డీసీ కరెంట్‌కు జై కొట్టండి! | Hats off to DC current | Sakshi
Sakshi News home page

డీసీ కరెంట్‌కు జై కొట్టండి!

Apr 15 2015 4:06 AM | Updated on Sep 3 2017 12:18 AM

వేసవి వచ్చిందంటే చాలు.. కరెంటు కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

వేసవి వచ్చిందంటే చాలు.. కరెంటు కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బ్యాటరీ ఇన్వర్టర్లతో పనిజరుపుకోవచ్చుకానీ... బోలెడు డబ్బు ఖర్చవుతుంది. మరి ప్రత్యామ్నాయం? తాము అందిస్తామంటోంది సిగ్నీ సంస్థ! ఐఐటీ మద్రాస్ సహకారంతో తాము రూపొందించిన గ్రీన్ ఆఫీస్ అపార్ట్‌మెంట్ (జీఓఏ) వ్యవస్థ ద్వారా కరెంటు వాడకాన్ని తగ్గించడంతోపాటు అతితక్కువ ఖర్చుతో బ్యాకప్ పవర్‌ను పొందవచ్చునని, గ్రిడ్ ద్వారా అందే విద్యుత్తును కూడా అతితక్కువగా వాడుకోవడం ద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చు. ఆసక్తికరమైన ఈ సరికొత్త ఆవిష్కరణ వివరాలు...
 
విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేసినా వాటిని ఆల్టర్నేట్ కరెంట్ (ఏసీ), డెరైక్ట్ కరెంట్ (డీసీ)అని రెండు రకాలుగా వాడుకునే అవకాశముంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏసీ కరెంట్ వాడకమే ఎక్కువ. బల్బులు, ఫ్యాన్లు, ఏసీ, వాషింగ్ మెషీన్, టీవీలు ఇలా అన్ని ఎలక్ట్రిక్ పరికరాలను కూడా ఏసీ కరెంట్‌ను దృష్టిలో ఉంచుకునే తయారు చేశారు. దురదృష్టమేమిటంటే... ఈ ఏసీ కరెంట్ అంత సమర్థమైంది కాదు. అదలా ఉంచినా సౌరశక్తి ద్వారా డెరైక్ట్ కరెంట్ ఉత్పత్తై... ప్రత్యేక పరికరాల ద్వారా దాన్ని ఏసీగా మార్చుకుని వాడుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనీసం 20 శాతం విద్యుత్తు వృథా అవుతుంది. ఈ నష్టాన్ని లేకుండా చేస్తే...? నేరుగా డీసీ కరెంట్‌నే వాడుకోగలిగితే? అన్న ఆలోచనకు వాస్తవ రూపం జీఓఏ వ్యవస్థ.

ఏముంటాయి దీంట్లో?
జీఓఏ ఒకరకంగా సౌరశక్తి వ్యవస్థే. కాకపోతే సోలార్ ప్యానెళ్లు మొదలుకొని దీంట్లోని అన్ని పరికరాలు డీసీ విద్యుత్తుతో సమర్థంగా పనిచేసేలా రూపొందించారు. ఐఐటీ మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అధ్యాపకుడు, శాస్త్రవేత్త అశోక్ ఝున్‌ఝున్‌వాలా ఆలోచనల ఆధారంగా సిద్ధమైన ఈ వ్యవస్థలో సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు, కొన్ని ప్రత్యేకమైన పరికరాలు ఉంటాయి. ప్రస్తుతానికి దీన్ని అపార్ట్‌మెంట్లలో ఉపయోగించేందుకు వీలుగా తయారు చేశారు.

వాయిదాల పద్ధతిలో...
డీసీ కరెంట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేందుకు ముందస్తు పెట్టుబడులేవీ అవసరం లేదని, మొత్తం తామే సమకూర్చి అపార్ట్‌మెంట్ల యజమానుల నుంచి వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకుంటామని సిగ్నీ సంస్థ ప్రతినిధి దీపేశ్ గుజరాతి అంటున్నారు. రెండు పడకగదులున్న అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.300, మూడు పడకగదులకైతే రూ.400 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతోపాటు వాడుకునే విద్యుత్తును బట్టి యూనిట్‌కు రూ.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఒక్కో అపార్ట్‌మెంట్‌కు ఏర్పాటు చేసే ప్రత్యేక మీటర్ ద్వారా వాడకాన్ని లెక్కించవచ్చునని చెప్పారు. పదేళ్ల వాయిదాల తరువాత మొత్తం వ్యవస్థ అపార్ట్‌మెంట్ వాసుల సొంతమవుతుందని, ఈ మధ్యలో బ్యాటరీలను మార్చడం, మెయింటెనెన్స్ మొత్తం కంపెనీనే చేపడుతుందని వివరించారు. ఒక్కో వ్యవస్థ కోసం 800 నుంచి వెయ్యి చదరపు అడుగుల పైకప్పు స్థలం అవసరమవుతుందని తెలిపారు. సంప్రదాయ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే దీనికి రెండింతల స్థలం అవసరమవుతుంది.

50 శాతం విద్యుత్తు ఆదా...
ఏసీ విద్యుత్ స్థానంలో డీసీని వాడటం ద్వారా కనీసం 50 శాతం విద్యుత్తు ఆదా అవుతుంది. ఉదాహరణకు సాధారణ ఫ్యాన్ పూర్తి వేగంతో తిరిగినప్పుడు దాదాపు 72 వాట్ల విద్యుత్తు వాడుతుందనుకుంటే... బ్రష్‌లెస్ డీసీ ఫ్యాన్ కేవలం 30 వాట్లు మాత్రమే వాడుతుంది. తక్కువ స్పీడ్‌తో తిరిగేటప్పుడు ఇది ఆరువాట్లు మాత్రమే ఉంటుంది. టెలివిజన్లు, మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ ఇంతే. సిగ్నీ అందించే ఒక్కో వ్యవస్థ ద్వారా ప్రతి అపార్ట్‌మెంట్ 5 బల్బులు, మూడు ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లు, ఒక టెలివిజన్‌ను పనిచేయించుకోవచ్చునని, వాషింగ్‌మెషీన్, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వాడకం మాత్రం ప్రస్తుతానికి సాధ్యం కాదని చెప్పారు.పైగా ఈ వ్యవస్థలో 230 వోల్టుల స్థానే కేవలం 48 వోల్టులు మాత్రమే వాడతారు కాబట్టి షాక్ కొట్టే అవకాశమే ఉండదు.

అడ్రస్:cygni energy pvt ltd
landsum house,plot no : 28-3, road no : 78,jubliee hills,hyderabad,telangana.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement