
ఒక ప్రవచనం ప్రకారం– ప్రళయ దినాన మొట్టమొదట ముగ్గురు వ్యక్తుల విషయంలో అల్లాహ్ తన తీర్పును వెలువరించారు. దైవమార్గంలో, ధర్మం కోసం పోరాడి ప్రాణాలర్పించిన షహీదును అందరికంటే ముందు న్యాయస్థానంలో హాజరుపరిచారు. దైవం అతణ్ణి ‘‘నీవు నీ బాధ్యతలను ఎంతవరకు నెరవేర్చావు? ఎటువంటి కర్మలు ఆచరించావు?’’ అని ప్రశ్నించాడు. ‘ప్రభూ! నేను నీ మార్గంలో పోరాడాను. నీ ప్రసన్నత కోసం ప్రాణాలను ధారపోశాను.’ అని సమాధానం చెప్పాడతను. ‘‘నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. నువ్వు కేవలం గొప్ప వీరుడవనిపించుకోవాలని జిహాద్‌లో పాల్గొన్నావు. ప్రజలంతా నిన్ను వీరుడవని, శూరుడవని పొగిడారు కదా! ఆ మేరకు దానికి తగిన ప్రతిఫలం నీకు అక్కడే లభించింది. ఇక్కడేమీ లేదు.’ అని అతణ్ణి నరకంలో పడవేయించాడు దైవం. తర్వాత ఒక విద్వాంసుడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. దైవం అతన్ని ‘‘ఒక పండితుడవైన నువ్వు ఏ మేరకు సత్కార్యాచరణ చేశావు? ప్రజలకు ఏమి బోధించావు?’’ అని ప్రశ్నించాడు.
అప్పుడతను, ‘‘ప్రభూ! నేను నువ్వు పంపిన గ్రంథాన్ని అధ్యయనం చేశాను. ఆచరించాను. దాన్ని ఇతరులకు బోధించాను.’’ అని చెప్పాడు. అప్పుడు దైవం, ‘‘అదంతా అబద్ధం. నువ్వు కేవలం ప్రజల మెప్పు పొందడానికి, ప్రజల చేత గొప్ప పండితుడిగా, విద్వాంసుడిగా కీర్తించబడాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశావు. నువ్వు ఆశించిన పేరు ప్రతిష్టలు నీకు అక్కడే లభించాయి. కనుక నీకిక్కడ ఏమీ లేదు’’ అని చెప్పి, అతణి ్ణకూడా నరకంలో పడవేయించాడు. తరువాత, ఒక గొప్ప ధనవంతుడి వంతు వచ్చింది. అతన్ని కూడా దైవం ‘‘ఇంత సంపద, ఇన్ని వరాలను పొందిన నువ్వు ఎలాంటి కర్మలు ఆచరించావు? సంపదను ఏ పనుల్లో వినియోగించావూ?’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడా ధనవంతుడు, ‘దేవా! నీ ప్రసన్నత ఇమిడి ఉన్న ఏ సత్కార్యాన్నీ నేను విడిచిపెట్టలేదు. నీ సంతోషం కోసం, నీ మెప్పుకోసం నా సంపదను నీ మార్గంలో ఖర్చుపెట్టాను.’ అని సమాధానమిస్తాడు ఆ ధనవంతుడు.
అప్పుడు దైవం, ‘‘నువ్వు కేవలం ప్రజల మెప్పుకోసం, ప్రజలంతా నిన్నొక గొప్పదాత అనుకోవాలని, త్యాగమయుడవని కీర్తించాలని, పొగడాలని నీ ధనాన్ని ఖర్చుపెట్టావు. నువ్వు ఆశించినట్లుగా ప్రజలంతా నిన్నొక గొప్పదాతగా, సత్కార్యాలు చేసేవాడిగా, పేదలను ఆదుకొనేవాడిగా గుర్తించి కొనియాడారు కూడా! ఇక్కడ నీకెలాంటి ప్రతిఫలమూ లేదు.’ అంటాడు దైవం.తరువాత అతణ్ణి కూడా ఈడ్చుకెళ్ళి నరకంలో పడవేయడం జరిగింది. మానవులు ఆచరించే కర్మల ప్రతిఫలం వారి వారి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పంతో కర్మలు ఆచరిస్తే, ఆ మేరకు వారికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దుష్టసంకల్పంతో సత్కర్మలు ఆచరిస్తే సత్ఫలితం లభించదు. అందుకని ప్రతి విషయంలోనూ సంకల్పం అన్నది మనిషికి అవసరం, అనివార్యం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్