
2015 ఆగస్టు 7 రాత్రి 7 గం.లకు ‘మెక్‌డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ అనే బంగ్లాదేశ్ బోయింగ్ విమానం మన దేశంలో దిగింది. నిజానికి, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో టేకాఫ్ అయిన ఆ విమానం నేరుగా ఒమన్ రాజధాని మస్కట్ వెళ్లాలి. అయితే దారి మధ్యలో విమానంలోని ఒక ఇంజిన్ చెడిపోయింది. పైలట్ విమానాన్ని అత్యవసరంగా రాయ్‌పుర్ (ఛత్తీస్‌గఢ్)లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్ట్‌లో దింపేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న 176 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత వాళ్లంతా ప్రత్యేక విమానంలో మస్కట్ చేరుకున్నారు. అయితే రాయ్‌పుర్‌లో ఆ రోజు ల్యాండ్ అయిన ఆ ‘డగ్లస్ 83’ మాత్రం నేటికీ తిరిగి బంగ్లాదేశ్ చేరుకోలేదు! రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా పదేళ్లుగా ఇప్పటికీ అక్కడే అంగుళం అయినా కదలకుండా ఉండిపోయింది!
పార్కింగ్‌కి రూ.4 కోట్ల బకాయి
పదేళ్లుగా ఆ డగ్లస్ 83 విమానం నిలిపి ఉన్న స్థలం ‘ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (ఏఏఐ) కిందికి వస్తుంది. అక్కడ పార్క్ చేసినందుకు ‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్‌వేస్’ ఇప్పటికి రూ. 4 కోట్లకు పైగా బకాయి పడింది. ఇమ్మంటే ఇవ్వదు, విమానాన్ని తీసుకుపోమ్మంటే పోదు. చూసి, చూసి, ఐదేళ్లు ఓపిక పట్టిన ఏఏఐ 2021 జనవరి 18న అధికారికంగా లేఖ రాసింది. ఆ లేఖ కూడా పని చేయలేదు. విమానం లాగే ఎక్కడి విజ్ఞప్తులు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడిక బంగ్లాదేశ్‌లో ఉన్నది తాత్కాలిక ప్రభుత్వం కావటంతో ఏఏఐ కూడా చూసీ చూడనట్లు పోవలసి వస్తోంది.
కొనేవాళ్ల కోసం ఎదురుచూపులు!
రాయ్‌పుర్, స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఉన్నవే 11 పార్కింగ్ బేస్‌లు. (మొదట ఎనిమిదే ఉండేవి). వాటిల్లో ఒక బేస్‌లో డగ్లస్ ఎం.డి.83 ఉండిపోయింది. దానిని డంప్ యార్డ్‌కు పంపటానికి లేదు, అలా పడి ఉంటుందిలే అని సర్దుకుపోయే వీలూ లేదు. రెండు మూడు మరమ్మత్తుల చేస్తే చాలు, పైకి ఎగిరే విమానమే అది. అయితే బంగ్లాదేశ్ ఆ పని కూడా చేయటం లేదు! ‘‘కొనేవాళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. కాస్త టైమ్ ఇవ్వండి..’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్‌వేస్ అంటోంది. విసిగి వేసారిన రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎస్.డి. శర్మ, న్యాయపరంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికేందుకు ఉన్న మార్గాల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వస్తే చాలు
అసలు డగ్లస్ 83 అత్యవసరంగా ల్యాండ్ అయిన మూడు వారాల తర్వాత గానీ బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ కోసం రాయ్‌పుర్ రాలేదు! ఆ వచ్చిన వాళ్లు మాత్రం చెడిపోయిన ఇంజిన్‌ను తీసి, దాని స్థానంలో కొత్తది బిగించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడి నుంచి విమానాన్ని తీసుకెళ్లాలంటే బంగ్లాదేశ్ విమానయాన శాఖ నుంచి తప్పనిసరిగా.. ‘ఎగిరేందుకు ఫిట్‌గా ఉంది’ అన్న సర్టిఫికెట్ రావాలి. అది రావటం లేదు, ఇది ఎగరటం లేదు. మనవాళ్లు ఇప్పటికి లెటర్‌లు, ఈమెయిళ్లు, కలిపి దాదాపు 100 వరకు పంపారు. నెలనెలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ‘‘ఇదిగో, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రాగానే విమానాన్ని తీసుకెళతాం’’ అని గత పదేళ్లుగా ఒకటే సమాధానం. రాయ్‌పుర్ ఎయిర్‌పోర్టుకూ ఇబ్బందులు ఉన్నాయి. అక్కడి నుండి రోజూ 30 విమానాలు టేకాఫ్ అవుతాయి. 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఉదయం 8–10 గం. మధ్య, సాయంత్రం 4–6 గం. మధ్య మొత్తం నాలుగు గంటల పాటు పదకొండు పార్కింగ్ బేస్‌లు విమానాలకు అవసరం అవుతాయి. డగ్లస్ 83 కారణంగా ఆ బేస్‌లో ఉంచవలసిన వాటిని వేరే బేస్‌కు తరలించాల్సి వస్తోంది.
... ఇక వాళ్ల కష్టాలు..!
‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్‌వేస్’ నష్టాల్లో కూరుకుపోయి, 2016లోనే కార్యకలాపాలు ఆగిపోయాయి. ఆ సంస్థ నుండి ఇంతవరకు ఒక్క విమానం కూడా టేకాఫ్ అవలేదు. అక్కడి నుంచి ఎనిమిది విమానాలను తీసుకెళ్లి ఢాకా హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ‘కార్గో అప్రోచ్ ఏరియా’లో వదిలేశారు. అక్కడ అవి కార్గో ఫ్లయిట్స్ కదలికలకు అడ్డుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో – రాయ్‌పుర్ విమానాశ్రయానికి పార్కింగ్ చార్జీలు చెల్లించలేక, విమానాన్ని తీసుకెళ్లలేక, ‘‘మీరే ఎవరైనా కస్టమర్‌ను వెతికి పట్టుకుని, డగ్లస్ 83ని వచ్చింతకు అమ్మేసి, మీ బకాయిలను మినహాయించుకుని, మిగిలిన డబ్బును మాకు పంపండి’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్‌వేస్.. మన ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ·
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?
‘మెక్‌డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ విమానం బంగ్లాదేశ్‌లో టేకాఫ్ అయింది. వారణాసి–రాయ్‌పుర్ గగనతల హద్దులోకి వచ్చేసరికి ఒక ఇంజిన్ పాడైపోయింది! లోపల 176 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్ అవకపోతే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉందని ఫైలట్ షాబాజ్ ఇంతియాజ్ ఖాన్ గ్రహించారు. భూమికి 32 వేల అడుగుల ఎత్తున విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. విమానంలోని ఫ్లయిట్ ఇంజినీర్ ‘ప్రమాదంలో ఉన్నాం. ల్యాండింగ్‌కి అనుమతి ఇవ్వండి’ అని సంకేతం పంపారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సంకేతం కోల్‌కతాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి చేరలేదు.
కోల్‌కతా చెబితేనే రాయ్‌పుర్ చేస్తుంది. ఏమైతే అది అయిందని విమానాన్ని రాయ్‌పుర్‌లో దించేయాలని పైలట్ నిర్ణయించుకున్నారు. అయితే అత్యవసరంగానే అయినా ఒక విమానాన్ని ల్యాండ్ చేయించే అధికారం రాయ్‌పుర్ ఎయిర్ పోర్ట్‌కు లేదు. కోల్‌కతా నుంచి ఆదేశాలు రావాలి. అయితే దురదృష్టంతో పాటుగా అదృష్టమూ వారి వెంట ఉన్నట్లుంది. పైలట్ ఇచ్చిన సంకేతాన్ని ముంబై నుండి కోల్‌కతా వెళుతున్న ఇండిగో ఫ్లయిట్ పైలట్ పికప్ చేసుకుని ఆ సమాచారాన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు అందించారు.
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే రాయ్‌పుర్ అధికారులకు సమాచారం ఇచ్చి ల్యాండింగ్‌కి అనుమతి ఇవ్వాలని కోరారు. రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలా దిగాలో తెలిపే నేవిగేషన్ చార్టు లేకుండానే విమానం సురక్షితంగా దిగేందుకు ఇండిగో పైలట్ నిర్విరామంగా రేడియో కాంటాక్ట్‌లోఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. విమానం భద్రంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు వేరే విమానం అందుబాటులో లేకపోవటంతో 27 గంటల పాటు వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ నుండి ఆగస్టు 8 రాత్రి 10.27 గం.లకు ప్రత్యేక విమానం వచ్చి వారిని మస్కట్ తీసుకెళ్లింది.