అమాయక లోకం జరావా...

అమాయక లోకం జరావా... - Sakshi


 ఓ వైపు పచ్చని ప్రకృతి, మరోవైపు నీలిసంద్రపు సోయగాలు. ఈ అందాలను కనులకు విందుచేసే అండమాన్ ద్వీపంలో ఉన్న అడవిబిడ్డలు వీరు. పేరు ‘జరావా.’ అంటే ‘ఇతర ప్రజలు’ అని అర్థం. పోతపోసిన నల్లని విగ్రహాలుగా కనిపించే ఈ అటవికులు దిగంబరులుగా సంచరిస్తూ ఉంటారు. వీరి సంఖ్య ఆడ-మగ, పిల్లా, పెద్దా కలిపి 300 లోపు ఉండచ్చని అంచనా! అంతరించిపోతున్న తెగల్లో ‘జరావా’ ఒకటి.

 వేటయే జీవనం

 రాతియుగపు నాటి మనుషుల గురించి చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదివి ఉంటారు. కొండకోనల్లో నివసించే ఆదివాసీల ఆహార్యాన్ని కొంతవరకు సినిమాల్లో చూసి ఉంటారు. అలాంటి పోలికలతోనే కనిపిస్తుంది ‘జరావా’ తెగ. పదునైన బాణాలతో అడవి పందులను, సముద్రంలో తాబేళ్లు, చేపలను వేటాడుతారు. పగడపు దిబ్బల్లో సముద్ర పీతలను ఏరుకుంటారు.



 చెట్లవేళ్లను, ఫలాలను సేకరిస్తారు. ఇవే వీరి ప్రధాన ఆహారం. బాణం కంటే వేగమైన కదలికలతో హానిని గుర్తించి, మెరుపువేగంతో మాయమవుతారు. ‘జరావా’ మహిళ ఎరుపు దారపు పోగుల చిన్న అల్లికను మాత్రమే నడుముకు చుట్టుకుంటుంది. తలపై వెంట్రుకలను పెరగనివ్వదు. ఆకాశాన్నంటినట్టుగా ఉండే వృక్షాల చిటారు కొమ్మల్లో దాగున్న తేనె తుట్టెను ఒడుపుగా తీసి, వీపునకు కట్టుకున్న కొయ్యడొప్పలో వేసుకుంటుంది. తేనెను సేకరించిన ప్రతీసారి మహిళలంతా తప్పక సముద్రతీరాలలో స్నానం చేస్తారు. 150 ఔషధ మొక్కలు గురించి, 350 రకాల జంతువులు, వాటి కదలికల గురించి జరావాలకు అత్యంత క్షుణ్ణంగా తెలుసు.



 పుట్టినప్పుడే పెళ్లి నిర్ణయం

 తీరప్రాంతంలో చేపలను పట్టడానికి చిన్న చిన్న తెప్పల్లాంటి పడవలను ఉపయోగించే వీరి వద్ద ఎల్లప్పుడూ విల్లంబులు, బాణాలు వెంటే ఉంటాయి. మొదట్లో రాతి గుహల్లోనే జీవించే వీరు ఆ తర్వాతి కాలంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని సమూహాలుగా జీవిస్తున్నారు. వీరిది చిన్న కుటుంబం. ఒక్కో ఇంటికి భార్య, భర్త, ఆరేడు మంది పిల్లలు ఉంటారు.



 తమ తెగలో అబ్బాయి లేదా అమ్మాయి పుట్టినప్పుడే పెద్దయిన తర్వాత ఫలానా వారితో కలిసి ఉండాలనే నియమం పెడతారు. అబ్బాయి లేదా అమ్మాయి 16,17 ఏళ్లు వచ్చాకే కుటుంబజీవనం సాగించాలి. జ్ఞానం, వయసు, అనుభవాన్ని బట్టి వేట, ఇతర పనులను విభజించి, అప్పజెబుతారు. సైగలు, అరుపులు, ఇతర శబ్దాల ద్వారా వీరు ఎక్కువగా తమ భావాలను ఎదుటివారికి తెలియజేస్తుంటారు. వీరి భాషపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వీరి మాటల్లో కొన్ని హిందీపదాలు దొర్లుతున్నాయి. ఈత, పరుగు, విసరడం.. వంటి వాటిల్లో వీరు బహునేర్పరులు. ఆనందం పంచుకునేవేళ అందరూ చేరి నృత్యం చేస్తారు.



 తెలియని అమాయకత్వం

 ‘విదేశీయులు’గా ఈ తెగను పరిగణించడాన్ని బట్టి చూస్తే ఆఫ్రికా, ఇతర ఐలాండ్ ప్రాంతాల నుంచి వేల ఏళ్లక్రితం వలస వచ్చి ఉంటారనేది ఒక పరిశోధన. మొదటిసారి 1990లో జరావాలు పొరుగు గ్రామాల మధ్య చేపల వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు నెరిపినట్టు, 1998లో విల్లంబులు లేకుండా దగ్గరలోని పట్టణాన్ని సందర్శించినట్టు నివేదికలు చెబుతున్నాయి.



 10కి, వెయ్యి రూపాయల నోటుకు తేడా తెలియని వీరు అండమాన్‌లో సునామీ వచ్చినప్పుడు ముందే కనిపెట్టి తప్పించుకున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. సునామీలో కొన్నివేల మంది అండమాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ‘జరావా’ తెగలో ఒక్కరైనా మరణించినట్టు నమోదు కాలేదు. దీనిని బట్టి జరావాలకు ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టి, జాగ్రత్తపడే నేర్పు ఉందని అర్థమైంది.



 మనుగడ ప్రశ్నార్థకం

 పర్యాటక ప్రదేశం కావడంతో అన్నిచోట్ల నుంచి టూరిస్టులు అండమాన్‌ని ఎక్కువగా సందర్శిస్తుంటారు. పర్యాటకుల ప్రవర్తన వల్ల అంతుచిక్కని వ్యాధు లు ఈ తెగను చుట్టుముట్టడంతో వీరి సంఖ్య వేలల్లో నుంచి వందలకు పడిపోయింది. ‘జరావా’ మహిళ అక్కడే స్థిరపడిన వ్యక్తుల చేత, బస్ డ్రైవర్ల చేత లైంగిక దాడులకు లోనయ్యేది. ఈ సమస్యలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ‘జరావాల’ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

 

 జరావా ఇక్కడ...

 రాతియుగపు ప్రతీకలుగా కనిపించే ఈ మట్టిమనుషులుండే చోటుకు వెళ్లాలంటే.... అండమాన్ రాజధాని పోర్ట్ బ్లేయర్‌కు చేరుకోవాలి. ఇందుకు చెన్నై, కలకత్తా నుంచి విమానంలో, విశాఖ నుంచి నౌకలో ప్రయాణం చేయాలి. పోర్ట్ బ్లేయర్ నుంచి 52 కిలోమీటర్లు రోడ్డుమార్గాన ప్రయాణిస్తే బారాటంగ్‌కు చేరుకుంటారు. ఇక్కడ నుంచి 48 కి.మీ దూరంలో దట్టమైన అటవీప్రాంతం ఉంటుంది. ట్రంక్‌రోడ్‌కి 100-200 మీటర్ల దూరంలోనే ‘జరావా’ తెగ ఉంటుంది.

 

 ఫొటో తీస్తే కేసు...

 ట్రంక్‌రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఇరువైపులా పచ్చదనాన్ని తిలకిస్తూ దారిలో ‘జరావా’ లను చూస్తూ వెళ్లవచ్చు. అయితే ‘జరావా’ల ఆహార్యాన్ని చూసి నవ్వకూడదు. ఎగతాళి చేయకూడదు. ఫొటోలు తీయకూడదు. పాటలు పాడకూడదు. ఆహారం విసరకూడదు... వీటిలో ఏ పొరపాటు చేసినా పోలీసులు కేసు ఫైల్ చేస్తారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top