అనాథ బాలికల కంటిరెప్ప

Nandha gopal help to Orphan girls - Sakshi

అబ్జర్వేషన్‌ హోమ్‌

గోరుముద్దలు పెట్టి, జాబిల్లి కథలు చెప్పి నిద్రపుచ్చాల్సిన అమ్మ  వద్దనుకుంది. చేయిపట్టి నడిపించాల్సిన నాన్న వదలించుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్లనో, కుటుంబ కలహాల కారణంగానో, బిడ్డకు అంగవైకల్యమనో, ఆడపిల్ల భారమనో ఇలా.. పురిటి గుడ్డుగానే ఎంతోమంది అనా«థలవుతున్నారు. ఆకలే తల్లిగా, ఆవేదనే తండ్రిగా, ఒంటరితనంతో అనాథలెందరో రోడ్ల పక్కన చేరి ఆలమటిస్తూ, కన్నీళ్లే తోడుగా, బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూ, ప్రేమ కోసం పరితపిస్తూ కనిపిస్తుంటారు. అలాంటి వారికి అమ్మ, నాన్నలా బాధ్యతగా ఆశ్రయం కల్పించి ఆదరిస్తోంది తిరుపతిలోని ప్రభుత్వ బాలికల పర్యవేక్షణా గృహం. అనాథలను అక్కున చేర్చుకుని అన్ని వసతులతో వారిని పెంచడమే కాకుండా, వారికి పెళ్లి కూడా జరిపిస్తోంది. 

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 4 కోట్లకు పైగా అనాథలు ఉన్నట్టు తేలింది. దేశ జనాభాలో వీరు నాలుగు శాతం.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 24 లక్షల మందికిపైగా అనా«థలు ఉన్నారు. అమ్మ ఒడికి , నాన్న లాలనకు నోచుకోని ఈ పిల్లల్లో అధిక శాతం ఆడపిల్లలే. అలా కన్నవారికి దూరమై సమాజంలో నిరాదరణకు గురైన బాలికలను చేరదీస్తోంది  తిరుపతి అనంత వీధిలోని ప్రభుత్వ ప్రత్యేక ‘చిల్డ్రన్స్‌ హోమ్, అబ్జర్వేషన్‌ హోమ్‌ ఫర్‌ గర్ల్స్‌’. అంతే కాదు,కోరుకున్న చదువు చెప్పించి, వారి కాళ్లపై వారు నిలబడేందుకు ప్రోత్సహిస్తోంది ఈ హోమ్‌. ఆఖరికి సంప్రదాయబద్దంగా పెళ్లి చేసే బాధ్యతను సైతం తీసుకుంటోంది. 2008లో ఆరుమంది అనా«థపిల్లలతో ప్రారంభమైన హోమ్‌లో ప్రస్తుతం 136 మంది ఉన్నారు.

హైటెక్‌ వసతులు
ఈ వసతి గృహంలో అనాథ బాలికలకు అనేక హైటెక్‌ వసతులు కల్పిస్తున్నారు. సోలార్‌ వాటర్‌ప్లాంట్, ఆర్వో ప్యూరిఫైడ్‌ వాటర్‌ సిస్టం, వాషింగ్‌ మిషన్లు, ఇన్వర్టర్, కంప్యూటర్‌ ల్యాబ్‌ వంటి సౌకర్యాలతో పాటు తరచు స్పెషల్‌ మెనూతో ఆరోగ్యవంతమైన భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలూ డాక్టర్ల పర్యవేక్షణ, చదువులో వెనుకబడిన విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ట్యూషన్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి. విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి ఇండోర్‌ క్రీడల సౌకర్యం, నాటికలు, పురాణ కథలు, డ్రామాలు, కోలాటాలు, చెక్కభజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. వీటితో పాటు యోగా, కరాటే, ధ్యానంతో వారిలో ఆత్మసై ్థర్యాన్ని నింపుతున్నారు. ఏడాదికోసారి విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాళహస్తి, మదనపల్లి, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో విహార యాత్రలకు సైతం తీసుకెళుతుంటారు.

విద్యతో పాటు వివాహం
బాలికల సంరక్షణతో పాటు ఉన్నత విద్యపై వారికి అవగాహన కల్పించి ఉపాధి ఉద్యోగాల వైపు వారిని నడిపించాలనే సంకల్పంతో బాలికల వసతి గృహ నిర్వాహకులు కృషి చేస్తున్నారు. బయటి విద్యార్థులకు దీటుగా కోరుకున్న చదువును చదివిస్తూ వారిని అన్ని రంగాల్లో రాణించే విధంగా తయారు చేస్తున్నారు. ప్రభుత్వ గ్రాంట్స్‌తో పాటు దాతల సహాయంతో చదువులో రాణించే బాలికలను పేరొందిన ప్రైవేటు సంస్థల్లో చదివిస్తున్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్‌ వంటి కోర్సుల్లో చాలా మందికి ప్రవేశాలు కల్పించి వారిని ప్రోత్సహిస్తున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన ఏడు మంది అనాథ యువతులకు ప్రభుత్వ అనుమతితో  వివాహం చేశారు. గత ఏడాది నలుగురు అనాథ బాలికలకు  వివాహం చేశారు.

పెళ్లిసందడి మొదలైంది
ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో హోమ్‌లోని యువతులకు వివాహాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండడంతో పర్యవేక్షణా గృహంలో అప్పుడే పెళ్లిసందడి నెలకొంది. వందల సంఖ్యలో వరుళ్ల బయోడేటాలు, ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబీకులతో పాటు కార్పొరేట్‌ స్థాయి ఉద్యోగులు, ఉన్నతస్థాయి కుటుంబాలు సైతం వధువు కోసం దరఖాస్తులు పంపుతున్నారు. 
పెళ్లి తర్వాత పుట్టింటì  తంతువివాహానంతరం పుట్టింటి నుంచి ఆడపడుచుకు పసుపు, కుంకుమ అందించడం ప్రతి కుటుంబంలో సాగే సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పర్యవేక్షణ గృహ ప్రతినిధులు పాటిస్తూ ఆడపడుచులకు అండగా నిలుస్తున్నారు. ప్రతి పండుగకు సాంప్రదాయ బద్దంగా గృహానికి ఆçహ్వానించి ఆడపడుచులకు కొత్తబట్టలు పెడుతున్నారు.
– పోగూరి చంద్రబాబు, సాక్షి, తిరుపతి 

వరుడి ఎంపికకు ప్రత్యేక కమిటీ
సామాజిక స్పృహ, నైతిక విలువలే ప్రాతిపదికగా ఏర్పాటైన ప్రత్యేక కమిటీతో హోమ్‌లోని యువతులకు వరుడి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ కమిటీలో ఓ ప్రభుత్వ అధికారి, న్యాయవాది, స్వచ్చంధ సంస్థ ప్రతినిధి, హోం అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ వరుడి సామాజిక, ఆర్థిక స్థితిగతులతో పాటుగా అతని సత్ప్రవర్తనపై ఆరా తీసి, ఆ తర్వాత మాత్రమే వధువును చూపించడం జరుగుతుంది. వరుడికి ఆరోగ్య పరమైన పరీక్షలు కూడా నిర్వహించడం విశేషం. ఈ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించడంతో పాటు వధువుకు వివాహ భద్రత కల్పించేలా వరుడు, వరుడి తల్లిదండ్రుల నుంచి కూడా లిఖితపూర్వకంగా హామీ పత్రాలపై సంతకాలు తీసుకుంటుంది.  

పన్నెండు పెళ్లిళ్లకు ప్రణాళిక
ఈ ఏడాది సెప్టెంబర్‌ మా హోమ్‌లో 18 సంవత్సరాల వయస్సు నిండిన  పన్నెండు మంది అనా«థ యువతులకు వివాహాలు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఏ కొరతా లేకుండా ప్రభుత్వ సాయంతో, దాతల ఔదార్యంతో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా రూ.50వేల నగదును వధువు పేరిట బ్యాంకు ఖాతాలో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను. అంతేకాదు, వివాహాలు  జరిగిన వారికి నా సొంత ఆస్తిలో 15 అంకణాల ఇంటిస్థలాన్ని ఇవ్వడానికి వైఎస్సార్‌ కడపజిల్లా కోడూరులో పనులు  కూడా ప్రారంభించాను. పది సంవత్సరాలుగా వీరితో మమేకమై వీరికి తండ్రిలా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం నాకు విజయవాడకు రీజన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ అధికారిగా బదిలీ అయింది.
– బి. నందగోపాల్‌

ఆయనే మాకు ఆదర్శం
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా తిరుపతిలోని బాలికల పర్యవేక్షణా గృహంలో గత ఏడాది ఏడు మంది అనాథ యువతులకు పూర్వపు పర్యవేక్షణాధికారి నందగోపాల్‌ ఆధ్వర్యంలో ఘనంగా వివాహాలు జరిగాయి.  ప్రస్తుతం కూడా సెప్టెంబర్‌ నెలలో 12 మంది అనా«థ యువతులకు వివాహాలు జరిపించేందుకు నందగోపాల్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ వివాహాలు ఘనంగా నిర్వహిస్తాం. పూర్వపు పర్యవేక్షణాధికారి నందగోపాల్‌ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగతా ఆశ్రమాల వారు కూడా ఇలాంటి సేవాకార్యక్రమాలకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటాం.
– సంజీవరెడ్డి, ప్రస్తుత పర్యవేక్షణాధికారి 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top