
సావ్‌ధాన్... ఒన్ టూ త్రీ వాక్ ఇన్ టు బేర్‌ఫుట్
తిలోనియా... ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో చిన్న కుగ్రామం. ఆరునెలలకు ఒకసారి ప్రపంచం నలుమూలల నుంచి కొంత మంది బామ్మలు
చైతన్యం
తిలోనియా... ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో చిన్న కుగ్రామం. ఆరునెలలకు ఒకసారి ప్రపంచం నలుమూలల నుంచి కొంత మంది బామ్మలు వస్తారిక్కడికి. వారంతా కాలేజ్ స్టూడెంట్స్. నిజమే... వాళ్లు బేర్‌ఫుట్ కాలేజ్‌లో చేరడానికే వస్తారు. వాళ్లలో చాలామంది స్కూలు ముఖం కూడా చూసి ఉండరు. ఏకంగా కాలేజ్‌లో చేరిపోవడానికి వచ్చేస్తారు. అక్షరం ముక్క రాకపోయినా... ఒకరి భాష ఒకరికి తెలియకపోయినా... అంతా కలిసిపోతారు. అందరి లక్ష్యం ఒక్కటే. నైపుణ్యం సాధించడం... సొంతూరికి సాయపడటం!
బేర్‌ఫుట్ కాలేజ్‌లో చేరిన మహిళలు ఆరు నెలల్లో ఇంజినీర్లు అవుతారు. వారిలో కొందరు తమ గ్రామంలో చీకటిని తరిమి వెలుగులు నింపడానికి సోలార్ లైట్ తయారీ నేర్చుకుంటారు. ఇంకొందరు చుక్క చుక్క వాననీటిని ఒడిసిపడతారు. మరికొందరు భావితరాలను అక్షర సైనికులుగా తీర్చిదిద్దే గురువులు అవుతారు. ఇంకా... ఎలక్ట్రీషియన్లు, డెంటిస్ట్‌లు, హస్తకళాకారులుగా ఎదుగుతారు. ఆశ్చర్యంగా ఉంటే ముక్కున వేలేసుకోవడం తప్ప మనం మరేమీ చేయలేం.
గ్రామీణుల నైపుణ్యమే పెట్టుబడి...
బేర్‌ఫుట్ కాలేజీ... ఇతర కాలేజీల మాదిరి చదువు చెప్పదు. సర్టిఫికెట్లు ఇవ్వదు. పల్లెటూళ్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ఆ గ్రామాల్లోని నిరక్షర నిపుణులే పెట్టుబడిగా బతుకును సాఫీగా మార్చుకునేందుకు అవసరమైన సాధన సంపత్తిని అందిస్తుంది అంతే. ‘‘బేర్‌ఫుట్ కాలేజీని 12 మంది తిలోనియా గ్రామ మేస్త్రీలే కట్టారన్నా... ముప్ఫై ఏళ్ల క్రితమే ఈ కాలేజీ మొత్తం సౌరశక్తితోనే నడిచిందన్నా... ఐదేళ్ల కరవును సైతం తట్టుకునేలా దీంట్లో నాలుగు లక్షల లీటర్ల సామర్థ్యమున్న వాననీటి సంరక్షణ ట్యాంకు ఉందన్నా.. అంతా ఈ ఫిలాసఫీ చలవే. అందుకే ఈ కాలేజీలో చేరేందుకు డిగ్రీలు అస్సలు పనికిరావు. మీ చేతులతో పనిచేయాలి... మీ పల్లె లేదా మీ చుట్టూ ఉన్న వారి సమస్యల్లో ఏదో ఒకదానికి పరిష్కారం చూపగలగాలి. అన్నింటికీ మించి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటేనే బేర్‌ఫుట్ కాలేజీలోకి ప్రవేశం. ఒకవేళ మీరు ఇంకెక్కడో పెద్దపెద్ద చదువులు చదువుకుని సామాజిక ప్రయోజనమున్న ఆలోచనలకు పదును పెట్టాలనుకుంటే మాత్రం ఎప్పుడైనా రావచ్చు... ఎంతకాలమైనా మాతో ఉండవచ్చు’’ అంటారు బంకర్ రాయ్.
ఎవరీ బంకర్!
స్వాతంత్య్రానికి రెండేళ్ల ముందు ఆగస్టు రెండున వెస్ట్ బెంగాల్‌లోని బర్న్‌పూర్‌లోని సంపన్న కుటుంబంలో జన్మించాడు సంజిత్ బంకర్ రాయ్. డూన్ స్కూల్‌లో చదువుకున్నాడు. 1962 తరువాత ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ చేశారు. స్క్వాష్‌లో జాతీయ ఛాంపియన్ కూడా. అనుకోవాలేగానీ... ఓ డాక్టర్, ఓ సైంటిస్ట్, ఓ దౌత్యవేత్త.. ఇలా ఏమైనా కాగలిగేవాడు. చదువు పూర్తయిన తరువాత ఆయనకు కొద్దిరోజులు పల్లెటూళ్లో గడిపితే ఎలా ఉంటుంది... అనే చిత్రమైన కోరిక కలిగింది. అంతే... బీహార్‌కు పయనమయ్యాడు. అప్పటికి అంటే 1965కి బీహార్ మహా కరవు రక్కసి కోరల్లో విలవిల్లాడి... జీవచ్ఛవంలా ఉంది. ఆ గ్రామాలను దగ్గర నుంచి చూశాడు. పల్లెటూరి సమస్యలేమిటో? ఎలా ఉంటాయో? గ్రామీణులు ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉంటారో అర్థమైంది.
వెనుదిరిగి రావడమే తడవు.. తాను పల్లెబాట పట్టబోతున్నట్లు ఇంట్లో ప్రకటించేశాడీ శ్రీమంతుడు. తల్లి బిత్తరపోయింది.. వీడికేమైనా పిచ్చెక్కిందా? అనేసింది కూడా. బంకర్ రాయ్ చాలా సింపుల్‌గా ‘‘మీరు చెప్పించిన చదువు నన్ను ఆలోచించేలా చేసిందమ్మా. అందుకే మన పల్లెటూళ్లకు నాదైన రీతిలో సేవ చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘ఏం చేస్తావక్కడ? ఏముంది? ఉద్యోగం లేదు... డబ్బులు ఉండవు.. పూట గడుస్తుందన్న నమ్మకం కూడా లేదు కదా’’ అని అమ్మ అంటే... ‘‘ ఏమీ చేతకాకపోతే బావులు తవ్వుతా’’ అన్నాడు సినీఫక్కీలో బంకర్ రాయ్. అనడమే కాదు... అన్నంత పనీ చేశాడు. ఆ పని చేసింది రాజస్థాన్‌లోని తిలోనియా గ్రామంలో. దాదాపు వంద గ్రామాల్లో కరవు పరిస్థితులను అధ్యయనం చేసిన ఆయన ముందుగా తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి నడుం బిగించాడు. ఈ నేపథ్యంలోనే 1972లో ప్రారంభమైంది బేర్‌ఫుట్ కాలేజీ!!!
తొలి ఇంజనీర్ బామ్మ!
బేర్‌ఫుట్ కాలేజీ రాజస్థాన్‌లో తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం కోసం మొదలైనప్పటికీ కాలక్రమంలో దీని పంథా మారిపోయింది. మహిళల స్వావలంబన మొదలుకొని ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంలో తనవంతు సహకారం అందిస్తోంది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియాదేశాల్లోని మారుమూల ప్రాంతాల బామ్మలకు మాత్రమే ఈ కాలేజీలో ప్రవేశం.
⇒సౌరశక్తితో పనిచేసే దీపాలు, వేడినీటియంత్రాల తయారీలో వీరికి శిక్షణ ఇస్తారు. తిలోనియాలో బేరఫుట్ కాలేజీ మొత్తానికి సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేసిన నిరక్షరాస్య ఇంజినీర్ ఒకరు వీరికి శిక్షణ ఇస్తారు. శిక్షణ తరువాత ఈ బామ్మలు వారి వారి స్వస్థలాల్లో సోలార్ లైట్లు, ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా... మరింత మందికి శిక్షణ ఇస్తారు.
⇒వాన నీటి సంరక్షణ మెళకువలు, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ, యంత్రాల తయారీలోనూ ఇదే తరహా తర్ఫీదు లభిస్తుందిక్కడ.
⇒చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యాబోధనకూ, సామాజిక దురాచారాల నిర్మూలనలపై కూడా బేర్‌ఫుట్ కాలేజీ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తారు. తిలోనియాలో శిక్షణ పూర్తి చేసుకన్న తొలి సోలార్ ఇంజినీర్ కనకా దేవి. 1997 డిసెంబరులో కాలేజ్‌లో చేరింది. ఇప్పటివరకూ బేర్‌ఫుట్ కాలేజీ దాదాపు 77 దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మందిని సోలార్ ఇంజినీర్లుగా తీర్చిదిద్దింది.
అవార్డు వద్దు! బహుమతి వద్దు!!
‘‘నిరుపయోగంగా ఉన్న క్షయవ్యాధి కేంద్రాన్ని నెలకు రూపాయికి అద్దెకు తీసుకున్నాం. అలా మొదలైన బేర్‌ఫుట్ కాలేజీకి 2002లో ఆగాఖాన్ ఆర్కిటెక్చర్ అవార్డు లభించింది. ట్రస్ట్ తరఫున కాలేజీని సందర్శించిన వారు దీన్ని కట్టింది మా ఊరి మేస్త్రీలే, ఈ కాలేజ్‌లో పని నేర్చుకున్న వారేనంటే వాళ్లు అస్సలు నమ్మలేదు. ఆర్కిటెక్ట్‌లు బ్లూప్రింట్ మాత్రమే ఇచ్చారు... నిర్మాణం మొత్తం మా మేస్త్రీలే చేశారు. వారికి నమ్మకం కలగకపోవడంతో ఆ అవార్డును తిరస్కరించాం. నగదు బహుమతి 50 వేల డాలర్లను తిరిగి ఇచ్చేశాం’’
– గిళియార్ గోపాలకృష్ణ మయ్యా