ఒక రోజుతో మారే జీవితం

Gayle Forman New Book - Sakshi

నవల– ఇద్దరు వ్యక్తులు యాదృచ్ఛికంగా కలుసుకుని చేసిన ఆకస్మిక ప్రయాణం గురించీ, ఒకమ్మాయి తనని తాను అర్థం చేసుకోవడం గురించినదీ.

గేయిల్‌ ఫోర్మన్‌ రాసిన ‘జస్ట్‌ వన్‌ డే’ అమెరికన్‌ అమ్మాయి ఏలిసన్‌ హీలీ, హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ తరువాత స్నేహితురాలైన మెలనీతోపాటు యూరప్‌ ట్రిప్‌కు వెళ్ళడంతో మొదలవుతుంది. ఒక రోజు లండన్‌లో తన టూర్‌ గుంపుని వదిలిపెట్టి, షేక్‌స్పియర్‌ ‘ట్వెల్థ్‌ నైట్‌’ నాటకం చూడ్డానికి వెళ్ళినప్పుడు, దేశదిమ్మరైన అందమైన డచ్‌ యువకుడైన విలెమ్‌ డు రైటర్‌ను కలుసుకుంటుంది. మామూలు రూపురేఖలున్న ఏలిసన్‌ను చాలా ఆకర్షణీయంగా ఉంటుందని నమ్మించి, ఆమెని ‘లూలూ’ అని పిలుస్తూ, తనతోపాటు పారిస్‌ రమ్మంటాడతను.

ఏలిసన్‌ చదువులో ముందుండే పిల్ల. క్రమబద్ధమైన జీవితం గడిపే అమ్మాయికి పరాయి యువకుడితో అప్పటికప్పుడే పారిస్‌కు వెళ్ళాలనుకునే మనస్తత్వం లేనప్పటికీ, తిరిగి అమెరికా వెళ్ళి ‘ఏలిసన్‌’గా తన సామాన్యమైన జీవితం గడపడానికి మారుగా మెలనీని వదిలి, ట్రిప్‌ ఆఖరి రోజున విలెమ్‌తో పాటు యూరో రైలెక్కుతుంది.

ఇద్దరూ కలిసి పారిస్‌లో గుర్తుంచుకోతగ్గ రోజు గడుపుతారు. అపరిచితుడైన విలెమ్‌తో తనకి ఏదో విశేషమైన సంబంధం ఉందనుకుంటుంది ఆ అమ్మాయి. అతను ఆమె చిరునామా, ఫోన్‌ నంబర్, ఈ మెయిల్‌ ఐడి– ఏవీ అడగడు, తనవీ చెప్పడు. ఉదయం నిద్ర లేవగానే విలెమ్‌ జాడ కూడా కనబడదామెకి. ‘మరొక అదనపు రోజు అతనితో గడిపినప్పటికీ, నా నిరాశ వాయిదా పడ్డం తప్ప ఇంకేమీ జరగదని నా మనస్సుకి తెలుసు’ అని సర్దిచెప్పుకుని, అతనితో తన సంబంధం తన భ్రమే అని అనునయించుకుని, ఆ దినపు జ్ఞాపకాలని తప్పించుకుని ఇంటికి తిరిగి వెళ్తుంది.

ఏలిసన్‌ కాలేజీలో చేరుతుంది కానీ విలెమ్‌ గురించి ఆలోచించడం మానక, అతనితో పాటు ఉన్నప్పుడు తనెంత తెగించి ప్రవర్తించిందో అన్న సంగతి కూడా మరవలేకపోతుంది. తనకి ఆసక్తి లేకపోవడంతో తన తల్లి ఎంపిక చేసిన సబ్జెక్టు మీద మనస్సు పెట్టి చదవలేకపోతుంది. ‘తన వెనక వదిలిన ఖాళీ జాగాల బట్టి, ఏదో లేకపోయినప్పుడే, అది ఉండేదని మనం గుర్తిస్తాం’ అనుకుంటూ, విలెమ్‌ను వెతకడానికి తిరిగి పారిస్‌ వెళ్తుంది. అతని జీవితానికి భాగం అయినవారిని కలుసుకున్నప్పుడు, ‘కేవలం ఒక్క రోజు’ తనతో గడిపిన వ్యక్తి, నిజ జీవితంలో ఎటువంటివాడో అర్థం చేసుకుంటుంది. చివర్న అతన్ని కలుసుకుంటుంది.

నవల– ఇద్దరు వ్యక్తులు యాదృచ్ఛికంగా కలుసుకుని చేసిన ఆకస్మిక ప్రయాణం గురించీ, ఒకమ్మాయి తనని తాను అర్థం చేసుకోవడం గురించినదీ. ‘విలెమ్‌ ఆమెని ఎందుకు వదిలేసి వెళ్ళాడు!’ అన్న కుతూహలమే పుస్తకాన్ని చదివించేది. తన వాదనని సరిగ్గా వినిపించలేకపోయే నిస్సహాయురాలైన ‘మంచి పిల్ల’, జీవితంలో తనకి కావలిసినదేదో తెలుసుకున్న సమర్థురాలిగా మారడం గురించిన ఈ పుస్తకం, ఏలిసన్‌ సుఖాంతం వైపు చేసిన ప్రయాణం మీద కేంద్రీకరిస్తుంది.

2013లో విడుదలయిన నవలకి, ఆడియో పుస్తకం ఉంది. విలెమ్‌ దృష్టికోణంతో వచ్చినది దీనికి ఉత్తర కథ అయిన ‘జస్ట్‌ వన్‌ యియర్‌.’ ఈ రెండింటినీ కలిపి ఒక సినిమాగా తీశారు. కేవలం 50 పేజీలున్న– ఏలిసన్, విలెమ్‌ల ఆఖరి కథ అయిన ‘జస్ట్‌ వన్‌ నైట్‌’ నవలిక ఈ–బుక్‌గా 2014లో వచ్చింది.
కృష్ణ వేణి  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top