ఫండ్స్‌ను ఎప్పుడు విక్రయించాలి?

Dhirendra Kumar, Value Research In An Exclusive Interview - Sakshi

నేను కొన్ని మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్‌లు(గ్రోత్‌ ఆప్షన్‌), డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. వీటిపై పన్నులు ఎలా ఉంటాయి? 
– ఫరూక్, హైదరాబాద్‌  

మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్‌లు(గ్రోత్‌ ఆప్షన్‌), డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌పై పన్నులు ఒకే విధంగా ఉంటాయి. మీరు ఏదైనా డెట్‌ ఫండ్‌ గ్రోత్‌ ఆప్షన్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మూడేళ్లలోపే మీరు ఈ ఫండ్‌ యూనిట్లను విక్రయిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన రాబడులను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఫండ్‌ యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, వీటిపై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ రాబడులపై ఇండెక్సేషన్‌ ప్రయోజనాలతో 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఏ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి? ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి అనే విషయాలపై కొంత అవగాహన ఉంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఒక ఇన్వెస్టర్‌గా నేను ఏం చేయాలి? ఫండ్‌ పనితీరు బాగా లేకపోతే ఆ ఫండ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలా ? లేదా వేరే ఫండ్‌లోకి మారిపోవాలా? అసలు  మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను ఏ ఏ సందర్భాల్లో విక్రయించాలో చెబుతారా ? 
– శైలజ, విజయవాడ  

ఒక మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను దీర్ఘకాలం  కొనసాగిస్తే, సంపద అదే పెరిగిపోతుందని చాలా మంది ఇన్వెస్టర్లు అనుకుంటారు. అయితే ఇది అన్ని ఫండ్స్‌కు వర్తించదు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఆ ఫండ్స్‌ పనితీరును తప్పనిసరిగా మదింపు చేయాలి. మంచి రాబడులు ఇస్తుందా లేక ప్రతికూలంగా ఉందా గమనించాలి. ఫండ్‌ పనితీరు అంచనాలకు అనుగుణంగా లేకపోయినా, ఈ కేటగిరిలోని ఇతర ఫండ్స్‌ కన్నా అధ్వానంగా ఉన్నా ఈ ఫండ్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌లోకి బదిలీ చేయాలి. దశాబ్దాలుగా మంచి పనితీరు కనబరిచిన ఫండ్స్‌ పనితీరు అధ్వానంగా ఉంటే పనితీరు మెరుగుపడేదాకా వెయిట్‌ చేయడం ఉత్తమం.  ఫండ్‌ మేనేజర్‌ మార్పు కూడా పరిగణనలోకి తీసుకోదగిన విషయమే. మీ ఫండ్‌ మేనేజర్‌ను సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ తొలగించి వేరే ఫండ్‌ మేనేజర్‌ను నియమించిందనుకుందాం. వెంటనే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చేయాల్సిన పనిలేదు. కొత్త ఫండ్‌ మేనేజర్‌ట్రాక్‌ రికార్డ్‌ను పరిశీలించండి. కొత్త ఫండ్‌ మేనజర్‌ నేతృత్వంలో మీ ఫండ్‌ పనితీరును కనీసం ఆరు నెలల పాటు అయినా మదింపు చేయండి. ఆ ఫండ్‌ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు ఆ ఫండ్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌లోకి మార్చుకోవచ్చు. మీరు రెండు, అంతకంటే ఎక్కువ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారనుకుందాం. ఒకటికి మించిన ఫండ్‌ పోర్ట్‌ఫోలియో స్టాక్‌ హోల్డింగ్స్‌ దాదాపు ఒకే విధంగా ఉంటే, ఏదో ఒక ఫండ్‌ నుంచి వైదొలగడమే ఉత్తమం. ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలు ఒకే విధంగా ఉంటే, డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు మీకు లభించవు. మీ పోర్ట్‌ఫోలియోలో అధిక సంఖ్యలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉంటే, తక్కువ రాబడులు వచ్చే, పనితీరు బాగా లేని ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఐదు కంటే ఎక్కువ ఫండ్స్‌ ఉండకపోవడమే మంచిది. ఇక మీ అంచనాలకు అనుగుణంగా లేని ఫండ్స్‌ను కూడా విక్రయించవచ్చు.   ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే.. సొంత ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు తదితర ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి రాబడులు వస్తాయి. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 

మా నాన్నగారి వయసు 75 సంవత్సరాలు. ఆయనకు బేసిక్‌ మెడిక్లెయిమ్‌ పాలసీ రూ.1.5 లక్షలకు ఉంది. ఆయన కోసం రూ.5 లక్షల టాప్‌ అప్‌ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి ?  
– కరుణాకర్, విశాఖ పట్టణం  

హాస్పిటలైజేషన్‌ను కవర్‌ చేసే బేసిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని టాప్‌ అప్‌ పాలసీగా చెప్పుకోవచ్చు. స్వల్ప అదనపు వ్యయంతో ఆరోగ్య బీమా కవర్‌ను పెంచుకోవడానికి ఇది అత్యుత్తమ మార్గం. వైద్య ఖర్చులు ఒక పరిమితికి మించితేనే ఈ టాప్‌ అప్‌ పాలసీలు పనిచేస్తాయి. చాలా టాప్‌ అప్‌ పాలసీలకు గరిష్ట వయసు పరిమితి 65 సంవత్సరాలు.  ఐసీఐసీఐ లొంబార్డ్‌ హెల్త్‌ కేర్‌ ప్లస్‌వంటి కొన్ని ప్లాన్‌లకు గరిష్ట వయోపరిమితి లేదు. ఇలాంటి టాప్‌ అప్‌ ప్లాన్‌లకు ప్రీమియమ్‌ కూడా అధికంగానే ఉంటుంది. అంతే కాకుండా మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా ప్రీమియమ్‌ ఆధారపడి ఉంటుంది. అందుకని అధిక వయసు వ్యక్తులకు వివిధ సంస్థలు అఫర్‌ చేస్తున్న  టాప్‌ అప్‌ ప్లాన్‌లన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి మీ బడ్జెట్‌కు సరిపడే ప్లాన్‌ను ఎంచుకోండి.

Read latest Expert Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top