అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

Kolkata Urban Nostalgists - Sakshi

పాత మేడ.. ఇల్లు.. ఏదైనా సరే.. ఓ జ్ఞాపకం. మన పెద్దల కష్టానికి, మన బాల్యానికి, కుటుంబ అనుబంధాలకు!  ఆలాంటి ఆస్తి చెమ్మపట్టి మెత్తగా జారిపోతుంటే.. పొడి రాలి చూరు కూలిపోతుంటే.. ప్రాణం పోయినంత పనవుతుంది. దాని కోసమే అమ్మానాన్నతో గొడవలు.. అన్నదమ్ములతో యుద్ధాలు.. అక్కాచెల్లెళ్లతో మాటపట్టింపులూ జాస్తే. అది వేరే విషయం. పట్టణాల్లో ఉన్న అలాంటి ప్రాపర్టీని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌కు ఇచ్చి అపార్ట్‌మెంట్స్‌లా మార్చకుండా.. కమర్షియల్‌ కాంపెక్స్‌లు కట్టకుండా.. ఆ పాత ఇంటి  శోభ పెరిగేలా.. జ్ఞాపకాల ఊటను పదిలంగా కాపాడే మార్గం ఏమైనా ఉంటే? ఆ తలుపు తట్టకుండా ఉంటామా? వెంటనే చిరునామా వెదకమూ! అయితే కోల్‌కత్తాలోని అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌ల గురించి తెలుసుకోవాల్సిందే! కోల్‌కత్తాలోని  ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఆర్కిటెక్ట్స్, సౌందర్యాభిరుచి ఉన్న వ్యక్తులు కొందరు.. దాదాపు నలభై మంది కలిసి ఈ పని చేస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలే రుజువులు. బ్రిటిష్‌ విక్టోరియన్‌ నిర్మాణ శైలికి లోకల్‌ ఈస్తటిక్స్‌ను మేళవించి కట్టిన, అమ్మకానికి ఉన్న వందేళ్ల నాటి భవంతులు, ఇళ్లను ఈ అర్బన్‌ నోస్టాల్‌జిస్ట్‌లు తీసుకుంటున్నారు.

పెద్ద హాళ్లు.. విశాలమైన వరండాలు.. ఎత్తయిన పైకప్పులు.. పొడుగు కిటికీలు.. మొజాయిక్‌ ఫ్లోరింగ్‌లు.. ఇలా ఆ భవనాల యాంటిక్, యూనిక్‌నెస్‌లను అంగుళం కూడా డిస్టర్బ్‌ చేయకుండా.. వాటిని అలాగే ఉపయోగించుకుని కొత్తగా మారుస్తున్నారు. ఆ ఇళ్ల ప్రత్యేకతను బట్టి బోటిక్‌ కమ్‌ హోటల్స్‌గా, ఆర్ట్‌ స్టూడియో, గ్యాలరీస్‌గా, రెస్టారెంట్‌ కమ్‌ లైబ్రరీగా, మీటింగ్‌ ప్లేసెస్‌గా, డ్రామా థియేటర్స్‌గా.. అంటే కొత్త ఆసామి ఆస్తకులు, అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ‘‘కొందరేమో అమ్మకుండా.. ఆధునిక హంగులను జోడిస్తూ రెనోవేషన్‌ కోరుకుంటున్నార’’ ని చెప్పారు ఈ నలభై మందిలో ఒకరైన మాళవికా బెనర్జీ. మొత్తానికి కోల్‌కత్తా నగరానికి ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌ను కాపాడుకోవాలనుకునే యజమానులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా ఈ అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లనే సంప్రదిస్తున్నారట.. ఆస్తిని అమ్ముకున్నా.. అదొక జ్ఞాపకంలా మదిలో మాత్రమే మిగలకుండా.. కంటిముందూ కనబడుతూండడంతో ఒకింత తృప్తి.. ఇంకెంతో నిశ్చింత అనుకుంటూ! ప్రస్తుతం కోల్‌కత్తాలో ఇలాంటి వాటికే డిమాండ్‌ పెరిగి. ఓ ట్రెండ్‌లా సాగుతోంది.. అర్బన్‌ నోస్టాల్‌జిస్ట్స్‌ అనే కొత్త పేరూ యాడ్‌ అయింది. వాళ్ల వెబ్‌సైట్స్‌కు ట్రాఫిక్‌ ఎక్కువైంది. ఇది కోల్‌కత్తా తీరం వెంట వైజాగ్‌కూ చేరి.. వయా విజయవాడ హైదరాబాద్‌కు రావడానికి ఇంకెంతో కాలం పట్టకపోవచ్చేమో! మంచిదే.. శుభ పరిణామమే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top