
హెలికాప్టర్‌తో బంగ్లాదేశ్‌లో దిగాం!
సైన్యంలో ఉద్యోగమంటే... ఏ మారుమూలకైనా వెళ్లాలి, కొండల మధ్యయినా గుండె దిటవు చేసుకొని బతకాలి.
యుద్ధ క్షేత్రం
సైన్యంలో ఉద్యోగమంటే... ఏ మారుమూలకైనా వెళ్లాలి, కొండల మధ్యయినా గుండె దిటవు చేసుకొని బతకాలి. సైన్యంలో ఇంజనీర్‌గా అలాంటి ఎన్నో ఘటనల్ని ఎదుర్కొన్న స్క్వాడ్రన్ లీడర్ వల్లూరు రామకృష్ణ (వాయుసేన విశ్రాంత అధికారి) అనుభవాలు ఈవారం...
మాది పశ్చిమగోదావరి జిల్లాలోని వల్లూరు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 1963లో మెకానికల్ ఇంజనీరు పట్టా పుచ్చుకున్నాను. తర్వాత ఏడాది ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్‌గా రక్షణరంగంలో ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో ఏడాది శిక్షణ పొందిన తర్వాత చండీఘర్‌లో నా తొలి పోస్టింగ్.
నాకు ఎక్కువగా హెలికాప్టర్లతోనే పని! భారత హెలికాప్టర్ ఒకటి చైనా సరిహద్దులో (మన భూభాగంలోనే) కూలిపోయింది. దాని మరమ్మతు బాధ్యతను నాకప్పగించారు. మరో ఇద్దరు టెక్నీషియన్లతో అక్కడికి బయల్దేరాను. రోడ్డు కాదు కదా కాలిబాట కూడా లేదు. ఎటు చూసినా మంచు కొండలు, లోయలే. కష్టపడి అక్కడికి చేరుకున్నాం. మనిషి ఆనవాలే లేదక్కడ. రెండు రోజులకో హెలికాప్టర్ వచ్చి మాకు ఆహారం, మంచి నీటిని అందించేది. అలా 45 రోజులు అక్కడే ఉన్నాం. ఒకసారి స్థానిక గిరిజనులు వారి పనుల మీద వెళ్తూ మమ్మల్ని గమనించారు. వారు వండుకున్నది (ఆకులతో వండిన పదార్థం. పేరు తెలియదు) మాకు పెట్టారు. అమృతంలా అనిపించింది.
బంగ్లాదేశ్ యుద్ధం (పాకిస్తాన్ యుద్ధం)లో నాకు ప్రత్యేకమైన అసైన్‌మెంట్ ఇచ్చారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన 20 మందికి ఒక రహస్య ప్రదేశంలో హెలికాప్టర్ ఇంజనీరింగ్‌లో శిక్షణ ఇవ్వడం నా బాధ్యత. నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత మేము నిర్వహించిన తొలి ఆపరేషన్ బంగ్లాదేశ్ భూమ్మీద దిగడం. ఆ యుద్ధంలో పాకిస్తాన్‌ని ఓడించిన తర్వాత బంగ్లాదేశ్ (అప్పట్లో అది తూర్పు పాకిస్తాన్) నేల మీద దిగిన తొలి బృందం మాదే. అది పాకిస్తాన్ వదిలి వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటుకు మధ్య సంధికాలం. బ్యాంకులు, దుకాణాలు అన్నీ ఎలా తెరిచినవి అలాగే ఉన్నాయి. పాక్ సైన్యం ఓటమి పరాభవంతో అనేక అకృత్యాలకు పాల్పడుతోంది. ఆ సమయంలో భారత సైన్యం బంగ్లాదేశ్ రక్షణ బాధ్యతను తీసుకుంది.
సమయస్ఫూర్తికి ప్రశంస!
యుద్ధంలో బుల్లెట్లు తగిలి హెలికాప్టర్ రెక్కలకు చిల్లులు పడేవి. వాటిని తిరిగి పని చేయించాలంటే చండీఘర్ నుంచి విడిభాగాలు రావాలి. యుద్ధ సమయంలో అంత టైముండదు. దాంతో స్థానికంగా దొరికే ఎమ్‌సీల్ వంటిది సేకరించి చిల్లులను అతికించి హెలికాప్టర్లను వాడుకలోకి తెచ్చాను. అందుకు మా ఎయిర్‌ఫోర్సు అధికారి నాకు కమెండేషన్ (ప్రశంసాపత్రం) ఇచ్చారు. ఇదంతా 1971లోనే.
కొంతకాలానికి అస్సాంలో కుంభిగ్రామ్‌కు బదిలీ అయింది. అదొక మారుమూల ప్రదేశం. మంచెల మీద వెదురు గుడిసెల్లో నివాసం. జంతువులు, పాములు కనిపిస్తుండేవి. ఏనుగుల ఘీంకారాలు వినని రోజుండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఆదివారం అన్ని కుటుంబాల వాళ్లం కలిసి పార్టీ చేసుకునేవాళ్లం. చనాబటూరా తినడమే మాకు పెద్ద విందు!
ఇక పిల్లలు స్కూలుకెళ్లాలంటే 40 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. కొండల మధ్య ఇరుకు దారులు తప్ప మంచి రోడ్డుండదు. తీస్తా నది మీద వంతెన ఊగుతుండేది. ఏ మాత్రం చూపు మరల్చినా వాహనం తీస్తానదిలో ఉంటుంది. కొండచరియలు విరిగిపడితే ఆర్మీ వాళ్లు వెళ్లి దారిని క్లియర్ చేస్తేనే బస్సు ముందుకు కదిలేది. అలాంటి పరిస్థితుల్లో స్కూలు బస్సు ఇంటికి రావడం ఓ గంట ఆలస్యమైతే చాలు... నేను చీఫ్ ట్రాన్స్‌పోర్టు అధికారిని కూడా కావడంతో పిల్లల తల్లితండ్రులు మా ఇంటికి వచ్చేసే వారు. మా పిల్లలు కూడా అదే బస్సులో ఉండేవారు. ఒకసారి సుడిగాలి రావడంతో మా చిన్నబ్బాయి (ఎనిమిదేళ్లుంటాయి) గొడుగు వేసుకుని ఇంటి బయటకి వచ్చాడు. గాలికి గొడుగుతోపాటు పైకి లేచాడు. నాలుగైదు అడుగుల దూరం అలా గాల్లోనే వెళ్లి కిందపడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా భయపడినా కూడా సంతోషంగానే ఉద్యోగం చేశాం.
రిపోర్టింగ్: వాకా మంజులా రెడ్డి