గ్రామీణ భారతానికి క్షీరాభిషేకం

special story on Director Shyam Benegal

∙డా. గోపరాజు నారాయణరావు

‘మంథన్‌’ పేరుతో ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ 1976లో ఒక సినిమా తీశారు.  మంథన్‌ అంటే అర్థం – చిలకడం. గుజరాత్‌ కో–ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌లోని ఐదు లక్షల మంది రైతులు దీనికి పెట్టుబడి పెట్టారు. పెట్టుబడే కాదు, ఇతివృత్తం కూడా ఆ పాడి రైతులదే. సినిమా 1976లో విడుదలైంది. తమ కథను వెండితెర మీద చూడడానికి ఆ ప్రాంత ప్రజలు ట్రాక్టర్లు పెట్టుకుని, బళ్లు కట్టుకుని వేలాదిగా వెళ్లి చూసి వచ్చారు. పాడి రైతుల గాథతో వెలువడిన ఆ సినిమాకు అవార్డుల పంట పండింది. తమ జీవితాలే ఆధారంగా, తాము ఇచ్చిన డబ్బులతో తీసిన చిత్రం. అంటే ప్రతి రైతు నిర్మాతే. దీని ఇతివృత్తం ప్రపంచ ప్రఖ్యాత ‘అమూల్‌’ సంస్థ విజయ గాథ. ఆ సంస్థ లదొక్కుకోవడానికీ, ఒక మహోన్నత విజయం సాధించడానికీ కారకుడే వర్గీస్‌ కురియన్, ఇంతకీ కురియన్‌ ప్రతి సభ్యుడిని పెట్టుమన్న పెట్టుబడి కేవలం రెండు రూపాయలు. సంఘటితమైతే వచ్చే సత్ఫలితం ఎంత నిర్మాణాత్మకంగా ఉంటుందో ఆ సినిమా తెలియ చెప్పింది.

 కైరా జిల్లా (గుజరాత్‌లోని ఆనంద్‌లో ఇది ఉంది) పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్‌ నమోదు చేసిన ఈ విజయ గాథ కేవలం వెండితెర మీదే కాదు, ప్రపంచానికే విభ్రమ గొలిపేటట్టు ఉంటుంది. కథా రచనలో బెనెగల్‌తో పాటు, ఆ సంస్థ అధిపతి వర్గీస్‌ కురియన్‌ కూడా తోడ్పడ్డారు. తెర మీద నడిచిన కథలో హీరో ఎవరైనా, ఆ అద్భుతగాథకు అసలు హీరో వర్గీస్‌ కురియన్‌. ‘లండన్‌లోని మురికి నీరు కన్నా, బొంబాయిలోని పాలు మరింత కలుషితమైనవి’– 1942–43 సంవత్సరంలో లండన్‌లోని ఒక ప్రయోగశాల తేల్చి చెప్పిన సంగతిది.  నాణ్యమైన పాల కోసమే కాదు, ఉత్పత్తిని పెంచడానికి కూడా అప్పుడే బ్రిటిష్‌ ప్రభుత్వం పాల కమిషనర్‌ను నియమించవలసి వచ్చింది. భారత పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడైన సత్యం మరొకటి ఉంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో దేశంలో జరిగిన పాల ఉత్పత్తి 155.5 మిలియన్‌ టన్నులు.

 రోజుకు పాల తలసరి లభ్యత 337 గ్రాములు. ఇప్పుడు పాల ఉత్పత్తిలో అగ్రస్థానం భారతదేశానిదే. అలాంటి అగ్రస్థానంలో దేశం నిలబడి చాలా కాలమే అయింది కూడా. ఆ పాల అల ఉత్థానపతనాలు నిజంగా ఒక అద్భుతం. ఒక చరిత్ర. ఇది మూడు దశాబ్దాలలో సాధించి చూపినవారే డాక్టర్‌ వర్గీస్‌ కురియన్‌ (నవంబర్‌ 26, 1921– సెప్టెంబర్‌ 9, 2012). తొమ్మిది మంది ప్రధానులను శాసించి తన నాయకత్వంలోని రైతుల సంస్థ కోసం పనులు చేయించారాయన. ప్రథమ ప్రధాని నెహ్రూ ఆయనను కౌగలించుకుని ‘కురియన్‌! మన దేశంలో నీలాంటి వాళ్లు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.

అంతా కురియన్‌ను శ్వేత విప్లవ పితామహుడు అంటారు. పాల వెల్లువ ఆయన పథకమే. ఇంకా ఎందరో ముద్దుగా ‘పాలల్లో మసిలే మొసలి’ అని కూడా అంటూ ఉండేవారు. ‘భారతదేశ పాల రాజధాని’ని సృష్టించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. కురియన్‌ మాత్రం రైతాంగ సాధికారత కోసమే పాటు పడ్డానని సవినయంగా చెప్పేవారు. ఈ సమీప గతంలో కనిపించే అద్భుతమైన, అరుదైన వ్యక్తి వర్గీస్‌. దక్షిణ భారతంలోని కేరళలో, కాలికట్‌లో పుట్టారు. ఆ సిరియన్‌ క్రైస్తవ కుటుంబంలోని వారంతా ఉన్నత విద్యావంతులే. తండ్రి పుతేన్‌ పరక్కల్‌ సర్జన్‌. తల్లి  పియానో విద్వాంసురాలు. ఒకప్పుడు కేంద్రంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన జాన్‌ మత్తయ్‌ వీరి సమీప బంధువే.

కురియన్‌ పట్టువదలని విక్రమార్కుడు. మంచి సాంకేతిక నిపుణుడు. మార్కెటింగ్‌ వ్యూహకర్త. దేనినైనా కొత్తగా ఆలోచించే తత్వం కలిగినవారు. వీటితో పాటు గొప్ప మానవతావాది. బెనెగల్‌ వంటి దర్శకుడు కథా రచనలో కురియన్‌ సాయం తీసుకున్నారంటే ఇక ఆయన సృజనాత్మక సామర్థ్యం కూడా గట్టిదేనని చెప్పాలి. నిజమే, ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నాడు.  ఆనంద్‌ అనుభవాలన్నింటినీ గుదిగుచ్చి రాసుకున్న ఆత్మకథ ‘ఐ టూ హ్యాడ్‌ ఏ డ్రీమ్‌’ (తెలుగు: నాకూ వుంది ఒక కల. అను: డాక్టర్‌ తుమ్మల పద్మిని, డాక్టర్‌ అత్తలూరి నరసింహారావు). చాలామంచి రచన.

ఎక్కడి కేరళ! ఎక్కడి గుజరాత్‌! అక్కడ నుంచి ముంబై–ఢిల్లీ జాతీయ రహదారి పక్కనే, నలభయ్‌ కిలోమీటర్ల దూరంలో ఉండే ఆనంద్‌ అనే చిన్న పట్టణానికి వచ్చారాయన. స్వాతంత్య్రం వచ్చిన కొత్త. అక్కడ డెయిరీ వ్యవహారాలు చూడడానికి ప్రభుత్వం ఆయనను పంపించింది. ఆనంద్‌ తన జీవిత గమ్యమని ఆయన ఆ క్షణంలో ఊహించలేదు. ఆ చిన్న పట్టణానికి ఆయన చేరుకున్న రోజు శుక్రవారం. కురియన్‌ను ఆయన కార్యాలయానికి తీసుకువెళ్లిన వ్యక్తి, ఆ రోజు మంచిది కాదు కాబట్టి, మరునాడు విధులలో చేరమని సలహా ఇచ్చాడు. అందుకు కురియన్‌ ఇచ్చిన సమాధానం, ‘మంచిది కాదా! అయితే ఇవాళే చేరతాను. ఇక్కడ ఉండకూడదన్న నా ఆశ తీరుతుందేమో!’ అనే. అలా చెప్పిన కురియన్‌ కొన్ని దశాబ్దాల పాటు అక్కడే ఉండిపోయారు.

 పాడి పరిశ్రమ నిర్వహణ గురించి చదువుతానని విద్యార్థి వేతనం తీసుకుని కురియన్‌ న్యూయార్క్‌ (మిచిగాన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయానికి) వెళ్లారు. కానీ అక్కడ చదువుకున్నది– మెటలర్జీ, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌. తిరిగి వచ్చాక, విద్యార్థి వేతనం తీసుకున్నారు కనుక, నిబంధనల మేరకు ప్రభుత్వ ఆదేశంతో ఆనంద్‌కు వచ్చారు. మనసు పడి మాత్రం కాదు. కేవలం మొక్కుబడి. కానీ అప్పటికే అక్కడ పాడిరైతులను కూడగడుతున్న జాతీయ కాంగ్రెస్‌ నాయకుడు త్రిభువన్‌దాస్‌ పటేల్‌ విన్నపం మేరకు ఉండిపోయారు.

న్యూయార్క్‌ వంటి మహా నగరం నుంచి, చక్కని వసతిని అనుభవించి దాదాపు అరవై ఏళ్ల క్రితం నాటి భారతదేశంలో ఒక చిన్న పట్టణానికి వచ్చిన వ్యక్తికి ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో, కురియన్‌ అభిప్రాయాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా కొన్ని అదనపు కష్టాలు వచ్చి పడ్డాయి. క్రైస్తవుడు కాబట్టి ఇల్లు ఇవ్వలేదు. శాకాహారానికి ప్రాధాన్యం ఇచ్చే గుజరాత్‌లో మాంసాహారికి ఇల్లు లభించడం కూడా కష్టమైంది. ఇలాంటి అభ్యంతరాలు లేనివాళ్లు ఆయన అప్పటికి బ్రహ్మచారి కాబట్టి ఇవ్వలేదు. చివరికి ఒక కారు షెడ్డులో ఆయన ఉద్యోగ జీవితం ఆరంభించారు. ఆనంద్‌లో ఉన్న ప్రభుత్వ క్రీమరీలో గేదె పాల నుంచి కొద్దిగా పాలపొడిని ఉత్పత్తి చేయడమే ఆయన ఉద్యోగం. కానీ ఎవరూ సహకరించేవారు కాదు. అయినా ఒక్కరు చేసే పనికోసం ఇరవై మందిని మాత్రం నియమించారు. అయినా అక్కడి ప్రజలను ఆయన ద్వేషించలేదు.

ఆ పరిస్థితులను ఈసడించుకోలేదు. కానీ ఒకటి. ఇలాంటి చోట పనిచేయడం వల్ల తను చదువుకున్నదంతా ఒట్టిపోతుందని బెంగపడ్డారు. ప్రజాధనం అప్పనంగా తింటున్నానన్న న్యూనత మరొకటి. అందుకే తన రాజీనామాను ఆమోదించవలసిందని ప్రభుత్వాన్ని కోరారు. ఎనిమిది నెలలకు ఆమోదం లభించింది కూడా. అయితే అప్పటికే కురియన్‌ ఆ క్రీమరీ పక్కనే ఉన్న కైరా పాల సహకార సంస్థ సభ్యులతో కొంచెం అనుబంధం ఏర్పరుచుకున్నారు. దాని నాయకుడే త్రిభువన్‌దాస్‌ పటేల్‌. ఆయన కోరికపైనే ఎన్నో ఇక్కట్టు పడుతూ తమ పాల ఉత్పత్తులను మధ్య దళారీలకు అమ్ముకుంటున్న రైతుల కోసం పాటు పడడం మొదలుపెట్టారు. అప్పుడు సర్దార్‌ పటేల్, ఆయన అనుచరుడు మొరార్జీ దేశాయ్‌లు ప్రోత్సహిస్తున్నా ఆ సంస్థ అష్టకష్టాలు పడుతోంది. త్రిభువన్‌ పటేల్‌ సర్దార్‌ పటేల్‌ అనుయాయి.

కైరా పాల సహకార సంస్థకు మరోపేరే అమూల్‌. ‘అమూల్య’ పదం నుంచి వచ్చింది. కైరా పాల సహకార సంస్థ అని పలకడం ఇబ్బందిగా ఉందికాబట్టి మరో పేరు పెట్టాలని కురియన్‌ భావించారు. అంతే, తన బృందంలో అమూల్‌ అని పేరు పెడదామన్నారు. అది ఆ సహకార సంస్థలో పనిచేస్తున్న అమూల్య అని కెమిస్ట్‌ను చూసి ఎవరో పైకి అన్న పేరు. అదే బావుందన్నారు కురియన్‌. ఇలా మొదలైన సంస్థ బహుళజాతి సంస్థలు నెస్లే గ్లాస్కో సంస్థలతో దీటుగా ఉత్పత్తులు చేసేటట్టు, మార్కెట్‌లో నిలబడేటట్టు చేశారు కురియన్‌. అప్పటిదాకా ఆవు పాల నుంచే పాలపొడి తీయగలమని ప్రపంచ దేశాలు నమ్మకం. ఆ దేశాలలో ఆవులు ఎక్కువ. కాబట్టి అంతకు మించి వారి ఆలోచన సాగలేదు. నిజానికి మన దేశంలో గేదెలు ఎక్కువ. అందుకే కురియన్‌ గేదె పాల నుంచి కూడా తీయవచ్చునని నిరూపించారు. ఇదొక ఘన విజయం.

దేశీయంగా ఆలోచించడం ఎలాగో ఈ ఉదాహరణ నుంచి నేర్చుకోవచ్చు. మన దేశానికి సంబంధించి మరో వాస్తవాన్ని వెల్లడించిన ఆలోచనాపరులలో కురియన్‌ కూడా ఒకరు. ‘దురదృష్టవశాత్తు భారతదేశానికి పెద్ద మూలధనం అక్కడి ప్రజలే అనే విషయం మర్చిపోయాం. ఏ మాత్రం ఇంగితజ్ఞానం ఉన్న ప్రభుత్వమైనా కచ్చితంగా నేర్చుకోవలసింది– ప్రజల శక్తియుక్తులని, సామర్థ్యాలని ఉపయోగించుకుంటూ వాళ్లనే మమేకం చెయ్యడం’ అన్నారాయన.ఇంత పెద్ద ప్రయాణం కురియన్‌ నల్లేరు మీద నడకలా సాగించారని మన దేశ పరిస్థితులు చూసిన వారు ఎవరూ నమ్మలేరు. నిజం కూడా అదే. సహోద్యోగులు, నిపుణులు, రాజకీయ నాయకులు ఆయనను ఇరుకున పెట్టిన సంఘటనలు ఎన్నో. నేను నేర్చుకున్న గొప్ప పాఠం ఒకటి ఉందంటూ ఆయన ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించారు.

 ‘ఈ నిపుణుల సాంకేతిక సలహాలన్నీ తరచూ అభివృద్ధి చెందిన దేశాల  ఆర్థిక ప్రయోజనాలకి అనుగుణంగా  ఉంటాయే కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకీ, వాస్తవ పరిస్థితులకీ అనుగుణంగా ఉండవు’  అన్నారాయన. కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమంటే ఇదే! తను ఎంత ఎత్తుకు ఎదిగినా క్షేత్రస్థాయిలోని వాస్తవికతను మరచిపోకుండా, గమనించుకుంటూ, అందుకు సానుకూలంగా స్పందిస్తూ ఉండే గొప్ప లక్షణం కొందరికే ఉంటుంది. ఈ ఘటనను పరిశీలిస్తే కురియన్‌లో అలాంటి గొప్ప లక్షణం ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. డెయిరీలో పని తీరును గమనించేందుకు కురియన్‌ నిత్యం కాలినడకన తిరుగుతూ ఉండేవారు. ఆయన వస్తున్నట్టు అందరికీ తెలిసేది. కానీ ఒకరోజు అలాంటి సూచనలు ఏమీ ఇవ్వకుండానే ఆయన డెయిరీలోకి ప్రవేశించారు. అక్కడ కోల్డ్‌ స్టోరేజీ దగ్గర బాగా గెడ్డాలు, మీసాలు పెరిగి ఉన్న వ్యక్తి మీగడను ఆబగా తినడం కనిపించింది.

చూసినందుకు కురియన్, పట్టుబడినందుకు ఆ గెడ్డాల మనిషి తత్తరపడ్డారు. అతడు తత్తరపడుతూ తాను ఏమీ తినలేదని అబద్ధం ఆడి వెళ్లిపోయాడు. కురియన్‌ వెనుదిరిగి వచ్చేశారు. ఆ మరునాడే అక్కడ పనిచేసే వారికి రోజూ అర లీటరు వంతున పాలు ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు కురియన్‌. వాళ్ల కళ్ల ముందు లక్షల లీటర్ల పాలు ఉంటాయి. కడుపులో ఆకలి ఉంటుంది. కానీ వాటిని తాగే అవకాశం వాళ్లకి లేదు. ఇది గమనించారు కాబట్టే కురియన్‌ ఈ ఆదేశాలు ఇచ్చారు.భారతదేశంలో ప్రతిభకు, సేవకు తగిన గుర్తింపునకు నోచుకున్న అరుదైన కొద్దిమందిలో కురియన్‌ ఒకరు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణŠ  పురస్కారాల వరకు ఆయనకు అందాయి. ప్రపంచం కూడా ఆయన సేవలను గుర్తించింది. దాని ఫలితమే రామన్‌ మెగసెసె పురస్కారం. ఆయన దేశాన్ని ప్రేమించారు. దేశం కూడా ఆయన్ని ప్రేమించింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top