పల్లె రుచులు 

Special story on  flavors of villages food - Sakshi

ఫుడ్‌  ప్రింట్స్‌

చిత్తూరు నుంచి బెంగళూరుకి వెళ్లే మార్గంలో, పలమనేరు ప్రాంతం దగ్గర పడుతుండగా ప్రయాణికులను పల్లె రుచులు కట్టిపడేస్తాయి. ఎంత హడావుడిగా ప్రయాణిస్తున్నవారైనా ఒకసారి రుచి చూద్దాంలే అనుకుంటూ ఆ హోటల్‌లోకి ప్రవేశిస్తారు. ఒక్కసారిగా వారి వారి పల్లెలు వారికి గుర్తుకువస్తాయి. అమ్మమ్మ చేతి భోజనం తిన్నంత తృప్తిగా కడుపు నింపుకుని, ఆరోగ్యంగా బయటకు వస్తారు. వ్యవసాయ అధికారిగా పనిచేసిన ఒక వ్యక్తి వినూత్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘పల్లెరుచులు’.  పూరిగుడిసెలోనే, రోలులో రుబ్బుతూ, కట్టెల పొయ్యిపై  64 రకాల రుచులను తయారుచేయిస్తున్నారు.

బైరొడ్ల బియ్యపు అన్నం, రాగి సంగటి, కూరాకు పులగూర, గొజ్జు, చింతనీళ్ళు, ఎరినూగుల ఊరి బిండి (చట్నీ)... చాలామంది ఈ వంటకాల పేర్లు కూడా విని ఉండరు. పలమనేరుకి చెందిన అమర్‌నాథ్‌ రెడ్డి ఇలాంటి సంప్రదాయ వంటకాలను తయారుచేసి ప్రజలకు రుచి చూపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో బొమ్మిదొడ్డి క్రాస్‌ దగ్గర ఈ వంటకాలు దొరుకుతున్నాయి. 

కాస్త కొత్తగా ఉండాలనే....
అమర్‌నాథ్‌ రెడ్డి సొంతవూరు పెద్ద పంజాణి మండలం గోనుమాకుల పల్లి. ఆయనది వ్యవసాయ కుటుంబం కావడంతో, పల్లెవాసనలు ఒంటబట్టాయి. పుంగనూరులో డిగ్రీ దాకా చదువుకొని ప్రైవేటు చక్కెర కర్మాగారంలో వ్యవసాయ అధికారిగా పనిచేశారు అమర్‌నాథ్‌ రెడ్డి. సమాజానికి ఉపయోగపడేలా ఏదో  ఒకటి చేయాలనే సంకల్పంతో, చేస్తున్న  ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏపీ టూరిజం హోటల్‌లో పనిచేశారు.  అక్కడి ఫాస్ట్‌ఫుడ్‌ విధానం, తద్వారా ప్రజలకు వస్తున్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఊబకాయ సమస్యలపై ఆయన చలించిపోయారు. ఆహారపు అలవాట్లతోనే యువత రుగ్మతల బారిన పడుతోందని గ్రహించారు. గ్రామీణ వంటల వల్ల అక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకుని,  ‘పల్లెరుచులు – మిల్లెట్‌ రెస్టారెంట్‌’ ప్రారంభించి అందరికీ ఆరోగ్యం అందించడం కోసం ఆ రుచులను పరిచయం చేస్తున్నారు.

పల్లె జీవనం ఉట్టిపడేలా....
ముగ్గులు, మామిడి తోరణాలతో పల్లెవాతావరణాన్ని తలపించేలా హోటల్‌ను రూపొందించారు. హోటల్‌ ముందు రుబ్బురోలు, కట్టెల పొయ్యి, మట్టి పాత్రలు ఏర్పాటుచేశారు. పల్లె పడుచులతో వంటలు చేయించడం ప్రారంభించారు. కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నల వంటి చిరుధాన్యాలతో వంటలు చేయిస్తున్నారు. తాడిపత్రి, కదిరి, అనంతపూర్, నంద్యాల, కర్ణాటక ప్రాంతాల నుంచి వీటిని తెప్పించి వండిస్తున్నారు. అరటి ఆకులలో మాత్రమే వడ్డిస్తున్నారు.

పాత వంటకాలను పరిచయం చేస్తున్నారు..
ప్రస్తుతం మేము బైరొడ్ల అన్నం, కొర్రలు, సామలన్నం, రాగి, సజ్జ, జొన్న రొట్టెలు, ఎర్రినూగుల చట్నీ, సెనగ కాయల ఊరిబిండి, ఎర్రగారం, పచ్చిగొజ్జు, ఉలవచారు, నాటుకోడి పులుసు, చేపల పులుసు, అలసంద బోండా, వడ, కూరాకు పులగూరలు, చిట్టిముత్యాల బిర్యానీ, కొర్ర పాయసం, ఎర్రగడ్ల చట్నీ వంటివి తయారు చేస్తున్నారు. సాయంకాలం శొంఠితోను, అల్లంతోను టీ తయారుచేసి, పంచదార బదులు బెల్లం ఉపయోగించి అందిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారు రాగిసంగటి కోసం ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడకు వచ్చి ఈ ఆహారం తిన్నవారు, ‘ఆరోగ్యప్రదాతా సుఖీభవ!’ అని ఆయనను ప్రశంసిస్తున్నారు.

ఆరోగ్య సమాజం కోసం...
పలు ప్రాంతాలను సందర్శించినప్పుడు, అక్కడి ఫాస్ట్‌çఫుడ్‌ కల్చర్‌ను గమనించాను. ఆ తిండి ఒంటికి మంచిదికాదని తెలుసుకున్నాను. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందచేయాలనుకున్నాను. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ‘పల్లె రుచులు’. ఈ వ్యాపారం వల్ల నష్టం వస్తుంది, వద్దని స్నేహితులు వారించినా, ధైర్యం చేశాను. దేశంలో 80 శాతం మంది పల్లెలలో పుట్టినవారే, పల్లె రుచులను తప్పక ఆదరిస్తార నే నమ్మకంతో ఈ హోటల్‌ ప్రారంభించాను. పల్లె ప్రజల వేషధారణలో హోటల్‌కి వస్తాను. మా కుటుంబీకులు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా నడుస్తోంది. 
 పి. సుబ్రహ్మణ్యం,  పలమనేరు, సాక్షి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top