చిన్న దుకాణానికీ... బీమా భరోసా... | hopes on small business | Sakshi
Sakshi News home page

చిన్న దుకాణానికీ... బీమా భరోసా...

Aug 29 2016 11:16 PM | Updated on Sep 4 2017 11:26 AM

చిన్న దుకాణానికీ...   బీమా భరోసా...

చిన్న దుకాణానికీ... బీమా భరోసా...

భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే గానీ కుటుంబ ఆర్థిక లక్ష్యాలను నేరవేర్చుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు.

ఉమెన్ ఫైనాన్స్ / షాప్ కీపర్స్ పాలసీ


భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే గానీ కుటుంబ ఆర్థిక లక్ష్యాలను నేరవేర్చుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇందుకు కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటే, కొందరు స్వయం ఉపాధిని ఎంచుకుంటున్నారు. స్వయం ఉపాధి కింద చాలా వరకు మహిళలు సొంతంగా చిన్నచిన్న దుకాణాలను (ఉదా: కిరాణా, దుస్తులు, గాజులు తదితర విక్రయాలు) సమర్థంగా నిర్వహిస్తున్నారు. అయితే ఎంత సమర్థంగా నిర్వహించినా కొన్నిసార్లు అనుకోని పరిణామాలు సంభవించి నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. ఈ నష్టాన్ని కొంత మేర ‘షాప్ కీపర్స్ పాలసీ’ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ఈ పాలసీని ఎవరు తీసుకోవచ్చు? ఇది ఎలా ఉపయోగపడుతుంది? అనే విషయాలను చూద్దాం.


వివిధ రకాల ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ షాప్ కీపర్స్ పాలసీని కొన్ని చిన్న చిన్న వ్యత్యాసాలలో అందజేస్తున్నాయి. ప్యాకేజ్ పాలసీగా వివిధ రకాల రిస్క్‌లను కవర్ చేసే విధంగా దీనిని అందిస్తున్నారు. ఈ ప్యాకేజీ పాలసీలో తప్పనిసరిగా తీసుకోవలసిన వాటిని తీసుకుని, ఆప్షనల్‌గా ఉన్నటువంటి వాటిని తమ షాపునకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. బిల్డింగ్, అందులోని వస్తువులకు అగ్ని ప్రమాదం జరిగితే వాటికి బీమా రక్షణ ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు బల్డింగ్ విలువను ప్రస్తుత మార్కెట్ విలువ, దాని తరుగుదల తదితరాల ఆధారంగా లెక్కగడతారు.  దొంగతనం జరిగినప్పుడు అందులో ఏ వస్తువులకైతే బీమా రక్షణ తీసుకున్నామో అవి చోరీకి గురయితే ఆ మేరకు నష్ట పరిహారం అందుతుంది.


అలాగే షాపులోని డబ్బుకు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.  పెడల్ సైకిల్, ప్లేట్ గ్లాస్, గ్లో సైన్‌కి డ్యామేజీ జరిగితే వాటిని కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.షాపులో పని చేసేవారు మోసం చేయడం వల్ల నష్టపోతే ఆ నష్టానికి కూడా బీమా రక్షణ పొందవచ్చు. అలాగే షాపులో జరిగే పని వల్ల వేరే వ్యక్తులు గానీ లేదా వారి ఆస్తికి గానీ ఏదైనా నష్టం వాటిల్లితే ఆ నష్టానికి కూడా ఈ పాలసీ ద్వారా రక్షణ కల్పించుకోవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగి, ఆ షాపును మళ్లీ యథాతథంగా ఏర్పాటు చేసుకోడానికి పట్టే వ్యవధిలో నష్టపోయే లాభానికి కూడా బీమా రక్షణ తీసుకోవచ్చు.

 
ఈ షాప్ కీపర్ పాలసీని ప్యాకేజీ పాలసీగా అందజేస్తారని ముందే చెప్పుకున్నాం. కాబట్టి షాపు ఉండే ఏరియా, వస్తువులు, తదితరాలకు అనుగుణంగా ఏయే ఆప్షన్‌లు కావాలో ఎంచుకోవాలి. పాలసీ తీసుకునేటప్పుడు వాటి నిబంధనలు, షరతులు తప్పనిసరిగా చదవాలి. ఏయే రిస్క్‌లకు కవరేజీ లభ్యం కావడం లేదో కూడా చూసుకోవాలి.

 
మన జీవితానికి ఎలాగైతే బీమా రక్షణ కల్పించుకుంటామో అదే విధంగా కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చే దుకాణానికి కూడా బీమా రక్షణ ఏర్పరచుకుంటే.. అనుకోని సంఘటనలు జరిగి నష్టం వాటిల్లినప్పుడు చాలా వరకు బీమా సాదుపాయం ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు.

 

రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement