
సీతమ్మ కొలిచిన దేవత పళ్లేలమ్మ
భారతీయ సంస్కృతిలో దేవుళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో, దేవతామూర్తులకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది.
పుణ్య తీర్థం
వానపల్లి పళ్లేలమ్మ తల్లి
భారతీయ సంస్కృతిలో దేవుళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో, దేవతామూర్తులకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. లక్ష్మి, పార్వతి, అలమేలు మంగమ్మ, పద్మావతీదేవి రమ, ఉమ వంటి దేవతలు దేవసహితంగా పూజలు అందుకుంటుంటే, ఆదిశక్తి స్వరూపిణి అయిన దుర్గ, చాముండి, కాళిక మొదలైన దేవతలు స్వయంప్రభతో వెలుగొందుతూ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లులుగా ఖ్యాతినందుకుంటున్నారు. కాళికాదేవి మరో అవతారంగా పేర్కొనదగ్గ దేవతలలో పవిత్రగోదావరి తీరప్రాంతవాసులకు ఆరాధ్యదైవంగా ఉన్న దేవత పళ్లాలమ్మ తల్లి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం, వానపల్లిలో పూజలందుకుంటోంది.
స్థలపురాణం
వనవాస కాలంలో సీతాదేవి గౌతమి, గోదావరి నదిలో స్నానమాచరించి, ఆ ప్రకృతి వనంలో ఒక పీఠాన్ని నెలకొల్పి అక్కడ దేవతాస్వరూపం ఉన్నట్లు భావన చేసుకుని, అక్కడ దొరికే పండ్లు, పూలతో అమ్మవారిని అర్చించేదట. సీతాదేవి భక్తికి మెచ్చిన ఆ ప్రకృతి దేవత పళ్లాలమ్మగా దర్శనమిచ్చి అనుగ్రహించిందట. గౌతమీ నదీతీరంలో గల ఈ వానపల్లిని పూర్వం వానరపల్లి అని పిలిచేవారు. ఈ గ్రామం త్రేతాయుగంలో వాల్మీకి రామాయణ కాలం నాటిదని, వనవాస కాలంలో సీతమ్మ గౌతమీ నదీతీరంలో వానపల్లి ప్రాంతంలో సంచరించినట్లు నానుడి. అయితే, వనాలు, వానరాలతో ఉండటం వల్ల వానరపల్లిగా ఈ గ్రామానికి పేరొచ్చింది.
ఇప్పటికీ ఈ గ్రామానికి పక్కనే కోతుల తోట పేరుతో ఒక గ్రామం ఉంది. సీతాదేవి వనవాస సమయంలో గౌతమీనదిలో స్నానం చేసి, ప్రకృతినే దేవతగా పూజించగా ఆమె పళ్లాలమ్మగా దర్శనమివ్వడమేగాక సీతమ్మవారు కోరిన కోరికలన్నీ నెరవేరేలా ఆశీర్వదించింది. అప్పుడు సీతమ్మవారు ఈ ప్రాంతంలో ఒక పేరులేని చెట్టును నాటిందని, ఆ చెట్టు నేటికీ ఉందని స్థానికులు చెబుతుంటారు. అమ్మవారు నాటిన ఆ చెట్టు చుట్టూ మూడుమార్లు ప్రదక్షిణం చేసి, చెట్టును పూజిస్తే సంతానంలేని వారికి వంశాభివృద్ధి చేసేలా కుమారుడు పుడతాడని భక్తుల విశ్వాసం. ఈ వృక్షానికి మొక్కుకుని, సంతానం కలిగిన వెంటనే ఒక కొబ్బరి మొక్కను, చీరను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ.
రాజుల నుంచి దొరల వరకు....
పిఠాపురం మహారాజావారి దగ్గరనుంచి, ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి ఆనకట్టను కట్టిన సర్ ఆర్థర్ కాటన్ దొర కూడా ఈ అమ్మవారిని ఆరాధించిన వారే. కాటన్ దొరకు అమ్మవారే స్వయంగా కలలో కనిపించి, ఆలయం పక్కన కాలువ తవ్వకం ప్రారంభిస్తే దిగ్విజయంగా కాలువ తవ్వకం పనులు జరుగుతాయని చెప్పిందట. ఆమె చెప్పినట్లుగానే కాటన్ దొర ముందు అనుకున్నట్లుగా గాకుండా కాలువను ఆలయం పక్కగా మరల్చి పనులను పూర్తి చేశాడట. ఆనకట్ట పనులు విజయవంతం కావడంతో కాటన్ దొర అమ్మవారికి పూలు, పళ్లు, చీర, సారె సమర్పించేవాడు. అలా క్రమం తప్పకుండా అమ్మవారికి పళ్లేల కొద్దీ సంభారాలు సమర్పిస్తుండడంతో... ఈ అమ్మవారిని స్థానికులు పళ్లేలమ్మ అని పిలవసాగారు. అదే వాడుకలోకి వచ్చింది.
అక్కచెల్లెళ్లతో ఆటపాటలు!
పళ్లేలమ్మ అర్ధరాత్రులలో తన 101 మంది అక్కచెల్లెళ్లతో ఆటపాటలతో గడుపుతుందని, ఆ సమయంలో ఆమె ఆనందానికి అవరోధం కలిగించడం అంత మంచిది కాదని పెద్దలు చెబుతారు. అందుకే స్థానికులెవరూ చీకటి పడిన తర్వాత ఆలయం ఛాయలకు వెళ్లరు.
ఆలయానికి దగ్గరలోనే పోలేరమ్మ ఆలయం ఉంది. అక్కడే అమ్మవారి సోదరుడు పోతురాజు విగ్రహం కూడా ఉంది. పౌర్ణమి వెళ్లిన సోమవారం ఈ పోతురాజుకు, పోలేరమ్మకు కుంభం సమర్పించి గ్రామంలో ఉన్న ఆలయానికి అమ్మవారిని శ్వేతవస్త్రాలంకరణతో ప్రవేశింపజేస్తారు. ఈ సమయంలో అమ్మవారికి ఎదురుగా ఎవరూ రాకూడదని, అలా వస్తే వారు శిలగా మారుతారని చెబుతారు. అలాగే చైత్రశుద్ధ పౌర్ణమి వెళ్లిన సోమవారం గుడిలోని అమ్మవారిని గ్రామంలోని మరొక గుడికి తీసుకుని వెళ్లి నెలరోజులపాటు నిత్యం రాత్రిసమయంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేస్తారు.
అలా మరుసటి పౌర్ణమి వెళ్లిన మంగళవారం వరకు నెలరోజులపాటు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నెలరోజులూ ప్రతి ఆదివారం ఉదయం తూర్పుదిశగా అమ్మవారి ముందు కుంభం పోస్తారు. అభిషేకాలు, ఆరాధనల అనంతరం తూర్పుదిశగా అమ్మవారు బయలుదేరి ఏ తోటలో అడుగుపెట్టి తాడిచెట్టుకు పసుపు పూస్తారో, ఆ తాడిచెట్టును నరికి చిన్న గుడి వద్దకు తీసుకు వస్తారు. మరుసటి రోజు పడమర కుంభం పోసి పడమర దిశగా బయలుదేరి సిరిబండపై గ్రామప్రజలు తీసుకుని వస్తారు. ఆ రోజు అమ్మవారి జాగరణ జరుగుతుంది. తాటి ఊయలపై ఊపి అదే రోజు సాయంత్రం సిరిబండ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.ఈ నెలరోజులూ ఆలయం వద్ద తీర్థం జరుగుతుంది. ఈ తీర్థానికి దేశం నలుమూలల నుంచి అనేకమంది భక్తులు విశేషంగా విచ్చేస్తారు.
ఎలా వెళ్లాలి?
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి 35 కిలోమీటర్ల దూరంలో కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం నుండి ఈ వానపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు, వివిధ రకాల వాహనాలలో కూడా వెళ్లవచ్చు.