సుమంతుడి కథ

funday childrens story - Sakshi

పిల్లల కథ

విష్ణుపురం అనే గ్రామంలో సోముడనే దర్జీవాడు ఉండేవాడు. అతని భార్య రమ. చాలా దురాశాపరురాలు. వారికి పదేళ్ళ కొడుకు సుమంతుడు. సోముడు తను కుట్టిన బట్టలు పక్కనే ఉన్న పట్టణంలోని సంతలో అమ్మి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఆ పట్టణానికి చిన్న అడవిని దాటి వెళ్ళాలి. ఒకసారి సోముడికి బాగా సుస్తీ చేసింది. ఎలాగో కష్టపడి బట్టలు కుట్టేవాడు కానీ, అమ్మడానికి కాలినడకన పట్టణానికి వెళ్ళలేకపోయాడు. ఇంట్లో సరుకులు నిండుకోవడంతో సుమం తుడి సాయం అడగక తప్పలేదు. సోముడు బాధపడుతూనే కొడుకుకి అన్ని జాగ్రత్తలూ చెప్పి పంపాడు. సుమంతుడు బట్టల మూట మోసుకుంటూ అడవిలో ప్రవేశించాడు. చిన్నవాడు కావడంతో కాసేపటికే కాళ్ళు నొప్పి పుట్టి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. బెదురుగా దిక్కులు చూస్తున్నవాడికి ఎదురుగా ఒక చిన్న మామిడి మొక్క కనపడింది. ఎండలకి వడిలినట్టుగా ఉన్న దాని ఆకులు చూసి సుమంతుడికి జాలి కలిగింది. దగ్గరలోనే సెలయేటి శబ్దం వినిపించడంతో వెళ్ళి దొరికిన డొప్పలో నీరు తెచ్చి మామిడి మొక్కకు పోశాడు. కాసేపు విశ్రాంతి తరువాత తిరిగి మరికొంత దూరం నడిచాక సుమంతుడికి చిన్న పనస చెట్టు కనపడింది. సుమంతుడు మరలా దగ్గరలో ఉన్న తటాకంలోని నీరు తెచ్చి ఆ చెట్టుకి కూడా పోశాడు. మరికొంత దూరం నడిచాక రేగుచెట్టు కనపడింది. అదీ చిన్న చెట్టే. దానికి కూడా నీరు తెచ్చి పోశాడు. తరువాత సుమంతుడు హుషారుగా పట్టణంలో సంతకు చేరుకుని, బట్టలు అమ్మి ఆ డబ్బును జాగ్రత్తగా పట్టుకొని చీకటి పడకముందే ఇల్లు చేరుకున్నాడు. 

అలా ప్రతి పదిరోజులకి ఒకసారి సంతకుపోవడం సుమంతుడి బాధ్యతగా మారింది. వెళ్ళినప్పుడల్లా ఆ మొక్కలకి నీరు పోసి ఆనందపడేవాడు. వాటితో మాట్లాడేవాడు. ముద్దులాడేవాడు. సోముడికి ఆరోగ్యం ఇంకా కుదుటపడకపోవడంతో సుమంతుడు చదువు కూడా మానేయాల్సి వచ్చింది. అందుకు చాలా బాధపడ్డాడు. ఒకసారి పట్టణానికి వెళ్లినప్పుడు మొక్కలకి నీళ్ళు పోస్తూ తన బాధంతా చెప్పుకున్నాడు. సుమంతుడి మీద వనదేవతకి జాలి కలిగింది. మరో పది రోజుల తరువాత పట్టణంలో సంతకి వెళుతూ ఎప్పటిలాగే మామిడిచెట్టుకి నీళ్ళు పోశాడు. చెట్టు కిందే కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంటే హఠాత్తుగా వాడి దృష్టి ఆకుల చాటున నిగనిగా మెరుస్తున్న పెద్ద మామిడిపండు మీద పడింది. అప్పుడు వేసవి కూడా కాదే అని ఆశ్చర్యపోతూ వాడా పండు కోసుకుని దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు. సంతలో బట్టలమ్మి, తండ్రికి కావాల్సిన కొత్త గుడ్డలు కొని ఇంటికి చేరుకున్నాడు. తను నీరుపోసే మామిడిచెట్టుకి ఇంత పెద్దకాయ కాసిందని మురిసిపోతూ పండుని తలిదండ్రులకి చూపించాడు. ఆశ్చర్యపోతూనే ఆమె పండు కోసింది. తియ్యటి గుజ్జంతా తిన్నాక లోపల వారికి బంగారు టెంక కనబడింది. ఆ టెంకని తిప్పి చూసేంతలో అది రెండుగా చీలి లోపలి నుండి గుప్పెడు రత్నాలు కింద రాలాయి. వారి ఆనందానికి అవధులు లేవు. ‘‘నాన్నా, మనం హాయిగా బతకడానికి, నీ వైద్యానికి కావాల్సినంత డబ్బు వచ్చింది. ఇక నేను నా చదువుకుంటాను నాన్నా’’ అన్నాడు సుమంతుడు.‘‘అయ్యో అదేమిటి నాయనా, ఈ డబ్బు ఎంతని? సంవత్సరంలో ఖర్చయిపోదూ? నువ్వీ విష యం ఎవరికీ చెప్పకు. మనలాంటి బీదవారి దగ్గర ఇంత విలువైన రత్నాలు ఎలా వచ్చాయని అందరికీ అనుమానం వస్తుంది. కొన్నాళ్ళు ఆగు నాయనా. చదువుకుందువుగాని’’ అంది రమ. తల్లి మాటలకి  సుమంతుడు నిరుత్సాహపడ్డాడు. రమ ఆ రత్నరాసులన్నీ జాగ్రత్తగా అటకపైన దాచిపెట్టింది. 

మరోనెల అడవిలో సుమంతుడికి ఘుమఘుమలాడుతున్న పనసపండు కనిపించింది. మరునాటి ఉదయం పనసపండు కోసి వారంతా తిన్నాక, బంగారు రంగులో మెరిసిపోతున్న పనస గింజల్లోంచి కూడా రత్నరాసులు బయటపడ్డాయి. రమ గబగబా ఇంటì కిటికీ తలుపులు కూడా మూసేసి వచ్చి అవన్నీ ఏరి తిరిగి అటక పైన ఉన్న ఒక చిన్న కుండలో దాచి పెట్టేసింది. సోముడు సంబర పడుతూ కొడుకు తల నిమిరి, ‘‘నాయనా సుమంతా, నీ అదృష్టమో ఏమోగానీ, ఆ అడవి తల్లి మనకింత గొప్ప సహాయం చేసింది. నేను మెరుగైన వైద్యం చేయించుకుంటాను. ఇక మీదట నీకు శ్రమ ఇవ్వను నాయనా. నువ్వు నీ ఇష్టప్రకారమే బాగా చదువుకుందువుగాని’’ అన్నాడు. ఆ మాటకి ఆనందపడుతున్న సుమంతుడిని రమ దగ్గరికి లాక్కుంటూ, ‘‘అయ్యో, అప్పుడేనా. మరికొన్నాళ్ళు వాడిని మీకు సహాయంగా ఉండనివ్వండి. అప్పుడే ఈ రత్నరాసులు అమ్మే పని పెట్టుకోవద్దు’’ అంది.

మరికొంతకాలం తరువాత సంత నుంచి తిరిగొస్తూ రేగుచెట్టు దగ్గర దిగులుగా కూర్చున్న సుమంతుడి మీద పండిన రేగుపండ్లు జలజలా రాలాయి. ఆకలితో ఉన్న సుమంతుడు అద్భుతమైన రుచితో ఉన్న పండ్లు తింటూ గింజలు ఉమ్మితే, అవి బంగారు రంగులో మెరుస్తూ కనిపించాయి. ఆశ్చర్యపోతూ ఆ చెట్టుకి ఉన్న పండ్లన్నీ కోసి గుజ్జు తినేసి అన్ని బంగారు గింజల్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. ఆలోచిస్తూనే ఇల్లు చేరాడు. ఆ రాత్రి తల్లి నిద్రించాక, తండ్రిని లేపి తనకు దొరికిన బంగారు రేగు గింజల్ని చూపించాడు. సోముడు నవ్వుతూ కొడుకు తల నిమిరి ‘‘నాయనా, ఈ గింజల్ని అమ్మకి చూపించకు. నేను ఆలోచించి నిన్ను బాగా చదివించే దారి చూస్తాను. ఆమెకు తృప్తి లేదు.’’ అన్నాడు. మరుసటి రోజు సంతకు సుమంతుడు బయలుదేరే ముందు, సోముడు కొడుకుకి ఒక ఉపాయం చెప్పాడు. ఆ సాయంత్రం సుమంతుడు సంత నుంచి ఇంటికి తిరిగిరాలేదు. చీకటిపడినా కొడుకు రాకపోవడంతో రమకి గాభరా కలిగింది. ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్ళి ‘‘ప్రతిసారీ సాయంత్రానికే ఇల్లు చేరే మన బిడ్డ ఇంత చీకటిపడినా ఇల్లు చేరలేదు. ఏ ఆపద వచ్చిందో ఏమో వెళ్ళి చూసి రావయ్యా’’ అంది. ‘‘నాకు కొద్దిగా ఆరోగ్యం కుదుటపడిందని చెప్పినా నువ్వు వినలేదు. వాడికైతే  అడవిలో రత్నరాసులు దొరుకుతాయన్న దురాశతో ఎన్నాళ్ళయినా వాడినే ఈ పనికి పంపిస్తున్నావ్‌. అన్ని రోజులూ ఒకేలా ఉంటాయా. ఇప్పుడు చూడు ఏమైందో’’ అని భార్యని తిడుతూ సోముడు అడవివైపు బయలుదేరాడు. తను చెప్పినట్టుగానే అడవి దగ్గరలోని ఒక పూటకూళ్ళ ఇంట్లో తలదాచుకుంటున్న కొడుకుని కలుసుకున్నాడు సోముడు. బంగారు రేగు గింజల్ని అమ్మి, వచ్చిన సొమ్ముతో అన్ని విద్యల్లోనూ అద్భుతమైన శిక్షణ ఇచ్చే ఒక మంచి పాఠశాలలో కొడుకుని చేర్పించాడు.

రెండురోజుల తర్వాత కొడుకు లేకుండా ఇంటికి తిరిగి వచ్చిన భర్తని చూసి రమ బాధపడినా సోముడు నిజం చెప్పలేదు. అంత డబ్బు కొడుకు చదువుకి తగలేశారని ఆమె దుర్భాషలాడుతుందని అతనికి తెలుసు. ఆ తరువాత కొన్నాళ్ళకి రమ అటకపైన దాచిన రత్నరాసులు తీసి నగలు చేయించుకోవాలనుకుంటే అవన్నీ రంగురాళ్ళుగా మారిపోయాయి. సోముడు ఎప్పటిలాగే దర్జీ పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకురాసాగాడు. ఇప్పుడు సుమం తుడు ఇరవయ్యేళ్ళవాడయ్యాడు. అన్ని విద్యల్లోనూ ప్ర«థముడిగా నిలిచి అందరి మన్ననలూ పొందాడు. ఆ సంవత్సరమే ఆ దేశపు రాజుగారు నిర్వహించిన చాలాపోటీల్లో సుమంతుడు బహుమతులు గెలుచుకుని రాజుగారి మెప్పు పొందాడు. రాజు తన కొలువులో మంచి జీతంతో, వసతి సౌకర్యాలతో సుమంతుడికి ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఉద్యోగంలో చేరగానే సుమంతుడు తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ తన స్వగ్రామం చేరాడు. వాళ్ళని తన వసతి గృహానికి తీసుకొచ్చేశాడు. అన్నివిధాలా ఎదిగిన కొడుకుని చూసి సోముడు ఆనందభాష్పాలు రాలిస్తే, తన దురాశతో కొడుకుని ఇన్ని సంవత్సరాలు దూరం చేసుకున్నందుకు రమ పశ్చాత్తాపంతో కన్నీళ్ళు పెట్టుకుంది.  ఆ తరువాత కూడా సుమంతుడు అన్నిచోట్లా చెట్లు నాటిస్తూ, చెరువులని సంరక్షిస్తూ ప్రకృతిపట్ల తన కృతజ్ఞతని చాటుకున్నాడు.            
ప్రసూన రవీంద్రన్‌               
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top