చల్లాడ్స్‌

food special on salads - Sakshi

కట్‌ చేయండి... ఎండను తగ్గించండి... 
కలపండి... ఎండను తొలగించండి...
ఫ్రిజ్‌లో పెట్టండి... ఎండను చల్లబరచండి... ఆరగించండి... ఎండను తరిమికొట్టండి...
ఎండలకు సలాడ్‌తో జవాబు చెప్పండి... క్యాబేజీ, బీన్స్, రైస్, ఎగ్‌ ...
కాదేదీ సలాడ్‌కనర్హం... ఆరోగ్యమూ చల్లదనమూ వీటి సొంతం!

చికెన్‌ సలాడ్‌ విత్‌ చౌ మే నూడుల్స్‌
కావలసినవి: డ్రెసింగ్‌ కోసం: బ్రౌన్‌ సుగర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, సోయా సాస్‌ – 2 టీ స్పూన్లు, కమలాపండు రసం – 2 టీ స్పూన్లు, నువ్వుల నూనె – 4 టీ స్పూన్లు, వెజిటబుల్‌ ఆయిల్‌ – పావు కప్పు, వెనిగర్‌ – 3 టేబుల్‌స్పూన్లు
సలాడ్‌ కోసం: లెట్యూస్‌ ఆకు  – ఒకటి (చిన్నది, సన్నగా తరగాలి. ఈ ఆకు దొరకని చోట క్యాబేజీ తరుగు ఉపయోగించుకోవచ్చు), ఉడికించిన బోన్‌ లెస్‌ చికెన్‌ బ్రెస్ట్‌ – 4 ముక్కలు, ఉల్లికాడల తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, క్యారట్‌ తురుము – అర కప్పు, నూడుల్స్‌ – 2 కప్పులు (ఉడికించకూడదు), పల్లీలు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి), కమలా పండు తొనలు – 10
తయారీ: ∙డ్రెస్సింగ్‌ కోసం తీసుకున్న పదార్థాలను ఒక పాత్రలో వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో, లెట్యూస్‌ లేదా క్యాబేజీ తరుగు, చికెన్, ఉల్లికాడల తరుగు, డ్రై నూడుల్స్, క్యారట్‌ తురుము, పల్లీ ముక్కలు వేసి బాగా కలిపి, డ్రెసింగ్‌ వస్తువులు వేసిన పాత్రలో వేసి కలపాలి ∙కమలా పండు తొనలతో అలంకరించి, వెంటనే అందించాలి.

గ్రీక్‌  రైస్‌ సలాడ్‌
కావలసినవి: అన్నం – 3 కప్పులు, పుట్ట గొడుగులు – కప్పు (గంటసేపు నీళ్లలో నానబెట్టి, నీరు ఒంపేసి చిన్న చిన్న ముక్కలు చేయాలి), టొమాటో – 1 (ముక్కలు చేయాలి), కీర దోస చక్రాలు – అర కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, చీజ్‌ – పావు కప్పు, నిమ్మ రసం – ఒక టేబుల్‌ స్పూను, మిరియాల పొడి – అర టీ స్పూను
తయారీ: ∙ఒక పాత్రలో అన్నం, మిగిలిన పదార్థాలు వేసి బాగా కలిపి మూత పెట్టి, ఫ్రిజ్‌లో సుమారు గంటసేపు ఉంచి తీసేయాలి ∙బౌల్స్‌లో సర్వ్‌ చేసే ముందు, కొద్దిగా కొత్తిమీర వేసి అందించాలి.

క్యాబేజీ సలాడ్‌  విత్‌ ఎ క్రంచ్‌
కావలసినవి: క్యాబేజీ తరుగు – ఒక కప్పు, ఆలివ్‌ ఆయిల్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, నూడుల్స్‌ – ఒక ప్యాకెట్, నువ్వులు – ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 4 (మెత్తగా చేయాలి), బాదం పప్పులు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి)డ్రెసింగ్‌ కోసంసోయా సాస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, వెనిగర్‌ – పావు కప్పు, పంచదార – అర కప్పు, రిఫైన్డ్‌ ఆయిల్‌ – పావు కప్పు, మిరియాల పొడి – పావు టీ స్పూను, అల్లం తురుము – పావు టీ స్పూను

తయారీ: ∙పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడయ్యాక సోయా సాస్, వెనిగర్, పంచదార, రిఫైన్డ్‌ ఆయిల్, మిరియాల పొడి, అల్లం తురుము వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి ∙ చల్లారాక ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచాలి ∙ ఒక చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి వేడయ్యాక నూడుల్స్, నువ్వులు, వెల్లుల్లి ముద్ద వేసి పదార్థాలన్నీ బంగారు రంగులోకి మారేవరకు కలిపి దింపేయాలి ∙ ఒక పెద్ద బౌల్‌లో నూడుల్స్‌ మిశ్రమం, క్యాబేజీ తరుగు వేసి కలపాలి ∙ ఫ్రిజ్‌లో నుంచి డ్రెసింగ్‌ మిశ్రమం బయటకు తీసి, ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి, బాదం పప్పులతో అలంకరించి చల్లగా అందించాలి.

త్రీ బీన్‌  సలాడ్‌
కావలసినవి:  నానబెట్టిన అలసందలు – ఒక కప్పు ; నానబెట్టిన చిక్కుడు గింజలు; – ఒక కప్పు ; నానబెట్టిన సెనగలు – ఒక కప్పు ; ఉల్లి తరుగు – అర కప్పు ; కొత్తిమీర తరుగు – ఒక కప్పు ; పంచదార – పావు కప్పు ; ఆలివ్‌ ఆయిల్‌ – 3 టేబుల్‌ స్పూన్లు ; ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్లు; నల్ల మిరియాలు – పావు టీ స్పూను; వెనిగర్‌ – 2 టీ స్పూన్లు
తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో మూడు రకాల గింజలూ వేసి బాగా కలపాలి ∙ కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి ∙ వేరొక బౌల్‌లో వెనిగర్, పంచదార, ఆలివ్‌ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి గింజలున్న బౌల్‌లో వేసి కలిపి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి, అందించాలి.

సాల్మన్‌  ఎగ్‌ స్పెషల్‌ సలాడ్‌
కావలసినవి: సాల్మన్‌ చేప – 14 ముక్కలు (ఫోర్క్‌తో గాట్లు పెట్టి, నూనెలో వేయించాలి), ఉడికించిన కోడిగుడ్లు – 6 (పెంకు తీసి, కోడి గుడ్లను చిన్నచిన్న ముక్కులుగా చేయాలి), ఉల్లి తరుగు – అర కప్పు, ఆవాలు – ఒకటిన్నర స్పూన్లు (నీళ్లలో నానబెట్టి మెత్తగా పేస్ట్‌ చేయాలి), చీజ్‌ – అర కప్పు, మిరియాల పొడి – అర టీ స్పూను, మిరప పొడి – పావు టీ స్పూను, ఉప్పు – తగినంత
తయారీ: పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్‌లో వేసి బాగా కలిపి, మూత పెట్టి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి చల్లగా అందించాలి.

చపాతీ నూడుల్స్‌
ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు నూడుల్స్‌కి బాగా అలవాటు పడ్డారు. మైదాతో తయారయ్యే నూడుల్స్‌ ఆరోగ్యానికి మంచిది కాదు. వాటికి బదులుగా చపాతీలతో నూడుల్స్‌లా చేసి పెడితే,  మళ్లీ మళ్లీ కావాలంటారు. 

కావలసిన వస్తువులు: చపాతీలు – 3, ఉల్లిపాయ – 1, పచ్చి మిర్చి – 2, క్యారట్‌ – 1, బీన్స్‌ – 8, అజినమోటో– చిటికెడు, పంచదార – ఒక టీ స్పూను, మిరియాలపొడి – ఒక టీ స్పూను, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – 4 టీ స్పూన్లు 
∙ఉల్లిపాయలను సన్నగా తరగాలి ∙క్యారట్, బీన్స్‌లను సన్నగా చీలికల్లాగా కట్‌ చేసుకోవాలి. ∙చపాతీలను కత్తెరతో సన్నగా నూడుల్స్‌లా కట్‌ చేయాలి ∙ప్యాన్‌ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి ∙క్యారట్, బీన్స్, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి ∙పంచదార, అజినమోటో జత చేసి రెండు నిమిషాలు వేయించిన తర్వాత కట్‌ చేసుకున్న చపాతీ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ∙రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దింపేసి, కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి.

మైదాపిండితో దుష్ప్రభావాలు
ఫుడ్‌ ఫ్యాక్ట్స్‌
సాధారణంగా బిస్కెట్లు, బ్రెడ్, కేకులు వంటి బేకరీ ఉత్పత్తులలో మైదాపిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. పిల్లలు ఎక్కువగా తినే పిజ్జా, పేస్ట్రీలు, బర్గర్లు, పరాఠాలు, నాన్, స్వీట్స్‌ వంటి వాటిలో సైతం మైదా వాడకం ఎక్కువే. మైదాపిండిని గోధుమల నుంచే తయారుచేస్తారని తెలుసా! గోధుమ పిండిని సన్నటి జల్లెడలో జల్లించితే వచ్చేదే మైదా పిండి. ఇంత ఎక్కువగా జల్లించడం వల్ల ఇందులో ఉండే పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజాలు పూర్తిగా బయటకుపోతాయి. జల్లెడ పట్టిన పిండిని బెంజైల్‌ పెరాక్సైడ్‌ వంటి రసాయనాలతో బ్లీచింగ్‌ చేశాక, వచ్చిన మెత్తని పిండిని మైదాపిండిగా వాడుతుంటారు. ఇన్ని రకాలుగా ప్రోసెస్‌ చేయడం వల్ల ఈ పిండి మానవ ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతుంది.

చెడు ప్రభావాలు...
మైదా పిండిలో అత్యధికంగా గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఉంటుంది. అందువల్ల ఈ పిండిని ఏ రూపంలో తిన్నా సుగర్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరిగి, పాంక్రియాస్‌పై ఒత్తిడి పడుతుంది. చివరకు ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. శరీరంలోని కొవ్వు శాతం పెరిగి, ఊబకాయులవుతారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువ అవుతాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడతాయి. కోలన్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. మలబద్దకం కలుగుతుంది. ఇన్ని చెడు ప్రభావాలు కలిగించే మైదాను వాడటం అవసరమా అని ఆలోచించుకోవాలి.

మైదాకు బదులుగా...
మైదాకు బదులుగా జొన్న, రాగి, వరి... ధాన్యాల నుంచి తయారయ్యే పిండిని వాడటం మంచిది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. వాల్‌ పోస్టర్లు అతికించడానికి, బట్టలకు గంజి పెట్టడానికి ఉపయోగించే మైదాను రోజువారీ ఆహారంలో నుంచి తొలగించడం ఆరోగ్యానికి చాలా మంచిది.
 

ఇంటి చిట్కాలు 
ఉసిరి పచ్చడి నల్లబడకుండా ఉండాలంటే, పచ్చడిలో తగినంత నిమ్మరసం కలిపితే సరి ∙దోస ఆవకాయ ఘాటుగా అనిపిస్తే, కొద్దిగా నిమ్మరసం పిండితే, ఘాటు కొంతవరకు తగ్గుతుంది ∙టొమాటో పప్పు చప్పగా అనిపిస్తే, టీ స్పూను నిమ్మరసం జత చేస్తే రుచిగా ఉంటుంది. 

మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్‌ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. మీరు చేసిన భిన్నమైన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్‌... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్‌.

mail : familyvantakalu@gmail.com
సేకరణ: వైజయంతి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top