అభీష్టం కొద్దీ రొట్టె

Rottelapanduga at nellore - Sakshi

రొట్టెల పండుగ సందర్భంగా...

రొట్టెలమ్మా రొట్టెలు... ఇంటి రొట్టె, చదువుల రొట్టె, ఉద్యోగాల రొట్టె, పెళ్లి రొట్టె, విదేశీ రొట్టె, సంతానం రొట్టె, ఆరోగ్య రొట్టె... మీకు ఏ రొట్టె కావాలి?  అంటూ అడుగుతుంటారక్కడ. అలాగని అమ్ముకోరు. ప్రేమగా పిలిచి మరీ ఇస్తారు. తీసుకునే వాళ్లు కూడా భక్తిశ్రద్ధలతో రొట్టెను అందుకుంటారు. ఈ సంవత్సరం రొట్టెను తీసుకున్న వారి కోరిక నెరవేరితే వచ్చే సంవత్సరం తామే రొట్టెలు తయారు చేసి వాటిని కావలసిన వాళ్లకు దానిని అందిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఘాట్‌లు కూడా ఉంటాయి.

హిందూ, ముస్లిం భేదం లేకుండా మతసామరస్యానికి ప్రతీకగా రొట్టెలపండగ ప్రతి సంవత్సరం నెల్లూరు నగరంలో జరుగుతుంది. ఉద్యోగం మొదలుకొని వీసా వరకు అన్ని రొట్టెలు ఇక్కడ భక్తులు భక్తితో సమర్పించి కోరిక తీరాక మళ్లీ రొట్టెలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు సమర్పించే రొట్టెలకు బారాషహిద్‌ సంతసించి కోరిన కోర్కెలు  తీర్చే దర్గాగా ఖ్యాతి గాంచడంతో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి, అరబ్‌ దేశాల నుంచి ఏటా ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ఇందుకే కాబోలు నెల్లూరులో జరిగే రొట్టెల పండగకు రాష్ట్రపండగ హోదాను 2015లో ప్రకటించింది ప్రభుత్వం. 1751లో మొదటిగా రొట్టెల పండగను ఆర్కాట్‌నవాబులు నిర్వహించారు. తదనంతరం అన్ని మతాల భక్తులు ఇందులో భాగస్వాములై కులమతాలకు అతీతంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ శుక్రవారం మొదలైన ఈ పండుగ ఐదు రోజులపాటు అంటే మంగళవారం, 25వ తేదీ వరకు జరుగుతుంది.

ఖండాంతరాలకు ఎగిరిన రొట్టె
బారాషహిద్‌ దర్గా కంటే రొట్టెల పండగ దర్గాగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచింది. మొదట్లో వ్యాపారం, ఆరోగ్యం రెండు రొట్టెలు మాత్రమే ఉండేవి. కాలక్రమేణా కోరికల రొట్టెలు పెరిగాయి. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఇప్పడు ఉద్యోగం రొట్టె, ప్రమోషన్ రొట్టె, వ్యాపారం రొట్టె, ఆరోగ్యం రొట్టె, విద్య రొట్టె, రాజకీయ రొట్టె, సంతానరొట్టె, వీసా రొట్టెల ఇలా అనేకం ఉన్నాయి. ఉత్సవాల్లో స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేకంగా ఒక్కో రొట్టెకు సంబంధించి ఒక్కో ఘాట్‌ను ఏర్పాటు చేయడంతో, ఆయా ఘాట్ల వద్ద భక్తులు మార్చుకుంటారు.

ముఖ్యంగా సంతానం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్య రొట్టెలు లక్షల సంఖ్యలో భక్తులు మార్చుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేరాలని మొదటగా ఒకరు రొట్టె ఇస్తారు. దానిని స్వీకరించిన వారు వారి కోరిక నెరవేరగానే మరుసటి సంవత్సరం వచ్చి మళ్లీ వారు మొక్కు తీర్చుకుంటారు. ఏటా రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రతోపాటు అరబ్‌ దేశాల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు. అధికార, ప్రతిపక్షనేతలతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు వచ్చి రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చాలని రొట్టెలు సమర్పిస్తుండటం విశేషం.

ఎలా తయారు చేయాలంటే..?
గోధుమ, బియ్యం పిండి కలిపి అర కిలోకు ఐదు రొట్టెలు వచ్చేలా సిద్ధం చేస్తారు. రొట్టెలపై ఏదైనా కూర ఉంచి స్వర్ణాల చెరువులోని నీటిలో నిలుచొని రొట్టెలను కావాల్సిన వారికి ఇస్తారు. ఉద్యోగం, పెళ్లిరొట్టెను బెల్లంతో కలిపి అందజేస్తారు. ఐదు రొట్టెలను ఏదైనా కోరికతో సిద్ధం చేసి ఒకటి ఇంట్లో ఉంచి మిగిలిన నాలుగు రొట్టెలను దర్గాకు తీసుకువచ్చి బారాషహిద్‌కు సమర్పించి స్వర్ణాల చెరువులో రెండు విడిచి మిగిలిన రెండింటిని కావాల్సిన వారితో మార్చుకుంటారు.

బారా అంటే 12 షహీద్‌ అంటే అమరుడు అని అర్థం. మత ప్రబోధం చేస్తూ జరిగిన పవిత్ర యుద్ధం మరణించిన 12 మంది వీరులు ఒకే ప్రాంతంలో సమాధి కావడం ఇక్కడ విశేషం. 1751లో 12 మంది సౌదీ అరేబియాలోని మక్కా నుంచి భారత్‌కు మతప్రచారం నిమిత్తం వచ్చారు. బీజాపూర్‌ సుల్తాన్ కు, తమిళనాడు వాలాజా రాజులకు మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన 12 మంది సమాధుల ప్రాంతమే బారాషహిద్‌ దర్గా.

అప్పట్లో నెల్లూరు ప్రాంతం తమిళనాడు రాష్ట్రం పాలించిన ఆర్కాట్‌ నవాబుల పాలనలో ఉండేది. వందల ఏళ్ల క్రితం నెల్లూరుకు ఎటువంటి రాకపోకలు లేని విధంగా పూర్తి అటవీ ప్రాంతంగా, సహజసిద్ధంగా ఏర్పడిన స్వర్ణాల చెరువు మాత్రమే ఉండేది. అప్పటి ఆర్కాట్‌ నవాబు సతీమణి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఒకరోజు బారాషహీద్‌లలో ఒకరు ఆమెకు కలలో కనిపించి తాను స్వర్ణాల చెరువు వద్ద సమాధి అయ్యానని, తనకు అక్కడ దర్గా నిర్మించమని ఆమెకు ఉపదేశించారు. తనకొచ్చిన స్వప్నాన్ని ఆర్కాట్‌ నవాబుకు ఆమె చెప్పగా వెంటనే భారీగా సైన్యంతో అటవీ ప్రాంతంలో ఉన్న స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి బారాషహీద్‌ కోరిన విధంగా సమాధి నిర్మాణ పనులు మొదలు పెట్టారు.

ఈ క్రమంలో అప్పట్లో దూరప్రాంతాలకు వచ్చే క్రమంలో రొట్టెలే ఆహారంగా ఎక్కువ వినియోగంలో ఉండేది. నవాబు, అతని సతీమణి రొట్టెలు తిని స్వర్ణాల చెరువులో నిలబడి మిగిలిన రొట్టెలను తమతో వచ్చిన పరివారానికి పంచి పెట్టారు. ఆమె వెంటనే కోలుకోవడంతో షహీద్‌పై భక్తివిశ్వాసాలు మెండుగా పెరిగాయి. ఆ తర్వాత ఆర్కాట్‌నవాబు షహీద్‌కు సమాధి నిర్మించి కొంత భూభాగాన్ని దర్గాకు కేటాయించారు. ఏటా మొహర్రం కలిసి వచ్చేలా బారాషహీద్‌ దర్గా ఉత్సవాలు జరుగుతుంటాయి.
ఆనాడు మొదలైన ఈ ఉత్సవాలు ఈ విధంగా 266 సంవత్సరాలుగా  జరుగుతున్నాయి.

– కాట్రపాటి కిశోర్, సాక్షి, నెల్లూరు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top