దొంగ సర్వేలతో బాబు, ‘భజంత్రీ’లు!

ABK Prasad Article On Chandrababu Naidu - Sakshi

రెండో మాట

ఆంధ్రప్రదేశ్‌ పత్రికా వ్యవస్థ విశ్వసనీయతనే రెండు పత్రికలు/రెండు మూడు ఛానళ్లూ దెబ్బతీశాయి. జాతీయ స్థాయిలో పేరున్న ‘లోక్‌నీతి– సీఎస్‌డీఎస్‌’ సర్వే సంస్థలు, ఇతర సర్వే సంస్థలు మార్చి 11–19 తేదీల మధ్య నిర్వహించిన సర్వేలో వైఎస్సార్‌సీపీ గెలుపును ఖాయపరుస్తూ ఫలితాలు ప్రకటించగా, వాటిని ‘ఉల్టా’ చేసి ‘టీడీపీదే అధికారం’ అంటూ సొంత డబ్బాకు బాబు ‘పత్రికలు’ దిగజారాయి. ఈ వార్తను ‘లోక్‌నీతి’ సర్వే సంస్థ అధిపతి ప్రొఫెసర్‌ వెంకటేష్‌ వెంటనే ఖండించవలసి వచ్చింది. మీడియాలో కొంతభాగం అవినీతికర ప్రభుత్వాలకు  నిత్య ‘భజంత్రీ’లుగా మారి ప్రజలను రకరకాల ప్రలోభాలకు గురి చెయ్యడానికి వెనుదీయడం లేదు.

‘‘మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఎన్నికల్లో అధికార దుర్వినియోగం ద్వారా అవినీతికి పాల్పడినప్పుడు అలహాబాద్‌ హైకోర్టు ఆమె ఎన్నికను కాస్తా రద్దు చేసింది. ఆమె అందుకు ప్రతిగా చేసిన పని దేశంలో ఎమర్జెన్సీని (అత్యవసరపరిస్థితి) ప్రకటించి వాక్, సభా పత్రికా, సమావేశ సప్త స్వాతంత్య్రాలను ప్రజలకు నిలిపివేయడం. ఆ సమయంలో దేశప్రజల వెన్నుదన్నుగా ఉండి, అండదండలు అందించవలసిన కొన్ని దేశవాళీ పత్రికలు చేవచచ్చి ప్రభుత్వానికి ఉంపుడు పత్రికలుగా (కెప్ట్‌ ప్రెస్‌) మారడం స్వతంత్ర భారత చరిత్రలో దుర్దశ.’’
– సుప్రసిద్ధ భారత పాత్రికేయులలో ఒకరైన ఎంఎన్‌ సాహ్నీ చేసిన ఆనాటి ప్రకటన.

స్వతంత్ర భారతంలో తొలి ఎమర్జెన్సీ కాలం తర్వాత తిరిగి అలాంటి పరిస్థితినే ప్రవేశపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీ–పరివార్‌ (ఎన్డీఏ) ప్రభుత్వం, దాని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ బీజేపీ అగ్రనాయ కుడు ఎల్‌కే అడ్వాణీ 2014లో మోదీ అధికారానికి వచ్చిన మూడు, నాలుగు మాసాల్లోనే, ‘త్వరలోనే దేశం మరొక ఎమర్జెన్సీని ఎదుర్కోను న్నద’ని ఒక హెచ్చరిక చేశారు. బహుశా ఆ ప్రకటన దేశంలో మరొక కల్లోలానికి దారితీయగలదని భావించిన బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటనకు సాహసించలేకపోయినా నర్మగర్భంగా భారత రిపబ్లిక్‌కి చెందిన పలు రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని, ఉనికిని నిర్వీర్యం చేస్తూ రావటాన్ని ప్రజలు ప్రత్యక్ష అనుభవంలో చూస్తున్నారు. అలాగే, ‘మోదీ సునామీ దేశాన్ని జాగృతం చేసింది కాబట్టి ఇక 2019లో ఎన్నికలు ఉండబోవు’ అని గత నెల 16న ఉన్నావ్‌ సభలో సాక్షాత్తూ బీజేపీ ఎంపీ సాక్షీ మహారాజ్‌ చెప్పారు.

ఈ వరుసలోనే, సరిగ్గా అలాంటి ఆలోచనలతోనే ఎదుగుతున్న వారు.. మాటకు, చేతకు నిలబడని అబద్ధాల రాయుడు ప్రస్తుతానికి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు. రాష్ట్రాన్ని, పరిపాలనా వ్యవస్థను అయిదేళ్ల పాలనలో బాబు ఏస్థాయికి తీసుకువచ్చారో ఇటీవల టీవీ చానెల్‌ ఇష్టాగోష్టి చర్చల సందర్భంగా పాల్గొన్న వివిధ స్థాయి కేంద్ర, రాష్ట్ర సంస్థల మాజీ ఉన్నతాధికారులు స్పష్టం చేయకతప్పలేదు. ‘అయిదేళ్ల బాబు పాలన అంతా అవినీతిమయమ’ని త్రిపురనేని హనుమాన్‌ చౌదరి ప్రకటించగా, ‘రెండున్నర లక్షల కోట్ల రూపాయల రుణభారంతో, పరి మితి దాటిన ఓవర్‌డ్రాఫ్ట్‌తో ఏపీ ఆర్థిక వ్యవస్థను ఇంతగా ముంచి వేయడం రాష్ట్ర చరిత్రలోనే లేదు’ అని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవీఆర్‌ కృష్ణారావు, అజయ్‌ కల్లం సాధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది. ఇక ఈ కాలంలోనే రాజకీయాల్లో విచ్చలవిడిగా ధనసంచులు వెదజల్లి పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు గెల్చుకునే సంస్కృతి జడలు విప్పుకుని నర్తించడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ అవినీతి పద్ధతులవల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతున్నవి ధనికవర్గ రాజకీయ పార్టీలే. ఈ ఎన్నికలు రాజకీయ లంచగొండితనంలో మునగానాం, తేలానాంగా మారిపోయాయని ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ప్రణబ్‌రాయ్, దోరబ్‌ సోపర్వాలా తమ తాజా గ్రంథం ‘ది వర్డిక్ట్‌’లో పేర్కొన్నారు.

కేంద్ర రాష్ట్రాల్లో పలువురు పాలకులు ఈ అవినీతి వెంపర్లాటలో తలమునకలవుతున్నందువల్లనే తమను ప్రశ్నించే పాత్రికేయులన్నా, అలాంటి మీడియా సంస్థలన్నా ప్రభుత్వాధినేతలకు కంటగింపుగా ఉంటోంది. అయితే కొంత భాగం మీడియా (ప్రసార మాధ్యమాలు) మాత్రం అధికారంలో ఉన్న కొన్ని అవినీతికర ప్రభుత్వాలకు బాహా టంగా నిత్య ‘భజంత్రీ’లుగా మారి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, రకరకాల ప్రలోభాలకు గురిచెయ్యడానికి ఎన్నికలలో వెనుదీయడం లేదు. అందుకే భారత్‌ సీనియర్‌ సంపాదక పాత్రికేయ దిగ్గజాలలో ఒక రైన ఎ.ఎన్‌. సాహ్నీ ఎమర్జెన్సీ రోజుల్లో కొన్ని పత్రికలు నిర్వహించిన నీచ మైన పాత్రను పాలకవర్గ ‘బాకాలు’ లేదా ‘భజంత్రీలు’ అన్న సౌమ్య పదజాలంతో గాకుండా అత్యంత కఠినంగా ‘ఉంచుకున్న(ఉంపుడు) పత్రికలు’గా అభివర్ణించవలసి వచ్చింది.

ఈ బాగోతంలో బాబు హయాంలో రెండు మూడు పత్రికలు, రెండు మూడు ఛానళ్లూ వంధిమాగధులుగా మారి, వ్యాపార ప్రకటన లను బహుళ స్థాయిలో వేల కోట్ల రూపాయల మేర అందుకోవడమే కాకుండా బలమైన ప్రతిపక్షాన్ని అసెంబ్లీ లోపల, వెలుపలా అడ్డగోలు వ్యూహాలతో అణచివేసే లక్ష్యంతో బాబు వక్ర చేష్టలకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కొమ్ముకాస్తూ వచ్చాయని మరవరాదు. అందుకు ముద రాగా వాటికి కోట్ల రూపాయలలో ‘పారితోషికాలు’ ముట్టడం బహి రంగ రహస్యం. ఈ రెండు మూడు పత్రికల్లో ఛానళ్లలో పనిచేస్తూ ఇప్పటి నీచ ప్రచారంలో భాగస్వాములైన పాత్రికేయులుగా చెలామణి అవు తున్న కొందరు నేను గతంలో ఎడిటర్‌గా పనిచేసిన కొన్ని దిన పత్రిక లలో పనిచేసినవారే. వారిలో ఒకరికి పలుకూ, మాట ఉంటుంది గానీ ‘ఉలు’కెక్కువ, ఆయన దృష్టిలో వైఎస్సార్‌సీపీ అధినేత ప్రతిపక్ష నాయ కుడు జగన్‌మోహన్‌రెడ్డి సభలకు జనాలైతే వస్తున్నారుగానీ, ‘ముఖ్య మంత్రి కావడానికి ఆయన వయస్సే అననుకూలం’ అట.

వ్యతిరేకతను కక్కలేక కక్కడం అంటే అదేమరి. శ్రీశ్రీని తెగడదల్చుకున్నవాడు ముందు పొగిడినట్టే పొగిడి ‘అయితే’ అంటూ మొద లుపెట్టాడంటే దాన్ని పొగడ్త వెనుకే విషం కక్కడం అనేవారు చలం. ఇక రెండో వాడు న్నాడు– అతనికి బాబు సీఎం అయితే, తానొక పిల్ల జమిందారు ఫోజులో ‘ఉపముఖ్యమంత్రి’గా వ్యవహరిస్తూ వచ్చిన రోజుల్ని మర వలేం. ఇక ఈ రెండో ‘పెద్దమనిషీ’, మొదటి ‘పెద్దమనిషీ’ ఆదిలో ఠికాణా లేక పోయినా బాబు పంచలో చేరి ఆయన మాదిరే కోట్లకు పడ గలెత్తి టీవీ ఛానళ్లకు, పత్రికలకు అధిపతులయినవాళ్లే. మరో ముచ్చట– అలనాటి మన పాత్రికేయ అనామక ‘ఉప ముఖ్యమంత్రి’, ఆనాడు ప్రజ లకు టోపీ పెట్టి ‘గ్లోబల్‌ ట్రస్ట్‌బ్యాంకు’ దివాళా తీసే స్థితిలో ఉండగా దాని అధిపతి హోదాలో ఉన్న గెల్లీ నుంచి ‘కొంత సొమ్ము’ను (కొందరు నాలుగైదు కోట్లు అంటారు) ముదరాగా పుచ్చుకుని తాత్కాలికంగా బయటపడవేశాడని ఆనాడే లోకం కోడై కూసింది. అన్నట్టు ఈ ‘జంట’ మరొక వ్యాపారంలో కూడా చేయి తిరిగిన వాళ్లే– ఒక పెద్ద లారీ కొని దాన్ని దేశమంతా తిప్పడానికి నేషనల్‌ పర్మిట్‌ సాధించి లాభించింది కూడా బాబు తొలి హయాంలోనే. ఇలా ఈ ‘వటులు’ ఇంతై ఇంతింతై, నభో మండలానికల్లంతై అనేలా సంపాదనాపరులు కావటంలో ఆశ్చర్య పోవలసింది లేదు. ఈ కార్యకలాపాలు బాహాటంగానూ, లోపాయికారి గానూ సాగుతున్న కాలంలోనే కలకత్తా నుంచి వెలువడుతున్న ‘టెలి గ్రాఫ్‌’ పత్రికలో కనీసం ఒక డజనుమంది ఈ అమాంబాపతు ‘పాత్రి కేయుల’ ప్రత్యక్ష పరోక్ష గుట్టుముట్టులను వారి పేర్లతో సహా బయట పెట్టడం అందరికీ తెలిసిన రహస్యమే. ఈ బాగోతానికి కొన సాగింపు గానే సర్వే ఫలితాలు కూడా తారుమారు చేసి చూపుతున్నాయి.

జాతీయ స్థాయిలో పరువూ ప్రతిష్టా సాధించుకున్న ‘లోక్‌నీతి– సీఎస్‌డీఎస్‌’ సర్వే సంస్థలు ఇతర సర్వే సంస్థలు మార్చి 11–19 తేదీల మధ్య నిర్వహించిన సర్వేలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ గెలు పును ఖాయపరుస్తూ ఫలితాలు ప్రకటించగా, వాటిని ‘ఉల్టా’చేసి ‘టీడీ పీదే అధికారం’ అని సొంత డబ్బాకు బాబు ‘ఉంచుకున్న పత్రికలు’ దిగజారాయి. ఈ వార్తను ‘లోక్‌నీతి’ సర్వే సంస్థ అధిపతులు, విశ్లేషకులు ప్రొఫెసర్‌ వెంకటేష్‌ వెంటనే (1.4.2019)న టీవీ ఛానల్‌ ద్వారా ఖండిం చవలసి వచ్చింది. ‘నేను ఓడిపోతే నాకు కుటుంబం ఉంది. భార్య, కొడుకు, మనవడు’ ఉన్నాడని ఓటమిని ముందే అంగీకరిస్తూ బాబు ముందే (2.4.2019) ప్రకటన విడుదల చేసి ఉన్నందున తాను ‘ఉంచు కున్న పత్రికలు’ కాస్తా బాబుగారి ఎన్నికల గాయంపైన కారం చల్లి నట్లయింది. బాబు బినామీలంతా వరస వారీ ఐటీ/ఈడీ దాడులతో, సోదాలతో తలోదారి చూసుకుంటున్న దశలో దింపుడు కల్లం ఆశతో మిగిలి ఉంది ఇక బాబు ఒక్కరే, కాకపోతే అతని ‘గెస్టపో’ (హిట్లర్‌ రహస్య కూపీగాళ్లు) దళాలు మరికొద్ది రోజులు అండగా ఉంటే ఉండొచ్చు, బహుశా బాబు ఓటమితో వాళ్లూ పరారై పోనూ వచ్చు.

రాష్ట్ర పత్రికా వ్యవస్థ విశ్వసనీయతనే రెండు పత్రికలు/ రెండు మూడు ఛానళ్లూ దెబ్బతీశాయి. బహుశా అందుకే సుప్రసిద్ధ అంత ర్జాతీయ (ఐర్లాండ్‌) పత్రికా విశ్లేషకుడు క్లాజ్‌ కాక్‌బర్న్‌ అని ఉంటాడు: ‘‘ఒక అంశాన్ని నిర్ద్వంద్వంగా, అధికారికంగా ఖండించేంతవరకూ ఏ వార్తనూ నమ్మకండి. ఇది వార్తకు, పత్రికా స్వేచ్ఛ విశ్వసనీయతకు గీటురాయి. విలువలతో కూడిన ఖండనను మాత్రమే విశ్వసించండి’’ అని. ఈ ప్రమాణాలతోనే, ఈ విలువల మధ్యనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంపాదకులు, ప్రసిద్ధ పాత్రికేయులు, కొందరు పత్రికా మేనే జ్‌మెంట్‌ నిర్వాహకులు తమ తమ వ్యక్తిత్వాలనూ, రచనా పాటవాన్ని పెంపొందించుకుని భావనా వ్యాప్తిలో నిలదొక్కుకున్నారు. అంతర్జా తీయ స్థాయిలో కాథరీన్‌ గ్రాహమ్‌ (వాషింగ్టన్‌ పోస్ట్‌), 1971లో అమె రికా వియత్నాం యుద్ధ బీభత్సానికి కారకులైన పెంటగాన్‌ అధినేతలను, రక్షణమంత్రి మక్‌ నమారాను కొరత వేయడానికి దారితీసిన విధా నాలను, పరిణామాలను బహిర్గతం చేసిన ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ అధినే తలూ ఈ కోవలోని వారే! ఈ వరసలోనే నార్మన్‌ పెరల్‌స్టెన్స్‌ ‘ఆఫ్‌ ది రికార్డ్‌’ జర్నలిస్టులకు, వార్త ఆధారాలకు మధ్య ఉండవలసిన హేతుపూ ర్వక సమన్వయాన్ని నొక్కిచెప్పింది.

ఇక మనదేశ పత్రికా రంగ చరిత్రలో ఉద్దండపిండాలైన చింతామణి, సీఎల్‌ఆర్‌ శాస్త్రి, కోటరాజు రామారావు, మణికొండ చలపతిరావు, నార్ల వెంకటేశ్వర్రావు, కోలవెన్ను రామకోటేశ్వ ర్రావు, ఖాసా సుబ్బారావు, కుందుర్తి, ఈశ్వరదత్‌ ప్రభృతులు ఒక్కొ క్కరూ ఒక ‘విజ్ఞాన సర్వస్వంగా పాత్రికేయ నావకు భీకర స్వాతంత్య్ర పోరాట సంద్రంలోనూ, స్వాతంత్య్రానంతర ప్రశాంత జలాల్లోనూ చుక్కాని పట్టి అనేక ఒడిదుడుకుల మధ్యనే దరిచేర్చుతూ వచ్చారు. తిరిగి ఆ స్ఫూర్తిని నవతరం పాత్రికేయ ఔత్సాహికులు వేగంగా అందు కోవాలి. డబ్బులకు అమ్ముడు పోయే దశలో అన్ని ప్రమాణాలను కాల దన్ని కట్టుకథల వార్తల్ని వ్యాపార ప్రకటనలుగా చెప్పకుండా ‘పెయిడ్‌ న్యూస్‌’గా, బాడుగ వార్తలుగా పత్రికలు ప్రకటిస్తూ ఉండటం ధనికవర్గ సమాజంలో ఒక రోగ విద్య. చంద్రబాబు సహా గాడితప్పే ఏ పాలకుడ్న యినా– ‘అధికారాంత మందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌’ అనుకుని ఎదురు తెన్నులు చూడవలసిందే!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top