ఈ నలుగురూ...

Tottaa Pataaka Item Maal Movie - Sakshi

మగవాడి అహంకారానికి, ఆధిపత్యధోరణికి, లైంగికప్రకోపానికి, విశృంఖలత్వానికి.. పాడె కట్టాలి కదా.. నలుగురు మోయాలి కదా! మృగాహంకారానికి అంత్యక్రియలుచేయాల్సింది ఈ నలుగురే కదా! మహిళకు జరిగిన అన్యాయాన్నే తిరిగి మగాడికి చేయడం కరెక్టా? అని అనిపించొచ్చు! నిర్భయకు జరిగింది కడుపు తిప్పేసే అన్యాయం.. ఆ కడుపులోంచే పుట్టారు ఈ నలుగురూ!

ఢిల్లీ.. సాయంకాలం.
‘మియావ్‌’ లేడీస్‌ ఓన్లీ షేరింగ్‌ క్యాబ్స్‌.
నలుగురు మహిళలు (క్యాబ్‌ డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ సహా) ప్రయాణిస్తున్నారు.
‘‘అవునూ.. ఈ క్యాబ్స్‌కి  అందరూ లేడీ డ్రైవర్సే కదా... మరి వాళ్ల సేఫ్టీ గురించి వాళ్ల ఫ్యామిలీస్‌ భయపడట్లే?’’ అడిగింది షగుఔఏ నర్వాల్‌.
‘‘కొత్తలో భయపడేవారు.. ఇప్పుడు అలవాటైపోయింది’’ చెప్పింది మియావ్‌ ఓనర్‌ అండ్‌ డ్రైవర్‌ శైలా.
‘‘భయపడ్డం అలవాటవడం .. భలే ఉంది’’ వ్యంగ్యంగా నవ్వుతూ షగున్‌.
‘‘మగవాళ్లకు ఇలాంటివేం ఉండవ్‌’’ విభా.
‘‘అసలు వాళ్లకు భయమంటే ఏంటో తెలిస్తే కదా..’’ చిత్ర కామెంట్‌.
‘‘నిజమే.. రాత్రి ఎనిమిది తర్వాత బయటకు వెళితే ఏదో జరగుతుందనే భయం వాళ్లకు ఎందుకు ఉంటుంది?’’  విభా మాట.
‘‘ ఏ టైమ్‌లో బయటకు వెళ్లినా.. జరగకూడదనిది జరుగుతుందనే ఒక అనుభవాన్ని.. భయాన్ని వాళ్లకూ కల్పించాలి ’’ అంది మళ్లీ షగుఔఏ.
‘‘ ఒక్క మగాడికి అలాంటి లెసన్‌ నేర్పిస్తే చాలు’’  విభా.
‘‘హు.. ఏం జరుగుతుంది? ఆడవాళ్లు అంత తెగించరని మగవాళ్లకు బాగా తెలుసు’’ నిరాసక్తంగా.. నిర్లక్ష్యంగా చిత్ర.
‘‘తెగించలేక కాదు.. క్రూరంగా ఉండడం చేతకాకా  కాదు.. కాన్షస్‌గానే మనం ఆ దారి వద్దనుకుంటున్నాం అంతే’’ చెప్తోంది ఆ నలుగురిలోకి వయసులో కాస్త పెద్దదైన విభా.
వీళ్లు మాట్లాడుకుంటూండగానే.. ఈ  కారును ఫాలో చేస్తూ.. ఒక మోటార్‌ సైకిల్‌ రైడర్‌.. కారుకూతలు కూస్తూ. ఫ్రంట్‌ విండో సీట్‌ దగ్గర కూర్చున్న చిత్ర చూస్తుంది అతణ్ణి. అంతకుముందే ట్రాఫిక్‌లోఒక రెస్టారెంట్‌ దగ్గర తారసపడ్డ వ్యక్తే. అప్పుడూ ఇలాగే ఏదో టీజ్‌ చేశాడు.
చిత్ర తనను చూడ్డంతో మరింత రెచ్చిపోతాడు. అంతే కోపం, ఆవేశంతో చిత్ర.. శైల చేతిలోని స్టీరింగ్‌ను ఒక్కసారిగా ఆ బైక్‌ వ్యక్తి వైపు తిప్పుతుంది. అతను పడిపోతాడు. లోపల ఉన్న మిగిలిన ముగ్గురూ షాక్‌. తేరుకొని గబగబా కార్‌ దిగి పడిపోయిన వ్యక్తి దగ్గరకు వస్తారు. చిత్ర పెప్పర్‌ స్ప్రే తీసి అతని కళ్లల్లో స్ప్రే చేస్తుంది. అక్కడే కనిపించిన కర్ర ఒకటి తీసుకొని అతని మెడ మీద, తల మీద కొడుతుంది విభా.
స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో అతను  చనిపోయాడనుకుంటారు ఈ నలుగురూ. ఈ హడావిడి చూసి.. విభా అతణ్ణి కొట్టకముందే లేడీస్‌ క్యాబ్‌లో ఉన్న సేఫ్టీ అలారమ్‌ను ప్రెస్‌ చేస్తుంది శైలా. అందుకే మిగిలిన ముగ్గురితో వాదన పెట్టుకుంటుంది ఆమె.. ‘‘మీరెందుకు కొట్టారతణ్ణి.. నేను సేఫ్టీ అలారమ్‌ ప్రెస్‌ చేశాను. పోలీసులు బయలుదేరి ఉంటారు ’’ అని.
‘‘ఎంత పనిచేశావ్‌? ఇప్పుడు ఇతనికి జరగరానిదేదైనా జరిగితే.. మనకు జైలే గతి. పైగా ఇతనిది ఎలాంటి ఫ్యామిలినో? ఒకవేళ పలుకుబడి ఉన్నవాళ్లయితే?’’ కంగారు పడ్తుంది షగున్‌.
‘‘సర్లే.. ఏదైతే అది అయింది.. ముందు ఇతణ్ణి కారెక్కించి.. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం’’ అని మళ్లీ తానే అందరికీ ధైర్యం చెప్పి సమాయత్తం చేస్తుంది.
                                                                   ∙     ∙       ∙
బొట్టు నుంచి కట్టు దాకా ఆంక్షలు.. సంస్కార ముద్రలు, పరువు భారం, డొమెస్టిక్‌ వయొలెన్స్, అస్సాల్ట్, టీజింగ్, రేప్‌... వీటన్నిటి వల్ల కలిగే భయాన్ని మగవాడికి కూడా రుచి చూపించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే  జెండర్‌ ఈక్వాలిటీ మీద తీసిన సినిమా  ‘‘టోట్టా పటాకా ఐటమ్‌ మాల్‌’’ . అందులోనిదే  పై సన్నివేశం.

రిమైనింగ్‌ పార్ట్‌ ఆఫ్‌ ది మూవీ
అలా కార్లో తీసుకెళ్లిపోయిన ఆ వ్యక్తిని.. మూతబడ్డ ఓ ప్రిటింగ్‌ ప్రెస్‌లో దాస్తారు. ఆ ప్రింటింగ్‌ ప్రెస్‌ చిత్ర వాళ్ల బంధువులది. దొంగ నోట్లు ముద్రిస్తున్నారన్న నెపంతో ఆ ఓనర్‌ను జైల్లోపెడ్తారు.  చిత్ర కరాటే  ఫైటర్‌.. ఆడపిల్లలకు కరాటే  నేర్పిస్తూంటుంది. షగున్‌ నర్వాల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. విభా సోషల్‌ మీడియా స్పెషలిస్ట్‌. పెద్ద పెద్ద బ్రాండ్స్‌కి సోషల్‌ మీడియా స్ట్రాటజీస్‌ తయారుచేస్తూంటుంది. ‘మియావ్‌’ లేడీస్‌ ఓన్లీ షేరింగ్‌ క్యాబ్స్‌ ఓనర్‌ శైల.. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ అయిపోయిన వెంటనే ఈ క్యాబ్స్‌ పెడ్తుంది. స్త్రీ తనకు తాను స్వతంత్రంగా బతకడమే అసలైన ఫెమినిజం అని నమ్ముతుంది. ఆమెకు  తప్ప  మిగిలిన ముగ్గురికీ జీవితంలో చేదు అనుభవాలు ఉంటాయి. షగుణ్‌ ఒక విషాదానికి సాక్షిగా ఉంటుంది. అంతకుముందు తను పనిచేసే ఒక పోలీస్‌స్టేషన్‌లో తన కళ్లముందే ఒక ఆడపిల్లను ఆమె తండ్రి, సోదరుడు కలిసి నరికేస్తారు. కులంకాని వ్యక్తిని ప్రేమించిందని. అలాగే విభాకూ ఓ బాధ ఉంటుంది.  తన చెల్లెలిని గ్యాంగ్‌ రేప్‌ చేస్తారు. ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. చిత్ర లైగింక దాడికి గురవుతుంది. ఆడవాళ్లకు జరుగుతున్న దారుణాలు విని, చూసి... తను అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా ఉంటే అలాంటివాటి నుంచి  తప్పించుకోవచ్చనే ఆలోచనతో కరాటే నేర్చుకొని శారీరకంగా దృఢంగా అవుతుంది.  

భయం అంటే ఏంటో చూపించాలని.
ప్రింటింగ్‌ ప్రెస్‌లో దాచిన ఆ వ్యక్తి పేరు మహేంద్ర ప్రతాప్‌ చౌహాన్‌. ఆడవాళ్లంటే సెక్సువల్‌ ఆబ్జెక్ట్స్‌.. సెక్స్‌తో, రుచికరమైన వంటతో  మగవాడిని సంతృప్తి పరుస్తూ.. పిల్లల్ని కనిపెంచే యంత్రాలు అనే అభిప్రాయంతో ఉంటాడు. తమ చేతికి చిక్కిన అతణ్ణి .. అయిదు రోజులు అలాగే ఆ ప్రెస్‌లోని ఓ బీరువాలో బంధిస్తారు ఆ నలుగురూ. ఆ  బీరువాకు ఓ చిన్న రంధ్రం చేసి దాని గుండా సూప్‌లు పంపిస్తూంటారు ఆహారంగా. అతని మొబైల్‌లో అసభ్యకరమైన వీడియోలు, అతని గర్ల్‌ఫ్రెండ్‌కి అతను పంపిన బ్లాక్‌మెయిల్‌ మెసేజ్‌లూ  చూస్తారు. అలాంటి ఎక్స్‌పీరియెన్స్‌నే ఇతనికీ ఇవ్వాలనుకొని  ఆ విషయాన్ని వాళ్లు అతనికి  చెప్తారు కూడా. దానికి  రంగం సిద్ధం చేసుకుంటారు. ఓ వీడియో కెమెరా తీసుకొచ్చి ఆ ప్రెస్‌లో ఓ మూలన అమరుస్తుంది విభా.

రోజుకోరకంగా..!
రోజూ సాయంకాలం పనులు ముగించుకొని ఆ ప్రెస్‌కి వస్తూంటారు  నలుగురూ. మహేంద్ర ప్రతాప్‌ చౌహాన్‌ చేత స్కర్ట్, షర్ట్‌ వేయిస్తారు. జుట్టుకి రబ్బర్‌బ్యాండ్‌ పెట్టుకోమంటారు. పెదవులకు లిప్‌స్టిక్‌ రాసి.. అచ్చు అమ్మాయిలా రెడీ అవమంటారు. పారిపోకుండా కాళ్లు, చేతులను గొలుసులతో కట్టేస్తారు.  తమకిష్టమైన మెనూ ఇచ్చి వంట చేయమంటారు. సరిగా చేయకపోతే ఇదేం వంట అంటూ తిడ్తారు.  ఇల్లు తుడిపిస్తారు. గిన్నెలు కడిగిస్తారు. చిన్న పొరపాటు జరిగినా.. తిడ్తారు.. కొడ్తారు. మొత్తానికి డొమెస్టిక్‌ వయొలెన్స్‌ ఎలా ఉంటుందో చూపిస్తారు. ఇంకో రోజు.. నచ్చిన పాటలు పెట్టి.. డ్యాన్స్‌ చేయమంటారు. చేయకపోతే ఈవ్‌ టీజింగ్‌.. అబ్యూజ్‌ ఎలా ఉంటుందో చూపిస్తారు. మరో రోజు.. హెరాస్‌ చేస్తారు. మూడురోజులు అయ్యేసరికి.. మానసికంగా కుంగిపోతాడు అతను. బూతులు తిట్టిన నోటితోనే అమ్మా...అక్కా.. చెల్లీ అంటూ కాళ్లబేరానికి వస్తాడు. తనను వదిలేయమని. వాళ్ల జోలికి వచ్చినందుకు క్షమించమనీ వేడుకుంటాడు. అయినా వదిలిపెట్టరు. మా జోలికే కాదు. జీవితంలో ఏ స్త్రీ జోలికీ వెళ్లకూడదు అంటూ.  నాలుగో రోజు లైంగిక దాడి, లైంగిక హింస అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ఇనుప రాడ్‌ తీసుకొస్తారు. బెదిరిపోతాడు అతను. మాటలతో ఇబ్బంది పెడ్తారు. ప్రతిఘటించలేనంత బలహీనుడవుతాడు. వణికిపోతాడు. ఆ భయంతోనే స్పృహతప్పి పడిపోతాడు. అయితే ప్రతిరోజూ ఈ వీడియో క్లిప్పింగ్స్‌ను తమ మొహాలు కనిపించకుండా ఎడిట్‌ చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తూ ఉంటుంది సోషల్‌మీడియా స్పెషలిస్ట్‌ విభా. అనూహ్య స్పందన వస్తూంటుంది ఆ వీడియో సిరీస్‌కి. అలా  స్పృహతప్పి పడిపోయిన మహేంద్ర ప్రతాప్‌ను ఆ రాత్రే తీసుకెళ్లి  ఢిల్లీలో ఓ రోడ్డు మీద పడేస్తారు.

మంచి పాఠం
స్పృహ వచ్చాక  ఇంటికివెళ్లిన మహేంద్ర ప్రతాప్‌ చౌహాన్‌ అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది ఆ రోజు వార్తా చానళ్లలో,∙సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వీడియో క్లిప్పింగ్స్‌ మీద అభిప్రాయ సేకరణ మొదలుపెడ్తుంది మీడియా. యూత్‌ ఆడ, మగ అందరూ.. ఆ నలుగురు చేసింది కరెక్ట్‌ అంటారు. అనే ఒపీనియన్‌ను వెలిబుచ్చుతారు. పెద్దవాళ్లూ సపోర్ట్‌ చేస్తారు. గడ్డం, మీసం.. పురుషుల ఆధిక్యతకు చిహ్నం కాదు. హార్మోన్ల ఐడెంటిటీ అంతే. అమ్మాయి.. అబ్బాయి.. వేర్వేరే... కాని ఈక్వల్‌ జెండర్స్‌. మనుషులుగా సమానమే! భావోద్వేగాలు ఇద్దరికీ ఒకటే. ఒకరి అవమానం ఇంకొకరికి సంతోషం కాకూడదు. హింసిస్తూ ఆనందాన్ని పొందడం నేరం.. అమానవీయం. ఇది ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా మనుషులందరికీ వర్తించే సత్యం! టోట్టా పటాకా ఐటమ్‌ మాల్‌ సినిమా సారం! టోట్టా.. అంటే పంజాబీలో అందమైన అమ్మాయికి ఆకతాయి అబ్బాయిలు వాడే విశేషణం.

బరిలో ప్రత్యర్థికి, బయట మగవాళ్లకు తనను పట్టుకునే ఎలాంటి ఆధారమూ ఇవ్వకుండా జుట్టు కత్తిరించుకుంటుంది. స్త్రీత్వాన్ని దాచుకొని గుండు, ప్యాంట్, షర్ట్‌తో అబ్బాయిలా కనిపిస్తూంటుంది. ఒక్క మగాడికి ఇలాంటి లెసన్‌ ఇస్తే, అది మిగిలిన వాళ్లకు చూపిస్తే నిజంగా ఆడపిల్లలు అనుభవిస్తున్న వ్యథ, మోస్తున్న అవమానాలు, పడ్తున్న బాధలు అర్థమవుతాయి

– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top