
నేర సామ్రాజ్యం
ఇటలీ నుంచి వచ్చి న్యూయార్క్‌లో స్థిరపడినవారిలో ఓ ఐదు కుటుంబాలు కాలక్రమాన ప్రబలమైన మాఫియా శక్తిగా ఎదుగుతాయి.
నవల / గాడ్ ఫాదర్
ఇటలీ నుంచి వచ్చి న్యూయార్క్‌లో స్థిరపడినవారిలో ఓ ఐదు కుటుంబాలు కాలక్రమాన ప్రబలమైన మాఫియా శక్తిగా ఎదుగుతాయి. ఆ కుటుంబాల పెద్దలు మాఫియా లీడర్లు అవుతారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఎప్పుడూ పొంచి ఉంటారు. బయటి నుంచి శత్రువు వచ్చినప్పుడు మాత్రం ఐదుగురూ ఒకటి అవుతుంటారు. ఐదు కుటుంబాల్లోకీ శక్తిమంతమైన నాయకుడు.. విట్ కార్లో. యాభై ఏళ్ల పెద్ద మనిషి. ఆపదలో శరణు అన్నవారికి ప్రాణం ఇస్తాడు. తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు తీస్తాడు. సామాన్యులు, నేర ప్రపంచంలోని అసామాన్యులు అతడిని ‘గాడ్‌ఫాదర్’లా గౌరవిస్తుంటారు. గాడ్‌ఫాదర్‌కి నలుగురు పిల్లలు. పెద్దవాడు ‘సన్నీ. రెండోవాడు ‘ఫ్రెడ్డీ’. మూడో అబ్బాయి ‘మేఖైల్’. కూతురు ‘కోనీ’. సన్నీకి పెళ్లయిపోతుంది. ఫ్రెడ్డీ తండ్రిగా సాయంగా ఉంటాడు. మైఖేల్.. తండ్రికి దూరంగా ఉంటాడు.. అతడి గ్యాంగ్‌వార్‌లూ అవీ నచ్చక. చివరికి తండ్రి తర్వాత అతడే ‘గాడ్‌ఫాదర్’ కావలసి వస్తుంది. అందుకు అనేక సంఘటనలు కారణం అవుతాయి.
‘కోనీ’ పెళ్లితో గాడ్ ఫాదర్ కుటుంబలో కల్లోలం మొదలౌతుంది. గాడ్‌ఫాదర్ ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం కోనీ భర్తను ఉపయోగించుకుంటాయి మిగతా మాఫియా కుటుంబాలు. వారి వ్యూహం ప్రకారం కోనీని హింసిస్తూ, ఆమె ద్వారా ఆమె పెద్దన్నయ్య సన్నీని ఒంటరిగా రమ్మని పిలిపించి దారి మధ్యలో గ్యాంగ్‌స్టర్‌లతో చంపిస్తాడు కోనీ భర్త. గాడ్‌ఫాదర్ రెండో కొడుకు ఫ్రెడ్డీ ఇవన్నీ వదిలేసి ‘నెవడా’లో హాటల్ నడుపుకునేందుకు వెళ్లిపోతాడు. ఇక ఆ కుటుంబంలో మిగిలింది మైకేల్. అతడు కూడా పెళ్లి చేసుకుని ప్రశాంత జీవనం సాగిస్తున్నప్పుడు కారులో బాంబు పెట్టి అతడి భార్యను చంపేస్తారు ప్రత్యర్థులు. దాంతో మైకేల్ జీవిత దృక్పథం మారిపోతుంది. తండ్రే కరెక్టు అనుకుంటాడు. తండ్రి మార్గంలోకి వచ్చేస్తాడు. తండ్రికి సాయంగా తనూ తుపాకీ పట్టుకుంటాడు. తన అన్నను చంపిన చెల్లెలి భర్తను చంపేస్తాడు. తండ్రి గుండెపోటుతో మరణించాక వారసత్వంగా ‘గాడ్‌ఫాదర్’ అవుతాడు. తండ్రికి దూరంగా అజ్ఞాతంలో ఉండగా మైఖేల్‌ను ఇష్టపడి, అతడిని వెతుక్కుంటూ న్యూయార్క్ వచ్చిన కే ఆడమ్స్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మేఖైల్. ఆడమ్స్ క్యాథలిక్కుగా మారి తన భర్త మనసు మార్చమని, ఈ మాఫియా రొచ్చు నుంచి బయటపడేయమని రోజూ దేవుడిని ప్రార్థిస్తుంది. దైవ మహిమో లేక మైఖేల్ అంతర్మథనమో కానీ మైఖేల్ మాఫియా జీవితాన్ని వదిలి, కుటుంబంతో పాటు నెవడా వెళ్లిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తాడు. ఇదీ ‘ది గాడ్‌ఫాదర్’ కథ. నేర సంబంధాలు కుటుంబ అనుబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ నవల చెబుతుంది.
ఈ నవలను ఇటలీ సంతతికి చెందిన అమెరికన్ రచయిత మారియో పుజో 1969లో రాశారు. కథాకాలం 1945-1955. ‘బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చూన్ దేర్ ఈజ్ ఎ క్రైమ్’ అనే బల్జాక్ (పద్దెనిమిదో శతాబ్దపు ఫ్రెంచి నవలాకారుడు)) కోట్‌తో నవల మొదలవుతుంది. ప్రతి భారీ సంపద వెనుక ఒక నేరం ఉంటుందని! ఈ ఒక్క వాక్యంతో పుజో తన పుస్తకంలోకి పాఠకుల్ని లాగేసుకున్నాడు. ది గాడ్ ఫాదర్‌కి సీక్వెల్‌గా పుజో 1983లో ‘ది సిసీలియన్’ అనే మరో నవల రాశారు. 1999లో ఫుజో చనిపోయాక ఐదేళ్లకు ‘ది గాడ్ ఫాదర్ రిటర్స్’ అనే నవల వచ్చింది. దానిని రాసింది మార్క్ వైన్‌గార్డ్‌నర్. ఆయనే మళ్లీ ‘ది గాడ్‌ఫాదర్స్ రివెంజ్’ అనే సీక్వెల్ రాశారు. అది 2006లో విడుదలైంది. మారియో పుజో ‘ది గాడ్‌ఫాదర్’ ఆధారంగా 1972, 1974, 1990 లలో మూడు సినిమాలు వచ్చాయి. వాటి స్క్రీన్‌ప్లే కోసం పుజో కొత్తగా కొన్ని మార్పులు, చేర్పులు చేశారు.
నవల్లోని చిన్న సంభాషణ:మైఖేల్: అధికారంలో ఉన్న ఏ వ్యక్తి కన్నా భిన్నం కాదు మా నాన్న. అతడు శక్తిమంతుడు. అమెరికా అధ్యక్షుడిలా, అమెరికన్ సెనెటర్‌లా శక్తిమంతుడు.
కే ఆడమ్స్ (మైఖేల్ భార్య): ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావ్ మైఖేల్! అధ్యక్షులు, సెనెటర్లు.. మనుషులను చంపరు.
మైఖేల్: అయాకత్వం ఎవరిది?? కే?
(అధ్యక్షులైనా, సెనెటర్లైనా ఏ నేరమూ చేయకుండా ఆ స్థాయికి చేరుకోలేరని మైఖేల్ అంతరార్థం).
మారియో పుజో