శుభాలకు స్వాగతం...

శుభాలకు స్వాగతం... - Sakshi


ఆత్మీయం



లోకమంతా డబ్బు చుట్టూతానే తిరుగుతూ ఉంటుందని ధనమూలం ఇదం జగత్‌ అనే లోకోక్తి చెబుతోంది. అది నిజం. నిత్యం లేచింది మొదలు, నిద్రించేదాకా ప్రతి ఒక్కదానికీ డబ్బు అవసరమే. అందుకే అందరికీ డబ్బు మీద ప్రేమ. డబ్బులిచ్చే దేవతల మీద అధిక భక్తి. అందులోనూ వరాలనిచ్చే వరలక్ష్మీదేవత అంటే ఇంకా ఎక్కువ భక్తి. ఈ రోజు ఆమె అనుగ్రహం పొందడం కోసం శాయశక్తులా పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. అయితే, మనసును మాత్రం పట్టించుకోరు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారు మన ఇంట కాలు పెట్టాలని వాకిళ్లను ఏ విధంగా అయితే బార్లా తెరుచుకుని ఉంటామో, మనసులోకి సానుకూల భావనలు రావాలని, ధనాత్మకమైన ఆలోచనలు కలగాలని మనసును కూడా అదేవిధంగా తెరిచి ఉంచుకోవాలి.



మురికి పట్టిన భావాలను, ఆలోచనలను శుభ్రం చేసుకోవాలి. కుళ్లుబుద్ధిని కడిగేయాలి. పిరికి మాటలను, పిరికి భావాలను తరిమి కొట్టాలి. ధైర్యసాహసే లక్ష్మీ అన్నారు కాబట్టి, మనసులో ధైర్యాన్ని నింపుకోవాలి. కుటుంబ సభ్యుల పట్ల, తోటివారి పట్ల ప్రేమను నింపుకోవాలి. పదిమందికీ సాయం చేయాలన్న భావనను కలిగి ఉండాలి. ఐశ్యర్యమంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు, ఆయుష్షు, ఆరోగ్యం, ధన, కనక వస్తు, వాహనాలు, దాసదాసీజనం, యశస్సంపదలు, నిన్ను ప్రేమించే వారు కూడా అని తెలుసుకోవాలి. ఈ వరలక్ష్మీ వ్రతం రోజున సానుకూల భావనలతో మనసును నింపుకుందాం. అందుకు సిద్ధమేనా మరి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top