
వైశాలి రాజ్యంలోని కందవరం గ్రామంలో ఒక పూజారి ఉండేవాడు. అతని పేరు సుధాకరుడు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే నది ఒడ్డుకు వెళ్లి స్నానమాచరించి, ఊరిలో ఉన్న గుడిలో పూజలు చేస్తూ ఉండేవాడు. ఆ ఊరిలోనే శరభయ్య అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను సమీపంలోని అడవిలో ఉండే పక్షులను, జంతువులను వేటాడి; వాటిని చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.
పూజారి ప్రతిరోజూ నదీ స్నానం అనంతరం సమీప అడవిలో ఉన్న వివిధ రకాల పూలను సేకరించి పూజకు తీసుకువెళుతూ ఉండేవాడు. ఒకరోజు నదికి వెళుతుండగా, ఎక్కడి నుంచో ఒక మేక పూజారి దగ్గరకు వచ్చి, అతనిని అనుసరించ సాగింది. ఎన్నిసార్లు దాన్ని అదిలించినా, అది వెళ్లిపోకుండా అతనినే అనుసరించింది. చేసేదిలేక దానిని కూడా తనతో పాటు తీసుకు వెళ్ళాడు ఆ పూజరి. ఆ రోజు మొదలు ప్రతిరోజూ పూజారి దగ్గరే ఉంటూ, పూజారితో పాటు నదీ స్నానానికి వచ్చి, పూజారి స్నానం చేస్తుండగా ఆ పరిసరాల్లో ఉన్న ఆహారాన్ని తిని, తిరిగి పూజారితోపాటు గుడికి వెళ్ళేది. ఇలా కొంతకాలం గడిచింది.
ఒకరోజు ఎప్పటి మాదిరిగానే పూజారిని అనుసరించి మేక నది వైపు బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత మేక వస్తున్న అలికిడి లేకపోవడంతో పూజారి వెనుతిరిగి చూశాడు. మేక కనిపించలేదు! కంగారుగా నాలుగు వైపులా వెతికాడు. చివరకు ఒక మూల చెట్టుకి కట్టేసి కనపడింది. వెంటనే వెళ్లి, దాని కట్లు విప్పదీశాడు. మేకని తీసుకుని వెళుతుండగా, ‘ఓ పూజారిగారు! ఆగండి... ఆగండి... ఏంటిది? దాన్ని తీసుకుపోతున్నారు? ఆ మేక నాది’ అన్నాడు శరభయ్య.
‘ఏంటి, ఈ మేక నీదా? ఇది ఎప్పటి నుంచో నాతో పాటు ఉంటోంది. ప్రతిరోజూ నా వెంబడి నది స్నానానికి వస్తోంది. ఈరోజు కూడా అలానే వస్తుంటే, దాన్ని పట్టి బంధించిందే కాకుండా, నీది అంటావా?’ అని పూజారి అన్నాడు.
‘లేదు లేదు... అది నాది’ అని దగ్గరకు రాబోతున్న శరభయ్యను తప్పించుకుని మేకను భుజాన వేసుకుని, ఆగకుండా వెళ్ళిపోయాడు పూజారి.
వెంటనే శరభయ్య రాజుగారి దగ్గరికి వెళ్లి పూజారి మీద ఫిర్యాదు చేశాడు. రాజుగారి భటులు పూజారి వద్దకు వచ్చి ‘నీ మీద అభియోగం వచ్చింది. నీ దగ్గర ఉన్న మేక నీది కాదని శరభయ్య ఫిర్యాదు చేశాడు. మేకతో సహా రావాలని రాజుగారి ఆజ్ఞ!’ అన్నారు.
అలాగేనంటూ పూజారి మేకతో సహా రాజుగారి ఆస్థానానికి చేరుకున్నాడు.
‘ప్రణామాలు మహారాజా! పిలిపించారట’ అనగానే, మంత్రి కలగజేసుకొని ‘శరభయ్య తన మేకను తీసుకున్నావని నీ మీద అభియోగం మోపాడు. దీనికి నీ సమాధానం?’ అన్నాడు.
‘మహారాజా! ఆ మేక నిజానికి నాది కూడా కాదు! ఒక రోజు నదీస్నానం చేసి, పూజ కోసం అడవిలో పూలు కోయడానికి వెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చింది. నేను ఎంత ప్రయత్నించినా వెళ్లకుండా, అప్పటి నుంచి నా వద్దే ఉంటోంది. అంతేగాని, ఈ శరభయ్య చెప్పినట్లు అది అతనిది కూడా కాదు’ చెప్పాడు ఆ పూజారి.
‘నువ్వు చెప్పిన దానికి ఏమైనా సాక్ష్యం ఉందా?’ అడిగాడు మంత్రి.
‘లేదు మహారాజా!’ అన్నాడు పూజారి.
‘మరైతే నీదే అని సాక్ష్యం లేనప్పుడు మరెలా?’ అన్నాడు మంత్రి.
‘ఒక పని చేయండి మహారాజా! ఈ మేక కళ్లకు గంతలు కట్టండి. ఒకవైపు నన్ను, మరొకవైపు శరభయ్యను ఉంచండి. తన యజమాని ఎవరో వాసన పసిగట్టి గుర్తించే గుణం పెంపుడు జంతువులకు ఉంటుంది అప్పుడు అది వారి వద్దకు వెళుతుంది’ అన్నాడు పూజారి.
‘నువ్వు చెప్పినది సబబుగానే ఉంది’ అని మంత్రి, ‘వెంటనే మేక కళ్ళకు నల్లని గుడ్డతో గంతలు కట్టండి’ అని భటులను ఆదేశించాడు.
వారు మేక కళ్లకు గంతలు కట్టారు.
మొదట శరభయ్య వద్దకు, ఆ తర్వాత పూజారి వద్దకు మేకను తీసుకువెళ్లారు.
శరభయ్య వద్దకు తీసుకెళ్లినప్పుడు ఏ స్పందన లేని మేక, పూజారి వద్దకు తీసుకు వెళ్ళగానే తన ముక్కుతో వాసన పిలుస్తూ, నాలుకతో పూజారి కాలిని నాకసాగింది. తర్వాత దానిని ఒక భటుని వద్దకు కూడా తీసుకువెళ్లారు. అప్పుడు కూడా అది ఏమీ చేయకుండా, అలాగే నిలబడింది. ఏ రకమైన స్పందన చూపలేదు.
వెంటనే మహారాజు ‘ఆ మేక పూజారిదే’ అని తీర్పునిచ్చాడు. ‘శరభయ్యను బంధించండి’ అని భటులను ఆదేశించాడు.
అతడు చేసిన తప్పును మన్నించి, అతడిని విడిచిపెట్టండి మహారాజా!’ అని పూజారి వేడుకున్నాడు.
‘చూశావా, శరభయ్యా! నువ్వు పూజారి మీద అభియోగం మోపినా, నీ మీద కోపం లేకుండా, నిన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇప్పటి నుంచైనా జంతువుల వేట మానుకుని, ఏదైనా పని చేసి బతుకు’ అని శరభయ్యను దండించకుండా వదిలేశాడు మహారాజు. పూజారిని అభినందిస్తూ, ఘనంగా సన్మానం చేశాడు. అప్పటి నుంచి శరభయ్య జంతువుల వేటను మాని, వ్యవసాయం చేస్తూ జీవించసాగాడు.