వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఎన్నికల ప్రచారసభను విజయవంతం చేసి వైఎస్సార్ సీపీ సత్తాచాటుతామని వైఎస్సార్ సీపీ ఖేడ్ అభ్యర్థి అప్పారావ్ షెట్కార్ అన్నారు.
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఎన్నికల ప్రచారసభను విజయవంతం చేసి వైఎస్సార్ సీపీ సత్తాచాటుతామని వైఎస్సార్ సీపీ ఖేడ్ అభ్యర్థి అప్పారావ్ షెట్కార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న షర్మిల నారాయణఖేడ్‌కు రానున్నారని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.హరికృష్ణ, ఇన్‌చార్జి సందీప్‌లతో కలిసి ఖేడ్‌లో షర్మిల నిర్వహించనున్న ప్రచార కార్యక్రమాలపై స్థానిక పార్టీ కార్యాలయంలో చర్చించారు.
అనంతరం అప్పారావ్ షెట్కార్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలతో పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారన్నారు. అందువల్లే జనమంతా ఇపుడు వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతున్నారనీ, ఇదే ప్రజామద్దతుతో తమ పార్టీ అభ్యర్థులంతా విజయం సాధించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో షర్మిలతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు జనక్‌ప్రసాద్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మొహియొద్దీన్, జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ హాజరకానున్నారని అప్పారావ్ షెట్కార్ తెలిపారు.
కార్యకర్తలు భారీగా తరలివచ్చి షర్మిల ప్రచార సభను విజయవంతం చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.హరికృష్ణ, ఇన్‌చార్జి సందీప్ మాట్లాడుతూ, షర్మిల ప్రచార కార్యక్రమాలు జిల్లాలో ఈనెల 21న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఖేడ్ పర్యటన అనంతరం షర్మిల జహీరాబాద్‌కు చేరుకుని అక్కడ ప్రచార సభల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నేతలు నరేశ్ యాదవ్, మల్లు పటేల్, విజయ్, దత్తు, ఫయాజ్, సురేష్, సత్యనారాయణ, ప్రవీణ్ ఉన్నారు.