పొడ ఎడ్లతో ఆత్మీయ బంధం!

Livestock Farming Income Is Higher Than Agriculture - Sakshi

నల్లమల అటవీ ప్రాంత ‘పొడ తూర్పు’ పశు జాతికి గుర్తింపు

కేంద్రం గుర్తింపు పొందిన తొలి తెలంగాణ పశు జాతి ఇదే

అమ్రాబాద్‌ అటవీ ప్రాంత రైతాంగ కుటుంబాలకు పొడ ఎడ్లతో అనాదిగా విడదీయరాని ఆత్మీయ అనుబంధం

పనీ పాటల్లో, పండుగలు పబ్బాలలో పొడ ఎడ్లకు పెద్దపీట

ప్రభుత్వ గుర్తింపుతో పెరగనున్న పశుపోషకుల ఆదాయం

తెలంగాణకు తలమానికం వంటి పశు జాతి ‘పొడ తూర్పు’. తూర్పు కనుమల్లోని అమ్రబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ నల్లమల అటవీ ప్రాంతంలో విరాజిల్లుతున్న పశు జాతి ఇది. నాగర్‌కర్నూల్‌ (పాత మహబూబ్‌నగర్‌) జిల్లాలోని తూర్పు భాగాన రైతులు, పశుపోషకులు అయిన లంబాడాలు, గొల్లలు, చెంచులకు తరతరాలుగా జీవనాధారంగా నిలుస్తున్నందున ఈ పశుజాతికి ‘తూర్పు’ అనే మాట వచ్చింది. ఈ జాతి పశువుల దేహంపై పొడ మచ్చలు ఉండటంతో ‘పొడ తూర్పు’ అని పేరు వచ్చింది. స్థానికులు ‘పొడ ఎడ్లు’ అని పిలుచుకుంటూ ఉంటారు.

ఈ జాతి ఎడ్లు మెట్ట రైతులకు వ్యవసాయంలో పెద్ద భరోసాగా నిలుస్తున్నాయి. మెట్ట పొలాలను దున్నటంతో పాటు మాగాణుల్లో దమ్ము చేయడానికి, ఇతర వ్యవసాయ పనుల్లో పొడ ఎడ్లు బాగా పనిచేస్తాయి. ఎంత కష్టమైన పనైనా విసుగు విరామం లేకుండా కొనసాగించి పూర్తి చేయటం, చీటికి మాటికి జబ్బుపడకుండా ఉండటం, తక్కువ మేత, తక్కువ నీటితో కూడా మనగలగడం ఈ పశు జాతి ఎడ్లకున్న సుగుణాలు. అందుకే నాగర్‌కర్నూల్‌ ప్రాంత  పశుపోషకులకు, రైతులకు పొడ ఎడ్లంటే అంత మక్కువ. వారి పండుగలు జాతర్లలో ఈ పశువులకు ప్రాధాన్యం ఉంటుంది. పొడ జాతి ఆవులు పాలు తక్కువగా ఇస్తాయి. అందుకే ఆ పాలను కూడా పూర్తిగా దూడలకే వదిలేసే పశుపోషకులు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తారు.

మూడేళ్ల క్రితం వాసన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పొడ తూర్పు పశు జాతి విశిష్టతల గురించి, స్థానిక పశు సంరక్షక, వ్యవసాయ కుటుంబాల వారు తరతరాలుగా ఈ పశుజాతిని పరిరక్షించుకుంటూ పొట్టపోసుకుంటున్న వైనం గురించి రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 2016లో, 17లో పొడ ఎడ్ల మేళాలను ఏర్పాటు చేయటంతో ఈ జాతి ఎడ్లంటే వివిధ ప్రాంతాల, రాష్ట్రాల రైతులకున్న మక్కువ వెల్లడైంది. దీంతో తెలంగాణ పశుసంవర్థక శాఖ పొడ తూర్పు జాతి పశు జాతి జన్యు స్వచ్ఛతను కాపాడాలని సంకల్పించింది. కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు చెయ్యడం నిలిపివేసింది.

ప్రభుత్వ గుర్తింపు పొందిన 44వ పశుజాతి
ఆ తర్వాత రెండేళ్ల పాటు ఈ జాతి పశు సంపద స్థితిగతులపై అధ్యయనం జరిగింది. స్థానిక రైతులు, పశుపోషకుల జీవితాలతో, వారి జీవనోపాదులతో ఈ పశు జాతి తరతరాలుగా ఎంత గాఢంగా పెనవేసుకొని ఉన్నదో అధికారికంగా గుర్తించడానికి ఈ అధ్యయనం తోడ్పడింది. సుమారు 450–500 వరకు లంబాడి, గొల్ల, ఎస్సీ కుటుంబాలు కేవలం పొడ తూర్పు పశు జాతి పోషణనే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ జాతి పశువులు 15,076 ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా మేత వేయటం, దాణా పెట్టడం అవసరం లేదు. పచ్చిక బయళ్లలో, అటవీ ప్రాంతంలో మేసే మేతే చాలు. ప్రత్యేకంగా మేత, దాణా వేయక్కరలేదు. ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పశు జన్యువనరుల బోర్డు(ఎన్‌.ఎ.పి.జి.ఆర్‌.) పొడ తూర్పు జాతి పశువులకు గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఎన్‌.ఎ.పి.జి.ఆర్‌. ఇప్పటికే 43 భారతీయ పశుజాతులను గుర్తించింది. తాజాగా గుర్తింపు పొందిన ‘పొడ తూర్పు’ 44వది.

రైతుల కన్నా పశుపోషకుల ఆదాయం ఎక్కువ
నాగర్‌కర్నూల్, పాత మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో  వర్షాధార వ్యవసాయమే ఎక్కువ. తరచూ కరువు పరిస్థితులను చవిచూసే ఈ ప్రాంత రైతులు వ్యవసాయంపై పొందే ఆదాయం కన్నా ‘పొడ తూర్పు’ పశువులను పెంచుకుంటూ జీవించే కుటుంబాల ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు వాసన్‌ అధ్యయనంలో తేలింది. 110 మంది పశుపోషకులపై అధ్యయనం చేశారు. వీరంతా కలిసి ‘అమ్రాబాద్‌ పొడ లక్ష్మి గోవు సంఘం’గా సంఘటితమయ్యారు. 80 నుంచి 120 పొడ తూర్పు ఆవులు, ఎద్దులు, దూడల మంద కలిగిన పశుపోషకుడు ఏటా 20 నుంచి 30 వరకు గిత్త దూడలను విక్రయిస్తూ, రూ. లక్షన్నర నుంచి రూ. 3 లక్షల వరకు ఆదాయం గడిస్తున్నారు.

8 నుంచి 15 నెలల గిత్త దూడల ధర రూ.8 వేల నుంచి 15 వేల వరకు పలుకుతోంది. రెండున్నర ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్ల వయసు వరకు వ్యవసాయ పనుల్లో ఈ గిత్తలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఐదెకరాల మెట్ట భూమిలో వ్యవసాయం చేసే రైతులు సైతం రూ. 30 వేలకు మించి ఆదాయం పొందలేకపోతున్న ఆ ప్రాంతంలో పొడ తూర్పు పశువులను పెంచి గిత్త దూడలను అమ్ముకునే పశుపోషకుల ఆదాయం చాలా ఎక్కువగా ఉందని వాసన్‌ డైరెక్టర్‌ డా. సవ్యసాచిదాస్‌ ‘సాక్షి’తో చెప్పారు. మెట్ట ప్రాంత వ్యవసాయానికి చాలా అనువైన ఈ పశుజాతిని పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఇందుకు తోడ్పడుతుందని ఆయన అంటున్నారు. 

మేత కోసం నెలల తరబడి వలస
దాదాపు 400 ఏళ్ల క్రితం నుంచి ఈ పశుజాతిని స్థానికులు పోషించుకుంటూ జీవనం గడుపుతున్నారని ఒక అంచనా. గతంలో నల్లమల అటవీ ప్రాంతంలో 15 కిలోమీటర్ల లోపలి వరకు వెళ్లి పశువులను మేపుకునే వారు. అయితే, అటవీ శాఖ అధికారులు ఇటీవలి కాలంలో మూడు కిలోమీటర్ల కన్నా లోపలికి అనుమతించడం లేదు. దీంతో శీతాకాలం నుంచే మేత దొరకడం గగనమైపోయింది.  జనవరి నెల నుంచి మే, జూన్‌ నెల వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణాజిల్లాలకు పశువులతో వలస వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

పిల్లలతో సమానంగా ప్రేమిస్తాం!
ముత్తాతల కాలం నుంచి పొడ(తూర్పు) ఎడ్లే మాకు జీవనాధారం. వీటితో మా జీవితాలకు విడదీయలేని అనుబంధం ఉంది. మా పిల్లలతో సమానంగా వీటిని మేం ప్రేమిస్తాం. మా తాతలు, తండ్రులు, మేము, మా పిల్లలు అందరం వీటిపైనే ఆధారపడి బతుకుతున్నాం. పిలిస్తే పలుకుతాయి మా ఎడ్లు. కొండలు, గుట్టలు ఎక్కి మేస్తాయి. విజిల్‌ వేస్తే చాలు చప్పున దిగి వస్తాయి. మా ప్రాంతంలో నెల క్రితమే మేత కరువైంది. మాకున్న 300 పొడ తూర్పు పశువులను తోలుకొని 15 రోజుల క్రితం గుంటూరు జిల్లాకు వలస వచ్చాం. ఇక్కడినుంచి కృష్ణా జిల్లాకు వెళ్తాం. మే, జూన్‌లో వర్షాలు కురిసి పచ్చిమేత మొలిచే వరకూ మాకు సంచార జీవనం తప్పదు. నేను గత పదిహేనేళ్లుగా ప్రతి ఏటా పశువులను తోలుకొని వలస వస్తూ ఉన్నాను. శ్రమ, ఖర్చు అయినా మాకు జీవనాధారమైన పశువులను రక్షించుకోవాల్సిందే. పొడ ఎడ్లకు ప్రభుత్వ గుర్తింపు రావటం సంతోషంగా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి. మా పశువులకు, మాకు, జీతగాళ్లకు బీమా కల్పించాలి.
– గంటల హనుమంతు (96525 21052), అధ్యక్షుడు, అమ్రాబాద్‌ పొడ లక్ష్మి గోవుల సంఘం, బీకే లక్ష్మీపుర్‌ తండా, నాగర్‌కర్నూల్‌ జిల్లా

గుర్తింపు వల్ల ఒరిగేదెమిటి?
పొడ తూర్పు పశుజాతికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు రావడం వల్ల తరతరాలుగా ఈ పశుజాతిని పరిరక్షిస్తున్న స్థానిక గ్రామాల్లోని లంబాడాలు, గొల్లలు, చెంచులు, ఎస్సీలకు గ్రామ బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీల (బి.ఎం.సి.ల) ద్వారా ఈ పశుజాతిపై ప్రత్యేక హక్కులు దఖలుపడతాయి. అందువల్ల ఈ పశువులను పెంచే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడానికి వీలవుతుంది. ఈ ఎడ్లను, ఆవులను కొనుగోలు చేసే రైతులు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు తీసుకోవచ్చు. ఫలితంగా పశుపోషకుల ఆదాయం పెరుగుతుంది.

అంతేకాదు.. అటవీ హక్కుల చట్టం కింద కూడా పొడ తూర్పు పశుపోషకులకు హక్కులు సంక్రమిస్తాయి. అటవీ శాఖ స్థానిక పశుపోషకుల హక్కులను గుర్తించేందుకు, సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉందని వాసన్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ డా. సవ్యసాచిదాస్‌ (94408 04860) ఆశాభావం వ్యక్తం చేశారు. 
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top