బంగారాన్ని వెలికితీసే శిలీంధ్రం

Gold coated fungus discovered by Australian scientists - Sakshi

పరి పరిశోధన

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలో ఓ కొత్తరకం శిలీంధ్రాన్ని గుర్తించారు. ఇదేం చేస్తుందో తెలుసా? పరిసరాల్లోంచి బంగారాన్ని సేకరిస్తుంది. ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలో గుర్తించిన ఈ శిలీంధ్రం ద్వారా ఆ ప్రాంతంలో మరిన్ని బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ స్సింగ్‌ బోహూ తెలిపారు. బంగారం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఫుసేరియం ఆక్సీస్‌పోరమ్‌ అనే శాస్త్రీయ నామమున్న ఈ శిలీంధ్రం సాధారణ పరిస్థితుల్లో చెత్తా చెదారం తొందరగా కుళ్లిపోయేందుకు ఎంతో ఉపకరిస్తుంది.

బంగారం ఉన్నప్పుడు మాత్రం వేగంగా శరీర బరువును పెంచుకుంటుంది. రసాయనికంగా బంగారం చాలా స్తబ్దుగా ఉండే పదార్థమని.. ఇలాంటి పదార్థాన్ని శిలీంధ్రం సేకరించగలగడం ఆశ్చర్యకరమైన విషయమని బోహూ తెలిపారు.ఇది ఎందుకు జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియాలో బంగారం ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త నిల్వలను పసిగట్టేందుకు ఈ శిలీంధ్రం ఉపయోగపడుతుందని అంచనా. ఈ శిలీంధ్రం ప్రపంచ వ్యాప్తంగా మట్టిలో కనిపించేదే అయినప్పటికీ బంగారాన్ని గుర్తించేందుకు దీన్ని వాడటం ఇదే తొలిసారి అవుతుందని వివరించారు.

ఈ కణాలతో గుండెకుమళ్లీ బలం!
గుండెపోటు వచ్చినప్పుడు గుండె కండరాల బలహీనం కావడం మొదలుకొని కొంతమేరకు నాశనం కావడం కద్దు. ఇలా ఒకసారి పాడైన గుండెను మళ్లీ సాధారణ స్థితికి తీసుకు రావడం కష్టసాధ్యం మాత్రమే. ఈ నేపథ్యంలో మౌంట్‌ సినాయికి చెంది ఐకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు గుండెకు మళ్లీ బలం చేకూర్చగలిగే కొత్త కణాలను గుర్తించారు. ఉమ్మునీటిలో ఉండే సీడీఎక్స్‌2 అనే మూలకణాలు గుండె కండరాలను మళ్లీ ఉత్పత్తి చేయగలవని వీరు అంటున్నారు. కొన్ని రకాల జంతువులపై తాము జరిపిన పరిశోధనలు ఇప్పటికే విజయవంతమయ్యాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హీనా చౌదరి తెలిపారు.

సీడీఎక్స్‌ 2 కణాలు ఉమ్మునీటిని మాత్రమే వృద్ధి చేస్తాయని ఇప్పటిదాకా అనుకునే వారమని.. అవయవాలను పునరుత్పత్తి చేయగలదని తమ పరిశోధనల ద్వారా మాత్రమే తెలిసిందని వివరించారు. గుండెతోపాటు ఇతర అవయవాలను మళ్లీ తయారు చేసుకునేందుకు ఈ కణాలు ఉపయోగపడతాయని అంచనా. ఈ కణాలు అత్యంత చైతన్యవంతమైన మూలకణాల మాదిరిగా ఉన్నాయని.. నేరుగా గాయపడ్డ కండర ప్రాంతాన్ని చేరుకోగలవని వివరించారు. పరిశోధన వివరాలు ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top