శ్రీశ్రీ అలభ్య అనువాద రచన (యక్షగానం) భాగ్యలక్ష్మి

Sri Sri Written Bhagyalakshmi Poet - Sakshi

మహాకవి శ్రీశ్రీ నూట ఎనిమిదో జయంతి సందర్భంగా, ఒక అదనపు కారణానికి కూడా ఈ పండుగ వేడుక హెచ్చింది. విరసం వారూ, తరువాత మనసు ఫౌండేషన్‌ వారూ వేసిన శ్రీశ్రీ సమగ్ర  రచనలు లేదా సంపూర్ణ లభ్య రచనల సంకలనాల శ్రద్ధాపూర్వక కృషి తరువాత కూడా   మరొక శ్రీశ్రీ రచన, లభ్యం అయ్యింది. అది రాసిన శ్రీశ్రీకి 34 ఏళ్ళు. ఒక ఏడాది ముందరే జరిగిన ఈ రచన, తన ప్రపంచ సాహిత్య అధ్యయన స్వభావానికి దీటుగానే ఉన్నది. ఈ రచన అచ్చు అయింది 26 మార్చ్‌ 1944 ఆనందవాణి పత్రికలో, భాగ్యలక్ష్మి (యక్షగానం) పేరిట.

ఇది  అనువాద కవిత కావడం మరొక విశేషం. ఇరవై మూడేళ్ళ రడ్యార్డ్‌ కిప్లింగ్‌ (1865 – 1936)  రచన ‘ద మాస్క్‌ ఆఫ్‌ ప్లెంటీ’కి యేడాది క్రితం నేను చేసిన యధాశక్తి తర్జుమా) అని శ్రీశ్రీ పాదసూచి పెట్టారు. ఇంతకుముందు శ్రీశ్రీ అనువాదాలు ఎక్కువగా వచ్చిన ఖడ్గసృష్టిలో కానీ, శ్రీశ్రీ కవితా ప్రస్థానం పేరిట మనసు ఫౌండేషన్‌ వారి బృహత్‌ ప్రచురణలో కానీ ఈ రచన లేదు. శ్రీశ్రీ అనువాదాలను అధ్యయనం చేసే వారికి, వారి సాహిత్య ప్రియులకు, తెలుగు సాహిత్య చరిత్రకు ఇదొక కొత్తగా లభ్యమైన వనరు.

శ్రీశ్రీ రచనల సేకరణలో అనితర సాధ్యమైన కృషి చేసిన చలసాని ప్రసాద్‌ గారిని స్మరించడం కూడా ఈ సందర్భానికి శోభను ఇస్తుంది. శ్రీశ్రీ సంపూర్ణ లభ్య రచనల కృషిలో రెండు మూడు తరాల సాహిత్యాసక్తులు, సాహిత్య వేత్తలు, సేకర్తలు కలిసి పని చేసి సాధించిన ఫలితంలో ఇదొక అదనపు అక్షర అక్షయ నిధి. సాహిత్య, సామాజిక, సాంస్కృతిక అధ్యయనానికి పుష్కలమైన అవకాశం.కిప్లింగ్‌ ఆంగ్ల కవిత లాహోర్‌ నుంచి నడిచే పత్రిక ‘ది పయనీర్‌’లో 26 అక్టోబర్‌ 1888 నాడు  ప్రచురణ. బ్రిటిష్‌ రాణి పాలనలో భారత జన జీవనంపై ఇదొక విలువైన రచన. బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం నియమించిన గవర్నమెంట్‌ విచారణ కమిషన్‌ తీరు తెన్నులపై, కిప్లింగ్‌ అంటే ఫ్రెంచ్‌ భాషలో ఒక పల్లీయ వినోద ప్రదర్శన గానూ, అలాగే అసలు విషయం దాచిపెట్టే కుహనా నివేదికల ప్రహసనంపై ఆంగ్ల భాషలో ఝ్చటజు అన్న అర్థంతోనూ ఈ రచన, పాలకుల ధోరణిపై విమర్శగా చేశాడు.

అలా చూస్తే, బ్రిటిష్‌ ఇండియా సాహిత్యంలో ఒక ప్రధాన రచన అయిన దీన్ని శ్రీశ్రీ 75 ఏళ్ల ముందర  తెలుగులోకి తెచ్చారు. యధాశక్తి తర్జుమా  అన్నారు కనుక 1888 మూలం, 1943 తెలుగు అనువాదం, నిశిత పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. రైతు జీవితాలు 1888 నాటికి ఎలా ఉన్నాయో, కిప్లింగ్‌ చెప్పగా, అంతకన్నా మరింత గడ్డుగా స్వాతంత్య్రానంతర భారతంలో ‘మార్చాము’ కనుక –  దాదాపు శతాబ్దపున్నర కిందటి ఈ భారతీయ సమాజ రచన ఆనాడే అక్కడే ఉండిపోకుండా, 75 ఏళ్ల కిందట  వెలుగులోకి తెలుగులోకి తెచ్చిన మహాకవి శ్రీశ్రీ సృజన దర్శనానికి వందనాలు.
సేకరణ, లఘువ్యాఖ్య: రామతీర్థ

(అవతారిక:– భారతీయ ప్రభుత్వం వారు దేశంలో యోగక్షేమాల భోగట్టా తియ్యడానికొక ప్రత్యేక సంఘాన్ని నియోగించారు. నిక్షేపం లాగ దేశం భాగ్యభోగాలతో తులతూగుతోందని ప్రభుత్వం వారు పసికట్టారు).
రంగం:–  భూలోకస్వర్గం – అనగా సిమ్లా శిఖరం. భారతీయ ప్రభుత్వం భాగ్యలక్ష్మి వేషంలో పాడుకుంటూ ప్రవేశం. టకోరా; సన్నాయి మేళాల నేప«థ్య గానం.
రైతు బ్రతుకే మధురం! ఆహా
రైతు బ్రతుకే మధురం
పగలూ, రాత్రీ, పాడీ పంటా
రాజ్యమేలే రాజులకన్నా
రైతు బ్రదుకే సులభం! ఆహా
రైతు బ్రదుకే సుభగం 
(తొహరా)
సాక్షాత్తూ మనదేశం
స్వర్గమే అని మా ఉద్దేశం
పుణ్యభూమి కాదటండీ వేరే
భూకైలాసం ఉన్నాదటండీ!
జరూరుగా తమరొక నివేదిక
తయారుచేసి పారేస్తే చాలిక!
శతసహస్ర భారత నరనారీమణులు
శక్రచాప శబలిత తేజోఘృణులు
చిత్రచిత్ర వర్ణాలతో వీరి పరిస్థితి 
చిత్రించండి సముజ్వల సుందరాకృతి
(హిమాలయ పర్వతాలు దిగి సమర్థులైన పరిశీలన సంఘంవారు దయచేస్తారు.)
తురుష్క వేత్ర హస్తుడు –
యోగక్షేమాల భోగట్టా తీశారా?
దేశం నాడిపరీక్ష చేశారా?
చక్కని భాషలో నివేదిక రాశారా?
సమాచారమేదో మా నెత్తిని కొట్టండి.
ఆవులూ గేదెలూ దూడలూ దున్నలూ
అమాం బాపతు లెక్కలు కట్టండి
ఫస్టు క్లాసులో యమ్మే ప్యాసయిన
బాబూజీనొకడ్ని పట్టండి
కట్టలు కట్టలుగా కాగితాల కుప్పలతో
గెజెటీర్లకి గెజెటీర్లే నిండుతాయి:
విష్కంభం
అనంతాకాశం నించి అశరీరవాణి
(జంత్ర వాద్యాల సంగీతంతో)
బక్కచిక్కిన దుక్కిటెద్దుల
ప్రాణములు కనుగొనల దాగెను
ఆకసము రక్తాగ్ని కుండము
భూమి నల్లని బొగ్గుకుంపటి
మండుగాడుపు టెండవేడికి
మరిగి కాలం భగీల్మన్నది
యముని కారెనుబోతు మెడలో
ఇనుపగంటలు నవ్వినట్లుగ
దిగుడుబావి దిగాలుమన్నది
పైరు పంటలు బావు రన్నవి
ఇంకిపోయిన ఏటి కడుపున
ఇసుక దిబ్బలు గొల్లుమన్నవి
పరమపద సోపాన పథమున
పాము నోట్లో పడ్డ రైతూ!
ఎవరికై చేయెత్తి ప్రార్థన?
ఎవరి కర్మల కెవరు కర్తలు
చూడు పడమట సూది బెజ్జపు
మేర కూడా మేఘ మంటదు
ఇంత వర్షపు చినుకు కోసం
చూచి కన్నులు సున్న మైనవి
ఏడుపెందుకు వెర్రి బిడ్డా
ఎవరు నీ మొర లాలకింతురు
చచ్చిపోయిన గొడ్డు నడుముకు
చచ్చినట్టే నిద్రపోవోయ్‌!
(విజయ గర్వంతో విర్రవీగుతూ సిమ్లా నగరానికి పరిశోధక సంఘంవారి పునరాగమనం. సింహ శాబకాన్ని వెంటబెట్టుకొని వస్తూన్న భరతపుత్రుని వేషంతో. అస్వస్థతగా వున్న భారతదేశం చికిత్స పొందుతున్న సూచనగా నుదుటికి పలాస్త్రీ, మోకాళ్లకి పట్టీలు)
సంఘసభ్యుల సంగీతం:–
తిరిగాము తిరిగాము గోవిందారామ
దేశమంతా మేము గోవిందా
రాజుల్ని చూశాము గోవిందారామ
రైతుల్ని చూశాము గోవిందా
చూశాము చూశాము గోవిందారామ
దేశసౌభాగ్యాన్ని గోవిందా
మాయ రోగాలేవి గోవిందారామ
మచ్చుకైనా లేవు గోవిందా
చావనే మాటైన గోవిందారామ
స్మరియించగా రాదు గోవిందా
శిస్తుగా ప్రజలెల్ల గోవిందారామ
మస్తుగా బలిశారు గోవిందా
సకల సంపదలతో గోవిందారామ
తులతూగుతున్నారు గోవిందా.
(నాట్యం)
కాపులూ కరణాలు
రాజులూ రెడ్లు
బ్రాహ్మణులు వైశ్యులూ
మాల మాదిగలు
పిండార్లు థగ్గులూ
జైనులూ జాట్లు
సర్కారు దయవల్ల గోవిందారామ
చల్లగా వున్నారు గోవిందా
తిని తిరిగి హాయిగా గోవిందారామ
తెగ బలిసి పోయారు గోవిందా
గో‘ఓ’వింద!
(ఇండియా ప్రభుత్వం తెల్ల శాటిన్‌ రెక్కలతో ఎగిరివచ్చి అమెరికన్‌ రోడ్డు తంబురా మీటుతూ స్వస్తి వాచకం–)
ప్రజ లేకగ్రీవమ్ముగ 
    పంచభక్ష్య రసాన్నములు
పర్వత శిఖరాగ్రమ్ముల
ప్రశాంతముగ పవ్వళించి
ఆరగించు దృశ్యమ్మును 
     ఆక్షి పేయమగునట్లుగ
చూచుచుంటకంటె వేరె
సుఖమున్నదె శుభమున్నదె?
పరిశోధక సంఘసభ్య
పావనమూర్తులకు జయము
ఫలియించెను మీరు పడిన
పరిశ్రమము ధన్యులొహో
కిరాయి మేళం – బాకాలూదుతూ:–
గొప్ప గొప్ప కామందులపై
వారి బంధుమిత్రాదులపై
భగవంతుని కరుణారసామృతం
ప్రవహించక తప్పదు మరి
వానలూ వరదలూ వచ్చినా
కరువూ కాటకం కలరా వచ్చినా
పేదవాళ్ల సొమ్మేం బోయింది
ఆదమరిచి నిద్రపోతే సరి
పేదవాళ్లు సుఖంగానే వున్నారని
భాగ్యవంతులు నిర్ణయించేశారు
గొప్ప గొప్ప వారందరికీ జయం
వారి చుట్టూ తిరిగే వారందరికీ జయం
పేదవాళ్ల కెందుకూ భయం?
ప్రాణమున్నన్నాళ్లు బతుకుతారు నయం!

Rudyard Kipling రాసిన
The Masque of Plenty కి 
ఏడాది క్రితం నేను చేసిన యథాశక్తి తర్జుమా.  

–శ్రీశ్రీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top