
దానమాసం
దానాలకు పేరు పొందిన ఈ వైశాఖ మాసంలో అన్నవస్త్రాలు, శయ్య, బియ్యం, మామిడిపళ్లు, ఆవునెయ్యి, మజ్జిగ, చెరకు రసం, అరటి పండ్లు దానం చేసిన వారికి అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి.
సందర్భం- ఏప్రిల్ 30 నుంచి వైశాఖ మాసం
దానాలకు పేరు పొందిన ఈ వైశాఖ మాసంలో అన్నవస్త్రాలు, శయ్య, బియ్యం, మామిడిపళ్లు, ఆవునెయ్యి, మజ్జిగ, చెరకు రసం, అరటి పండ్లు దానం చేసిన వారికి అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి.
పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసమని పేరు. మాసాలన్నింటిలోకి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైనదిగా పురాణాలు పేర్కొన్నాయి. చాంద్రమానాన్ని అనుసరించే ప్రజలు చైత్రశుద్ధ పాడ్యమిని సంవత్సరారంభంగా ఏ విధంగా భావిస్తారో సౌరమానాన్ని ఆచరించే జనులు వైశాఖమాసం మొదలయ్యే రోజును అంటే వైశాఖశుద్ధ పాడ్యమిని సంవత్సరాదిగా భావిస్తారు. అక్షయతదియ, పరశురామ జయంతి, ఆదిశంకర జయంతి, భగవద్రామానుజ జయంతి, నారసింహ జయంతి, హనుమజ్జయంతి, బుద్ధపూర్ణిమ వంటి ఎన్నో పర్వదినాలకు ఆవాసం ఈ మాసం.
కొద్దిపాటి దానానికైనా అనంతమైన ఫలాలనిచ్చేదిగా పేరు పొందిన ఈ మాసంలో మండు వేసవిలో ఎండనబడి వెళ్లే బాటసారులకోసం ఒక కుండతో నీళ్లు ఏర్పాటు చేసి, అడిగిన వారికి నీరు అందిస్తే అదే జలదానం. దానితోబాటు అన్నవస్త్రాలు, శయ్య, బియ్యం, మామిడిపళ్లు, ఆవునెయ్యి, మజ్జిగ, చెరకు రసం, అరటి పండ్లు దానం చేసిన వారికి అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఈ వైశాఖమాసంలో ప్రతిరోజూ పుణ్య తీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్నిస్తుందని పద్మ పురాణం చెబుతోంది. చెరువు, సరస్సు లేక బావి వీటిల్లో ఏదైనా సరే ఈ వైశాఖ స్నానానికి యోగ్యమైనదే!
నెల పొడవునా స్నానం చేయలేనివారికి మూడు రోజుల్లో అయినా స్నానం చేయాలని చెబుతారు. అవి - శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులు. ఈ మూడు తిథుల్లో చేసే స్నానానికి కల్మషాలను కడిగేసే శక్తి ఉంటుంది.
స్నానం తర్వాత త్రికరణశుద్ధిగా విష్ణుపూజ చేయాలి. నల్ల తులసి, తెల్ల తులసి, రెండూ ఈ మాసంలో హరిపూజకి అనుకూలమైనవే. ఈ విధంగా త్రికాలపూజ చేసే వారికి పునర్జన్మ ఉండదని పద్మపురాణ వచనం.
ఈ మాసంలో ఆవును అర్చించినవారి దుర్గతులు దూరమవుతాయని పురాణోక్తి. వైశాఖశుద్ధ పాడ్యమి నాడు శాస్త్రప్రకారం స్నానం చేసినవారు వేయి ఆవుల దానం వల్ల, భూమిని దానం చేయటం వల్ల లభించే ఫలితాన్ని పొందుతారని ప్రతీతి.
అట్లాగే ఏకభుక్తం, నక్తం లేక అయాచితం... వీనిలో ఏదైనా ఆచరించేవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వైశాఖపురాణం చెబుతోంది.
ఈ వైశాఖస్నాన వ్రత సంపూర్ణ ఫలితాన్ని పొందాలనుకునేవారు చేయవలసిన దాన విశేషాల్ని గురించి వామన పురాణం ఏమి చెబుతోందంటే... పాడి ఆవు, పాదుకలు, పాదరక్షలు, గొడుగు, విసనకర్ర, అన్ని సౌకర్యాలతో కూడిన శయ్య, దీపం, అద్దం దానం చేయాలి. వీలైనంతమందికి భోజనం పెట్టి నీటితో నింపిన కలశాన్ని, యవలను దానం చేసి, దక్షిణ ఇవ్వాలి. అందుకు శక్తి లేనివారు కనీసం పది మందికి పులగం వండిపెట్టాలి. ఈ మాసంలో చలివేంద్రాలు నిర్వహించటం, శివుడికి నిరంతరాయంగా అభిషేకం జరిగేలా చూడటం, పితృదేవతలకు తర్పణలు ఇవ్వడం, చెప్పులు, గొడుగు, వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు, నీటితో నింపిన కుండని దానం చేయటం అన్ని విధాలా మేలుని కలిగిస్తుంది. వీటితోబాటు ఈ మాసంలో సముద్రస్నానం కూడా విశిష్ఠ ఫలాలనిస్తుందని శాస్త్రవచనం.
వైశాఖంలో పర్వదినాలు
ఏప్రిల్ 30 నుంచి వైశాఖమాసం ఆరంభమవుతోంది. అన్నట్లు ఇది దానాల మాసం మాత్రమే కాదు. అనేక పర్వదినాలకు ఆవాసం కూడా!
మే 2, శుక్రవారం అక్షయతృతీయ: ఈరోజున చేసే పూజ, హోమం, దానం, పితృ తర్పణం అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి కాబట్టే దీనికాపేరొచ్చింది.
మే 4, ఆదివారం శంకర జయంతి: సాక్షాత్తూ శంకరుని అంశతో జన్మించినట్లుగా చెప్పుకునే జగద్గురు ఆదిశంకరాచార్యులవారు జన్మించిన పుణ్యతిథి శంకర జయంతి. మే 4న పరశురామ జయంతి కూడా!
మే 13, మంగళవారం నృసింహ జయంతి: వైశాఖ శుద్ధ చతుర్దశినాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి.
మే 14, బుధవారం బుద్ధపూర్ణిమ: కర్మాచరణ కన్నా ధర్మాచరణ ముఖ్యమని, అన్ని వ్రతాలలోకెల్లా అహింసావ్రతమే మిన్న అని బోధించి, మానవాళి కష్టాలకు మూలకారణమైన కోరికలను త్యజించాలని చెప్పిన గౌతముడు జ్ఞానం పొంది, బుద్ధుడైన రోజు.
మే 23, శుక్రవారం హనుమజ్జయంతి: ఉత్తర భారతంలో చైత్రమాసంలో చేస్తే దక్షిణ భారతదేశంలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమజ్జయంతిజరుపుకుంటారు. హనుమంతుని అనుగ్రహం కోసం ఈరోజున సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. శ్రీ సీతారామచంద్రులను పూజిస్తారు.
చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్నట్టు పైన చెప్పిన వాటిలో అన్నీ కాకపోయినా, కనీసం కొన్నింటిని ఆచరించినా మంచిది.
- డి.కృష్ణకార్తిక