తెలుగు కథకు చార్మీనార్‌ నెల్లూరి

తెలుగు కథకు చార్మీనార్‌ నెల్లూరి - Sakshi


నెల్లూరి కేశవస్వామి కథల్లో ఆనాటి దేవిడీలు, కోఠీలు, దివాన్‌ ఖానాలు, నానా ఖానాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. నవాబులు, నవాబ్‌ పాషాలు, దుల్హన్‌ పాషాలు, బేగం సాహెబాలు, ఖాజీలు, హకీం సాబ్‌లు, ఇమామ్‌లు, మౌల్వీలు, ఉస్తాద్‌లు ఈ రోజు లేరు. వారు ధరించిన షల్వార్‌లు, దుపట్టాలు, కమీజులు, చమ్కీలు, ఘాఘ్రాలు వాడుకలో పెద్దగా లేవు. అయినా కేశవస్వామి సాహిత్యంలో ఇవన్నీ భద్రపరచబడి ఉన్నాయి. ఆయన కథలు చదువుతూ ఉంటే సాలార్‌జంగ్‌ మ్యూజియంలో గత వైభవ చిహ్నాల్ని చూసి తబ్బిబ్బయినట్లు ఉంటుంది.



నెల్లూరి కేశవస్వామి (1920–1984) హైదరాబాదు దక్కన్‌లో పుట్టి, హైదరాబాదులోనే పెరిగి, ఇక్కడే నీటి పారుదల శాఖలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేసి, ఉన్నత శ్రేణి కథకుడిగా ఎదిగారు. నిజాం పాలన నాటి రోజుల్ని, స్వతంత్ర భారతంలో క్రమంగా మారుతూ వచ్చిన పరిస్థితుల్ని స్వయంగా చూసిన వ్యక్తి. ముఖ్యంగా 13–17 సెప్టెంబర్‌ 1948న యూనియన్‌ సైన్యాలు హైదరాబాద్‌ నగరాన్ని చుట్టు ముట్టి ఆక్రమించుకోవడం, నిజాం లొంగిపోయి తన స్వతంత్ర రాజ్యాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చెయ్యడం... వాటిని పూసగుచ్చినట్లు ‘యుగాంతం’ కథలో అక్షరీకరించిన రచయిత. ఫ్యూడల్‌ రాజ్యానికి చరమ గీతం పాడిన సృజనకారుడు.



అప్పుడు జరిగిన మార్పుల్లో శుక్రవారం సెలవు ఆదివారానికి మారింది. దక్కన్‌ రేడియో ఆలిండియా రేడియో అయ్యింది. కల్దారు నాణాలు చెల్లకుండా పొయ్యాయి. పాఠశాలల్లో ఉరుదూ మీడియం మారిపోయింది. షేర్వాణీలు, రూమీ టోపీలు మాయమవుతూ వచ్చాయి. ఒక గొప్ప ఫ్యూడల్‌ రాచరికపు చిహ్నంగా చార్మీనార్‌ తలెత్తుకు నిలబడింది. అయితే కేశవస్వామి దాన్ని ఉన్నదున్నట్లుగా శ్లాఘించలేదు. ఆ వ్యవస్థలోని అవలక్షణాల్ని ఈసడిస్తూనే మనుషులుగా హిందూ ముస్లింల స్నేహాన్ని ఆకాంక్షించారు. ఒక చారిత్రిక నేపథ్యాన్ని ఒక సాంస్కృతిక నేప«థ్యాన్ని తన కథల్లో నిక్షిప్తం చేస్తూనే, ఒక మహారచయిత ఎదగాల్సిన స్థాయికి ఎదిగారు. కానీ ఎందువల్లనో  ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంది.



నెల్లూరి కేశవస్వామి కథల్లో నాటి కట్టడాలు, భవనాలు, తినుబండారాలు, ఆస్తులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆనాటి దేవిడీలు, కోఠీలు, దివాన్‌ ఖానాలు, నానా ఖానాలు ఈ అరవైయేళ్ళలో చాలావరకు ధ్వంసమైపొయ్యాయి. నాటి నవాబులు, నవాబ్‌ పాషాలు, దుల్హన్‌ పాషాలు, బేగం సాహెబాలు, ఖాజీలు, హకీం సాబ్‌లు, షేక్‌ ఇమామ్‌లు, మౌజ్జన్‌లు, మౌల్వీలు, మామాలు, ఉస్తాద్‌లు ఈ రోజు లేరు. వారు ధరించిన షల్వార్‌లు, దుపట్టాలు, కమీజులు, చమ్కీలు, ఘాఘ్రాలు వాడుకలో పెద్దగా లేవు. అయినా కేశవస్వామి సాహిత్యంలో ఇవన్నీ భద్రపరచబడి ఉన్నాయి. ఆయన కథలు చదువుతూ ఉంటే సాలార్‌జంగ్‌ మ్యూజియంలో గత వైభవ చిహ్నాల్ని చూసి తబ్బిబ్బయినట్లు ఉంటుంది.



హైదరాబాదులోని ఇన్ని సాంస్కృతిక వైరుధ్యాలు ఇంత ప్రతిభావంతంగా మరే తెలుగు రచయిత తమ కథల్లో వ్యక్తీకరించలేదని అంటే అతిశయోక్తి కాదు. దలావర్, నజ్మీ, అమీనా లిబ్నా, హసన్, రజియా, కమల్‌రాయ్, బిల్కిస్, మహబూబ్‌రాయ్‌ సక్సేనా, ఇక్బాల్, గులాం, రమణి, బిందు, రాధ వంటి పాత్రలు ఈయన కథల్లో కనిపిస్తాయి. డబీర్‌పురా, మీర్‌ ఆలంమండి, చార్‌ కమాన్‌ లాంటి సంఘటనా స్థలాలు తారసపడతాయి. చాయ్, పాన్, ఖూబానీకా మీఠా, నవాజ్, షర్బత్, ఈద్‌ లాంటి మాటలు నాటి సాంస్కృతిక చిహ్నాలుగా ఇప్పటికీ మనకు హైదరాబాద్‌లో వినిపిస్తూ ఉన్నాయి.



ఆ రోజుల్లో మామూలుగా వినిపించే తఖల్, చాదర్, ఖుష్కా, మెహద్‌ జౌహారీ, పాతెహా... ముస్లిం పరదాల వెనుక, బుర్‌ఖాల వెనక, వినబడే అనేకానేక మాటలు, పలుకుబళ్ళు, సామెతలు, నానుడులు, జీవనగాథలు, వెతలు కేశవస్వామి కథల్లో నమోదై ఉన్నాయి. కేవలం ఆయన మాత్రమే ఎలా నమోదు చేయగలిగారంటే ఆయనకు చిన్నప్పటి నుండి బాల్య స్నేహితులు ఎక్కువ మంది ముస్లింలు ఉండటం, తెలుగుతో పాటు ఉరుదూ కూడా ధారాళంగా మాట్లాడగలగడం, ఇంజనీర్‌గా ఉన్నతోద్యోగంలో ఉండడం వల్ల నవాబ్‌లతో స్నేహం పెరగడం, వారితో విందులు, వినోదాలలో పాలు పంచుకోవడం వగైరా ఎన్నో కారణాలున్నాయి. భాష పట్ల, మానవ ప్రవృత్తి పట్ల, రచయితగా ఒక పరిశీలనా దృష్టి ఉండటం వల్ల ఆయన హైద్రాబాద్‌ సంస్కృతి నేపథ్యంలోంచి కథలు రాయగలిగారు. ఆయనకు మాత్రమే వీలయ్యింది. తన కెదురైన జీవితాన్ని రచయితగా అశ్రద్ధ చేయలేదు.



హిందూ ముస్లిం విభేదాల్ని పక్కన పెట్టి, షియా సున్నీ భేదం పక్కన పెట్టి మేం ‘‘కేవలం మనుషులం’’ అని ప్రకటించి ఒక ప్రేమికుల జంట ఒకటవుతారు. మతాలు మారకుండానే భార్యా భర్తలుగా మనగలమని ‘కేవలం మనుషులం’ కథలో ధైర్యంగా ప్రకటిస్తారు. ‘వంశాంకురం’ కథ మత సంప్రదాయాలకు అతీతమైన మానవీయ సంబంధాలను ఎలుగెత్తి చాటింది. హైద్రాబాద్‌ డబీర్‌పురాలోని అమీన అనే అమ్మాయి దుబాయ్‌లో షేక్‌ ఇంట్లో ఆయన అనేక మంది భార్యల్లో ఒకతి కావడం, విముక్తి కోసం పెనుగులాడడం ‘ఆఖరి కోరిక’లో వివరించబడింది. నవాబుల ఇళ్ళలో సంగీత సాహిత్యాల అభిరుచి, ఆ స్థాయి, ఆ దర్జా వర్ణించాలంటే సామాన్యులకు వీలుకాదు. ఆ వాతావరణంలో మెలిగి, ఆ మనుషుల అంతరాత్మలు అధ్యయనం చేసిన కేశవస్వామి లాంటి వారికే సాధ్యం! ‘రూహీ–ఆపా’ చదివితే ఆయన కథాకథన వైభవం పాఠకుడి మనసులో జీవితాంతం నిలిచిపోతుంది.



నవాబుల ఇళ్ళలో దాసీలను ఆటవస్తువులుగా వాడుకునే ఆచారాలన్నీ తిరస్కరించిన సుల్తాన్‌ అనే విద్యావంతుడు దాసీనే పెండ్లాడి అలీఘడ్‌ పారిపోయి ఉద్యోగిగా స్థిరపడడం ‘విముక్తి’లో చూస్తాం. ‘ప్రతీకారం’లో పాషా నవాబు గారి అక్రమ సంతానం లచ్చూ అనే హిందూ మహిళకు పుడతాడు. అతను నవాబు కొడుకైనా వారసత్వ హక్కులేవీ ఉండవు. ఆ కసితో ప్రతీకారం తీసుకోవాలను కుంటాడు. నవాబుగారి అసలు కోడలు గుడ్డీరాణిని తన బాహువుల్లోకి ఆకర్షిస్తాడు. మరో కథ ‘అదృష్టం’లో నవాబు పశుబలంతో సర్రాఫ్‌ (కాషియర్‌) భార్య శీలాన్ని హరిస్తే, నవాబు రెండో భార్య తనకన్నా పన్నెండేళ్ళు చిన్నవాడైన సర్రాఫ్‌ కొడుకుని చేరదీసి, పెండ్లి చేసుకుంటుంది. చట్టానికి దొరకకుండా, ఆస్తిపాస్తులు ఇతరులకు పోకుండా, ముస్లిం మత ఆచారాల ప్రకారం జాగ్రత్త పడుతుంది.



షరీఫా అనేది అద్భుతమైన కథ, రాత్రి మందు పార్టీలో పాల్గొన్న ఒకతను ఇంటికి వెళుతూ ఉంటే రిక్షావాడు ఆపి, రిక్షాలో ఉన్న వేశ్యను చూపిస్తాడు. ఆమె అతణ్ణి తన గదికి తీసుకువెళ్ళి, బట్టలిప్పుకుని పక్కన కూర్చుంటుంది. అతను ఆమె వక్షోజం తాకుతాడు. అతని ముఖం మీద పాలు చిమ్ముతాయి. ఆమె అతనికి క్షమాపణ చెప్పి, పరదా వెనుక ఏడుస్తున్న చంటి వాడికి పాలు కుడుపుతుంది. అతను తన జేబులోని డబ్బంతా తీసి ఆమె చేతిలో కుక్కి వడివడిగా బయటపడతాడు. బయట ఉన్న రిక్షావాడు ‘‘వెళ్ళొద్దు సాబ్, నా భార్య మొండి ముండ సాబ్, నేను సర్ది చెబుతాను సాబ్‌’’ అని ప్రాధేయపడతాడు.



‘‘నేనెవరి దగ్గరా భిక్షం తీసుకోను’’ అని బయటకి వచ్చిన షరీఫా క్రోధంగా కేకలేస్తుంది. ‘ఆ ఇచ్చిన డబ్బు తనకు కాదని చంటిబాబుకు కానుక’ అని చెప్పి, విటుడు చీకటిలో మాయమవుతాడు. నాలుగు పేజీల చిన్న కథలో ఒక పూర్తి జీవితాన్ని చిత్రించిన తీరు ఒక అద్భుతమైతే, ప్రతి పేజీలో ఒక మలుపుతో ఉత్కంఠ భరితంగా రాయడం మరో ఎత్తు. బీదరికం, ఆకలి చెప్పకుండానే చెప్పడం, సెక్స్‌కథలా నడిపించి దాన్ని మాతృత్వంలోకి మళ్ళించడం, భర్త అనుమతితో వ్యభిచరించి డబ్బు గడిస్తున్న స్త్రీకి కూడా ఒక నీతి ఉండడం, చివరిగా వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఆ విటుడు డబ్బిచ్చి చంటి బాలుడికి కానుక అనడం వల్ల, రచయిత ఉదాత్తంగా, హుందాగా కథను ముగించినట్లయ్యింది.



ఇది హైదరాబాదు పాతబస్తీలోని సందుల్లోంచి తీసుకున్న ఇతివృత్తమైనా, ఇందులో విశ్వజనీనత ఉంది. మానవ జీవితంలోని దైన్యం, విషాదం ఉన్నాయి. మనం మనుషులమని గర్వంగా చెప్పుకో గలిగే అంశమూ ఉంది. హైద్రాబాద్‌ సాంస్కృతిక చిహ్నంగా చార్మీనార్‌ నిలబడినట్లే కేశవస్వామి కథల సంపుటి ‘చార్మీనార్‌’ కూడా అలాగే నిలబడింది. ఇందులో హైదరాబాద్‌ తెలుగు భాష ఒక మినార్, సంస్కృతి ఒక మినార్, రాజకీయ నేపథ్యం ఒక మినారయితే సామాజికాంశాలు మరో మినార్‌!



డాక్టర్‌ దేవరాజు మహారాజు

9908633949

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top