ఉల్లి కుళ్లకుండా నిల్వ చేసే పద్ధతి..!

onion storage system - Sakshi

రైతు పంట పండించిన సీజన్‌లో కన్నా కొద్ది నెలలు నిల్వ చేయగలిగితే మార్కెట్‌లో మంచి ధర పలికే అవకాశం ఉంది. త్వరగా కుళ్లిపోయే స్వభావం ఉన్న ఉల్లిపాయలను నిల్వ చేయడం సమస్యలతో కూడిన విషయం. అయితే, మధ్యప్రదేశ్‌ డెడ్ల జిల్లా ధర్‌కు చెందిన యువ రైతు రోహిత్‌ పటేల్‌(21) గత ఏడాది ఎగ్జాస్ట్‌ ఫాన్లతో ఉల్లిపాయలను సమర్థవంతంగా నెలల తరబడి నిల్వ చేసే పద్ధతిని కనిపెట్టారు. ఈ కథనాన్ని గతంలోనే ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు అందించింది. ఖర్చు పెద్దగా లేకపోవడం, నిల్వ నష్టాన్ని పది శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం రోహిత్‌ పటేల్‌ సాధించిన విజయం. ఈ కథనం స్ఫూర్తితో.. వికారాబాద్‌ జిల్లా జిన్‌గుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్‌ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 200 క్వింటాళ్ల ఉల్లిపాయలను అదే పద్ధతిలో నిల్వ చేస్తున్నారు. ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ నిపుణుడు రమాకాంత్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి..

పక్కా భవనంలోని 850(17“50) చదరపు అడుగుల గదిలో ఏప్రిల్‌ 20 నుంచి ఈ పద్ధతిలో ఉల్లిపాయలను నిల్వ చేస్తున్నారు. ప్రతి 100–105 చదరపు అడుగులకు ఒక్కొక్క ఎగ్జాస్ట్‌ ఫాన్‌ చొప్పున మొత్తం 8 ఫాన్లను ఏర్పాటు చేశారు. ఇవి నిరంతరాయంగా పనిచే స్తూ ఉల్లిపాయలు కుళ్లిపోకుండా కాపాడుతున్నాయి. తొలుత గదిలో గచ్చుపైన 9 అంగుళాల ఎత్తున సిమెంటు ఇటుకలు పేర్చి.. దానిపైన ఇనుప మెష్‌ పరిచారు.
100 అడుగులకోచోట ఎగ్జాస్ట్‌ ఫ్యాన్ల కోసం ఇటుకలు పేర్చారు. వాటిపైన 2.5 అడుగుల ఎత్తున మెష్‌ను పీపాలా గుండ్రంగా చుట్టి.. దానిపైన ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ను అమర్చారు. చివరిగా అడుగున్నర మందాన దాదాపు 200 క్వింటాళ్ల ఉల్లిపాయలను నిల్వ చేశారు. మరో 200 క్వింటాళ్ల వరకు ఇదే చోట నిల్వ చేయడానికి అవకాశం ఉందని రమాకాంత్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పెద్ద పాయలైతే ఎక్కువ పరిమాణంలో నిల్వ చేయవచ్చు. పెద్ద పాయలను 3 అడుగుల మందాన కూడా పోసి నిల్వ చేసుకోవచ్చంటున్నారు. నీడలో బాగా ఆరబెట్టిన ఉల్లిపాయలలో నుంచి కుళ్లిపోయిన వాటిని జాగ్రత్తగా తీసేసి నిల్వచేసుకోవటం చాలా ముఖ్యమని ఆయన అంటున్నారు. ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు ఆగకుండా తిరగాల్సిందేనని రమాకాంత్‌(83747 21751) సూచించారు.

                     సిమెంటు ఇటుకలు, ఇనుప మెష్‌పైన ఉల్లిపాయలు పోస్తున్న దృశ్యం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top