పెళ్లి చేసుకోని అమ్మాయి

Inter caste marriages Effects on Parents And Society - Sakshi

అమ్మాయికి 29 ఏళ్లు వచ్చాయి.ఉద్యోగం చేస్తోంది.చాలా సంబంధాలు వస్తున్నాయి.కాని చేసుకోను అంటోంది?ఎందుకు అని అడిగితేమూడు కారణాలు చెబుతోంది.ఏమిటి ఆ కారణాలు?అసలు కారణం ఎక్కడ దాగుంది?

ప్యాంట్‌ వేసుకుంటే ప్రవల్లిక చక్కగా కనిపిస్తుందని ఆమె ఆఫీస్‌లో ఫిమేల్‌ కలీగ్స్‌ అంటారు. ప్రవల్లిక కొంచెం పొడగరి. జుట్టు కూడా పొడవుగా ఉంటుంది. నడుస్తూ ఉంటే చూడబుద్ధేసేలా ఉంటుంది. ఆ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మూడు షిఫ్ట్‌లలో డ్యూటీ ఉంటుంది. ఏ షిఫ్ట్‌ డ్యూటీలో అయినా ప్రవల్లిక అలసట కనపడనివ్వక తాజాగా ఉంటుంది. అలాంటి ప్రవల్లికను పెళ్లి చేసుకోవాలని ఎవరికి ఉండదు? కాని ఆ అమ్మాయి మాత్రం పెళ్లికి దూరం.పెళ్లా? నాకా? అని నవ్వేస్తుంది.

ప్రవల్లిక వాళ్ల ఇల్లు గచ్చిబౌలిలో ఉంటుంది. ప్రవల్లిక తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి పి.జి. చేస్తోంది. ఒక అమ్మాయి బి.టెక్‌ చేస్తోంది. ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లో కళకళలాడుతూ ఉంటారు. తండ్రి లెక్చరర్‌. తల్లి గృహిణి. ముగ్గురి పెళ్లిళ్ల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్‌ చేసి ఉన్నారు. కాని ప్రవల్లిక వైఖరి వాళ్లకు అర్థం కాకుండా ఉంది.

‘పెళ్లి చేసుకోవే’ అని తల్లి అడిగితే–‘అదేంటమ్మా.. అలా అంటావ్‌. ఇంటికి పెద్ద కూతురిని. నిన్నూ నాన్నను చూసుకోవాల్సిన దాన్ని. నాకు పెళ్లి వద్దు... ఏమీ వద్దు’ అని అంటుంది.మరోసారి నాన్న అడుగుతాడు– ‘ఏమ్మా.. పెళ్లి చేసుకోవా? మా కొలిగ్‌ వాళ్ల అబ్బాయి ఉన్నాడు’ అనంటే ‘ఏం పెళ్లిలే నాన్నా... ఎన్ని చూడటం లేదు. ఏవీ సజావుగా సాగడం లేదు. అన్నీ ఏవో ఒక కంప్లయింట్లలో నడుస్తున్నాయి. ఆ కంప్లయింట్‌లలో నన్నూ పడమంటావా?’ అంటుంది.

ఇంకోసారి ఇద్దరు చెల్లెళ్లు అడుగుతారు ‘పెళ్లి చేసుకో అక్కా’ అని.అప్పుడేమో ‘మగాళ్లు సరిగ్గా ఉంటే కదా చేసుకోవడానికి. వాళ్లు శరీరానికి ఇంపార్టెన్స్‌ ఇస్తారు తప్ప మనసుకు కాదు. స్త్రీ మనసుకు విలువ ఇచ్చే రోజులు వచ్చినప్పుడు చేసుకుంటాను’ అంటుంది.తల్లిదండ్రులకు ఇదంతా వొత్తిడిగా ఉంది. ఇంట్లో పెద్దమ్మాయికి పెళ్లయితేనే తర్వాతి ఇద్దరూ కదులుతారు. కాని ఈ అమ్మాయి ఇలా అంటోంది.

ఇప్పుడెలా?
రోజులు గడిచే కొద్దీ ప్రవల్లికలో హుషారు పోతోంది. ఆ మెరుపు పోతోంది. నవ్వు పోతోంది. మూడీగా మారిపోతోంది. ఏమిటో.. ఏమయ్యిందో... ఇంట్లో వాళ్లకు అర్థం కావడం లేదు. పెళ్లి గురించి వొత్తిడి తెస్తున్నందుకు ఇలా చేస్తున్నదా? అని వారికి సందేహం వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరూ సంప్రదించుకుని ఆమెతో ‘సరేలేమ్మా... నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మానెయ్‌’ అన్నారు.‘అంటే నేను పెళ్లే లేకుండా బతకమంటారా?’ అని భోరున ఏడ్వడం మొదలుపెట్టింది.దాంతో ఇంకా తికమకపడిపోయారు తల్లిదండ్రులు.ప్రవల్లిక ఏదో సమస్యతో బాధపడుతోంది. ఏంటా సమస్య అని సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లారు.

ముందు ప్రవల్లిక సైకియాట్రిస్ట్‌ దగ్గర ఏమీ ఓపెన్‌ కాలేదు. ఆ తర్వాత మెల్లగా తన గురించి చెప్పడం మొదలెట్టింది.
‘సార్‌. మాకు అన్నం నీళ్లు లేకపోయినా పర్వాలేదు.. కులం ఉండాలి. మా నాన్న, అమ్మ ఎప్పుడూ కులం గురించే మాట్లాడుతుంటారు. చిన్నప్పటి నుంచి కులం గొప్పతనం చెబుతుంటారు. ఆ కులంలో పుట్టినప్పుడు ఆ కులాన్ని గౌరవించకుండా ఎలా ఉంటాం. అంతమాత్రాన ఇతర కులాలతో మనకు స్నేహం అక్కర్లేదా? అదొక్కటే కాదు.. ప్రేమలు, వేరెవరో ప్రేమించి చేసుకోవడం ఇవి చాలా తప్పు అని, ప్రమాదం అని పదే పదే చెబుతూ పెంచారు. మా బంధువుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చాలా చూశాను. అందరూ సఫర్‌ అవుతున్నారు. అలాగని ప్రేమ పెళ్లిళ్లు గొప్పవని కాదు. కాని కనీసం ఎంతో కొంత మన ఎంపిక ఉంటే బాగుంటుంది కదా. మా ఆఫీస్‌లో ఒకతను చాలా మంచివాడు. కష్టపడి పైకి వచ్చాడు. నేనంటే ఇష్టం ప్రదర్శిస్తుంటాడు. కాని ఆ సంగతి తెలియనట్టే నేనుంటాను. ఎందుకంటే అతడిది వేరే కులం. వేరే కులం కుర్రాడితో పెళ్లి మా ఇంట్లో సాధ్యం కాదు. కాని అతడు ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు. ఆ మాట నాతో చెప్పనంత వరకూ నేను బాగానే ఉన్నాను. కాని మొన్న చెప్పి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. అప్పటి నుంచి నాకు డిప్రెషన్‌ మొదలైంది. నేను నో చెప్తే అతడు వేరొకరిని పెళ్లి చేసుకుంటాడు. ఎస్‌ చెప్తే ఇంట్లో ఇబ్బందులొస్తాయి. అందుకే నాకు డిప్రెషన్‌ వచ్చేసింది’ అంది ప్రవల్లిక.

సైకియాట్రిస్ట్‌కు సమస్య అర్థమైంది.‘నీకు అతన్ని పెళ్లి చేసుకోవాలని ఉందా?’ అని అడిగాడు.‘ఉంది’ అందా అమ్మాయి.‘చేసుకుంటావా?’‘కాని మా అమ్మా నాన్నలను వొదులుకోలేను’‘నేను వాళ్లతో మాట్లాడతాను’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.

‘మీ అమ్మాయి అంటే మీకు ఎక్కువ ఇష్టమా... మీ కులం అంటే మీకు ఎక్కువ ఇష్టమా?’ అడిగాడు సైకియాట్రిస్ట్‌ ప్రవల్లిక తల్లిదండ్రులను.వాళ్లిద్దరూ ముఖం ముఖం చూసుకున్నారు.‘మా అమ్మాయే ఇష్టం’ అన్నారు.

‘కాని మీ అమ్మాయికి మీకు మీ కులమే ఇష్టం అనే భావన ఉంది. చూడండి... ప్రతి కులానికి మన సొసైటీలో ఒక స్థానం ఉంది. సంస్కృతి ఉంది. ఎవరి కులాలను వారు గౌరవించుకుంటారు. కాని మన కులాన్ని, కుటుంబ సంప్రదాయాన్ని గౌరవించే ఎదుటి కులాలు కూడా ఉంటాయి. ఎదుటి కులాల మనుషులు మనతో, మనం ఎదుటి కులాల మనుషులతో పరస్పర అంగీకారంతో సంబంధాలు కలుపుకోకపోతే సమాజం నడుస్తుందా? మీ అమ్మాయి వేరే కులం అబ్బాయిని ప్రేమించింది. కాని మీరేమనుకుంటారోనని లోలోపల కుమిలిపోతోంది. చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రులు ఎవరిని తెస్తే వారిని చేసుకోవచ్చు. కాని కొందరు అంత సులువుగా స్పందించరు. మీ అమ్మాయి అలాంటి అమ్మాయి. ఎంతో నచ్చితే తప్ప పెళ్లి దాకా రాదు. ఆ అబ్బాయి యోగ్యుడు. 29 ఏళ్ల అమ్మాయి అతనితో వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు. కాని మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉండటం వల్లే మీ అంగీకారంతో చేసుకోవాలనుకుంటోంది’ అని ఆగాడు సైకియాట్రిస్ట్‌.

ప్రవల్లిక తల్లిదండ్రులకు తమ తప్పు అర్థమైంది.
‘సార్‌... ఏదో అందరిలాగా ఆలోచించాముగాని అమ్మాయి జీవితమే నాశనమవుతుందంటే కులాన్ని పట్టుకు ఊగులాడతామా? మా అమ్మాయి కోరిన అబ్బాయికే ఇచ్చి చేస్తాము సార్‌’ అన్నారు.
ఆ తర్వాత ప్రవల్లిక పెళ్లయిపోయింది.వారిది పెద్దలు కూడా ఆనందించే ప్రేమ వివాహం అయ్యింది.

– కథనం: సాక్షి ఫ్యామిలీఇన్‌పుట్స్‌
 డాక్టర్‌ కల్యాణచక్రవర్తి
సైకియాట్రిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top