పేగుల్లోని బ్యాక్టీరియాతో మధుమేహ నియంత్రణ 

Control Of Diabetes With Bacteria In The Intestines - Sakshi

పేగుల్లోని బ్యాక్టీరియాపై శాస్త్రవేత్తల దృష్టి ఎక్కువవుతున్న కొద్దీ.. వీటి ద్వారా మనకు కలుగుతున్న ప్రయోజనాల చిట్టా పెరిగిపోతోంది. తాజాగా కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు కొందరు పేగుల్లోని బ్యాక్టీరియా.. రక్తంలోని గ్లూకోజ్‌ మోతాదును నియంత్రిస్తున్నట్లు పరిశోధన పూర్వకంగా గుర్తించారు. పేగుల్లో సెరటోనిన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా బ్యాక్టీరియా మనకు మేలు చేస్తున్నట్లు వెల్లడించారు. సంతోషంగా ఉండే ఫీలింగ్‌ ఇచ్చే సెరటోనిన్‌ జీవక్రియల్లోనూ కీలకపాత్ర పోషిస్తుంటుంది. శరీరంలో ఉత్పత్తయ్యే మొత్తం సెరటోనిన్‌లో 90 శాతం పేగుల్లోనే ఉండటం గమనార్హం. ఊబకాయుల రక్తంలో సెరటోనిన్‌ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. పేగుల్లో దీని ఉత్పత్తిని బ్యాక్టీరియా నియంత్రిస్తుందన్న అంచనాతో జంతువులపై పరిశోధనలు మొదలుపెట్టారు. బ్యాక్టీరియా వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే సెరటోనిన్‌ ఉత్పత్తిలోనూ మార్పులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మార్పులు రక్తంలో గ్లూకోజ్‌ నిర్వహణపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. రక్తం, పేగుల్లో సెరటోనిన్‌ ఎంత ఎక్కువగా ఉంటే.. గ్లూకోజ్‌ నిర్వహణ అంత అధ్వానంగా ఉన్నట్లు స్పష్టమైంది. 

వెంట్రుకలకు కరెంట్‌ షాక్‌
వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఇబ్బంది పడుతున్న వారందరికీ ఓ శుభవార్త. వెంట్రుకలు వేగంగా పెరిగేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నయంత్రాన్ని తయారు చేశారు. స్వల్పస్థాయి కరెంటు షాక్‌లు ఇవ్వడం (దీన్నే ఎలక్ట్రోట్రైకోజెనిసిస్‌ అంటారు) ద్వారా ఇది పనిచేస్తుంది.  ఇందుకు అవసరమైన యంత్రాలు భారీ సైజులో ఉంటాయి.  విద్యుత్‌ అవసరాలూ ఎక్కువే. ఇప్పుడా  యంత్రాన్ని ఓ టోపీలో ఇమిడ్చేయడం ఈ కొత్త పరికరం విశేషం. అంతేకాదు.. శరీర కదలికలను విద్యుత్‌గా మార్చుకోగలగడం ఇంకో ముఖ్యమైన విషయం.

శరీరంలోని వివిధ ప్రక్రియలను ప్రేరేపించేందుకు కరెంటు షాకులు ఉపయోగపడతాయి. అయితే ఇందుకు తగ్గ పరికరాలు మాత్రం అందుబాటులో లేవని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త షుడాంగ్‌ వాంగ్‌ తెలిపారు. వెంట్రుకల తయారీ పరికరం తనంతటతానే సూక్ష్మస్థాయి విద్యుత్‌ను తయారు చేసుకుంటుందని వివరించారు.  ఇప్పటికే బట్టతల వచ్చిన వారికి ఈ యంత్రం పెద్దగా ఉపయోగపడకపోవచ్చనేది శాస్త్రవేత్తల మాట.! పరిశోధన వివరాలు ఏసీఎస్‌ నానో జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top