లోకేష్ బాబు గ్రాఫిక్ మాయాజాలం!

చంద్రబాబు - లోకేష్ - Sakshi


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు అన్ని విషయాలలో తండ్రిని మించిన తనయుడు కావాలని తెగ తాపత్రయపడిపోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రిన్స్ ఎన్టీఆర్‌ భవన్‌ మీద ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్నారని ఆ పార్టీలోనే గుసగుసలు వినపడుతున్నాయి. అందు కోసం ఆయన  పడరాని పాట్లు పడుతున్నారు.  మరొకరి ఆలోచనలను, ఇతరుల కార్యక్రమాల ఫొటోలను కాపీ కొట్టడంలో దిట్టగా మారారు. గ్రాఫిక్ మాయాజాలంతో  ప్రజలను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలను జనం ఇట్టేపట్టేయడంతో అవి బెడిసికొడుతున్నాయి. పార్టీ పరువును బజారుకీడిస్తున్నాయి.



ఇప్పటికే ప్రత్యర్థులపై ట్విట్టర్‌లో లేనిపోని ఆరోపణలు చేసి  రాష్ట్ర రాజకీయాల్లో  ట్విట్టర్‌ బాబుగా  పేరు తెచ్చుకున్నారు.  అధికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా పరవాలేదనుకున్నట్లున్నారు. 2014లో అధికారంలోకి రాకపోతే ఇక భవిష్యత్తులేదని కూడా లోకేష్ బాబు  గ్రహించినట్లున్నారు.  నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారు.  ఇప్పుడు కొత్తగా ఎవరో చేసిన అభివృద్ధిని కూడా తాము చేసిన అభివృద్ధిగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ మధ్యనే 'బ్రింగ్ బాబు బ్యాక్‌' అనే ఉద్యమాన్ని లోకేష్‌ బాబు మొదలుపెట్టారు. దాంతో చాలా మంది భయపడిపోతున్నారు. సాప్ట్వేర్ ఉద్యోగులు ఈ నినాదంపై స్పందించారు.   'బ్రింగ్ బాబు బ్యాక్‌' అంటే 1995 - 2004 మధ్య కరవు, రైతుల ఆత్మహత్యలు, నీటి కొరత, కరెంట్ చార్జీల పెంపు ఇవన్నీ మరలా తీసుకురావాలా? అంటూ నెటిజన్లు ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌లలో కౌంటర్ల మీద కౌంటర్లు పోస్ట్ చేస్తున్నారు.  కొంత మంది ఉద్యోగులు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది.



'బ్రింగ్ బాబు బ్యాక్‌' పేరుతో ప్రచారానికి వాడుతున్న ఫొటోలపై పెద్ద దుమారంలేచింది. ఈ ప్రచారంలో ఇతరుల ఫొటోలను యధేచ్ఛగా వాడేసుకున్నారు. దాంతో లోకేష్ బాబు కాపీకొట్టడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచం సాంకేతికంగా దూసుకువెళుతోంది. లోకేష్ బండారం బయటపడింది. అంతే, నెటిజన్లు ఆ ఫోటోలను షేర్‌ చేసి లోకేష్‌ బాబు గాలితీసేశారు. స్త్రీలపై జరుగుతోన్న అన్యాయాలు ఆగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని,  టీడీపీ ఆధ్వర్యంలో మహిళల కోసం పోరాడుతున్నామని  మై ఆన్‌ లైన్‌ కిట్టీ అనే సంస్థ ప్రకటనల కోసం వాడిన  ఫోటోను కాపీ కొట్టి లోకేష్‌ బాబు కలరింగ్ ఇవ్వాలని చూశారు.  నలంద కాలేజీ విద్యార్ధులు ప్రముఖ సంఘసేవకుడు అన్నా హజారే ఉద్యమానికి మద్దతుగా ర్యాలీ చేశారు. విద్యార్ధులు టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లుగా ఆ ఫొటోను వాడేశారు. లోకేష్ బాబు గారి బాగోతం ఇంతటితో ఆగలేదు. మల్టీ మీడియా మాయాజాలం ఇంకా చాలా ఉంది.



 జేటీ సొల్యూషన్ సాప్ట్వేర్‌ సంస్థ ప్రకటనను తీసుకుని సాప్ట్వేర్‌ ఉద్యోగులందరూ టీడీపీకి మద్దతు పలుకుతున్నట్లు మరో మాయాజాలం.  చంద్రబాబు పాలనలో రోడ్లు ఇలా ఉన్నాయి అని రాజస్థాన్లోని ఎన్హెచ్758 రాజస్‌ మండ్‌ నుంచి బిల్వారా వెళ్లే జాతీయ రహదారిని చూపారు. ఇంకో భయంకరమైన నిజం ఉంది. హైదరాబాద్లోని  తెలుగు తల్లి ప్లైఓవర్‌ బ్రిడ్జిని   చంద్రబాబు 1998లో మొదలుపెట్టారు. 2004 వరకు కూడా పూర్తి చేయలేదు. దివంగత  వైఎస్ రాజశేఖర రెడ్డి  అధికారంలోకి వచ్చిన తరువాత 2005లో దానిని పూర్తి చేశారు.  దీనిని కూడా లోకేష్ చంద్రబాబు ఖాతాలో వేసేశారు.



 తమిళనాడులోని మదురైలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మెడికల్  క్యాంప్‌ ఫొటోను  కరీంగనర్‌ జిల్లాలో ఎన్టీఆర్‌ ట్రస్ట్  మెడికల్ క్యాంప్‌ నిర్వహించిన ఫొటోగా చూపారు. ఈ ఫోటోలను ఈ విధంగా ఉపయోగించిన  బృందంలోని ఓ సభ్యుడే  లోకేష్‌ బాబు మాయాజాలాన్ని బయటపెట్టాడు. దీంతో  సోషల్ మీడియాలో టీడీపీ పరువు పూర్తిగా పోయింది. ఈ విషయాలన్నీ తెలిసి పెద్దబాబుగారు చిన్నబాబుగారికి చీవాట్లు పెట్టినట్లు సమాచారం.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top