మార్చుకోలేని గుర్తింపు

Book Review Of Coming Out As A Dalit - Sakshi

కొత్త బంగారం

యషికా దత్‌ నిదానియా రాసిన ‘కమింగ్‌ అవుట్‌ యాజ్‌ ఎ దళిత్‌’– దత్, తాను దళితురాలినని బయటపడిన కారణంతో మొదలవుతుంది. ‘‘ఇండియాలో, నేను నా దళిత ఉనికిని రుద్దిరుద్ది వదిలించుకున్నాను. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు రెండు వారాలముందు అతను నాకు ఫేస్‌బుక్‌ రిక్వెస్ట్‌ పంపినప్పుడు, నేను దాన్ని డిలీట్‌ చేశాను. నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు, వైరల్‌ అయిన అతని ఆత్మహత్య లేఖ చదివి, ‘ఆ జీవితం నాదే అయి ఉండేది. సరైన కారణాల కోసం పోరాడేందుకు రెండో ఆలోచన కూడా చేయని అతని ధైర్యం– సంవత్సరాలుగా, నా దళిత ఉనికిని దాచుకుంటూ బతికిన నన్ను బయటకి లాగి, ఫేస్‌బుక్‌లో దళితురాలినని ప్రకటించుకునే నిర్ణయానికి చేర్చింది. అణచివేత గురించి సిగ్గు పడాలి. కులం గురించి కాదు’ అన్న గుర్తింపును అతను నాకు కలుగజేశాడు. దేశానికి దూరంగా ఉండటం వల్ల, వెల్లడించడం నాకు సులభం అయింది.’’

‘‘నేను రాజస్తాన్‌ అజ్మీర్‌లో దళిత కుటుంబంలో పుట్టాను. కులం దాచడం నేర్చుకుంటూనే పెరిగాను. నా కాన్వెంట్‌ స్కూల్‌ చదువు, ‘చామనచాయగా ఉన్నా మురికిగా లేని నా చర్మపు రంగు’ వల్ల, ఉన్నత కులందానిగానే చలామణీ అయ్యాను. సోఫియా బోర్డింగ్‌ స్కూల్లో ఏడేళ్ళప్పుడు చేరి, పై కులాల అలవాట్లు నేర్చుకున్నాక, తక్కిన జీవితమంతా వాళ్ళతో కలిసిపోగలనని అనుకున్నాను’’ అంటారు దత్‌. ‘‘మంచి విద్య (ఇంగ్లిష్‌ మీడియం) మాత్రమే మనల్ని సమాజం అంగీకరించేట్టుగా చేస్తుందని, దాన్ని పొందేందుకున్న ఒకే దారి, కులాన్ని దాచుకోవడం అనేవారు మా తాతగారు. ఆయన 60 ఏళ్ళ కిందట వదిలేసిన ‘నిదానియా’ అన్న ఇంటిపేరుని మరచిపోయాను.’’

‘‘ఎవరైనా ‘ఏమ్మా, మీదే కులం?’ అనడిగినప్పుడు, ‘పరాశర్‌ బ్రాహ్మిణ్‌’ అనడం, ఎంత తరచుగా, నమ్మకంగా చెప్పే అబద్ధం అయుండేదంటే, వాళ్ళనేకాక నన్ను నేనే మోసగించుకోగలిగాను. అయితే, ఎవరైనా ‘కులం కేటాయింపు’, ‘భంగీ’ (నా కులం అయిన పాకీవృత్తి) లాంటి మాటలు అన్నప్పుడల్లా అసౌకర్యం కలిగేది.’’ దత్‌ కుటుంబంలో ముత్తాతతో సహా, మూడు తరాలు చదువుకున్నవారే. తల్లి చదువుకున్నదే అయినప్పటికీ ఇంగ్లిష్‌ మీడియంలో కాకపోవడం వల్ల, భర్త అవమానపరుస్తుంటాడు. ఆమె ఐపీఎస్‌ కావాలనుకున్నా పడదు. చిన్న ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని ఆదుకుంటుంది.  ప్రభుత్వాధికారైన ఆమె తండ్రి, తాగుడు అలవాటువల్ల ఉద్యోగం పోగొట్టుకుంటారు. రచయిత్రి తమ సమాజంలోని స్త్రీలు తమ పురుషులనుండే ఎదుర్కునే అణచివేత గురించి కూడా రాస్తారు. ఆమె తల్లీ, అమ్మమ్మా చర్మపు రంగు మార్చుకునేందుకు వాడే నలుగుపిళ్ళ వివరాలుంటాయి పుస్తకంలో. ఆమె కథనంలో స్పష్టంగా కనపడేది తల్లికి తన పిల్లలకు ఉన్నత కులపు చదువు, మధ్య తరగతి పెంపకం అందించాలన్న నిశ్చయం. రచయిత్రి సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల (ఢిల్లీ)లో మూడు వేల విద్యార్థి వేతనం పొంది చదువుకున్నారు. తరువాత, హిందుస్తాన్‌ టైమ్స్, ఏషియన్‌ ఏజ్‌ పత్రికల్లో ఉద్యోగం చేసినప్పుడు, తన కులం బయటపడకుండా– ఉన్నత వర్గాలకు సంబంధం కలిగుండే ఫాషన్, జీవనశైలి వంటి విషయాలే ఎన్నుకునేవారు. 

కథలో– ఆమె జీవితపు సంస్మరణ, సామాజిక వ్యాఖ్యానంతో పాటు దళిత ఉద్యమాల క్లుప్తమైన చారిత్రక శకలాలూ కనిపిస్తాయి. ‘మన దేశంలో ఇంచుమించు ప్రతీ వ్యవస్థలోనూ గేర్లు మార్చే అగోచరమైన చెయ్యి’ వంటి పరిశీలనలు ఉంటాయి. అమెరికా–కొలంబియా యూనివర్సిటీ నుండి జర్నలిజంలో మాస్టర్స్‌ చేశారు దత్‌. ‘‘రోహిత్‌ను అనుకరించాలనుకున్నాను. దళిత హక్కుల కోసం అతను వెలిగించిన బాటను అనుసరిస్తూ, ‘డాక్యుమెంట్స్‌ ఫర్‌ దళిత్‌ డిస్క్రిమినేషన్‌’ మొదలెట్టాను. అక్కడ నాలాంటి వారు తమ తమ కథలను చర్చించుకుంటూ, వారూ బయటకొచ్చే అవకాశం ఉంది’’ అంటారు.  కులవ్యవస్థను– అంబేద్కర్, మహాత్మా గాంధీలు సమీపించిన విధానాల్లో ఉన్న కీలకమైన తేడాలను ఎత్తి చూపిన ఈ పుస్తకాన్ని ‘ఆలెఫ్‌ బుక్‌ కంపెనీ’ 2019 ఫిబ్రవరిలో ప్రచురించింది.
_కృష్ణ వేణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top