హమ్‌ లోగ్‌ ఇలా మొదలైంది... | Sakshi
Sakshi News home page

హమ్‌ లోగ్‌ ఇలా మొదలైంది...

Published Wed, Jan 30 2019 12:16 AM

The first drama series of Indian television was the Hum Log - Sakshi

కుటుంబం అంటే ఏక ఆలోచన కాదు. ఏక వ్యక్తి కాదు. ఏక రూపం కాదు.కాని అలా ఉండాలని అనుకునేవారు.వైఫల్యాలని దాచిపెట్టాలని అనుకునేవారు.గెలుపు బయటకు చూపించాలనుకునేవారు.ఇంటి గుట్టు ఇంట్లోనే ఉంచాలనుకునేవారు.ఇది ఒత్తిడి. దాచే కొద్దీ లోలోన వచ్చే ఉడుకు.అలాంటి సమయంలో ‘హమ్‌లోగ్‌’ సీరియల్‌ వచ్చింది.కుటుంబం అంటే అనేక ఆలోచనలూ అనేక వ్యక్తిత్వాలు అనేక రూపాలు అని చెప్పింది.

వైఫల్యాలు ఉంటాయి... భంగపాట్లు ఉంటాయి... తిరిగి లేచి నిలబడటమూ ఉంటుంది... ఇదేమీ దాచిపెట్టాల్సిన రహస్యమూ కాదు.. అని ఆ సీరియల్‌ చెప్పింది.అప్పుడూ ఉన్నది ఆ మనమే. ఇప్పుడూ ఉన్నదీ మనమే.మన కోసం ఎప్పుడూ కావాలి ఒక ‘హమ్‌లోగ్‌’.దూరదర్శన్‌లో సీరియల్స్‌కు తెర తీసిన తొలి సీరియల్‌ ఇది.సగం దేశ జనాభా చూసిన సీరియల్‌. సూపర్‌ హిట్‌ సీరియల్‌.

బసేసర్‌ రామ్‌ది ఓ మధ్యతరగతి కుటుంబం. మద్యానికి బానిస. భార్య చిల్లర డబ్బులు ఎక్కడ పెడుతుందో వెతుక్కుంటూ ఆ పూటకు మందు గడిస్తే చాలు అనుకునే రకం. భార్య భగవంతి ఇంటి గుట్టు బయటపెట్టుకోకూడదనే సగటు ఇల్లాలు. వీరికి ఐదుగురు పిల్లలు. పెద్ద కొడుకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కూతురు సినిమా నటి కావాలని తపిస్తూ ఉంటుంది. చిన్న కూతురికి డాక్టర్‌ కావాలనేది కల.

మరో కొడుక్కి క్రికెట్‌ అంటే పిచ్చి.. ఇలా ఈ పాత్రలన్నింటినీ కుటుంబం అనే తోరణానికి గుచ్చి 35 ఏళ్ల క్రితం బుల్లితెర మీద ఆవిష్కరించారు రచయిత మనోహర్‌ శ్యామ్‌జోషి, దర్శకులు కుమార్‌వాస్‌దేవ్‌లు. ఆ అందమైన తోరణం పేరు ‘హమ్‌లోగ్‌.’ బుల్లితెర మీద మొట్ట మొదటి సీరియల్‌గా అశేష జన నీరాజనాలు అందుకుంది హమ్‌లోగ్‌. ఇప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిపోయింది.  

నేటికీ ఇవే సంఘర్షణలు
సీరియల్‌ అయినా సినిమా అయినా ప్రజల మనసుల్లో బలమైన ముద్రవేయాలంటే అవి తమ మధ్య నడిచే కథలై ఉండాలి. తమ మధ్య కదలాడే పాత్రలై ఉండాలి. అలాంటి కథను పరిచయం చేసింది ‘హమ్‌లోగ్‌’ సీరియల్‌. అందుకే ఈ కథ 35 ఏళ్ళ నాటిది అయినా ఇప్పటికీ తాజాగా అనిపిస్తుంది. అప్పటికే 70 ఏళ్ల సినిమాను మించిన పాపులారిటీ 154 ఎపిసోడ్లు ఉన్న ఈ ఒక్క సీరియల్‌ తీసుకొచ్చింది. ఓ మహిళా ఇది నీ కథ.. ‘హమ్‌లోగ్‌’ ప్రధానంగా స్త్రీ సాధికారత గురించే చెబుతుంది. ఈ షోలోని మహిళా పాత్రధారులు ముఖ్యంగా బసేసర్‌రామ్‌ భార్య భగవంతి పాత్రలో జయశ్రీ అరోరా నటించారు. జయశ్రీ తొమ్మిదేళ్ల వయసు నుంచే డ్రామా ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టెలివిజన్‌ నటి అయ్యారు. కథక్, మణిపురి డ్యాన్సర్‌.

ఎన్నో బాలీవుడ్‌ సినిమాలు, సీరియల్స్‌లో సహపాత్రధారిగా నటించారు జయశ్రీ. హమ్‌లోగ్‌లో ఐదుగురు పిల్లల తల్లిగా ‘నీకేం తెలియదు ఊరుకో’ అని కసురుకునే కుటుంబసభ్యుల నడుమ త్యాగం చేయడమే జీవితంగా భావిస్తుంది భగవంతి పాత్ర. ఇప్పటికీ భారతీయ సగటు తల్లుల పరిస్థితి అంతా ఇలాగే ఉంటుంది. భర్తకు, పిల్లలకు జీతం, భత్యం లేని పనిమనిషిగా సేవలు చేస్తూ, కుటుంబం యోగక్షేమాలే తన బాగోగులు అనుకుంటుంది. 2019లో ఇప్పటికీ ఇలాంటి భగవంతిలను మన ఇరుగింట్లోనో, పొరుగింట్లోనో చూస్తూనే ఉంటాం. ఇక కూతుళ్లు బడ్కి, మఝ్లీ, ఛుట్కీ.. వారు పడే సంఘర్షణలు, ఎదుర్కొనే సమస్యలు, గుర్తింపుకోసం తహతహలాడే గుణం ఆద్యంతం కనిపిస్తుంటుంది.

ఐదుగురు పిల్లల్లో పెద్ద కూతురు బడ్కీ.స్వేచ్ఛను కోరుకుంటుంది కానీ బయటకు వ్యక్తపరచలేదు. లోలోపల తీవ్ర మానసిక వత్తిళ్లకు లోనవుతూ ఉంటుంది. గుండెమాటున కన్నీళ్లు దాచుకుంటూ కాలం గడుపుతుంటుంది. మొత్తానికి సామాజిక సేవే వృత్తిగా మార్చుకుంటుంది. బడ్కీగా సీమా భార్గవ్‌ నటించారు. ఈమె సినిమా, టీవీ, నాటకరంగ నటి. 2017 నాటికి 63 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌లు సాధించిందిన సీమ 2017లో బరేలీ కి బర్ఫీ, శుభ్‌ మంగల్‌ సావధాన్‌.. ఈ రెండు సినిమాల్లో ఉత్తమ సహనటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌కి ఒకేసారి నామినేట్‌ అవడం విశేషం.  ఏక్తాకపూర్‌ సీరియల్‌ ‘కసమ్స్‌ సె’ లో మౌసిగా సీమా టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలు.

ఆ తర్వాత 2014లో హిప్‌ హిప్‌ హుర్రే సీరీస్‌ ద్వారా సింగిల్‌ మదర్‌గా సీమ నటన సుప్రసిద్ధం. ఇక హమ్‌లోగ్‌లోని రెండవ కూతురు మఝ్లీ. స్వేచ్ఛను పొందడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది మఝ్లీ. తన కలలకు అడ్డుపడిన ప్రతి ఒక్కరితోనూ వాదిస్తూనే ఉంటుంది. మహిళా స్వయంశక్తిగా ఎదగాలంటే ఎన్ని ఒడిదొడుకులను దాటాలో మఝ్లీ పాత్ర చూపుతుంది.

ఇలాంటి అమ్మాయిలు ఇప్పటికీ మనకి చాలా ఇళ్లలో కనిపిస్తూ ఉంటారు. మఝ్లీగా దీప్తీ సేథ్‌ నటించారు. ఈ సీరియల్‌ తర్వాత దీప్తి ఏడు టీవీ సీరియళ్లు, నాలుగు సినిమాల్లో నటించారు.  ఇంట్లో చిన్న కూతురు ఛుట్కీ. చదవంటే ప్రాణం. డాక్టర్‌ కావాలనేది తన కల. భగవంతి, బడ్కీలకు ఈ అమ్మాయి మీద ఎనలేని నమ్మకం. తండ్రి నుదుటి మీద ఏర్పడ్డ చారలకు కారణం అది అతని ముఖానికి నప్పడమా, లేక ఆడపిల్లలకు కట్నం ఇచ్చుకోవాలనా? అనే ఆలోచన చేస్తూ ఉంటుంది. భవిష్యత్తు తరాల తరుణుల ఆలోచనకు అద్దంలా ఉంటుంది ఈ పాత్ర. 

బసేసర్‌ రామ్‌.. వినోద్‌నాగ్‌పాల్‌
హమ్‌లోగ్‌లో ప్రధాన పాత్రధారి అయిన బసేసర్‌ రామ్‌. వినోద్‌నాగ్‌పాల్‌ ఈ సీరియల్‌లో బసేసర్‌రామ్‌గా నటించాడు. మధ్యతరగతి తండ్రిగా, మద్యానికి బానిస అయిన వ్యక్తిగా నాగ్‌పాల్‌ నటన అందరినీ ఆకట్టుకుంది. హాస్యాన్ని వ్యంగ్యధోరణిలో అస్త్రాలుగా వదిలేవాడు. ‘హమ్‌లోగ్‌ కథ 25–30 పేజీలు ఉంటుందేమో. రచయిత మనోహర్‌ శ్యామ్‌ జోషి బ్రెయిన్‌లోనే స్క్రిప్ట్‌ అంతా రెడీగా ఉండేది. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. ప్రతి ఎపిసోడ్‌లో ఏయే అంశాలు రావాలో అనర్గళంగా ఆన్‌ది స్పాట్‌లోనే చెప్పేసేవారు.  ఇన్నేళ్లయినా ఖోస్లా కా ఘోస్లా, లవ్‌ షువ్‌ తె చికెన్‌ ఖురానా.. వంటి సీరియల్స్‌లోనూ నాకోసం పాత్రలు ఉండటం అంటే హమ్‌లోగ్‌ నాకు ఇచ్చిన అదృష్టమే’ అని వివరించారు ఓ ఇంటర్వ్యూలో నాగ్‌పాల్‌. 

మధ్య తరగతి కష్టం
మద్యం, లింగవివక్ష, కళ్ల ముందు ఎన్నో అవకాశాలు, వాటిని అందుకోలేని పేదరికం, మసకబారిన సామాజిక విలువలు, గుడ్డి నమ్మకాలు.. ఇలాంటివెన్నో ‘హమ్‌లోగ్‌’ చూపుతుంది. ఇప్పటికీ హమ్‌లోగ్‌ (మన దేశ ప్రజలు) కనపడని ఈ దెయ్యాలతో నిత్యం పొరాటం చేస్తూనే ఉన్నారు. అందుకే ఇది అందరి సీరియల్‌ అయ్యింది. ఇప్పటి సీరియల్స్‌కి దిశా నిర్దేశం చేసే ఒక గైడ్‌ హమ్‌లోగ్‌.
– ఎన్‌.ఆర్‌.

ఇండియన్‌ టెలివిజన్‌ కార్యక్రమాలలో ఒక మాస్టర్‌ పీస్‌ ‘హమ్‌లోగ్‌.’ వాస్తవికతకు దగ్గరగా ఉండేవి అప్పటి కార్యక్రమాలు. 80, 90ల కాలంలో అదొక సామాజిక విప్లవం. దీంతో దూరదర్శన్‌ ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది. 
అంజలి సెజ్వాల్‌ (గృహిణి)

నేను ఈ సీరీస్‌ సీడీలు మొత్తం కొని దాచుకున్నాను. ఇప్పటికీ చూడదగింది. దిగువ మధ్యతరగతి ఎదుర్కొనే సవాళ్లను బాగా చూపించింది హమ్‌లోగ్‌.
రవి సింఘ్‌ (పంజాబీ) 

ముప్పై ఏళ్ల క్రితం నాటి మాటి. తక్కువ ఆదాయం, ఎక్కువ సంతోషం ఉండే రోజులవి. కంప్యూటర్, మొబైల్‌ వంటివి లేవు అప్పట్లో. అదొక గోల్డెన్‌ పీరియడ్‌. మనుషుల మధ్య సత్సంబంధాలు, ఒకరికొకరు సాయపడే గుణం ఎక్కువ. ఆ సీరియల్‌ని తలుచుకుంటే నాటి రోజులు గుర్తుకువస్తాయి. నాటి రోజులను తలుచుకుంటే తప్పకుండా హమ్‌లోగ్‌ ఒక భాగమై ఉంటుంది. 
బ్రహ్మదత్త శర్మ

అవి వేసవి సెలవులు. అప్పట్లో మా ఇంట్లో సౌకర్యం అంటే ఒక టేబుల్‌ ఫ్యాన్, బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీ. హమ్‌లోగ్‌లో వచ్చే పాత్రల గురించి మా అమ్మతో చర్చించేదాన్ని. నాటి రోజులు తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. 
– అరుణా చౌహాన్‌

మొట్ట మొదటి సీరియల్‌ యాంకర్‌ అశోక్‌కుమార్‌
ప్రతి ఎపిసోడ్‌ చివరలో అగ్ర సినిమా నటుడు అశోక్‌కుమార్‌ స్క్రీన్‌ మీద కనిపించేవారు. కథలో, వాస్తవంలో జరుగుతున్న పరిణామాలను, రాబోయే ఎపిసోడ్‌లో జరిగే విషయాన్ని చాలా క్లుప్తంగా, ఆలోచనాత్మకంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుపోయేలా చెప్పేవాడు. అందుకే అందరికీ అశోక్‌కుమార్‌ ఒక సలహాదారుడిలా, తమ కుటుంబ సన్నిహితుడిలా అనిపించేవారు. అశోక్‌కుమార్‌ 50 ఏళ్ల సినీ జీవితంలో కంటే 18 నెలల హమ్‌లోగ్‌ సీరియల్‌ తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. అశోక్‌కుమార్‌ స్టైల్‌గా, గంభీరంగా కనిపించడానికి సన్‌గ్లాసెస్‌ పెట్టుకుంటున్నాడు అనుకునేవారు అంతా. కానీ, తన ముందు టెలీప్రామ్టర్‌లోని అక్షరాలు కనపడటానికి గ్లాసెస్‌ ధరించేవాడని ప్రేక్షకులెవ్వరికీ తెలియదు.

మూలం... మెక్సికన్‌ సీరియల్‌
ఇండియన్‌ టెలివిజన్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన డ్రామా సీరీస్‌ ‘హమ్‌ లోగ్‌’. దూరదర్శన్‌లో ఈ సీరియల్‌ జూలై 7 1984 ప్రారంభమై 17 డిసెంబర్‌ 1985 వరకు 154 ఎపిసోడ్లు ప్రసారమైంది. దీనిని మెక్సికన్‌ టెలివిజన్‌ సీరీస్‌ ‘వెన్‌ కన్‌మిగో(V్ఛn ఛిౌnఝజీజౌ 1975)లోని మూల కథ నుంచి తీసుకున్నారు. నాటì ప్రసారశాఖ మంత్రి వసంత్‌ సాథే మైండ్‌లో రూపుదిద్దుకున్న ఆలోచనకు దృశ్య రూపం కల్పించారు రచయిత మనోహర్‌ శ్యామ్‌ జోషి, స్క్రిప్ట్‌ రైటర్, ఫిల్మ్‌ మేకర్‌ పి.కుమార్‌ వాసుదేవ్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిల్‌ బిస్వాస్, హిందీ సినీ నటుడు అశోక్‌కుమార్‌లు.

Advertisement
Advertisement