కవే గాయకుడవడం అదృష్టం

కవే గాయకుడవడం అదృష్టం


వింజమూరి అనసూయ, సుప్రసిద్ధ జానపద సంగీత గాయని

 

ఎనభై నాలుగేళ్ల స్నేహం రజనీ అన్నయ్యతో! నాకంటే ఒక ఏడాది పెద్దవాడనుకుంటాను. బాలాంత్రపు వారి కుటుంబం అంతా నాకు ఆప్తులే. వెంకట్రావు బాబయ్యగారు, పార్వతీశం మామయ్యగారు (వేంకట పార్వతీశ కవులు) నాకు సన్నిహితులు. బాలాంత్రపు నళినీ అన్నయ్య మా అందరికీ పెద్దన్నయ్య. నాగరాజు బావ, చెల్లాయి, సుభద్ర, శశాంక అందరూ నాకు కావలసిన వాళ్లే.

 పిఠాపురం నాకెందుకిష్టం అంటే, ఊరంతా నా వాళ్లే. దివాను గారి బంగళాల కెదురుగా ఉండే సందులో మొదటింట్లో (రంగనాయకులు గారిల్లు) మామయ్య కృష్ణశాస్త్రి ఉండేవాడు. సందు తిరగగానే మెయిన్ రోడ్డు మీద ఎడం పక్క మొదటిల్లు వెంకట్రావు బాబయ్యగారిది. దానికెదురుగా అవతల పక్కనున్న ఇల్లు పార్వతీశం మామయ్య గారిది. ఎడం పక్క వీరిళ్లయితే, కుడి పక్కన రంగనాయకులు లైబ్రరీ. నా చిన్నతనంలో వేంకట పార్వతీశ కవుల బెంగాలీ అనువాద నవలలు అన్నీ అక్కడే చదివాను.

 

నా చిన్నతనం సగం కాకినాడలోనూ, సగం పిఠాపురంలోనూ గడిచింది. మామయ్యకు చాలాకాలం పిల్లలు లేరు. నేను మామయ్య గారాల చిన్నతల్లిని (నన్నలాగే పిలిచేవాడు). శనివారాలు, ఆది వారాలు వచ్చాయంటే కాకినాడ నుంచి నన్ను పిఠాపురం తీసుకొచ్చేవాడు. తర్వాత రజనీ అన్నయ్యా వాళ్లు కూడా కాకినాడకు మకాం మర్చారు. అప్పుడు తరచూ కలుసుకునేవాళ్లం. అప్పటికే నేను పెట్టిన ట్యూన్స్‌లో లలిత సంగీత కచేరీలు చేస్తున్నాను. రజనీ అన్నయ్య తను రాసిన ట్యూన్స్ పెట్టిన ‘చండీదాస్’ పాటలు వినిపించడానికి వచ్చేవారు.అప్పటి మా నాన్నగారి పద్ధతి ప్రకారం, రాత్రి 9 అయితే పిల్లలు చదువు ఆపి, దీపాలార్పి పడుకోవలసిందే. అప్పటికి మామయ్య కుటుంబం కూడా పిఠాపురం నుంచి మా ఇంటికి వచ్చేశారు. హాల్లో ముసలాళ్లూ, పిల్లలం పడుకునేవాళ్లం. రజనీ అన్నయ్య ఆ టైమ్‌కి వచ్చేవాడు తీరుబడిగా. ‘‘ప్రభ గారూ!’’ అని అన్నయ్యను పిలిచేవాడు. తలుపు తీసినా, లైట్ వేసినా పెద్దవాళ్లు దెబ్బలాడతారు. అందుచేత అన్నయ్యా, నేనూ కిటికీ దగ్గరే కూర్చునే వాళ్లం. కిటికీ అవతల ప్రక్క నిలబడి, చిన్న గొంతుతో తన పాటలు పాడి వినిపించేవాడు. ఇందులో ‘రామి’ (హీరోయిన్) కేరక్టరు పాటలు అనసూయ పాడాలని నిర్ణయంచుకుని రాసి, ట్యూన్ పెట్టాననే వాడు. నేనా రోజుల్లో మామయ్య రాసిన ‘వసంతోత్సవం’ సంగీత నాటికకు ట్యూన్స్ పెడుతున్నాను. మొదటిసారి ‘వసంతోత్సవం’ మద్రాసు రేడియోలో ప్రసారమైనప్పుడు, మామయ్య కుటుంబం, మా కుటుంబం, ప్రయాగ నరసింహశాస్త్రి, రజనీ అన్నయ్య, గాడేపల్లి సుందరమ్మ - అందరం పెళ్లివారు లాగ కాకినాడ నుంచి మద్రాసుకు వెళ్లాం. అప్పుడు రజనీ అన్నయ్య ‘వసంతుడు’, ప్రయాగ నరసింహశాస్త్రి అన్నయ్య ‘మలయ మారుతం’, గాడేపల్లి సుందరమ్మ ‘వేణువు’, నా చెల్లెలు వింజమూరి సీత - ‘కోయిల’, నేను - ‘తుమ్మెద’, బాలమ్మ, సుగంధి - ‘పువ్వులు’గా పాడాం.ఈనాటి వాగ్గేయ కారులలో రజనీ అన్నయ్య ఒకడు. కవే గాయకుడవడం ఎంతో అదృష్టం. తన భావాలకు తగిన సంగీతం కూర్చవచ్చు. త్యాగరాజు అందుచేతే అంత గొప్ప గాయకుడు కూడా అయ్యాడేమో! బాలాంత్రపు రజనీకాంతరావు కవి, గాయకుడు కూడాను. అనేకమైన లలిత సంగీతం ప్రోగ్రాములు, రేడియో ప్రోగ్రాములూ నేను రజనీ అన్నయ్యా కలిసి పాడినవి ఉన్నాయి. మేము పరస్పర అభిమాన సంఘాల వాళ్లం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. మేము సమకాలికులం, సమ భావికులం, సమ గాయకులం.


 
http://img.sakshi.net/images/cms/2015-01/51422468435_Unknown.jpg
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top