చితిమంటల్లో చీకటి

research on light pollution effects on ecological balance - Sakshi

వెలుతురు కత్తులు చీకటిపై దాడి చేస్తున్నాయి.
కసిగా పొడుస్తున్నాయి.
పొద్దు పొడవక ముందే రాత్రిని చంపేస్తున్నాయి.
రాత్రి.. ఆ చితిమంటల్లో మండుతుంటే...
గ్లోబు గుడ్లప్పగించి చూస్తోంది!
నిద్ర గర్భంలోకి వెలుతురు వంతెనపై జబ్బులు
కవాతు చేస్తున్నాయి.
పహారా హుషార్‌! రాత్రిని ఎత్తుకుపోతున్నారు!!

వెలుతురు.. చీకట్లను చిదిమేస్తోంది! వెలుగు చీకటిని మింగేస్తోంది. రాత్రి చీకటిని పారదోలుతూ పగటి వెలుగుల మాదిరిగా విద్యుత్‌ వెలుగులు మరింత విస్తరించడం మానవాళికి సంకటంగా మారుతోంది. దాంతో ఏడాదికేడాది కొత్త ప్రాంతాలను కాలుష్య కాంతులు ఆవరిస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న కాంతి కాలుష్యంరాత్రి వేళల్లో అవసరానికి మించి ఉపయోగిస్తున్న విద్యుత్‌ లైట్ల వల్ల ‘కాంతి కాలుష్యం’ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 2.2 శాతం (భారత్‌లో 7.4 శాతం) మేర  లైట్ల  వినియోగంలోని వృద్ధితో ఈ కాలుష్యం మరింత విస్తరిస్తోంది. ఇది  మానవాళి  ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ సగటుతో పోల్చితే భారత్‌ మూడు రెట్లు ఎక్కువగా రాత్రులను కోల్పోతున్నట్లు  2012–2016 మధ్యలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘లైట్‌ ఎమిటింగ్‌ డయోడ్స్‌’ (ఎల్‌ఈడీ) కాంతుల వినియోగం వల్ల విద్యుత్‌ ఆదా కాకపోగా ఈ కాలుష్యం పెరుగుదలకు దారితీస్తోంది! విద్యుత్‌ ఎక్కువగా వినియోగించే ప్రాంతాల్లోనే ఈ కాలుష్యం పెరుగుతున్నట్టు ఉపగ్రహ చిత్రాల సహాయంతో స్పష్టమైంది. జర్మనీలోని ‘జర్మన్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియో సైన్సెస్‌’లో ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యంపై కాంతి కాలుష్య ప్రభావాల మీద పోస్ట్‌ డాక్టరల్‌ రిసెర్చ్‌ చేస్తున్న క్రిస్టఫర్‌ కైబా ఈ అధ్యయనం నిర్వహించారు.

వెలుగు కాటే స్తోంది
 మన శరీరాల్లోని జీవక్రియల్లో కీలకమైనవి కొన్ని.. వెలుగు, చీకట్లపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ కాంతి కాలుష్య ప్రభావం సకల జీవరాశితో పాటు మానవాళిపై కూడా ఉంటుంది. ఈ వెలుగులతో మన మెదడులోని జీవగడియారం గతి తప్పుతుంది. దాంతో వెలుగు, చీకట్లకు అనుగుణంగా ప్రవర్తించాల్సిన సర్కేడియన్‌ రిథమ్‌ సైతం దెబ్బతింటుంది. అది ఇన్‌సోమ్నియా, కుంగుబాటు, గుండెకు సంబంధించిన సమస్యల వంటి వాటికి కారణమవుతుంది. కృత్రిమ వెలుగులు చిందించే లైట్లు రొమ్ము కాన్సర్, ప్రొస్టే్టట్‌ క్యాన్సర్‌లకు కారణమవుతున్నాయని గతంలో నిర్వహించిన మరో అధ్యయనంలోనూ తేలింది. లైట్ల వెలుగుల వల్ల శరీరాలు అయోమయానికి గురై స్వతహాగా నిర్వహించాల్సిన పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ఉదయం సమయాల్లో సూర్యుడి వెలుగు ఆరోగ్యవంతమైంది. అదే.. రాత్రి సమయాల్లో లైట్ల కాంతి అనారోగ్యానికి కారణమవుతోంది. రాత్రి సమయాల్లో లైట్ల వల్ల నిద్ర దూరమై ఆలస్యంగా నిద్రపోవడం, నిద్ర వ్యవధి తగ్గడం వంటి అనర్థాలు సంభవిస్తాయి.  రాత్రుళ్లు పడక గదుల్లోకి సైతం వీధి లైట్ల వెలుగులు ప్రసరిస్తుండడంతో నిద్రపై ప్రభావం చూపే పరిస్థితులున్నాయి. చాలా జీవక్రియలకు నిద్ర కీలకం. వెలుతురు కాలుష్యంతో ప్రధానంగా దెబ్బతినేది నిద్ర. దాంతో మరెన్నో ఆరోగ్యపరమైన అనుబంధ సమస్యలు వస్తాయి.

నిద్రలేమి వల్ల కలిగే తక్షణ నష్టాలు  
శరీరంలోని అన్ని వ్యవస్థలు నిద్రలేమి వల్ల దెబ్బతింటాయి. అదీ తీవ్రస్థాయిలో. ఉదాహరణకు నిద్రలేమి వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా.. ∙ఏకాగ్రత లోపించడం ∙అలసట / నిస్సత్తువ
∙గుండె వేగం / గతిలో మార్పు ∙తక్షణం స్పందించలేకపోవడం (అవసరమైనది ఏదీ తక్షణం స్ఫురించకపోవడం) ∙హుషారు / ఉత్సాహం తగ్గుదల ∙తమ పని తాము సక్రమంగా చేయలేకపోవడం ∙మబ్బుగా / దిగులుగా ఉండటం ∙చిరాకు, కోపం ఎక్కువ కావడం ∙మానవసంబంధాలు దెబ్బతినడం, కుటుంబ కలహాలు పెరగడం ∙ఒళ్లునొప్పులు... ఇలాంటి అనేక సమస్యలు కనిపిస్తాయి.

దీర్ఘకాలిక నష్టాలు
∙మతిమరపు ∙మెదడు ఎదుగుదలలో లోపం
∙పిల్లల ఎదుగుదలలో లోపం ∙అధిక రక్తపోటు
∙గుండెజబ్బులు ∙స్థూలకాయం ∙డయాబెటిస్, ∙జీర్ణకోశ సమస్యలు ∙రోగనిరోధక శక్తి తగ్గడం
∙గాయాలు మానే ప్రక్రియ ఆలస్యం కావడం
∙జీవన వ్యవధి (లైఫ్‌ స్పాన్‌) తగ్గడం.

నిద్రలేమితో మానసిక సమస్యలు
నిద్రలేమి వల్ల ప్రత్యేకించి మానసిక సమస్యలు పెరుగుతాయి. చాలా మానసిక సమస్యల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం నిద్రలేమి. ముఖ్యంగా మూడ్‌ డిజార్డర్స్‌ (భావోద్వేగ సమస్యలు), యాంగై్జటీ డిజార్డర్స్, సైకోసిస్, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) సమస్యల్లో నిద్రలేమి చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
పిల్లల్లో... ∙అటెన్షన్‌ డెఫిసిట్‌ హెపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) వంటి లక్షణాలు ∙మెదడు ఎదుగుదలలో లోపం

జ్ఞాపకశక్తి లోపించడం
పెద్దల్లో... ∙యాంక్సైటీ డిజార్డర్స్‌ (ఆందోళన వల్ల కలిగే సమస్యలు)
∙డిప్రెషన్‌ ∙సైకోసిస్‌ ∙మాదక ద్రవ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం పరోక్షంగా అనేక ఆరోగ్య అంశాలపై నిద్రలేమి ప్రభావం ఉండటం, దానికి వెలుగు కాలుష్యం దోహదపడుతుండటం వల్ల ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉంది.

వెలుగు కాలుష్యాన్ని అధిగమించడం ఎలా?
‘విద్యుత్‌ వెలుగుల నియంత్రణ’కు సాంకేతికతను జోడించి విద్యుత్‌ ఆదాతో పాటు కాంతి కాలుష్యాన్ని తగ్గించవచ్చునంటున్నారు. ఫైబర్‌ ఆప్టిక్‌ టెక్నాలజీ ద్వారా లైట్లు ఏ దిశలో వెలగాలో కూడా నిర్ణయించవచ్చునని, భద్రతకు ప్రాధాన్యతనిస్తూనే అంతగా అవసరం లేని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో లైట్ల కాంతిని తగ్గించడం లేదా ఈ అధిక వెలుగుల సమయాన్ని కుదించడం చేయవచ్చునని చెబుతున్నారు. లైట్లను అమర్చే విధానం వల్ల కూడా అనుకున్న ఫలితాలను సాధించవచ్చునని నిపుణులు పేర్కొన్నారు.

భారత్‌లో పరిస్థితి
భారత్‌లోని ఒక చిన్నగ్రామంలో అయిదారు విద్యు™Œ  స్తంభాలతో విద్యుత్‌ వెలుగులను అందిస్తే దాంతో పెద్ద ప్రమాదం ఉండదు. కానీ పట్టణాల్లో వీధులన్నీ లైట్లతో నిండిపోతే అది కాలుష్యానికి తప్పక కారణమవుతోంది. గత అయిదేళ్లలో దాదాపు అన్ని పట్టణాల్లో విద్యుత్‌ బల్బుల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. అలాగే కొత్తగా  శివారు ప్రాంతాల విస్తరణతో ఈ లైట్ల వినియోగం మరింత అధికమైంది. మొత్తంగా చూస్తే మనదేశంలోని దక్షిణాదితో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ కాంతులు పెద్దమొత్తంలో పెరిగాయి. మనదేశంలో పదిశాతం ప్రాంతాలు అత్యంత ప్రకాశవంతంగా ఉన్నట్లు, ఇతర ప్రాంతాల్లో 25 శాతం వరకు పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు.

ఎవరికి ఎంత నిద్ర అవసరం?
నిజానికి ఎవరికి ఎంత నిద్ర కావాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా... చాలా అధ్యయనాల ఏకాభిప్రాయం ప్రకారం ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరమంటే:
ఏ వయస్సు వారు?     ఎంత నిద్ర?
రోజుల పిల్లలు    పద్దెనిమిది గంటలు ఆ పైన
1 నుంచి 12 నెలల పిల్లలు    14 నుంచి 18 గంటలు
1 ఏడాది నుంచి 3 ఏళ్లు    12 నుంచి 15 గంటలు
3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు    11 నుంచి 13 గంటలు
5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు    9 నుంచి 11 గంటలు
కౌవూరంలో (12–19 ఏళ్లు)      9 నుంచి 10 గంటలు
21 ఏళ్లకు పైబడ్డవారిలో    7 నుంచి  8 గంటలు
50 ఏళ్లు పైబడిన వారిలో    5 నుంచి 7 గంటలు
– కె. రాహుల్, సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top