ఫిల్మీ దునియా


వెండి తెర ఇలవేల్పులు ఇలలో కనిపిస్తే... సగటు అభిమాని ‘కలయా నిజమా’ అంటూ ఓ సాంగేసుకోకుండా ఉంటాడా! ఇక మనం నిత్యం తిరిగే సెంటర్లలో సడన్‌గా ఎంట్రీ ఇస్తే... షాకవ్వకుండా ఉంటామా! కానీ... గణపతి కాంప్లెక్స్, కృష్ణానగర్ గ్రీన్ బావర్చి, మంగ, పూర్ణ టిఫిన్ సెంటర్లు, ఫిలింనగర్ సొసైటీ కాంప్లెక్స్... ఈ ఏరియాల్లో తారల తళుకులు క్వైట్ కామన్! సినీ జనం తిరిగే హాట్ సెంటర్స్!

 

ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్ (ఫిలిం చాంబర్)కు వెళితే... అక్కడ వెండి తెర నుంచి బుల్లి తెర వరకు ఆర్టిస్టులు కనిపిస్తుంటారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలతో పాటు ఫిలిం సొసైటీలో ఓ ప్రివ్యూ థియేటర్ కూడా ఉంది. తెలుగు నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వంటివెన్నో ఇక్కడ కొలువుదీరాయి. దీంతో హీరోలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు... ఒకరేమిటీ అంతా ఎప్పుడో అప్పుడు విజిట్ చేస్తూనే ఉంటారు.

 

అన్నీ అక్కడక్కడే...

ఫిలింనగర్ సొసైటీ దగ్గరలో వెంకటేష్, మోహన్‌బాబు, మురళీమోహన్, గుమ్మడి తదితర ప్రముఖ నటుల ఇళ్లు ఉన్నాయి. సందర్శనకు వచ్చే అభిమానులు వారి ఇళ్లను చూసి సంబరపడిపోతుంటారు. దగ్గరలోనే రామానాయుడు స్టూడియో. ఇక్కడ షూటింగ్‌లకు నిత్యం అనేక మంది ప్రముఖులు ఈ ప్రధాన రహదారి గుండానే వెళ్తుంటారు. అంతేకాదు.. అనేక మంది నిర్మాతలు, ప్రముఖుల ఇళ్లు దగ్గర్లోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ సినీ జనం కనిపించడం సర్వసాధారణం. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు వీరిని చూసి మురిసిపోతుంటారు. వీలైతే ఓ సెల్ఫీ దిగి... తమ వారికి మురిపెంగా చూపించుకుంటుంటారు.

 

సెలబ్రిటీ టెంపుల్

ఫిలింనగర్ సొసైటీ దైవ సన్నిధానం ఒక ప్రత్యేకమైన దేవాలయం. ఇందులో దాదాపు పద్దెనిమిది దేవతామూర్తులు కొలువై ఉన్నారు. సాధారణ భక్తులతో పాటు సినీ ప్రముఖులూ ఇక్కడకు వచ్చి వెళుతుంటారు. ప్రత్యేక పూజలు జరిపిస్తుంటారు. ఏవన్నా పండగలైతే... మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర తారలు మొదలు అంతా ఒకేసారి బయటకు వస్తారు.

 

చోటామోటా...

ఇక జూనియర్ ఆర్టిస్టులు, ఫైట్ మాస్టర్లు, డ్యాన్సర్ల వంటి వారెందరికో అడ్డా కృష్ణానగర్, ఇందిరానగర్‌లు. ఇక్కడి గ్రీన్ బావర్చీ, పూర్ణా చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతా వారే కనిపిస్తుంటారు. ఎవర్ని చూసినా... ఎక్కడో చూసిన అనుభూతి కలుగుతుంది.    

- సత్య/ శ్రీనగర్ కాలనీ

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top