అమ్మమ్మ అశీర్వాదం

Special Story On Sankranti Festival - Sakshi

పండుగ

కడుపు పండటం.. తమలపాకుతో నోరు పండటం.. గోరింటాకుతో చేయి పండటం.. దైవధ్యానంతో బతుకు పండటం.. ఎన్ని పంటలు జీవితంలో! సంక్రాంతికి కూడా  ధాన్యపు సిరులతో పాటుగా పండవలసినవి ఎన్నో ఉంటాయి. అవి పండకపోతే సంక్రాంతి లక్ష్మి కళ కాస్తయినా తగ్గుతుంది. కళ తగ్గితే ఆ లక్ష్మీదేవి ఎలా ఉంటుందన్న ఆలోచనకు అక్షరరూపమే ఈ సృజన రచన. ‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువుగానీ’ అంటూ నన్ను ఎంత సాదరంగా ఆహ్వానించేవారో! ఇప్పుడెక్కడో గానీ ఆ స్వాగత గీతం వినిపించడం లేదు. స్వాగత తోరణం కనిపించట్లేదు’’ అని కలతపడింది సంక్రాంతి లక్ష్మి. ఆ మాటకు అమ్మమ్మ ఫక్కున నవ్వింది.

సంక్రాంతి లక్ష్మి నిర్లిప్తంగా కూర్చుని ఉంది. ఆమె వదనంలో చిరునవ్వుల కాంతులు మినుకు మినుకుమంటున్నాయి తప్ప ప్రకాశించడం లేదు. ఊహ తెలిశాక ఎనభై సంక్రాంతులను చూసిన అమ్మమ్మ అక్కడికి వచ్చింది. వస్తూనే, ‘‘అమ్మా! సంక్రాంతి లక్ష్మీ.. నీ నిర్లిప్తతకు కారణం చెప్పు. మేం తీర్చగలిగేదైతే తీరుస్తాం. నువ్వు విషయం చెబితేనే కదా మాకు తెలిసేది’ అంటూ సంక్రాంతి లక్ష్మి చేతిలో చేయి వేసింది. అనునయించింది. ‘‘చెప్పు తల్లీ’’ అని మరొకసారి అడిగింది. సంక్రాంతి లక్ష్మి మౌనం వీడింది. ‘‘అమ్మమ్మా! కొన్నేళ్ల వరకు నేను కళకళలాడుతూ ఉండేదాన్ని. హరిదాసులు చిటితాళాలు మీటుతూ హరినామస్మరణ చేస్తుంటే, వీనుల విందుగా ఉండేది నాకు. వారి కావళ్లు ధాన్యాలతో నిండిపోతుంటే, నా మనసు కూడా పరవళ్లు తొక్కేది. గంగిరెద్దుల మేళాలు ఇంటింటికీ వచ్చి, డోలుసన్నాయి వాయిస్తూ, గంగిరెద్దును ఆడిస్తూ, ఆ ఎద్దును రకరకాల పాత చీరలతో అలంకరిస్తుంటే, వారి కళ్లలోని ఆనందాన్ని చూసి ఎంత సంబరపడేదాన్నో.

ఇంటింటా ఆడపిల్లలు తెల్లవారుజామునే లేచి, వెన్నెల వన్నెతో పోటీ పడే ముగ్గుపిండితో రంగవల్లులు తీర్చుతుంటే, ఆకాశంలోని చుక్కలు నేల మీద చుక్కల్ని చూసి ఈర్ష్య పడుతుంటే, నాకు ఎంత ఆహ్లాదంగా అనిపించేదో. ధనుర్మాసం నెల్నాళ్లు గజగజ వణికే చలిలో దుప్పట్లు కూడా కప్పుకోకుండా, ఆవు పేడ కోసం బయలుదేరేవారు. గోవులను పెంచేవారి ఇళ్లన్నీ ఈ ఆడపిల్లల్తో కళకళలాడేవి. వారంతా వరుసలో నిలబడి, ఆవు పేడ తెచ్చుకుని, ఇంటికి వచ్చి, వాటిని గొబ్బెమ్మలుగా తయారుచేసి, పసుపు కుంకాలతో, పూలతో అలంకరించి, ఇంటి ముందున్న ముగ్గులో వాటిని ఉంచితే.. నేను కళకళలాడేదాన్ని. ఇప్పుడు ఆ కళకళలు పోయి వెలవెలలాడుతున్నాను. ఏ ఇంట్లోనూ చంటి పిల్లలకు భోగం చేసే భోగి పళ్లు కనిపించట్లేదు, భోగి మంటలు తగ్గిపోయాయి. బొమ్మల కొలువైతే లక్షమందిలో ఒకరు కూడా పెట్టట్లేదు. పిండి వంటలు మానేశారు. పొంగళ్లు, బొబ్బట్లు, అరిసెలు, గారెలు.. ఏవీ ... అసలు పండుగే జరుపుకోకపోతుంటే, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి నా పిచ్చితనం కాకపోతేను.

‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువుగానీ’ అంటూ నన్ను ఎంత సాదరంగా ఆహ్వానించేవారో! ఇప్పుడెక్కడో గానీ ఆ స్వాగత గీతం వినిపించడం లేదు. స్వాగత తోరణం కనిపించట్లేదు. మరి నేను బాధ పడకుండా ఉండగలనా అమ్మమ్మా!’’ అంటూ అమ్మమ్మ చేతి కొంగుతో ముఖాన్ని దాచుకుంది సంక్రాంతి లక్ష్మి. అమ్మమ్మ ఫక్కున నవ్వింది. అయ్య.. వెర్రిపిల్లా! ఇందుకా నువ్వు బాధ పడుతున్నది. మరి నేను ఇంకెంత బాధపడాలి. నీ కంటె ఎక్కువ కష్టాలు చూశాను నా జీవితంలో. ముప్పై ఏళ్ల క్రితం వరకు పండుగ సెలవులకు నా మనవలంతా ఇంటికి వచ్చేవారు. వాళ్లకి ఎన్ని పిండివంటలు చేసిపెట్టేదాన్నో. ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి, రహస్యంగా అడిగి తినేవారు.

నేను ఇన్నేళ్లు ఇంత ఆయుర్దాయంతో ఉండటానికి కారణం ఆ జ్ఞాపకాలే. నా మనవలు, మునిమనవలు నా దగ్గరకు రావటం మానేసి పాతికేళ్లయ్యింది. ఇప్పుడు మళ్లీ రెండు మూడు సంవత్సరాలుగా వస్తున్నారు. అంటే నీకు అర్థమైందా! ఆనందమైనా, బాధ అయినా ఎక్కువకాలం ఉండదు. కష్టసుఖాలు, వెలుగునీడలు, తెలుపునలుపుల్లాగా.. పండుగలు కూడా కొన్నాళ్లు ఆనందంగాను, కొన్నాళ్లు ఏమీ లేకుండాను, మళ్లీ ఆనందంగాను గడుస్తాయి. నీ శోభ చిరకాలం చిరస్థాయిగానే ఉంటుంది. నువ్వు దిగులు పడకు. నువ్వు మళ్లీ తెలుగు లోగిళ్లలో సంబరాలు చూస్తావు. సంతోషంగా న వ్వుతూ ఉండు. తథాస్తు! చిరంజీవ! స్వస్తి!’’ అంటూ అమ్మమ్మ సంక్రాంతి లక్ష్మిని ఆశీర్వదించింది.
– వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top