
నవజీవన బంధం
కార్పొరేట్ సంస్థలో మేనేజర్ సందీప్. అతడి తల్లిదండ్రులది కడప జిల్లా. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సందీప్ పుట్టిన తర్వాత కొన్నాళ్లకే వారు విడిపోయారు.
కార్పొరేట్ సంస్థలో మేనేజర్ సందీప్. అతడి తల్లిదండ్రులది కడప జిల్లా. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సందీప్ పుట్టిన తర్వాత కొన్నాళ్లకే వారు విడిపోయారు. ఆర్థిక బాధల్లో అతడి తల్లి సందీప్‌ను అతడి పెద్దమ్మ దగ్గరకు పంపించింది. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ‘‘పెద్దమ్మ టీ దుకాణంలో నన్ను పనికి పెట్టింది. బాధలు పడలేక ఓ రోజు సాయంత్రం రెలైక్కి నిద్రపోయాను. నిద్రలేచే సరికి విజయవాడ చేరాను. అక్కడ నాకెవరూ తెలియదు. తిరిగి తిరిగి ఒక హోటల్‌కెళ్లి పనిలో చేరాను. రోజులు గడిచాయి. ఒక రోజు బాలకార్మికులను గుర్తించడానికి ప్రభుత్వ సిబ్బంది హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీ చేసినప్పుడు నేను దొరికాను. అది నా జీవితంలో గొప్ప మలుపు.
వారు నన్ను నవజీవన్ బాల భవన్‌లో చేర్చారు. అక్కడి ఫాదర్ నా ఇష్టాన్ని గుర్తించి స్కూల్లో చేర్పించారు. తర్వాత కాలేజ్‌లో చేరి బిబిఎం చదివాను. ‘ఓ లిమిటెడ్ కంపెనీ’లో మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. అందులో స్థిరపడ్డాక ఫాదర్‌తో మాట్లాడి నా క్లాస్‌మేట్ ‘రాజీ’ని పెళ్లి చేసుకున్నాను. నా పెళ్లి నవజీవన్ వాళ్లే దగ్గరుండి చేశారు. ఇప్పుడు మాకో పాప. తన పేరు సహస్ర’’ అని పాపను, భార్యను చూపిస్తూ ‘నవజీవన్ లేకపోతే ఈ సందీప్ లేడు’ అన్నారాయన ఆర్ద్రంగా.
ఒకప్పటి స్ట్రీట్‌బాయ్...
యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్ సంతోష్‌కుమార్ ఒకప్పుడు వీథుల్లో తిరిగిన కుర్రాడు. ఇతడి అమ్మానాన్నలు గొడవలు పడేవారు. దాంతో ఇంటి నుంచి పారిపోయి వరంగల్ చేరాడు. మూడేళ్లపాటు హోటళ్లలో పనులు చేస్తూ వీధుల్లో తిరుగుతూ గడిపేశాడు. ఒకరోజు రెలైక్కబోయి జారి పడడంతో గాయాల పాలయ్యాడు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడికెళ్లాలో తెలియక విజయవాడ చేరాడు. నవజీవన్ సిబ్బంది గుర్తించి బాలభవన్‌కు తీసుకొచ్చారు. సంతోష్ జీవితానికి అది మలుపు. ‘‘స్కూలుకెళ్తున్న విద్యార్థుల యూనిఫాం చూసి నాకూ అలాంటి దుస్తులు కావాలని అడిగాను.
వాటిని చదువుకునే వాళ్లకు మాత్రమే ఇస్తారని చెప్పడంతో స్కూలుకెళ్లి చదువుకుంటానని చెప్పి యూనిఫామ్ తీసుకున్నాను. దాంతో అనివార్యంగా చదవాల్సి వచ్చింది. అలా చదువుకొంటూ బి.ఎస్‌సి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి నాగార్జున యూనివర్శిటీలో ఎం.ఎ (సోషల్ వర్క్)లో గోల్డ్‌మెడల్ సాధించాను. నెట్ క్వాలిఫై అయి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యాను’’ అని వివరించారు సంతోష్. స్వతహాగా సోషల్ వర్క్ మీద ఉన్న ఇష్టంతో రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఇండియన్ సోషల్ ఫోరంలలో పనిచేశాడు. వీటన్నింటికంటే అనాథలకు, వీధిబాలలకు, బాలకార్మికుల కోసం ఏదైనా చేయాలనే తపనతో తిరిగి వరంగల్ చేరుకున్నాడు. అతడు ఇప్పుడక్కడ నవజీవన్ బాలభవన్ డెరైక్టర్. భార్య సునీత, పిల్లలు నిథిలన్, హర్షిల్‌తో హాయిగా జీవిస్తున్నాడు సంతోష్.
తప్పిపోయి ఈ చెట్టు చేరాను!
మహారాష్ట్రకు చెందిన రాధ తప్పిపోయి హైదరాబాద్‌కు చేరింది. ఒక పెద్దావిడ చొరవ తీసుకుని రాధను వీధిబాలలకు ఆశ్రయమిచ్చే ప్రభుత్వ హాస్టల్‌లో చేర్చింది. అక్కడే ఏడవ తరగతి వరకు చదువుకున్న రాధను, మిగతా పిల్లలతోపాటు వృత్తి విద్యాకోర్సులలో శిక్షణ కోసం తిరుపతికి పంపించారు. చదువుకుంటానని చెప్పడంతో ఆ అమ్మాయిని విజయవాడ నవజీవన్‌కు పంపించారు సంబంధిత అధికారులు. ఇంటర్ వరకు చదివిన తర్వాత బ్యూటీషియన్ కోర్సు చేసిందామె. ‘‘నాకు పెళ్లి కూడా నవజీవన్ వాళ్లే చేశారు. మా వారు శ్రీనుది కడప. సవతి తల్లి పెట్టే బాధలు పడలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చి వాసవ్యహోమ్‌లో కొన్నాళ్లు ఉండి తర్వాత నవజీవన్‌కి చేరారు. అక్కడే నన్ను చూసి ఇష్టపడి, ఫాదర్‌తో చెప్పడంతో ఫాదర్ మా పెళ్లి చేశారు’’ అని చెప్పింది రాధ.
పేరు పెట్టింది కూడా ఫాదరే!
రాజేశ్ నెలల బిడ్డగా రైల్వేస్టేషన్‌లో దొరికాడు. నవజీవన్ షెల్టర్‌హోమ్‌లో చేర్చిన తర్వాత అక్కడి ఫాదర్ బాలశౌరి అతడికి పేరు పెట్టారు. ‘‘హోమ్‌లోనే ఉంటూ పదో తరగతి వరకు చదివాను. నవజీవన్‌లోనే కార్పెంటర్ వర్క్ నేర్పించారు. ప్రస్తుతం విజయవాడ టౌన్‌లో కాంట్రాక్టులు చేస్తున్నాను. హోమ్‌కి వచ్చే నాలాంటి వారికి పనులు నేర్పిస్తూ నలుగురికి ఉపాధి చూపిస్తున్నాను. నాకు అమ్మా నాన్న..అన్నీ నవజీవనే’’ అంటాడు రాజేశ్.
ఇప్పల కోటిరెడ్డి, విజయవాడ
ఫొటోలు: రాజేంద్రమోహన్
ఎక్కడో పుట్టి... ఇక్కడ పెరుగుతున్నారు!
విజయవాడలో పాతికేళ్ల కిందట నవజీవన్ బాలభవన్‌ను స్థాపించారు. ఇంటినుంచి పారిపోయి వచ్చిన పిల్లలు, తప్పిపోయిన పిల్లలు, బాలకార్మికులు తారసపడితే మా సిబ్బంది వారిని హోమ్‌కు తీసుకువస్తారు. అలా ఈ పాతికేళ్ల ప్రస్థానంలో 24 వేల మందిని గుర్తించి వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాం. 43వేల మందికి పునరావాసం కల్పించాం. నవజీవన్‌లో ఆశ్రయం పొందిన వారిలో ఎంతోమంది చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాల నిర్మూలనపై కార్యక్రమాలు చేపడుతున్నాం.
- ఫాదర్ బాలశౌరి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, నవజీవన్ బాలభవన్, విజయవాడ