చరిత్ర అడుగు.. చెప్పింది చెయ్‌

toilet museum that promotes Indo-Indian inspiration - Sakshi - Sakshi

వినూత్నం స్వచ్ఛభారత్‌ స్ఫూర్తికి ఊతమిస్తున్న టాయిలెట్‌ మ్యూజియం

స్టూడెంట్స్‌ను సైన్స్‌ మ్యూజియంకు తీసుకువెళతారు. లేదా కళాత్మక అంశాలు ఉన్న మ్యూజియంకు తీసుకువెళతారు.మరి టాయిలెట్‌ మ్యూజియంకు తీసుకువెళతారా?‘తీసుకు వెళ్లాలి’ అంటున్నారు ఢిల్లీలో టాయిలెట్‌ మ్యూజియంను నిర్వహిస్తున్న సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వాళ్లు. అలా తీసుకువెళితేనే వాళ్లకు టాయిలెట్ల ఉపయోగం, నిర్మాణం పట్ల అవగాహన కలుగుతాయని అంటున్నారు.కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ అంశాన్ని ఒక విధానంగా స్వీకరించడానికి చాలా ఏళ్ల ముందే సులభ్‌ సంస్థ వ్యవస్థాపకుడైన డాక్టర్‌ బిందేశ్వర్‌ పాఠక్‌ దేశవ్యాప్తంగా ప్రజా మరుగుదొడ్ల వ్యవస్థాపన ఉద్యమాన్ని స్వీకరించాడు. మన దేశంలోని నగరాల్లో, పట్టణాల్లో బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జనకు పబ్లిక్‌ టాయిలెట్లు ఏ మాత్రం లేకపోవడం వల్ల కలిగే తీవ్ర అసౌకర్యం ఒక సమస్యైతే వాటి లేమి వల్ల సాగే బహిరంగ విసర్జన వల్ల వ్యాపించే అపరిశుభ్ర పరిస్థితులు మరో సమస్య. వీటి కంటే ఎక్కువగా చేతులతో వ్యర్థాల్ని ఎత్తిపోసే ‘డ్రై లెట్రిన్ల’ వాడకం వల్ల కొన్ని నిమ్న జాతులు ఆ అమానవీయమైన వృత్తికి అంకితమై ఇతరులచే ఏహ్యభావనతో చూడబడే పరిస్థితిలో ఉండటం ఇంకా పెద్ద సమస్య. ఈ సమస్యలన్నింటి సమాధానం సక్రమమైన టాయిలెట్ల వ్యవస్థాపన అని సులభ్‌ సంస్థ భావించింది. అందుకు తగినట్టుగా చేసిన కృషికి తగిన ఫలితాలు కూడా ఈ దేశం చూసింది. అంతకుమించి సులభ్‌ సంస్థ స్థాపించిన ‘టాయిలెట్‌ మ్యూజియం’ ఈ దేశ యువతరానికి టాయిలెట్ల చరిత్రనే కాదు వాటి ఆధునిక వ్యవస్థాప నకు సంబంధించి సంపూర్ణ అవగాహన కలిగిస్తోంది.

ఆధునిక టాయిలెట్లు
టాయిలెట్‌ మ్యూజియంలో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడ తక్కువ ఖర్చుతో మరింత ఉపయోగకరంగా టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నదో ఆ మోడల్స్‌ అన్నీ ఉన్నాయి. మానవ విసర్జకాలను కంపోజ్‌ చేసి ఎరువుగా మార్చే టాయిలెట్ల నిర్మాణాన్ని ఇక్కడ నిర్వాహకులు ఒక కార్యక్రమంగా వివిధ రంగాల విద్యార్థులకు తెలియపరుస్తున్నారు. ఫలితంగా వారి ద్వారా టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రచారం చేస్తున్నారు. టాయిలెట్‌ మ్యూజియంలో ఉన్న ఆధునిక టాయిలెట్లలో చైనా ‘టాయ్‌ కమోడ్‌’, అమెరికా ఎలక్ట్రిక్‌ టాయిలెట్, జపాన్‌ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్‌ టాయిలెట్‌ ఉన్నాయి. వీటిని చూడటానికి ఎటువంటి ఫీజు లేదు. ఈ మ్యూజియం ప్రతిరోజూ తెరిచే ఉంటారు. ఈసారి ఢిల్లీ వెళ్లినప్పుడు ముక్కు మూసుకోకుండానే హాయిగా దర్శించండి.

మ్యూజియం స్థాపించి..
భారతీయ సంస్కృతిలో విసర్జన అవసరాల గురించి మాట్లాడటం నిషిద్ధం. అందువల్ల మనదేశంలో పూర్వికుల టాయిలెట్‌ అలవాట్లు దాదాపుగా నమోదు కాకుండా పోయాయి. హరప్పా నాగరికతలోనే మనవాళ్లు చాలా శాస్త్రీయత కలిగిన మరుగుదొడ్లు నిర్మించుకున్నారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ నాగరికత అంతరించి మన దేశంలో టాయిలెట్ల నిర్మాణం లేకుండా పోయి బహిరంగ విసర్జన అలవాటైంది. అయినప్పటికీ రాజుల, మహరాజుల కాలంలో టాయిలెట్ల వాడకం గురించి అప్పటి నిర్మాణాల గురించి ఉన్న కొద్దో గొప్పో ఆచూకీ తీసి ఒకచోట చేర్చే గొప్ప ప్రయత్నం ‘టాయిలెట్‌ మ్యూజియం’ స్థాపన ద్వారా సులభ్‌ సంస్థ చేసింది. ఢిల్లీ శివార్లలో ఉన్న ఈ మ్యూజియంలో ‘ప్రాచీన’, ‘మధ్యయుగ’, ‘ఆధునిక’ అనే మూడు విభాగాలలో నాటి టాయిలెట్ల ఆనవాళ్లు, రిప్లికాలు చూడవచ్చు. కింగ్‌ లూయిస్‌ 14 వాడిన సింహాసనం వంటి టాయిలెట్‌ ఈ మ్యూజియంలో ఉంది. దాదాపు యాభై దేశాల టాయిలెట్ల నిర్మాణాల ఫొటోలను ఈ మ్యూజియంలో చూడవచ్చు. విసర్జకాలను ఏ విధంగా నిర్వహించవచ్చో కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top