కభీ కభీ మేరే దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై...

Writer Khayyam Died With Illness - Sakshi

నివాళి

మహాకవుల పంక్తులకూ పల్లవులకూ స్వరాలు అద్దగలిగిన అంతిమ సంగీతకారుడు నిదుర కొరకు శిరము వాల్చాడు. మానవ మాధుర్యాలనూ జీవన వేదనలనూ కాగితంపై పెట్టగల ప్రతి మహోన్నత కలానికి తోడు నిలిచి, పాటగా మలిచి ప్రజలకు చేర్చిన నాదవాహకుడు అంతిమవాహనాన్ని అధిరోహించాడు. భారతీయతకు, లోకగీతానికి, ఉత్తరాది రాగానికి, నకలు ఎరగని అసలీయతకు ఆనవాలుగా నిలిచిన తేనెబాణీల జాగీర్దారు మధుపంపకాన్ని చాలించి పరుండేందుకు మృత్తికకు చేరాడు. ఖయ్యాం మరణించాడు. పునరావృతం కాలేని ఒక సురుచిరమైన సంగీత చరిత్రను ముగించాడు.

కభీ కభీ మేరే ఖయాల్‌ ఆతా హై కె జైసే తుజ్‌కో బనాయా గయా హై మేరే లియే...
కొందరు పాటను ఎంచుకుంటారు. కొందరిని పాట ఎంచుకుంటుంది. సంగీత ప్రపంచానికి ఖయ్యాం కావాలి. అందుకే అది అతణ్ణి తన దరికి చేర్చుకుంది. పంజాబ్‌లో పుట్టిన ఖయ్యాం కుటుంబంలో సంగీతం తెలియదు. పాటా తెలియదు. అప్పుడప్పుడే జనాన్ని ఆకర్షిస్తున్న సినిమాలతో ప్రభావితమై జలంధర్‌ నుంచి ఢిల్లీ చేరాడు ఖయ్యాం హీరో అవుదామని. అతడి ఉద్దేశ్యం సినిమాలు ఢిల్లీలో తయారవుతాయని. ఢిల్లీలో బాబాయి ఉన్నాడు కనుక అక్కడే ఉంటూ హీరో అయిపోవచ్చని. నగరానికి చేరగానే బాబాయి లెంపకాయ తప్ప వేరే ఏమీ దొరకలేదు. ఇంట్లో కుర్రాణ్ణి కూచోబెట్టి ప్రయోజనం లేదని ఆ బాబాయి తనకు తెలిసిన అప్పట్లో ఢిల్లీలో ఉంటున్న, ఇంకా సినిమాల్లోకి రాని సంగీతకారులు హన్స్‌లాల్‌–భగత్‌రామ్‌ దగ్గరకు తీసుకెళ్లాడు. కుర్రాడు బాగానే ఉన్నాడు హీరో కావాలంటే సంగీతం తెలియాలి నేర్పిస్తాములే అన్నారు వాళ్లు. ఎవరి పాటలు వాళ్లే పాడుకోగల హీరోలు ఉండే ఆ కాలంలో అలా ఖయ్యాం పాటలోకి ప్రవేశించాడు. క్రమంగా హీరో పిచ్చి పోయి పాట పూనకం అబ్బింది. ఢిల్లీలో సంగీతం నేర్చుకున్నాడు. లాహోర్‌ వెళ్లి అక్కడా నేర్చుకున్నాడు. అసిస్టెంట్‌ స్థాయికి చేరాక రెండో ప్రపంచయుద్ధ సమయంలో సినిమాలు మూలపడితే వెళ్లి సైన్యంలో చేరాడు. హార్మోనియం వాయించడానికి తప్ప ఈ చేతులు తుపాకీ పట్టడానికి పనికి రావని గ్రహించిన అధికారులు ఇతనిలాగే సైన్యంలో పని చేస్తున్న కవి ఫయాజ్‌ అహ్మద్‌ ఫయాజ్‌తో జత కలిపి ఒక సాంస్కృతిక బృందంగా చేసి– పోండి.. పోయి జనాన్ని సైన్యంలో చేరేందుకు ఉత్సాహపరచండి అనంటే ఆ పనీ చేశాడు. కాని మళ్లీ బొంబాయికే చేరాడు. కొన్నిరోజులు ‘శర్మ’ అనే డూప్లికేట్‌ పేరుతో మ్యూజిక్‌ చేశాడు. మూలం నుంచి విడుదలైన నదీపాయ విశాలమయ్యి ప్రవాహమయ్యి జనమైదానం చేరడానికి సమయం పడుతుంది. ఖయ్యాంకు కూడా పట్టింది. అన్ని అడ్డంకులు తొలిగి అతడి పేరుతో తొలి పాట జనానికి చేరింది. ‘ఫుట్‌పాత్‌’ సినిమాలో తలత్‌ మెహమూద్‌ పాడగా దిలీప్‌ కుమార్‌ మీద చిత్రించిన ఈ పాట అతడు ఎగరేసిన తొలి గాలిపటం.

ఖయ్యాం
షామే గమ్‌ కీ కసమ్‌ ఆజ్‌ గమ్‌గీన్‌ హై హమ్‌ ఆభిజా ఆభిజా ఆజ్‌ మేరే సనమ్‌...
స్వీట్‌ లస్సీని పోల్చుకోవడం పంజాబీవాడికి చిటికెలో పని. ఖయ్యాం చల్లలో పస ఉందని అదే పంజాబ్‌కు చెందిన కవి సాహిర్‌ లూధియాన్వీ తక్షణమే కనిపెట్టాడు. వెంటనే తాను పాటలు రాస్తున్న రాజ్‌ కపూర్‌ సినిమా ‘ఫిర్‌ సుబ్‌హా హోగి’కి రికమండ్‌ చేశాడు. సాధారణంగా రాజ్‌కపూర్‌ సినిమా అంటే శంకర్‌ జైకిషన్‌లు ప్రత్యక్షం కావాలి. కాని ‘ఫిర్‌ సుబ్‌హా హోగి’ సినిమా ప్రఖ్యాత రష్యన్‌ రచయిత్‌ దోస్తవ్‌ స్కీ నవల ‘క్రైమ్‌ అండ్‌ పనిష్‌మెంట్‌’ ఆధారంగా తయారైంది. ‘ఇలాంటి కథకు కాస్త పుస్తకాలు చదివి అర్థం చేసుకోగలవాడు సంగీతం ఇవ్వాలి’ అని సాహిర్‌ చెప్పి ఇప్పించాడు. ఆ సినిమాకు ఖయ్యాం చేసిన ‘ఓ సుబ్‌హా కభీతో ఆయేగి’ పాట గంభీరమైనది. బరువైనది. లోతైనది. ఇవాళ్టికి కూడా అలాంటి శుభోదయం కోసం అందరూ ఎదురు చూసేలా చేయగలిగినది.

ఆ తర్వాత ఖయ్యాం బండి ఆగలేదు. ‘షోలా ఔర్‌ షబ్నమ్‌’ లో రఫీ పాడిన ‘జీత్‌ హీ లేంగే బాజీ హమ్‌ తుమ్‌’ హిట్‌ మీదుగా ‘షగూన్‌’లో సూపర్‌ హిట్‌ అయిన ‘తుమ్‌ అప్‌నా రంజోగమ్‌’ పాట మీదుగా ‘ఆఖరీ ఖత్‌’లో ఇంటింటికీ చేరిన లతా పాట ‘బహారో మేరా జీవన్‌ భీ సవారో’ వరకూ సాగింది. అయితే అప్పటికే ‘బాబీ’ వంటి సినిమాలు విడుదలయ్యి లక్ష్మీకాంత్‌–ప్యారేలాల్‌ తుఫాన్‌ సృష్టిస్తున్నారు. ఆ గాలులను లెక్క చేయకుండా ఖయ్యాంను రెండు సినిమాలు నిలబెట్టాయి. ఒకటి ‘రజియా సుల్తాన్‌’, రెండు ‘కభీ కభీ’. రెంటికీ కూడా లక్ష్మీకాంత్‌–ప్యారేలాల్‌నే దర్శక నిర్మాతలు సైన్‌ చేశారు. కాని రజియా సుల్తాన్‌ తీస్తున్న కమాల్‌ అమ్రోహీకి వాళ్ల బాణీ నచ్చక ఖయ్యాం దగ్గరకు వచ్చాడు. ‘కభీ కభీ’ని తీస్తున్న యశ్‌చోప్రాను లక్ష్మీకాంత్‌–ప్యారేలాల్‌ ట్యూన్‌ చేసేటట్టయితే నా పాటలు ఇవ్వను అని సాహిర్‌ లూధియాన్వీ బెదిరించడంతో ఖయ్యాంను తీసుకున్నాడు. రజియా సుల్తాన్‌లోని ‘అయ్‌ దిలే నాదాన్‌’ పాట లతా పాడిన పాటల్లో ఒక గొప్ప పాటగా చెబుతారు. ‘కభీ కభీ’లోని ప్రతి పాటా నేటికీ సెల్‌ఫోన్లలో రింగ్‌టోన్‌గా వినిపిస్తూ ఉంది. ముకేష్‌ ఆ సినిమాలో పాడిన ‘కభీ కభీ మేరే దిల్‌ మే’, ‘మై పల్‌ దో పల్‌ కా షాయర్‌ హూ’ పాటలు చాలా పేరు తెచ్చాయి. ఆ తర్వాత యశ్‌ చోప్రాయే తీసిన ‘నూరి’ కేవలం ఖయ్యాం పాటల బలం వల్ల సూపర్‌ హిట్‌ అయ్యింది. అందులోని పాటలు ‘నూరీ నూరీ ఆజరే ఓ మేరె దిల్‌బర్‌ ఆజా’, ‘చోరి చోరి కోయీ ఆయే’ కథాస్థలి అయిన కాశ్మీర్‌ స్వచ్ఛనీటినురగల్లా ఉంటాయి.

కాని ఖయ్యాంను అప్పటికీ ఇప్పటికీ బహుశా ఎప్పటికీ తలుచుకునేది ‘ఉమ్రావ్‌జాన్‌’ సినిమా కోసమే. రేఖా సినీ జీవితానికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఈ సినిమా, కవిగా షహరియార్‌కు చిరంజీవత్వం తెచ్చి పెట్టిన ఈ సినిమా, గాయనిగా ఆశా భోంస్లేకు ప్రామాణికతను ఖరారు చేసిన సినిమా, ఖయ్యాంకు చెరపలేని కీర్తిని తెచ్చి పెట్టింది. గజల్‌ అంటే లతా మంగేష్కర్‌ అనుకునే రోజుల్లో ఆశా భోంస్లే గజల్‌ బాగా పాడుతుందని ఖయ్యాం ఈ సినిమాతో నిరూపించాడు. ‘ఉమ్రావ్‌జాన్‌’లోని ‘ఇన్‌ ఆంఖొకి మస్తీమే’, ‘దిల్‌ చీజ్‌ క్యా హై’... పాటలు కొనసాగుతూనే ఉన్నాయి రసికుల మెహఫిళ్లలో ప్రస్తావనకు వస్తూ.
ఖయ్యాం అంటే ఒరిజినల్‌ సంగీతం. రాసిన పాటకు బాణీ కట్టిన సంగీతం. గొప్ప కవిత్వానికి గొంతు ఇచ్చిన సంగీతం. కైఫీ ఆజ్మీ, జాన్‌ నిసార్‌ అఖ్తర్, అలీ సర్దార్‌ జాఫ్రీ వంటి గొప్ప గొప్ప కవుల కవనం అతని స్పర్శతో ఆరని సువాసనలీనింది. మన హైదరాబాదీ కవి మగ్దూమ్‌ మొహియుద్దీన్‌ గజల్‌ ఒకటి ‘బజార్‌’ సినిమా వల్ల ఖయ్యాం సంగీతంతో పూలు పూలుగా వికసించింది.

ఆ గజల్‌–ఫిర్‌ ఛిడీ రాత్‌ బాత్‌ ఫూలోంకిరాత్‌ హై బారాత్‌ ఫూలోంకి...
ఖయ్యాంది 92 ఏళ్ల సంపూర్ణ సార్థక జీవనం. పద్మభూషణ్‌ ఎత్తుకు ఎదిగిన జీవితం. తాను సంపాదించుకున్న పది కోట్ల రూపాయల ఆస్తిని ఆకలిగొన్న కళాకారుల కోసం అర్పించి స్ఫూర్తివంతంగా నిలిచిన జీవితం. శిక్కుమతానికి చెందినజగ్‌జిత్‌ను వివాహం చేసుకొని కుమారుడికి ‘ప్రదీప్‌ ఖయ్యాం’ అని పేరు పెట్టి సహ మత గౌరవాన్ని నిరూపించిన జీవితం.ఖయ్యాం అనే అందమైన తీరం నావలను బోర్లించేసింది. అవి కదలవు. ఇక ఒడ్డున కూచుని కెరటాల సవ్వడిని వినడం మాత్రమే మనం చేయగలిగింది.కరోగె యాద్‌తో హర్‌ బాత్‌ యాద్‌ ఆయేగి...– ఖదీర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top