బుగ్గ చుక్క

Special polling centers have been set up for women - Sakshi

ఇంటి పని ఆపుకుని, ఎండన పడి వచ్చిన ఆడకూతుర్ని ఒట్టి చేతుల్తో పంపకుండా ఏదో ఒకటి ఇవ్వడం మంచిదే. పువ్వో, పండో చేతిలో పెట్టడం ఎలాగూ మన సంప్రదాయంలో ఉంది. అయితే ఎన్నికల సంఘం దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన ఈ సంప్రదాయం మాత్రం వేరుగా ఉంది.

మాధవ్‌ శింగరాజు
పెళ్లిలో బుగ్గచుక్క పెడతారు. పెళ్లికి వచ్చిన వాళ్లందరికీ కాదు. వధువుకి, వరుడికి. బుగ్గచుక్కలో అబ్బాయి కన్నా అమ్మాయే అందంగా ఉంటుంది. అది ప్రకృతి పార్షియాలిటీ. నెక్లెస్‌ సెట్‌లా కొన్నింటిని ఆడపిల్లలకే సెట్‌ చేసి ఉంటుంది ప్రకృతి. అదైనా కావచ్చు, లేదా.. ఈ చుక్కలు, బొట్లు ఆడపిల్లలకైతేనే బాగుంటాయన్న మన  మైండ్‌ సెట్‌ కావచ్చు.బుగ్గచుక్క ఆడవాళ్లకు అందం తెస్తుంది కదా అని, మహిళా ఓటర్లకు వేలికి కాకుండా వాళ్ల బుగ్గకు చుక్క పెట్టడానికి లేదు. ఎన్నికల సంఘానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం స్త్రీ పురుష వివక్ష లేకుండా ఓటర్లందరికీ వేలికే చుక్క పెట్టాలి. ఓటేసిన ఆడవాళ్ల వేలి చుక్కలోనూ ఎవరికైనా అందం కనిపిస్తే కనిపించవచ్చు. దాంతో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు. డేట్లివ్వడం, ఓట్లేయించడం.. అంతవరకే. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎన్నికల సంఘం ‘అంతవరకే’తో ఆగిపోవడం లేదు! మహారాష్ట్రలో ఈరోజు పద్దెనిమిది లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది.

ఇరవై ఆరు చోట్ల మహిళలకు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచి విషయం. ఎక్కువ సేపు క్యూలో ఉండే అవసరం లేకుండా త్వరగా ఓటేసి వెళ్లిపోవచ్చు. ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలే కాకుండా, మహిళలకు ఇంకా ఏదైనా ప్రత్యేకంగా చేస్తే బాగుండన్న ఆలోచన కూడా వచ్చినట్లుంది ఎన్నికల సంఘానికి. ఓటేయడానికి ఈ ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే మహిళలందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ ఇస్తామని ప్రకటించింది! కూల్‌డ్రింకులు కూడా ఇస్తోంది. ఇంటి పని ఆపుకుని, ఎండన పడి వచ్చే ఆడకూతుర్ని ఒట్టి చేతుల్తో పంపకుండా ఏదో ఒకటి ఇవ్వడం మంచిదే. పువ్వో, పండో చేతిలో పెట్టడం ఎలాగూ మన సంప్రదాయంలో ఉంది. అయితే ఎన్నికల సంఘం దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన ఈ సంప్రదాయం మాత్రం వేరుగా ఉంది. ఇంటికొస్తే ఇవ్వడం కాకుండా, ఇంటికొస్తే ఇస్తాం అన్నట్లుగా ఉంది. మహిళల్ని ఓటింగ్‌కి ప్రోత్సహించడానికట! ప్రోత్సాహం ఉంటే తప్ప ఓటేయలేనంత నిరుత్సాహంలో ఉన్నారా మహిళలు?! లేరు.

దేశంలో మహిళా ఓటర్లు పెరిగారు. ఓటేసే మహిళలూ పెరిగారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘమే గొప్పగా కాంప్లిమెంట్‌ చేస్తూ చెప్పింది. మరెందుకీ ప్యాడ్‌లు!  ‘ఓటు హక్కును వినియోగించుకోండి’ అన్నంత వరకే చెప్పి ఆగిపోవాలి ఎన్నికల కమిషన్‌. మగ ఓటర్‌లకు ఫాగ్‌ స్ప్రేలు, మహిళా ఓటర్‌లకు పౌడర్‌ డబ్బాలు గిఫ్టులుగా ఇవ్వడం అన్నది మంచి ఆలోచనైతే కావచ్చు. రావలసిన ఆలోచనైతే మాత్రం కాదు. ఓటుకు వేలు చూపడం పౌరధర్మం, ఓటుకు చెయ్యి చాచడం ప్రలోభించడం అని ఓటర్లను మేల్కొలిపే పని కూడా ఎలక్షన్‌ డ్యూటీలో భాగంగా ఉందేమో కానీ, డ్యూటీని డ్యూటీ వరకే చెయ్యాలి. డ్యూటీకి పౌడర్‌ అద్ది, స్ప్రే కొడితే.. వేషం అంటారు తప్ప, శేషన్‌ అనరు. టి.ఎన్‌.శేషన్‌ చండ శాసనుడు. సిస్టమ్‌ని సూటిగా నడిపించిన ఒకప్పటి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌. ఆయన ప్లేస్‌ని ఇప్పుడు మహిళా ఓటర్లు తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఏదో ఓటు వేసి రావడం కాకుండా, ఎవరికి ఓటేయాలో బాధ్యతగా నిర్ణయించుకుని మరీ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తున్నారు.

బాధ్యత అంటే నచ్చినవారిని గెలిపించడం మాత్రమే కాదు. నచ్చని వాళ్లను ఓడించడం కూడా.గత నవంబర్, డిసెంబర్‌లలో జరిగిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాలను మార్చేసింది మహిళలే.ఛత్తీస్‌గఢ్‌లో పదిహేనేళ్లుగా పాలనలో ఉన్న బీజేపీని దింపేసి కాంగ్రెస్‌ని తెచ్చుకున్నారు. అక్కడ పురుషుల కన్నా, మహిళల ఓట్లు ఎక్కువగా పోలైన ఇరవై మూడు నియోజకవర్గాలలో ఒక్క సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూడా గెలవలేదు! ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం తొంభై నియోజకవర్గాలలో మహిళల ఓటింగ్‌ ఎక్కువగా (86.88 శాతం) ఉన్న ఖర్సియా స్థానంలో కూడా బీజేపీ టిక్కెట్టుపై తొలిసారి ఎన్నికల్లో నిలబడ్డ ఐ.ఎ.ఎస్‌. అధికారి ఓపీ చౌదరిపైన కూడా ‘పాపం ఫస్ట్‌ టైమ్‌ కదా’ అని మహిళలేమీ కనికరం చూపలేదు. తేడా కొన్ని వేల ఓట్లే అయినా.. ఆయన్ని ఓడించి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఉమేశ్‌ పటేల్‌ని గెలిపించుకున్నారు.

రాష్ట్రం మొత్తం మీద మహిళల ఓట్లు ఎక్కువగా పోలయిన రాజస్థాన్‌లో కూడా పాత గవర్నమెంట్‌ (బీజేపీ) పడిపోయి, కొత్త గవర్నమెంట్‌ (కాంగ్రెస్‌) వచ్చింది. నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నేడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు ఒక సంకేతం అని అప్పుడే అనుకున్నారు కనుక ఈ ఎన్నికల్లో కూడా మహిళల ఇండెక్స్‌ ఫింగరే ‘మ్యాజిక్‌ వాండ్‌’ కావచ్చు.అందం వస్తుంది కదా అని ఓటు చుక్కను బుగ్గకు పెట్టడానికి లేనట్లే.. ఓటేయడానికి ఉత్సాహంగా వెళ్తారు కదా అని శానిటరీ ప్యాడ్‌లు, కూల్‌డ్రింకులు ఇస్తామని చెప్పడం కరెక్ట్‌ కాదేమోనన్న ఆలోచన ఎన్నికల సంఘానికి రావాలి. వచ్చినా రాకున్నా.. బిందె నీళ్లిచ్చే నాయకుడికి  ఓటేయాలనుకుని మహిళ  పోలింగ్‌ బూత్‌కి వెళుతుంది కానీ, అడగకున్నా ఇచ్చే కూల్‌డ్రింక్‌ కోసం వెళ్లదు. ప్యాడ్‌లకైనా అంతే తనిచ్చే ప్రాముఖ్యం. ఓటే తనకు ముఖ్యం.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top