ఉపనిషద్దర్శనం | Deputy nisaddarsanam | Sakshi
Sakshi News home page

ఉపనిషద్దర్శనం

Jan 16 2016 10:32 PM | Updated on Aug 13 2018 7:54 PM

ఉపనిషద్దర్శనం - Sakshi

ఉపనిషద్దర్శనం

ఉపనిషత్తులన్నీ ఆవులయితే వాటి పాలు పితికేవాడు శ్రీకృష్ణుడు.

ఉపనిషత్తులన్నీ ఆవులయితే వాటి పాలు పితికేవాడు శ్రీకృష్ణుడు. ఆవు దూడ అర్జునుడు. పాలు గీతామృతం. ఉపనిషత్తులు గోమాత వంటివి. వాటివల్ల కలిగే జ్ఞానం ఆవుపాల వలె ఆరోగ్యప్రదం. భారతీయ వైదిక సాహిత్యం నాలుగు వేదాల నుండి మొదలవుతోంది. మూల వేదాన్ని సంహిత అంటారు. దాని తరువాత బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులుగా వేదవాఙ్మయం విస్తరించింది. అన్నీ వేదం చెప్పిన ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలో, ఎలా ఆచరించాలో వివిధ మార్గాల్లో వివరిస్తాయి. వేదాల్లో చెప్పిన కర్మలు ఎలా చెయ్యాలో బ్రాహ్మణాలు, ఉపాసన ఎలా చెయ్యాలో ఆరణ్యకాలు, ఎలా తెలుసుకోవాలో ఉపనిషత్తులు వివరిస్తాయి. ‘జ్ఞానదేవతా కైవల్యమ్’ (జ్ఞానమే మోక్షానికి మార్గం) అన్నారు కనుక అన్వేషణలో ముగింపు ఉపనిషత్తులతోనే అవుతోంది కనుక వాటిని ‘వేదాంతం’ అంటారు.యజ్ఞయాగాది కర్మలు, జపతపాలు ఎన్ని చేసినా ఉపనిషత్తులే జ్ఞానాన్ని ఇస్తాయి. అందుకే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు మూడింటినీ వరుసగా అధ్యయనం చెయ్యాలి. భారతీయ సంస్కృతి, తత్త్వం, ధర్మం, సంప్రదాయం, మానవజన్మ పరమార్థం, బుద్ధి వికాసం, అధ్యయన విధానం అన్నీ ఒకేచోట దొరికే చోటు ఉపనిషత్తులే.

‘ఉప’ ‘ని’ ‘షద్’ అంటే గురువు సమీపంలో కూర్చుని నేర్చుకునేది అని శబ్దార్థం. విజ్ఞానవంతుడై, అధ్యయనపరుడై, బోధింపగలిగినవాడైన గురువు దగ్గర కూర్చొని వింటేనే ఉపనిషత్తుల వలన జ్ఞానం లభిస్తుంది. అజ్ఞానం నశిస్తుంది. సగం జ్ఞానం కాకుండా సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేది అని కూడా ఉపనిషత్ పదానికి అర్థం. ఈ జ్ఞానం లౌకికంగా, పార లౌకికంగా బుద్ధివికాసాన్ని కలిగిస్తుంది. అది ఇద్దరు చర్చించినప్పుడే నిస్సందేహంగా తెలుస్తుంది. అందుకే దగ్గర కూర్చొని వినేవి’ అని పేరుపెట్టారు.
 
ఉపనిషత్తులను వేదాలలో భాగాలుగా, వాటికి అనుబంధాలుగా చెప్పినప్పటికీ విడిగా కూడా కొన్ని ఉపనిషత్తులు ఏర్పడ్డాయి. వేదాధ్యయనంతో సంబంధం లేకుండా ఉపనిషత్తులు చదువుకోవచ్చు. జ్ఞానాన్ని సంపాదించవచ్చు. మొత్తం ఉపనిషత్తులు పదకొండు వందల ఎనభై వరకు ఉన్నాయి. ఋగ్వేదంలో ఇరవై ఒకటి, యజుర్వేదంలో నూట తొమ్మిది, సామవేదంలో వెయ్యి, అధర్వణ వేదంలో ఏభై ఉన్నట్టు ఇప్పటి లెక్క. వీటన్నిటిలో నుంచి ముఖ్యమైన నూట ఎనిమిది ఉపనిషత్తులను ఎంపిక చేసి త్రేతాయుగంలో శ్రీరాముడు తన భక్తుడైన ఆంజనేయునికి వివరించాడట. అప్పటినుంచి నూటెనిమిది ముఖ్యమైన ఉపనిషత్తులు లోకంలో ప్రసిద్ధమైనాయి.
     నూట ఎనిమిది ఉపనిషత్తులలో ప్రాచీనమైనవి పది ఉపనిషత్తులు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ పదింటికి భాష్యాన్ని రాశారు. వీటిని దశోపనిషత్తులు అంటారు. నూట ఎనిమిది ఉపనిషత్తులలో ఋగ్వేదానికి చెందినవి పది. శుక్ల యజుర్వేదంలోనివి పందొమ్మిది. కృష్ణ యజుర్వేదంలోనివి ముప్ఫయి ఒకటి ఉన్నాయి.

 ప్రధానమైన పది ఉపనిషత్తులు - ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులుదశోపనిషత్తులతో పాటు కౌషీతకి, శ్వేతాశ్వతర, మైత్రాయణి ఉపనిషత్తులకు కూడా అంతటి ప్రాధాన్యం ఉంది.
 నూట ఎనిమిది ఉపనిషత్తులలో కొన్ని నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని చెబుతాయి. కొన్ని శివ, శక్తి, విష్ణువులను గూర్చి చెబుతాయి. కొన్ని సాంఖ్యయోగ పద్ధతిలో ఉంటాయి. ఈ వరుసలో అవి ప్రాచీన , మధ్య, అర్వాచీన కాలాలకు చెందినవిగా బాలగంగాధర్ తిలక్ వంటి పెద్దలు అభిప్రాయపడ్డారు. పది ఉపనిషత్తులలో ఈశావాస్య, బృహదారణ్యకాలు, శుక్ల యజుర్వేదానికి, కఠ, తైత్తిరీయోపనిషత్తులు కృష్ణయజుర్వేదానికీ, కేన, ఛాందోగ్యోపనిషత్తులు సామవేదానికీ, ప్రశ్న, ముండక, మాండూక్యోపనిషత్తులు అధర్వవేదానికీ చెంది ఉన్నాయి. ఒక్క ఐతరేయోపనిషత్తు మాత్రం ఋగ్వేదానికి చెందింది. ఈ పది ఉపనిషత్తులలో కఠోపనిషత్తు ఒక్కటే సాకార విష్ణు ప్రస్తావన చేస్తుంది. ఈశావాస్యంలో జ్ఞానప్రబోధం, కేనోపనిషత్తులో పరబ్రహ్మతత్త్వం, ప్రశ్నోపనిషత్తులో అక్షర పరబ్రహ్మ తత్త్వం, ముండకోపనిషత్తులో సన్యాసాశ్రమ విషయాలు, మాండూక్యంలో ఓంకార ప్రాముఖ్యం, అద్వైత తత్త్వం, తైత్తిరీయంలో ధర్మాలు, ఆచారాలు ఐతరేయంలో బ్రహ్మవిద్య ఛాందోగ్యంలో ధార్మికాంశాలు, బృహదారణ్యం చాలా పెద్ద ఉపనిషత్తు. దీనిలో సృష్టి, పరబ్రహ్మ తత్త్వం మొదలైన ఎన్నో విషయాలు సంవాద రూపంలో చర్చించబడ్డాయి. శ్వేతాశ్వతరోపనిషత్తు శైవధర్మాన్ని, భక్తి తత్త్వాన్ని  ప్రతిపాదిస్తోంది. మైత్రాయిద్యుపనిషత్తు భౌతిక దేహం అశాశ్వతతాన్ని, సూర్య భగవానుని ఆరాధన గురించి చెబుతోంది. కౌషీతకి బ్రహ్మవిద్య, జీవచైతన్యం గురించి వివరిస్తోంది.

నూటెనిమిది ఉపనిషత్తులలో సన్న్యాస ధర్మాన్ని పదిహేడు, వైష్ణవతత్వాన్ని పద్నాలుగు, శివ తత్వాన్ని పదిహేను శక్తితత్వాన్ని ఎనిమిది, యోగవిద్యను ఇరవై ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఉపనిషత్తుల అధ్యయనం మానసిక పరిపక్వతను, కుశాగ్ర బుద్ధిని తెలియజేస్తుంది. స్నాతకోత్తర విద్యలా ఉన్నత స్థాయిలో పరిశోధనాత్మకంగా విశ్లేషణ, అన్వేషణ పూర్వకంగా సత్యదర్శనం చేయిస్తుంది. గుడ్డిగా నమ్మటం కాకుండా గట్టిగా చర్చించి సత్యాన్ని అంగీకరించే పరిణతి కలిగిస్తుంది. సంప్రదాయ పద్ధతిలో కాక చారిత్రక దృష్టితో చూసినా క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాటికే ఉపనిషత్తులు ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. భారతదేశ సంస్కృతి, మానవజాతి మనోవికాసంలో ఎంత ముందున్నదో మన ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో ఏ మానవుడైనా ఉపనిషత్తుల అధ్యయనం వల్ల జాగృతుడు అవుతాడు. జాతి జ్ఞాన సస్యశ్యామలం అవుతుంది.
 
‘ఉప’ ‘ని’ ‘షద్’ అంటే గురువు సమీపంలో కూర్చుని నేర్చుకునేది అని శబ్దార్థం. విజ్ఞానవంతుడై, అధ్యయనపరుడై, బోధింపగలిగినవాడైన గురువు దగ్గర కూర్చొని వింటేనే ఉపనిషత్తుల వలన జ్ఞానం లభిస్తుంది. అజ్ఞానం నశిస్తుంది. సగం జ్ఞానం కాకుండా సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేది అని కూడా ఉపనిషత్ పదానికి అర్థం.
 
 - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement