సర్వమానవ సార్వత్రిక దార్శనికుడు ఫిలిప్పు...

Philip was one of the seven who had been chosen to be anointed in the church  - Sakshi

సువార్త

ఆదిమ చర్చిలో సామాజిక పరిచర్య కోసం ఎంపిక చేయబడి అభిషేకం పొందిన ఏడుగురిలో ఫిలిప్పు ఒక పరిచారకుడు. అయితే యెరూషలేములోని ఆదిమ చర్చి ఎంతో వేగంగా, బలంగా  విస్తరించడం చూసిన యూదు మత ఛాందసులు అసూయచెంది నూతనంగా చర్చిలో చేరుతున్న క్రైస్తవ విశ్వాసులను  హింసించడం ఆరంభించడంతో  యెరూషలేములోని విశ్వాసులంతా యూదా దేశం వదిలి పలు ప్రాంతాలకు చెదిరిపోయారు. అక్కడి ప్రతి విశ్వాసి ఒక సువార్తికుడై దేవుని ప్రేమను ప్రకటించడంతో చెదిరిపోయిన వారి ద్వారా సువార్త కొత్త ప్రాంతాలకు వ్యాపించి చర్చిలు, విశ్వాసుల సంఖ్య మరింత విస్తరించింది.

అంటే చర్చిని, విశ్వాసులను కట్టడి చేయడానికుద్దేశించిన యూదుల చిత్రహింసల వ్యూహం ఎంతగా విఫలమైందంటే, అది చర్చిని అణిచివెయ్యలేకపోయింది సరికదా, చర్చి మరింత ఉధృతంగా విస్తరించడానికే ఇలా దోహదపడింది.ఆ కాలంలో ఫిలిప్పు మాత్రం యెరూషలేము నుండి సమరయ ప్రాంతానికి వెళ్లి అక్కడి అసంఖ్యాకులైన సమరయులకు సువార్త ప్రకటిస్తే వాళ్లంతా ఇనుమడించిన  ఉత్సాహంతో క్రైస్తవ విశ్వాసులయ్యారు. ఇది నిజంగా విప్లవాత్మకమైన పరిణామం. ఎందుకంటే సమరయులు యూదులకు అస్పృశ్యులు, ఆ కారణంగా వాళ్లంటే చిన్న చూపు. యూదా సామ్రాజ్యాన్ని అషూరులు పాలిస్తున్నప్పుడు, కొందరు యూదులు అషూరు స్త్రీలను వివాహమాడిన కారణంగా పుట్టినవారే సమరయులు.

అలా వాళ్ళు మిశ్రమ జాతికి చెందినవారన్న నెపంతో వారికి యెరూషలేము దేవాలయ ప్రవేశాన్ని కూడా చాందస యూదులు నిషిద్ధించారు. అయినా సమరయులు మాత్రం యూదు మతవిధులే పాటిస్తూ, ఆ దేవుణ్ణే ఆరాధిస్తూ మెస్సీయా ఆగమనాన్ని కాంక్షించేవారు. అలా వారిని దూరం పెట్టిన యూదులే ఇపుడు క్రైస్తవ విశ్వాసులై ఫిలిప్పు నాయకత్వంలో తమవద్దకొచ్చి యేసు సువార్త చెబుతుంటే అత్యుత్సాహంతో వాళ్లంతా కొత్త విశ్వాసంలో చేరారు. యూదులకు, సమరయులకు మధ్య 800 ఏళ్లుగా నెలకొన్న వైషమ్యాన్ని, అగాథాన్ని ఇలా క్రైస్తవం దూరం చేసి సమరయులను విశ్వాసులను చేసి వారికి ఆత్మగౌరవాన్నిచ్చింది, వారిలో అత్యానందాన్ని నింపింది.ఫిలిప్పుతో దేవుడొకసారి దర్శన రీతిన మాట్లాడి దక్షిణానికి వెళ్లి యెరూషలేము నుండి గాజాకు వెళ్లే దారిలో ఒక వ్యక్తిని కలుసుకొమ్మని ఆదేశించాడు.

ఇథియోపియా రాణి గారి ఖజానాదారుడు, ఇథియోపియా దేశపు ఉన్నతాధికారియైన ఒక నపుంసకుడు అక్కడ ఫిలిప్పుకు తారసపడ్డాడు. అతను యెరూషలేముకొచ్చి దేవుని ఆరాధించి రథంలో తిరిగి వెళుతూ యెషయా గ్రంథాన్ని చదవడం ఫిలిప్పు కనుగొన్నాడు. యేసుప్రభువు సిలువ ఉదంతాన్నంతా యెషయా తన గ్రంథంలో పరోక్షంగా చెప్పిన 53వ అధ్యాయాన్ని అతడు చదువుతుండగా ఫిలిప్పు ఆ భాగాన్ని ఆధారం చేసుకొని యేసుప్రభువు సువార్తను అతనికి ప్రకటిస్తే, అతను అక్కడికక్కడే మారు మనసు పొంది విశ్వాసియై ఇథియోపియా వెళ్ళాడు. అంటే యెరూషలేములో శత్రువులు విశ్వాసులు హింసిస్తే సువార్త సమరయకు, అక్కడినుండి ఈ విశ్వాసి ద్వారా ఇథియోపియా దేశానికి అంటే మొదటిసారిగా ఆఫ్రికా ఉపఖండానికి కూడా వ్యాపించిందన్న మాట.

అస్పృశ్యులైన జాతివిహీనులు, నపుంసకులు అనే తారతమ్యం లేకుండా సర్వమానవ సార్వత్రిక దర్శనంతో ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని నిర్మించాడు. విశ్వాసి ఆత్మపూర్ణుడైతే ఎంత బలంగా అతన్ని దేవుడు వాడుకొంటాడన్నదానికి ఫిలిప్పు నిదర్శనం. విశ్వాసులు ఫిలిప్పు లాగా ఆత్మపూర్ణులైతే సువార్త వ్యాప్తికి సరిహద్దులు లేవు,  దాన్ని అడ్డుకోగల అవరోధాలు కూడా లేవు.యెరూషలేములో అతనెప్పుడూ ప్రసంగాలు చెయ్యలేదు. ఎందుకంటే అతని పరిచర్యలో ఇతరులకు సహాయం చెయ్యడమే తప్ప ప్రసంగాలుండవు. కానీ సమరయలో అతను సువార్త ప్రకటించే మహా వక్త అయ్యాడు, వేలాది మందికి దేవుని ప్రేమను ప్రకటించి వారికి ఆత్మీయ తండ్రి అయ్యాడు. సమరయ, ఇథియోపియా దేశాలకు తొలిసారిగా సువార్త చేరవేసిన ఆద్యుడయ్యాడు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top