నాదం సృష్టించే చేతులు

Asvatthama Specialist For Making Tabla - Sakshi

తబల, మృదంగం వంటి చర్మవాద్యాల తయారీ అనాదిగా పురుషుల పని. కాని బెంగళూరుకు చెందిన అశ్వత్థమ్మ గత ఆరు దశాబ్దాలుగా ఈ కళలో ఆరితేరారు. నాదాన్ని సృష్టించే చేతులు స్త్రీలవి కూడా కాగలవని నిరూపించారు.

భారతీయ సంప్రదాయ సంగీతంలో కొన్ని వందల వాద్య పరికరాలు ఉన్నాయి. అందులో కొన్ని తంత్రీ వాద్యాలైతే, కొన్ని చర్మ వాద్యాలు.  వీటిని తయారుచేయటానికి ఎంతో కొంత సంగీత పరిజ్ఞానం ఉండాలి. స్వరస్థానాలను గుర్తించగలిగే శక్తి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక వాద్య పరికరం శృతిపక్వంగా తయారవుతుంది. ముఖ్యంగా తబలా, మృదంగం వంటివి తయారు చేయటం చాలా కష్టం. వాటి తయారీకి కలపతోపాటు జంతు చర్మాలను ఉపయోగిస్తారు. సాధారణంగా వీటిని మగవారే తయారుచేస్తారు. కాని పురుషులకు ఏ మాత్రమూ తీసిపోను అంటూ ఇప్పటి వరకు 10 వేల పరికరాలు తయారుచేశారు బెంగళూరుకు చెందిన అశ్వత్థమ్మ.

‘‘మా వారు ఆర్‌ ఎస్‌ అనంతరామయ్య సంగీతకారులు. ఆయన తబలా, మృదంగ వాద్యాలలో నిపుణులు. నా పదిహేనో ఏట నాకు వివాహమైంది. నేను వంటతోపాటు మావారి దగ్గర వాద్యపరికరాల తయారీ, వాటిని బాగు చేయటం రెండూ నేర్చుకున్నాను.’’ అంటున్న అశ్వత్థమ్మ బెంగళూరు బాలాపేట్‌ సర్కిల్‌లోని శాంతా తబలా వర్క్స్‌లో పని చేస్తున్నారు. ‘‘ఈ పరికరాల తయారీకి శారీరక బలం చాలా అవసరం. గట్టి గట్టి దెబ్బలు కొడుతూ వాద్యాలు తయారు చేయడం మగవారికి మాత్రమే అలవాటు. అటువంటిది నా కండ బలంతో ఈ కళలో నైపుణ్యం సాధించాను’’ అంటారు 75 సంవత్సరాల అశ్వత్థమ్మ. సంగీతానికి సంబంధించి ఎటువంటి కోర్సులు చేయలేదు అశ్వత్థమ్మ. స్కూలు చదువులు కూడా లేవు. కాని, వాద్యపరికరాలు తయారుచేసేటప్పుడు అందులో పలికే అపశృతులను గుర్తించగలరు. వాటిలోని మాధుర్యం తెలుసుకోగలరు. బెంగళూరులో ఎవరికి వాద్యపరికరాలు కావాలన్నా శాంతా తబలా వర్క్స్‌కి రావలసిందే.

అశ్వత్థమ్మ భర్త అనంతరామయ్య దేవాలయాల్లోను, నాటకాలలోను తబలా, మృదంగం వాయించేవారు. ఆ రోజుల్లో కచేరీలకు పెద్దగా డబ్బులు వచ్చేవి కాదు. అందువల్లే వాద్యపరికరాల తయారీ ప్రారంభించారు. అశ్వత్థమ్మ ఆ పని నేర్చుకున్నారు. భార్యాభర్తలు ఈ పనులు చేస్తున్నందుకు బంధువుల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ‘‘వాద్యపరికరాలను జంతు చర్మాలతో చేస్తారని అందరికీ తెలిసిందే. మా కుటుంబమంతా దేవాలయాలలో పనిచేసేవారు. మేము జంతుచర్మాలతో పనిచేస్తున్నందుకు, మమ్మల్ని దూరం పెట్టారు. మగవారు చేసే మృదంగం పనులు చేయటం ఎందుకు అంటూ నన్ను ఎగతాళి చేసేవారు. వాస్తవానికి జంతుచర్మాలతో తయారుచేసే పరికరాలకు శక్తి కంటె తెలివి ఉండాలి’’ అంటారు అశ్వత్థమ్మ.

తబలాను రిపేర్‌ చేయడానికి వారం రోజులు, మృదంగమైతే పది రోజుల సమయం పడుతుంది. ఈ వాద్యాలను  పనస చెక్క, మామిడి చెక్కలతో పాటు ఇతర చెక్కలతోను తయారు చేస్తారు. ఆవు, గేదె, మేక చర్మాలను పరికరాల తోలుకోసం ఉపయోగిస్తారు. ‘‘నేను సుమారు వంద రకాల వాద్య పరికరాలను తయారు చేస్తాను. ఇప్పటివరకు కొన్ని వందల రిపేర్లు చేశాను’’ అంటారు ఆమె. ప్రముఖ సంగీత విద్వాంసులందరూ అశ్వత్థమ్మ దగ్గరే బాగు చేయించుకుంటారు. ఈ అరవై సంవత్సరాలలో అశ్వత్థమ్మ చేతి నుంచి 10000 వాద్యపరికరాలు కళాకారుల చేతుల్లోకి వెళ్లాయి. తబలా, మృదంగం, ఢోలక్, ఢోల్కీ, ఢమరుకం, నగారీ, కంజరా వంటివి తయారవుతుంటాయి. ‘మా వారికి కర్ణాటక కళాశ్రీ బహుమతి వచ్చింది. ప్రస్తుతం మా అబ్బాయి శ్రీనివాస్‌ ఈ సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నాడు’ అంటూ సంతోషంగా చెబుతారు అశ్వత్థమ్మ.
 

– వైజయంతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top