ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

youtube hits in this week

అమ్మా.. నీకే ఫోన్‌
గిఫ్ట్‌ యువర్‌ టైమ్‌ దిస్‌ దివాలీ: యునైట్‌ ఫర్‌ లవ్‌
నిడివి : 1 ని. 15 సె.
హిట్స్‌ :94,42,843

మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు? మోస్ట్‌లీ అది మీ చేతిలోని స్మార్ట్‌ ఫోన్‌! అవునా? స్మార్ట్‌ ఫోన్‌తో నిద్ర లేస్తారు. స్మార్ట్‌ ఫోన్‌ తో నిద్రలోకి జారిపోతారు. టుడే యాత్‌కైతే.. టైమే సరిపోవడం లేదు. కెరియర్‌ ఓరియెంటెడ్‌ కదా! బిజీ బిజీ. పైపైకి ఎదగాలంటే ఎట్‌ ఎనీ టైమ్‌ ఆఫీస్‌తో కనెక్ట్‌ అయి ఉండాలి నిజమే. మరి అమ్మతో! ‘ఒరేయ్‌ ఒక్క ముక్క తిని పోరా’ అని వెంటపడే అమ్మతో.. ఫోన్‌ రాగానే తింటున్నది వదిలేసి ‘బై.. మమ్మీ’ అనేసి వెళ్లిపోతే మనపై బెంగ పెట్టుకునే అమ్మతో.. కనెక్ట్‌ కాలేమా? అమ్మకంటే ఎక్కువా? కాదు. అమ్మా ఎక్కువే, కెరీరూ ఎక్కువే. ఏం చేయాలి? ఈ వీడియోలో.. దట్‌ బాయ్‌.. ఏం చేస్తాడో తెలుసా? దీపావళి గిఫ్ట్‌ ఇస్తాడు. ఆమె నిద్రలే చే సరికి గిఫ్ట్‌ ప్యాక్‌ కనిపిస్తుంది.

కొడుకు.. ముందే లేచి తల్లి కోసం బ్రెడ్‌ స్లయిస్‌ మీద బటర్‌ అద్దుతూ డైనింగ్‌ రూమ్‌లో ఉంటాడు. తల్లి గిఫ్ట్‌ ప్యాక్‌ ఓపెన్‌ చేసి చూస్తుంది. అందులో చిన్న బాక్స్‌. ఆ చిన్న బాక్స్‌లో స్మార్ట్‌ ఫోన్‌! కొడుకును వెతుక్కుంటూ వస్తుంది. బాక్స్‌ని కొడుక్కి చూపించి, ‘ఇది నీ ఫోన్‌ కదా!’ అంటుంది. ఆమెకేం అర్థం కాదు. కొడుకు నవ్వుతాడు. ‘ఈరోజంతా నా ఫోన్‌ నీదే. నా ఫోనే కాదు, నేను కూడా. హ్యాపీ దివాలీ మా’ అని బ్రెడ్‌ స్లయిస్‌ ఇస్తాడు తినమని.  ఆవేళ్టికి కంప్లీట్‌గా తన ప్రపంచంతో తల్లిని కనెక్ట్‌ చేస్తాడు. తల్లిని తన ప్రపంచం చేసుకుంటాడు. గ్రేట్‌ గిఫ్ట్‌ కదా! నోకియా కంపెనీ యాడ్‌ ఇది. వీడియోలో లాస్ట్‌ సీన్‌.. ఈవెనింగ్‌ ‘ప్రియా’ అనే అమ్మాయి మన హీరోకి ఫోన్‌ చెయ్యడం. స్క్రీన్‌ మీద ప్రియ అని డిస్‌ప్లే అవుతుంటుంది. ‘అమ్మా.. మాట్లాడు’ అంటాడు. అమ్మ నవ్వుతుంది.  ‘మాట్లాడమ్మా.. ఈరోజు వచ్చే కాల్స్‌ అన్నీ నీకే..’ అంటాడు. ‘నో.. నో.. నువ్వే మాట్లాడు’ అని అమ్మ పెద్దగా నవ్వుతుంది. అమ్మ నవ్వుతో దీపావళి వెలిగిపోతుంది.

నవ్వించి చంపుతాడు
ఖరిబ్‌ ఖరిబ్‌ సింగిల్‌: ట్రైలర్‌
నిడివి :2 ని. 23 సె.
హిట్స్‌ :45,60,219

దాదాపు సింగిల్‌ అని అర్థం.. ‘ఖరిబ్‌ ఖరిబ్‌ సింగిల్‌’ అంటే! ఇర్ఫాన్‌ఖాన్, పార్వతి (మలయాళీ నటì ) సింగిల్‌ సింగిల్‌. కానీ కలిసి ప్రయాణం చేయవలసి వస్తుంది. ఒక స్త్రీ, ఒక పురుషుడు.. చిర్రుబుర్రులు, చిటపటల జర్నీ.. ఎలా ఉంటుందో ఊహించండి. లైవ్లీగా ఉంటుంది. కానీ లవ్‌లీగా ఉండదు. హిస్టారికల్‌ ప్లేసెస్‌ తిరుగుతుంటారు. ఓ చోట ఇద్దరూ ఒకే రూమ్‌లో స్టే చేయవలసి వస్తుంది. పార్వతి స్నానం చేసి, బట్టలు మార్చుకుంటున్నప్పుడు సడెన్‌గా ఇర్ఫాన్‌ వచ్చేస్తాడు లోపలికి. ‘ఓ మై గాడ్‌’ అని పెద్దగా అరిచేస్తుంది పార్వతి. ఇర్ఫాన్‌ కూడా అరిచేస్తాడు అంతకన్నా పెద్దగా ‘ఓ మై గాడ్‌.. ’ అని!  ఈ ట్రైలర్‌లో ఇంకా చాలా సీన్స్‌ మన పొట్టని పకపకా టికిల్‌ చేస్తాయి. ఇర్ఫాన్‌ ఎక్స్‌ప్రెసివ్‌. ముందూవెనుకా చూసుకోకుండా పెద్దగా మాట్లాడేస్తుంటాడు. పార్వతి ‘ఎక్స్‌ప్రెస్సో. చప్పుడు చెయ్యకుండా సివిలైజ్డ్‌గా కాఫీ తాగే రకం. 

‘నా జీవితంలో మొత్తం మూడు గ్రేట్‌ లవ్‌స్టోరీలు ఉన్నాయి’ అంటాడు ఇర్ఫాన్‌! ‘వ్వాట్‌’ అంటుంది పార్వతి ముఖం చిట్లించి. ‘అవును. ప్రతి లవ్వూ హిస్టారిక్, లెజెండ్రీ, షేక్‌స్పియరియన్‌ ట్రాజిడీ’ అంటాడు. ఆమె నవ్వుతుంది. ఆ మూడు ప్లేస్‌లు.. హిస్టారిక్‌.. లెజెండ్రీ.. షేక్‌స్పియరియన్‌ కాలాలకు బ్యాగులు సర్దేసుకుంటారు. వీళ్లది ‘సాత్‌ జీనె మర్నే వాలీ స్టోరీ’ కాదు. కలిసి జీవించరు. కలిసి కన్నుమూయరు. నో ఎమోషన్‌. కానీ చివర్లో అమ్మాయి పడిపోతుంది. ‘నీ స్మైల్‌ బాగుంటుంది’ అంటాడు ఇర్ఫాన్‌.. రోప్‌ వేలో ఇద్దరూ కలిసి ప్రయాణిస్తున్నప్పుడు. అప్పుడు పడిపోదు. ఇక్కడో తనకు తెలియకుండానే పడిపోతుంది. పడిపోవడం అంటే ప్రేమలో అనుకోకండి. నచ్చిన అబ్బాయి దగ్గర అమ్మాయి ఎంత ఫ్రీగా మూవ్‌ అవుతుందో అలాగ! నచ్చడం అంటే మళ్లీ ప్రేమ అనుకోకండి. నచ్చడం. అంతే. ఈ ఫన్‌ ఫిల్డ్‌ కామెడీ నాన్‌–లవ్‌ స్టోరీ థియేటర్స్‌లోకి నవంబర్‌ 10న వస్తోంది. బై ద వే.. మనసుకు నచ్చిన అబ్బాయి దగ్గర అమ్మాయి ఎంత ఫ్రీగా ఉంటుందో తెలుసా? ట్రైలర్‌ చివర్లో మీరే చూస్తారు.

టూవో మూవీ త్రీడీ
మేకింగ్‌ ఆఫ్‌ 2.0 3డి ఫీచరెట్‌
నిడివి 3 ని. 35 సె.
హిట్స్‌ 28,47,777

2.0 (టూ పాయింట్‌ ఓ) మూవీ.. నో డౌట్‌ సూపర్‌ హిట్‌. 2018 జనవరి 25న అంటున్నారు కదా మూవీ రిలీజ్‌. అప్పుడే ఎలా చెప్తాం హిట్‌ అని?! డైరెక్ట్‌గా త్రీడీలో షూట్‌ చేస్తున్న తొలి ఇండియన్‌ ఫిల్మ్‌ మరి! అయితే మాత్రం ఇప్పుడే ఎలా చెప్పేస్తాం సూపర్‌ హిట్‌ అని? హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘2.o’ ను 450 కోట్ల రూపాయలతో తీస్తున్నారు. ఇవన్నీ సరే.. మూవీ హిట్‌ అని ఎలా చెప్తాం? ఇదిగో... ఈ ‘మేకింగ్‌ ఆఫ్‌ 2.o’ ఫీచరెట్‌ని చూస్తే అనిపిస్తోంది. త్రీడీలో సినిమాను ఎలా తీస్తారో శంకర్‌ ఇందులో ప్రాక్టికల్‌గా చూపెడుతూ, డిస్క్రిప్షన్‌ ఇస్తుంటాడు.

మేకింగ్‌ ప్రాసెస్‌ అమేజింగ్‌గా ఉంది. రజనీకి రోబో రూపం తెచ్చేందుకు ఒక టీమ్‌మొత్తం శ్రమించడం కూడా.. అక్కడేదో విశ్వాంతరాళంలో పని జరుగుతున్నట్లుగా ఉంది. సినిమాటోగ్రాఫర్‌ నిర్వాణ్‌షా అయితే.. నాట్‌ లెస్‌ దేన్‌.. ఎ కెమెరా సైంటిస్ట్‌! టూడీ, త్రీడీ షూటింగ్‌ల మధ్య తేడాలను చెప్పడానికి ‘లైకా’ కంపెనీ ఈ వీడియోను యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసింది. సినిమాకు డబ్బులు పెడుతోంది ‘లైకా’నే.

పగిలిందేదో పగిలింది మిగిలిందేరా జీవితం!
రూడీ మాన్‌క్యూసో అండ్‌ పూ బియర్‌: బ్లాక్‌ అండ్‌ వైట్‌
నిడివి 3 ని. 7 సె.
హిట్స్ :16,72,135

పాతికేళ్ల అమెరికన్‌ ఇంటర్నెట్‌ కమెడియన్‌ రూడీ మాన్‌క్యూసో (ఫొటోలో ఉన్నది అతడే) కాస్త సీరియస్‌గా లైఫ్‌ గురించి ఆలోచించి ఆలపించిన గీతం ఈ ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’. ఇతడితోపాటు నలభై ఏళ్ల అమెరికన్‌ గ్రామీ విజేత జేయస్‌ బాయ్‌డ్‌ (పూ బియర్‌ అనేది స్టేజ్‌ నేమ్‌) కొన్ని జీవిత సత్యాలను ఇందులో శోధించారు. ‘నా లైఫ్‌ పజిల్‌ను పూర్తి చేయడానికి నాలోని ముక్కలన్నిటినీ జతకూర్చాలా! పగిలిందేదో పగిలిందని.. మిగిలిన దాన్నే నా జీవితం అనుకోవాలా..’ అంటూ సాంగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఇదొక పియానో బేస్డ్‌ పాప్‌ గీతిక. రూడీ తొలి సింగిల్‌ ట్రాక్‌.

‘నా దారికి అడ్డం లెయ్‌.. అడ్డం లెయ్‌. ఫ్రమ్‌ ద బిగినింగ్‌ టు ద నౌ.. చాలా దూరం వచ్చేశాం. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో నేను ప్రపంచాన్ని చూశాను. నువ్వెందుకు చూడవు..’ అని ఇద్దరూ కలిసి పాడతారు. మంచి రంగస్థల నాటకం చూస్తున్నట్లు ఉంటుంది ఈ సాంగ్‌. వితవుట్‌ కలర్స్‌.. మనం మనంగా జీవిద్దాం, ఉన్నది ఉన్నట్లుగా జీవితాన్ని చూద్దాం అంటున్నారు రూడీ అండ్‌ పూ బియర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top