సారీ.. నానమ్మా!

family crime story - Sakshi

క్రైమ్‌ పేరెంటింగ్‌

ఒక వయసొచ్చాక తక్కువ వినపడుతుంది. వినపడినదంతా ఎక్కువగా అనిపిస్తుంది.పెద్దలతో మాట్లాడుతున్నప్పుడుమనం చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రతిరోజూ లేచినప్పటినుంచి నిద్రపోయేదాకా‘నా వల్ల ఈ కుటుంబానికి ఎంత కష్టం?’అనుకుంటూనే జీవిస్తుంటారు.ఒక్క మాట చాలు. దుఃఖంలో కూరుకుపోవడానికి.పిల్లలకు నేర్పించండి ఇంట్లోని పెద్దలను గౌరవించమని!నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఒక నానమ్మ కథ!

ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలు మాటా పలుకూ లేకుండా ఉన్నాయి. రాత్రి చీకటి నిస్సహాయంగా ఉంది.అలలు గాఢతను నింపుకుని తమ మీదకు వచ్చే దేనినైనా దూరం నెట్టేద్దామా అని సమాయత్తమవుతూ ఉన్నాయి. ఆ ముసలామె రెయిలింగ్‌ దగ్గర నిలుచుని ఉంది. సాయంత్రం అయిదింటికి ట్యాంక్‌బండ్‌ మీద ఆటోలో దిగిందామె. ఒక్కోవిగ్రహం దగ్గరా కాసేపు కాసేపు కూర్చుంటూ ఇప్పుడు రోడ్డు దాటి రెయిలింగ్‌ దగ్గర నిలుచుంది. దూరంగా మసక నింపుకున్న బుద్ధుని చిర్నవ్వు. శరణు జొచ్చడానికి తీరిక ఇవ్వని సమాజం ఆ అర్ధరాత్రి అప్పుడొక వాహనం అప్పుడొక వాహనంగా దూసుకొని పోతోంది. ఆ రెయిలింగ్‌ ఎక్కి నీళ్లలోకి ఎలా దూకాలో ఆ ముసలామెకు అర్థం కాలేదు. అరవై అయిదేళ్ల వయసులో అలాంటి పని చేయాల్సి వస్తుందని ఊహించనుకూడా ఊహించలేదు. ముడతలు పడ్డ చేతి చర్మం రెయింగ్‌ను పట్టుకున్న మణికట్టు మీద సంశయాన్ని ప్రదర్శిస్తూ ఉంది. దాని మీద రాలాల్సిన కన్నీటి చుక్కలు గాలి అప్పుడే వీయగా శూన్యంలో లుప్తమైపోయాయి. ఒక్క నిమిషం ఆమె గట్టిగా గాలి పీల్చుకుంది. మెడలో ఉన్న తన పెళ్లినాటి బంగారు గొలుసు తీసి గట్టుమీద పడేసింది. రెయిలింగ్‌ను గట్టిగా పట్టుకొని కాళ్లను తేలిగ్గా చేసి నడుము వంచేస్తే దేహం దాని మానాన అది నీళ్లలో పడిపోతుందని నిర్ణయించుకుంది. రెయిలింగ్‌ గట్టిగా పట్టుకుంది. నడుము కొద్దిగా వొంచింది. పాదాలు తేలిక చేసి దేహాన్ని నీళ్లలో పడేస్తుండగా టక్కున ఎవరో పట్టుకుని ఆపేశాడు.

స్పెషల్‌ పోలీస్‌.ఆత్మహత్యలు చేసుకునేవారి మీద నిఘా పెట్టే టీమ్‌లో ఒక సభ్యుడైన శివ.చాలా సేపటిగా ఆమెనే గమనిస్తున్నాడు.‘ఏమైందమ్మా?’ అడిగాడు.ఆమెకు కళ్లవెంట వెచ్చదనం ఉబికింది.‘ఊరుకో తల్లి. ఈ వయసులో ఏమిటి ఈ పని?’ఆమె ఊరికే ఉంది. అతడు ఆమె చేయి పట్టుకుని కొయ్యబల్ల మీద కూర్చోపెట్టాడు.‘కొడుకు ఏమైనా అన్నాడా?’ అడిగాడు.‘కోడలు ఏమైనా అన్నదా?’ అడిగాడు.ఆమె తల అడ్డంగా ఊపింది.‘మరి ఎవరు?’‘మనవడు’ చెప్పిందామె.‘మనవడా? వయసెంత?’ఆమె అతడివైపే చూస్తూ చెప్పింది.‘ప..ది... సం..వ..త్స..రా..లు’. ఒక పదేళ్ల పిల్లాడు ఒక ముసలామె ఆత్మహత్యకు ఎలా ప్రేరేపిస్తాడు?
    
‘బుజ్జీ... కాస్త నా స్లిప్పర్స్‌ ఎక్కడున్నాయో చూసి పెట్టవా నాన్నా’... బుజ్జి నుంచి సమాధానం లేదు. ‘బుజ్జీ... ఈ నానమ్మకు హెల్ప్‌ చేయరా కన్నా’ ‘నువ్వే వెతుక్కో పో’ ‘నువ్వు వెతకొచ్చుగా’ ‘ఏం... నువ్వు గుడ్డిదానివి కాలేదుగా. నువ్వు బ్లైండ్‌ అయిపో నేను వెతికి పెడతా’ఆమె మాట లేనట్టుగా ఉండిపోయింది.‘అమ్మ డిన్నర్‌కి పిలుస్తోంది’ పిలిచాడు బుజ్జి.ఆమె లేచింది.‘నీ కోసం స్పెషల్‌గా చపాతీ చేయలేదు. అన్నమే తిను. అయినా నీలాంటి ఓల్డ్‌ లేడీస్‌ ఏమీ తినరట కదా. నువ్వు మాత్రం ఫుల్‌గా తింటావు. నీకు వేరే పనేం లేదానానమ్మా’... ఆ రాత్రి ఆమె పస్తే పడుకుంది.‘నువ్వు ఎందుకు వేరే డాటర్స్‌నీ సన్‌నీ కనలేదు?’ ఒకరోజు అడిగాడు.ఆమె నీరసంగా నవ్వింది.‘నాకు మీ నాన్న ఒక్కడే పుట్టాడురా. వాడే లోకం అనుకున్నాను’‘ఇంకా చాలామందికి బర్త్‌ ఇచ్చి ఉంటే సరిపోయేదిగా. వాళ్ల దగ్గర ఉండేదానివి. ఎప్పుడూ ఇక్కడే పడి ఉంటావ్‌. మా ఫ్రెండ్స్‌ అశ్విన్, భువన్, ఆదేశ్‌ వాళ్ల ఇళ్లలో నీలా ఎవరూ ఉండరు తెలుసా? వాళ్ల మమ్మీ డాడీ ఎంతో హ్యాపీగా ఉంటారు’ఆమె వాడి వైపు చూసింది.దూరంగా కోడలు చిర్నవ్వుతో వాడి మాటలు వింటూ ఉంది.

సాయంత్రం పార్క్‌లో కలిసిన కాలనీ ఆమెతో మాటామాటగా ఈ సంగతి చెప్పింది.‘పిల్లలు అలా మాట్లాడరు. ఎవరైనా మాట్లాడిస్తే తప్ప’ అందామె సానుభూతిగా.‘ఏం చేయను. నా మనసు ముక్కలవుతోంది’‘పిల్లలకు నేర్పాల్సింది తల్లిదండ్రులే. కాని వాళ్లను తమ పగ తీర్చుకోవడానికి సాధనంగా వాడుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. మీ కోడలికి మీరుండటం ఇష్టం లేదు. ఆ మాట తను నేరుగా చెప్పలేక మీ మనవణ్ణి ఆయుధంగా వాడుకుంటోంది. పాపం చిన్నపిల్లాడు. వాడికేం తెలుసు. తల్లి ఎలా చెబుతుంటే అలా చెబుతున్నాడు’‘కోడలు తిట్టినా ఇంత బాధ ఉండదు. కాని చిన్నపిల్లాడితో అంటే’... ఆమెకు ఏడుపు తన్నుకొచ్చింది. మనవడిని ఒడిలో కూర్చుపెట్టుకుని కథలు చెప్పాల్సిన వయసు. కాని ఆ మనవడే విలన్‌గా మారడం ఆమెను తినేస్తోంది.‘ఎందుకీ బతుకు? ఎక్కడైనా దూకి చస్తాను’ అనుకుందామె.
 
పోలీసులు ఆమె కొడుకును, కోడలును, మనవణ్ణి స్టేషన్‌కు పిలిపించారు.సాయంత్రం నుంచి పెద్దావిడ కనిపించకపోయేసరికి వాళ్లు కంగారుగా వెతుక్కుంటున్నారు.తీరా ఈ సంగతి తెలిసేసరికి ఇద్దరూ హడలిపోయారు. కోడలు కంగారుపడిపోయింది.‘క్షమించండత్తయ్యా. ఏదో మిమ్మల్ని ఉడికించడానికి అంటున్నాడని ఊరుకున్నాను. మీరింత బాధపడతారని తెలియదు’ అంది నిజంగానే.‘అమ్మా... ఏంటిది.. చిన్నపిల్లాడు ఏదో అన్నాడని ఇలా చేస్తావా. నేను అనుంటే ఫీలవ్వాలి గానీ’ అన్నాడు కొడుకు.బుజ్జి ఇదంతా స్టన్‌ అయ్యి చూస్తున్నాడు.‘నానమ్మా.. నువ్వు చచ్చిపోతావా?’ అన్నాడు దగ్గరకొచ్చి చేతులు పట్టుకుని దీనంగా. ఆమె ఆ పసివాణ్ణి చుట్టుకుపోయింది.కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.ఆ తర్వాత బుజ్జి ఆమెను ఏమీ అనలేదు.కొడుకు, కోడలు కూడా బుజ్జికి నానమ్మ ఎంత విలువైన మనిషో, కుటుంబానికి ఎంత పెద్దదిక్కో వివరించారు.ఆమెతో వాళ్లకు పేచీ ఉంటే లేదా ఆమెకు వాళ్లతో పేచీ ఉంటే ఆమెను ఏదైనా మంచి ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో చేర్పిస్తారు తప్పితే ఆమె మనసు ముక్కలు చేయడానికి పిల్లలను మాత్రం ఆయుధంగా మార్చరు గాక మార్చరు. ఇది మాత్రం సత్యం.
 

ఆచరిస్తే... అనుసరిస్తారు
పెద్దలను గౌరవించే విధానాన్ని పిల్లలు తల్లిదండ్రుల దగ్గరనుంచే నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులతో గౌరవ మర్యాదలతో మెలిగితే, వీరిని చూసి పిల్లలు తమ తాత, నానమ్మలను గౌరవిస్తారు. ఇంటిలోని పెద్దవాళ్లు ఆస్తి వ్యవహారాలలో లేదా ఇతర విషయాలలో నచ్చకపోతేనో లేదా వారి వ్యవహార శైలి నచ్చకపోతేనో వారి గురించి పిల్లల ముందు కామెంట్‌ చేయకూడదు. తల్లిదండ్రులు ‘ముసల్ది, ముసలాడు, వాడు, అది...’ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అది తప్పకుండా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. పెద్దవాళ్లకు అనారోగ్యం చేసినప్పుడు ఆ చికిత్సకు అయ్యే ఖర్చు గురించి తల్లిదండ్రులు తప్పుగా మాట్లాడితే అది కూడా పిల్లల పసి మనస్సులపై ముద్రపడుతుంది పెద్దవాళ్లకు పెట్టే ఖర్చు దండగ అని. పెద్దవాళ్లు తమను ఎలా పైకి తీసుకువచ్చారు... అందుకోసం వారు ఎంత కష్టపడ్డారు.. నైతిక విలువలు, ఇతర సంస్కృతీ సంప్రదాయాలు, మంచి అలవాట్లను నేర్పించేందుకు వారు ఎంతగా కృషి చేశారు... వంటి విషయాలను చెప్పుకుంటూ ఉండటం వల్ల తాత, నాయనమ్మ లేదా అమ్మమ్మ తాతయ్యలు మంచివాళ్లని అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలను తాతానానమ్మల దగ్గర కూర్చుని, వారి చేత కథలు, ఇతర మంచి విషయాలు చెప్పించుకునేలా చేయాలి. అప్పుడు వారి మీద గౌరవాభిమానాలు కలుగుతాయి. ముందు మనం మన పెద్ద వాళ్లను గౌరవించాలి. అప్పుడు పిల్లలు మనల్ని అనుసరిస్తారు.
డాక్టర్‌ కళ్యాణ్‌చక్రవర్తి
కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌
లూసిడ్‌ డయాగ్నస్టిక్స్‌

- సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top