చెల్లి పాదాల చెంత | Army Employees Helps College Sister Marriage | Sakshi
Sakshi News home page

చెల్లి పాదాల చెంత

Jun 19 2019 11:40 AM | Updated on Jun 19 2019 11:40 AM

Army Employees Helps College Sister Marriage - Sakshi

వధువు శిశికళ నడిచేందుకు చేతులు పరుస్తున్న సైనికులు : అన్న లేని లోటును ఈ అన్నయ్యలు తీర్చారు

ఆడపిల్లని తండ్రి గుండెల మీద పెంచుతాడు.అన్నదమ్ములు కనురెప్పల్లా చూసుకుంటారు.తండ్రి గుండెల్లోని ప్రేమను.. అన్నదమ్ములు ఇచ్చే భద్రతను..ఈ సైనిక సోదరులు శశికళకు పంచి ఇచ్చారు.
అరిచేతుల మీదుగా అమెను ఏడడుగులు వేయించారు!

శశికళ పెళ్లి. అందరూ ఉన్నారు. అన్నయ్యే లేడు. అతడెందుకు పెళ్లి రాలేదు! రాలేనంత దూరంలో ఉన్నాడు. బిహార్‌కు జమ్మూకశ్మీర్‌ ‘రాలేనంత’ దూరం కాదే! కాదు కానీ, అతడు మాత్రం తిరిగి రాలేనంత దూరాలకు వెళ్లిపోయాడు. 2017 నవంబర్‌ 18న జమ్ముకశ్మీర్‌లోని బండిపొరా ప్రాంతంలోని ఒక ఇంట్లో నక్కి ఉన్న ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేందుకు ఢిల్లీలోని హై కమాండ్‌ నుంచి వచ్చిన ఆదేశాలతో ముందుకు ఉరికిన ‘గరుడ కమెండో ఫోర్స్‌’ సైనికుడు జ్యోతి ప్రకాష్‌ నిరాలా అతడు. లైట్‌ మెషీన్‌ గన్‌తో ఆరుగురు భయంకర ఉగ్రవాదుల్ని హతమార్చి, ఆ పోరులో శత్రువు తూటాలకు బలయ్యాడు. ఆ ఆరుగురిలో ఇద్దరు 2008 ముంబై పేలుళ్ల సూత్రధారులకు సమీప బంధువులు! వాళ్లను అంతమొందించడం ద్వారా జ్యోతి ప్రకాష్‌ భవిష్యత్తులో జరగబోయే దాడుల్ని నివారించాడు. అతడి మరణానంతరం భారత ప్రభుత్వం అతడికి అశోక చక్రను ప్రకటించింది.

జ్యోతి ప్రకాష్‌ నిరాలా చెల్లి శశికళ పెళ్లికి వచ్చిన గరుడ కమెండో ఫోర్స్‌ (భారత వైమానిక దళం) సైనికులు
పెళ్లింట్లో అన్న లేడు. అన్నకు వచ్చిన అశోకచక్ర ఉంది. అందులోంచి అన్న దీవిస్తున్నట్లుగా ఉంది.  శశికళ పెళ్లికి ఆమె అన్న సేవలు అందించిన గరుడ ఫోర్స్‌ నుంచి యాభైమంది జ్యోతిప్రకాష్‌లు వచ్చారు. అవును. సొంత అన్నయ్యల్లా వాళ్లంతా కొద్ది గంటలు సెలవు పెట్టి శిశకâ¶  పెళ్లికి వచ్చారు. పెళ్లి పెద్దలు వాళ్లే అయ్యారు. పెళ్లి ఏర్పాట్లూ వాళ్లే చేశారు. పెళ్లి ఖర్చూ వాళ్లే భరించారు. చేతి పట్టున ఉంచమని ఆ చెల్లికి 5 లక్షల రూపాయలను ఇచ్చారు. గరుడ ఫోర్స్‌లో వందల మంది సైనికులు ఉంటారు. వాళ్లంతా తలా ఇంత అని జమచేస్తే కూడిన మొత్తం అది. కానుకగా డబ్బు ఇచ్చారు. ‘దీర్ఘసుమంగళీ భవ’ అని ఆశీర్వదించి, అక్షింతలు వేశారు. అయితే అక్కడితో తమ సహచరునికి నివాళి ఇచ్చినట్లవుతుందని అనుకోలేదు. ఇంకా ఏదైనా చెయ్యాలని అనుకున్నారు. తమ అరచేతుల మీద నవ వధువుని నడిపించుకున్నారు! బిహార్‌లో అది సంప్రదాయం అవునో కాదో. ఈ సైనికులు మాత్రం ఒక మంచి సంప్రదాయానికి అరిచేతులిచ్చారు. ఇది ఒక వందన సమర్పణ కన్నా తక్కువేం కాదు.

గరుడపక్షికి హృదయం ఉంటుందా? పదిహేనేళ్ల క్రితం భారత వైమానిక దళం ‘గరుడ కమెండో ఫోర్స్‌’ని ప్రారంభించినప్పుడు గరుడపక్షికి ఉండే వేగం, బలం.. ముఖ్యంగా ఆ నిశితమైన చూపును దృష్టిలో పెట్టుకుని ఈ వాయుసేనకు గరుడ కమెండో అని పేరు పెట్టింది. అయితే గరుడకు వేగం, బలం, నిశితమైన చూపు మాత్రమే కాకుండా హృదయం కూడా ఉంటుందని ఈ చిన్న సంఘటన రుజువు చేసింది. ఇక్కడ గరుడ పక్షి అంటే పక్షి కాదు. గరుడ సైనికుడు. ఆ సైనికుడి హృదయం ఎంత మెత్తనో చెప్పుకునే ముందు అతడి విధులు ఎంత గట్టివో తెలుసుకోవాలి. వైమానిక స్థావరాలను కంటికి రెప్పలా కాపాడటం గరుడ బాధ్యత. అదొక్కటే కాదు విపత్తులలో గల్లంతైనవారి కోసం ప్రాణాలొడ్డి అన్వేషిస్తారు. ఇళ్లు కోల్పోయినవారిని పునరావాస కేంద్రాలకు క్షేమంగా తరలిస్తారు. ఇవన్నీ చిన్న పనులు. పెద్ద పని ‘పీస్‌ కీపింగ్‌’. ఏ దేశంలోనైనా అస్థిర పరిస్థితులు ఎంతకూ తగ్గుముఖం పట్టకుండా ఉన్నప్పుడు అక్కడ శాంతిని, సుస్థిరతను నెలకొల్పేందుకు విమానాలు వేసుకుని వెళతారు.

అక్కడే ఉండిపోతారు. అక్కడి వైరివర్గాలు వీళ్లపై దాడులు చేయడానికి వస్తాయి. తప్పించుకుంటారు. అంతే తప్ప ‘ఆపరేషన్‌’ కంప్లీట్‌ అయ్యేవరకు అక్కడి నుంచి కదలరు. లోకల్‌గా ఉగ్రవాదుల పైకి వెళ్తారు. బోర్డర్‌లో యుద్ధ పిపాసుల మీదకూ వెళ్తారు. మొత్తం 1500 మంది ఉంటారు. ఢిల్లీలోని హెడ్‌క్వార్టర్స్‌ నుంచి వాయు వేగంతో కదిలి సమస్యాత్మక ప్రాంతంలో ల్యాండ్‌ అవుతారు. టఫ్‌ జాబ్‌. డైరెక్ట్‌ యాక్టన్‌ అండ్‌ ఎటాక్‌. మొత్తం మీద రెండే గరుడ డ్యూటీలు. విజయమో, వీరస్వర్గమో. ఒక అశోకచక్ర అవార్డు ఉంటుంది. నాలుగు శౌర్యచక్ర అవార్డులు ఉంటాయి. ఇంకా అనేకమైన వాయుసేన మెడల్స్‌ ఉంటాయి. అన్నీ అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. గత ఏడాదే శశికళ అన్నయ్య జ్యోతి ప్రకాశ్‌ నిరాలాకు అశోకచక్ర అవార్డు వచ్చింది. నేలమీద జరిగిన ఫైట్‌కు ఈ అవార్డు అందుకున్న తొలి నింగి సైనికుడు జ్యోతి ప్రకాశ్‌. బిహార్, రోహ్‌తాక్‌ జిల్లాలోని బద్లాది గ్రామం నుంచి సైన్యంలోకి వచ్చాడు. గరుడ ఫోర్స్‌ మొదలైన మరుసటి సంవత్సరంలోనే లేత వయసులో సర్వీస్‌లోకి వచ్చాడు. రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ముఖాముఖి పోరులో ఆరుగుర్ని హతమార్చి తను అమరుడయ్యాడు.దేశంకోసం ప్రాణాలర్పించిన సైనికుడి రుణాన్ని ప్రభుత్వం అవార్డు ఇచ్చి తీర్చుకుంటే.. సాటి సైనికులు ఆ అమరవీరుడి చెల్లెల్ని తమ చేతులపై నడిపించుకుని రుణం తీర్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement