రిటైర్మెంట్‌ అవసరాలకు...బెస్ట్‌ ప్లాన్‌

Dhirendra Kumar About Best Plans For Retirement - Sakshi

మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వాటిల్లో సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)ల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తున్నాను. భవిష్యత్తులో మంచి రాబడులు పొందవచ్చనే ఆలోచనే దీనికి కారణం. ఇది సరైన నిర్ణయమేనా? – సుధీర్, విజయవాడ  
ఇది సరైన నిర్ణయమని చెప్పలేము. అలాగే కాదని కూడా చెప్పలేం. మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఎప్పుడు మంచి రాబడులనిస్తాయో, ఎప్పుడు నష్టాలను మిగులుస్తాయో ఖచ్చితంగా అంచనా వేయలేం. సాధారణంగా మార్కెట్‌ బాగున్నప్పుడు లార్జ్, మిడ్, స్మాల్‌– ఈ మూడు కేటగిరీల మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు సంతృప్తికరంగానే ఉంటుంది. ఫండ్స్‌ పనితీరును మదింపు చేసి, దానికనుగుణంగా ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. అన్ని సమయాల్లో మార్కెట్‌ ఎలా ఉండబోతుందో అంచనా వేయడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే. 2017లో మార్కెట్‌ అప్‌ట్రెండ్‌లో ఉన్నప్పుడు స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌తో సహా అన్ని రకాల ఫండ్స్‌ మంచి రాబడులనిచ్చాయి.

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన ప్రధాన సూత్రమేమిటంటే.. వీలైనంత వరకూ మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేయడమే. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విభిన్నరకాల ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందవచ్చు. కేవలం ఒక మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌కే మీ పెట్టుబడులను పరిమితం చేస్తే, డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందలేరు. మార్కెట్‌ కదలికలకు అనుగుణంగా, లేక ఒక్క మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ల్లోనే ఇన్వెస్ట్‌ చేయాలని మీరు అనుకుంటే, మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కేవలం 20 శాతం పెట్టుబడులను మాత్రమే మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌  కోసం కేటాయించండి. మిగిలిన 80 శాతం మొత్తాన్ని డైవర్సిఫికేషన్‌ అధికంగా ఉన్న, వ్యయాలు తక్కువగా ఉన్న, మంచి ఫండ్‌ మేనేజర్‌ నిర్వహణలో ఉన్న, మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.

నేను గత కొంత కొలంగా మూడు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఎస్‌బీఐ బ్లూచిప్‌ ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌–ఈ మూడు ఫండ్స్‌లో ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పనితీరు గత రెండేళ్ల నుంచి సంతృప్తికరంగా లేదు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా? లేక ఆపేయమంటారా? – కిరణ్మయి, హైదరాబాద్‌  
ఒకే ఫండ్‌ హౌస్‌కు చెందినవి కాకుండా వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలకు చెందిన మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మీరు డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు అధికంగా పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ మంచి రాబడులనివ్వవచ్చు. మరికొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ మంచి లాభాలనివ్వవచ్చు. ఇప్పుడు మంచి రాబడులనిచ్చాయి కదాని స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి, కొన్నేళ్ల తర్వాత లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ మంచి రాబడులనిస్తున్నాయని వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీరు పొందే ప్రయోజనాలు పెద్దగా ఉండకపోవచ్చు.

ఇక మీ విషయానికొస్తే, మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్స్‌ మూడూ మంచి ఫండ్సే. మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌కు కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ పరిమితుల దృష్ట్యా ఇతర కేటగిరీల ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్స్‌ పనితీరు కొంత అసంతృప్తినివ్వవచ్చు. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ వాటికున్న సౌలభ్యం దృష్ట్యా ఇతర ఫండ్స్‌తో పోల్చితే ఒకింత మెరుగైన రాబడులనిచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. మరొక ఏడాది వేచి చూసి, అప్పుడు కూడా ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పనితీరు మీరు ఆశించిన స్థాయిలో లేకపోతే, అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీరు వేరే ఫండ్‌లోకి మారాలనుకుంటే, వేరే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు చెందిన మల్టీక్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోండి.

రిటైర్మెంట్‌ అవసరాల కోసం పన్ను ఆదా చేసే ఫండ్స్‌లో సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇలా చేయడం సరైనదేనా? – హరీశ్, విశాఖపట్టణం  
రిటైరైన తర్వాత వచ్చే అవసరాల కోసం 15–20 ఏళ్ల పాటు సిప్‌ మార్గంలో పన్ను ఆదా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైనదే. మీరు కనుక 30 ఏళ్లపాటు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయగలిగితే, ఇదే మంచి రిటైర్మెంట్‌ ప్లాన్‌ అవుతుంది. పన్ను ఆదా ఫండ్స్‌కు మూడేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. దీని వల్ల మీకు ప్రయోజనమే కలుగుతుంది. ఒక ఈక్విటీ ఫండ్‌లో మూడేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మూడేళ్ల కాలంలో ఈక్విటీల పనితీరు ఎలా ఉంటుందో మీకు అవగతమవుతుంది.

మార్కెట్‌ పట్ల, ఈక్విటీ ఫండ్స్‌ పనితీరు పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది. మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్స్‌ మంచి రాబడులనిస్తాయి. మార్కెట్‌ తగ్గుతున్నప్పుడు వీటి పనితీరు అంతంతమాత్రంగానే ఉంటుంది. కొండొకచో నష్టాలు కూడా రావచ్చు. మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఉత్సాహభరితంగానే ఉంటుంది. కానీ, మార్కెట్‌ పతనబాటలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌ చేయడానికి మనస్సు రాదు.  కానీ మార్కెట్‌ ఉత్థాన, పతనాలతో సంబంధం లేకుండా ఈ ఫండ్స్‌లో సిప్‌లు కొనసాగించండి. ఈక్విటీ ఫండ్స్‌కు మూడేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ విధించడం వెనక అసలు ఉద్దేశం కూడా ఇదే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top