తంగేడు పూవైతది!

Gorati Venkanna special in telugu conference - Sakshi

‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో...’  ప్రపంచంలోనే ఏకైక సామూహిక పూలపండగకు  తెలంగాణ వేదిక. పూలంటే గులాబీలు, తామరలు కాదు, గునుగు, గడ్డి పూలు, తంగేడు.. ఆ బతుకమ్మకు సింగారం, మహా అలంకారం, పవిత్ర ఆకారం. ఇక్కడ మీరెప్పుడైనా ఓ విషయం గమనించారా.. ‘గడ్డిపోచ’ చులకనకు భాషారూపం. పూలను పూజించే ఈ అద్భుత అనాది ప్రక్రియ ఆ అనామక పూలకు పవిత్ర స్థానమిచ్చింది. లేకుంటే ఆ గడ్డిపూలను కానేదెవరు, ఈపాటికి అంతరించేల చేసినా అడిగే నాథుడెవడు? అనామక పూలనే అంతగొప్పగా కాపాడుకుంటున్న మనం.. విశ్వ భాషల్లో మేటిగా నిలిచే మన అమ్మ భాషను ఎంత పదిలంగా చూసుకోవాలి. అందుకే నేను చెప్పేదేందంటే గొప్పదైన మన మూల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటేనే భాష ఉంటది. భాష–మనదైన సంస్కృతిలో భాగం. దానిపై నేటి తరంలో మక్కువ కల్పించాలి. అప్పుడు తంగేడు పూలంతా గొప్పగా తెలుగు వర్ధిల్లుతుంది’’

పూసిన పున్నమి వెన్నల మేన తెలంగాణ వీణ.. వాసిగ చరిత వెలుగొందిన గత వైభవాల కోన... అంటూ తెలంగాణ ఉనికిని కళ్లముందుంచిన ప్రజాకవి గోరటి వెంకన్న మాట ఇది! శ్రమజీవుల చెమట నుంచి పుట్టి.. పండితుల చేతుల్లో వన్నెలద్దుకున్న ఈ ప్రాచీన భాషా వైభవం ఇకముందు కూడా వెలుగొందాలంటే దాన్ని మన సంస్కృతిలో భాగంగా చేసి, తెలుగు మూల సంప్రదాయాలపై నేటి తరంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. జనం పాటకు ప్రాణం పోస్తున్న ఆయన ఆ పాటకు ప్రాణమిచ్చిన భాషకు ఎలా పట్టం కట్టాలో తనదైనశైలిలో చెబుతున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..

కాటమరాజు కథలో ఆవులేమైనవో ఎవరికైనా ఎరుకనా...
కాటమరాజు కథ చదవండి, అందులో ఆవుల వర్ణన వింటే రోమాలు నిక్కపొడుచుకుంటై. దాదాపు ఐదొందల రకాల పేర్లను చెప్తరు. వాటిని మేపేందుకు అవసరమైన గడ్డి గురించి చెప్పే క్రమంలో దాదాపు 200 రకాల గడ్డి జాతుల పేర్లు వినిపిస్తయి. మరి ఇప్పుడు అన్ని రకాల ఆవులు, గడ్డి జాతులేమైనయి. ఎవరైనా ఆలోచించిన్రా, మనదైన మేలురకం ఆవులు పోయి జెర్సీ ఆవులేడికెళ్లి వచ్చినై? విదేశీ గడ్డి వంగడాలెందుకు దూసుకొచ్చినై? ఈస్టిండియా కంపెనీ కథ వింటే ఇది ఉట్టిగనే అర్థమైతది. తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు మన మీద దాడి చేసి మన సంపద, సంప్రదాయాలను నాశనం చేసిన తీరే దీనికి నిదర్శనం. మన భాషను నాశనం చేస్తే మనం వారికి గులాములైతమన్న కుట్ర అమలైంది. ఇది మన భావితరానికి తెలవాల్సి ఉంది.

ఇంగ్లిష్‌కు గ్లామర్‌ వద్దు..
ఇంగ్లిష్‌లో చదివితెనే మంచి ఉద్యోగమొస్తదని, దాన్ని నేరిస్తేనే నాగరికులనే గ్లామర్‌ విపరీతంగా వచ్చింది. అది ఓ భాష మాత్రమే.  చైనా విద్యార్థులు మాతృభాషలో చదివి ప్రపంచ అంగట్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులు అమ్ముతలేరా, వియత్నాం వాసులు వారి భాషలో చదివి వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేస్తలేరా, జపనీయులు సొంత భాషలో చదివి అమెరికాను మించి ఎదుగతలేరా? మనమెందుకు మన భాష ఒదిలి ఆంగ్లం వెంట ఉరకాలె? ఈ మాటలు పిల్లల మెదడులోకి ఎక్కాలె. భాషలెన్నైనా నేర్వచ్చు. కానీ మన తెలుగు భాషను మరవొద్దు.

ఇవాంకా వస్తే గంత మురిపమెందుకు?
ఇటీవల అమెరికా అధ్యక్షుడి బిడ్డ ఇవాంకా మన పట్నానికి వచ్చింది. ఆమెను గౌరవించటం, మంచి ఆతిథ్యమియ్యటం మన బాధ్యత. ఇందులో ప్రభుత్వానికి ప్రత్యేక బాధ్యత ఉంటది. మంచి చెడ్డలు ప్రభుత్వం చూసుకుంటది. కానీ వ్యాపారాల్లో మునిగితేలే ఇవాంకా వస్తే మనజనం ఎందుకు అంత మురిసి పోయిన్రు. గంత హడావుడి ఎందుకు పడ్డరు. ఈ విదేశీ వ్యామోహమే మన భాషను కూలుస్తోంది. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనం మన సంప్రదా యాలను నిర్లక్ష్యం చేస్తే భాషను పక్కనపెట్టినట్టే. చెంచులు వేల రకాల మూలికలను సేకరిస్తరు, వాటి పేర్లను నోటికి యాదికించు కుంటరు. ఆ మూలికల్లో భయంకర జబ్బులను నయం చేసే గుణమూ ఉంటది. మరి ఆ మూలికలే మూలంగా విదేశీ కంపెనీలు మందులు తయారు చేసి మనకే అమ్మవట్టిరి. ఇంకేముంది మూలికల చెంచులు జాడే లేకుండా పోబట్టే. ఇది మూలికలకే కాదు.. మూలమైన మన భాషకూ పట్టుకుంది. ఇదంతా నేటి తరం గమనించాలె.

అందుకే మన చరిత్ర చెప్పాలె..
భాషను బతికించాలంటే.. తెలుగులో చదివినోళ్లకు ఉద్యోగాలిస్తమన్న తాయిలాలు కాదు.. ఆ భాష ప్రాధాన్యం వారికి తెలియచెప్పాలె. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికాకంటే ఐదు వేలకుపైబడ్డ చరిత్ర ఉన్న మన ముచ్చట్లు చెప్పాలె. ఆ చరిత్రకున్న గొప్పతనం విప్పిజెప్పాలె. ఆ గొప్పదనం ప్రపంచానికి ఏమిచ్చిందో వివరించాలె. అప్పుడు ఆమెరికా, ఆంగ్లం గొప్పయి కాదన్న సంగతి వారికి తెల్సి వాటెనక ఉరుకుడు ఆపుతరు. ఇక్కడ మన సంస్కృతీ సంప్రదాయాలంటే మూఢత్వానికి దూరంగా ఉన్న అసలు సంప్రదాయమన్నది నా ఉద్దేశం

భాష పరిరరక్షణకు ఉద్యమం రావాలె
గ్రంథాలయోద్యమం తరహాలో మన భాష పరిరక్షణ ఉద్యమం రావాలె. మిల్లెట్స్‌ పేరుతో జొన్నలు తెచ్చుకుని తినేటోళ్లు మన భాష పదం జొన్నలను గుర్తువట్టరు. ఖరీదైన వంటకంగా పులస చేప రుచిని చూస్తరు దాని తెలుగుపేరు తెల్వదు. ఈ తీరు మారాలె. ఈ విషయంలో తల్లిదండ్రుల్లో తొలుత చైతన్యం రావాలె. మూకుమ్మడిగా కదిలితే ఆ ఉద్యమం మంచి ఫలితమిస్తది. అవగాహనతో భాషను బతికించుకుంటం. ఈ కోవలో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు మంచి మేలే చేస్తయనిపిస్తుంది. మన భాషను రక్షించుకునే ఆలోచన రగిలిస్తది. ఇలాంటి సభలు మరిన్ని జరగాలె. ఊళ్లలో కూడా కొనసాగాలె. విదేశీ అనుకరణ ప్రమాదమనే సంకేతం పోవాలె.

కేసీఆర్‌కు రుణపడి ఉంటా
ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం వేళ తన ప్రసంగ సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాపాట ‘గల్లీ సిన్నది... గరీబోళ్ల కథ పెద్దది’ అనంగనె లక్షల చప్పట్లు మోగె. గది సంప్రదాయ పాటకున్న శక్తి. పెద్దపెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థల ఉద్యోగుల ముంగట నేను పాటపాడితే వాళ్లు లేసి గంతులేసిన్రు. మన పాట, మన మాట, మన భాష మజా తెలిస్తే ఇట్లనే ఉంటది. ఆ ప్రయత్నం చేస్తె మంచిది. కేసీఆర్‌ లాంటి వాళ్లు మన పాటలు, పద్యాలు పాడితే సాధారణ ప్రజలెందుకు మొదలుపెట్టరు. అందుకే కేసీఆర్‌కు రుణపడి ఉంటా.. ఆయన ఆలపించిన పద్యాలు కొన్ని లక్షల మందిలో ఇప్పటికే ఆలోచన రేకెత్తి ఉంటాయి. రేపట్నుంచి పద్యాలకు ఆదరణ కచ్చితంగా పెరుగుతుంది.
 

– గౌరీభట్ల నరసింహమూర్తి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top